కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Sottalu' New Telugu Story
Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
"టాంగ్ ఠాంగ్.. ఏమిటీ సౌండ్ పొల్యూషన్?
ఆపవయ్యా..నీగోల" అంది చెవులు మూసుకుంటూ వనజ.
"అదేంటమ్మగారూ!? ఈ రోజుల్లో ఇత్తడి, రాగి సామాన్లు ఎవరు వాడుతున్నారండీ...
ఈ రాగి బిందెకు సొట్టలు తీయమని మీరేగా నన్ను పిలిచారూ... సొట్టలు తీయాలంటే సుత్తితో సుతిమెత్తగా కొట్టాలి గదండీ!? అవునూ! సొట్టలుతీసి, చింతపండూ ఉప్పూవేసి తోమేసి, మీ బామ్మగారి గుర్తుగా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా " అన్నాడు సొట్టలు తీసే అతను.
ఆలోచనలో పడింది వనజ.
ఫోన్ రింగైతే లిఫ్టు చేసింది.
"హలో వనజా ఏంచేస్తున్నావ్?" అంది వనజ స్నేహితురాలు.
"నా పెళ్ళికి బామ్మ అందరిలా కాకుండా వెరైటీగా, పాత రాగి బిందెను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇస్తూ, ‘వనజా! నేనున్నా లేకున్నా ఈ బిందె చూడగానే ఈ బామ్మే గుర్తురావాలి నీకు.... ఇవాళా రేపు రాగి, ఇత్తడీ ఎవరూ వాడట్లేదు. అందుకని ఆ వంకతో ఈ బిందె ఎప్పుడూ అమ్మాలని గానీ, మార్చి వేరే వస్తువు తీసుకోవాలని గానీ ప్రయత్నించకు’ అని చెప్పింది. అందుకని నేను ఇల్లు మారినప్పుడల్లా, దీన్ని కూడా, నాతో తెస్తూనే ఉన్నా. ఇప్పుడు... నేనూ, సందేష్ విడిపోవాలనుకున్నాం గా.. ఈ బిందెకూడా నాతో తెచ్చా. సొట్టలు పడి, మకిలి పట్టిందిగా.... కాస్త రిపేర్ చేసీ.... " అంటూ ఆగి ఎందుకో ఆలోచనలలో పడింది వనజ.
"నీ విడాకులు ఎక్కడిదాకా వచ్చినాయ్? నువ్వడిగిన భరణం ఇస్తానన్నాడా? గురుడు. " అడిగింది స్నేహితురాలు.
సమాధానం చెప్పని వనజని....
"ఏంటీ.. ఫోన్ చేతుల్లోనే ఉంచుకుని ఏంటంత పరధ్యానం ? ఏమాలోచిస్తున్నావ్ " రెట్టించింది.
"అదీ! … విడాకుల కేస్ వాపస్ తీసేసుకుందామను కుంటున్నాను." అంది వనజ.
"అదేమిటే!? డైవోర్స్ తీసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా వనుకున్నాము" ఆశ్చర్యంగా అంది వనజ స్నేహితురాలు.
"బామ్మ ఎప్పుడో ఇచ్చిన బిందెనే సుత్తితో రెండు బాదుళ్ళు బాది, తోమీ, వాడుకోవాలని చూస్తున్నాను. అలాంటిదీ.. అలాంటిది అమ్మా నాన్నా, నేనూ, ఇష్టపడి చేసుకున్న పెళ్ళేగా!........ కొట్టో, తిట్టో, తోమో దారికి తెచ్చుకోవాలిగానీ, వివాహబంధం తెంపేసుకుంటే, ఇంకోటి చేసుకున్నా అంతేగా! కొత్తగా మళ్లీ అందులోని సొట్టలు తీసి సరి చేసుకోవాలిగా?.... పిల్లలున్నారుగా! వీళ్ళని ఏంచేయాలి? ఏం సమాధానం చెప్పాలి?
కొత్తదాంట్లోనూ, మనకు తెలీని సరిచేయలేని చిల్లులూ, వంకరలూ ఉంటే?!.. అప్పుడేంటీ? ఉన్నదాన్నే సరిచేసుకుంటే పోలా!? " అని ఫోన్ పెట్టేసింది వనజ.
"అమ్మా! సొట్టలు తీసేసా. కాస్త చింతపండు, తోమే పొడి యేస్తే ...." అతగాడి పిలుపుకి ఏదో లోకం లో నుండి బయటికి వచ్చి...
అవన్నీ వేసి తోమించి చూస్తుంటే....
"అబ్బ... ఎంతబాగుందీ?! ఇది కిలుం పట్టిన నా పాత బిందేనా?! " ఆశ్చర్యపోతూనే....
‘బామ్మే నాకు కనబడకుండా సందేశం ఇవ్వట్లేదుకదా?!’ అనుకుంది మనసులో .
"అమ్మగారూ! దేన్నైనా బాగుచేసే మాజిక్ మనచేతుల్లోనే ఉంది. హ హ హ" అని నవ్వాడు గొప్పగా, వాడి భాషలో....
"ఇదిగో నువ్వడిగిన వందకాక, జీవిత పాఠాన్ని అర్ధమయ్యేటట్లు చెప్పినందుకు ఇదిగో ఇంద" అని కొన్ని నోట్లు అతడి చేతుల్లో పెట్టింది వనజ.
అర్ధంకాని ముఖంతోనే డబ్బులు తీసుకున్నాడు.....
'సొట్టలు తీసే అతను'.
///////////////
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
Commentaires