top of page

మనసున్న మనిషి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Manasunna Manishi' New Telugu Story

Written By Muralidhara Sarma Pathi


రచన: పతి మురళీధర శర్మ


"పార్వతీ! టిఫిన్ తయారయిందా?” వంటింట్లో ఉన్న భార్యని అడిగేడు భాస్కరరావు.

"ఇంకా లేదు. అయినా ఈవేళ ఆదివారం కదా! ఆఫీసు ఉండదన్న సంగతి మర్చిపోయేరా?"


గుర్తుచేసింది భార్యామణి.


"ఆ సంగతి గుర్తులేక కాదు. ఆఫీసుకి సెలవు గాని ఆరగింపుకు సెలవు ఉండదు కదా! ఆఫీసు లేదని ఆకలి వెయ్యడం మానేయదు కదా! "సంజాయిషీ ఇచ్చేడు సదరు భర్త గారు.

"పనిమనిషి ఎన్ని గంటలకు వచ్చిందనుకున్నారు? 7 ½ కి. ఉదయాన్నే వచ్చి చెయ్యగలిగితే చెయ్యి. లేకపోతే మానేయమని చెప్పేసేను. ఈవేళ ఆదివారం కాబట్టి సరిపోయింది. లేకపోతే టిఫినే తయారు చెయ్యనా? లేక వంట చేసి మీకు కేరేజీయే కట్టనా? పైగా ప్రతి ఏడాదీ జీతం పెంచమంటుంది." పనిమనిషి మీద పార్వతి ఫిర్యాదు.


"చూడు పార్వతీ! మన ఇంట్లో మన పనే మనం చేసుకోలేక పనిమనిషిని పెట్టుకుంటున్నాం. అలాంటిది వాళ్ళు వాళ్ళింట్లో పని చేసుకుని వచ్చి నాలుగిళ్ళల్లో పని చేస్తేనేగాని వాళ్లకు గడవదు. ముందొస్తేనేమో 'తెల్లారేసరికి వచ్చేసేవు.. పడుకోనివ్వకుండా' అంటారు. ఆలస్యంగా వస్తే 'ఇప్పుడా వస్తావు?' అంటారు. మరి అందరిళ్ళకీ ముందూ కాకుండా, ఆలస్యం కాకుండా ఒకే టైమ్ కి రావాలంటే వాళ్ళకి మాత్రం ఎలా అవుతుంది చెప్పు? వాళ్ళకిచ్చే నెల జీతం మనం ఒక రోజు రెస్టారెంట్ కీ, సినిమాకీ వెళ్తే అవుతుంది."

అని చెప్పుకుంటూ పోతున్న భర్తతో అంది పార్వతి.


"తెల్లారిందా మీ సూక్తిముక్తావళికి? అయినా పనిమనిషి తరఫున మీరు వకాల్తా పుచ్చుకున్నారా ఏంటి? మీరు చెప్పిందల్లా వింటూ కూచుంటే అవతల వంటింటి పని ఎవరు చేస్తారనుకున్నారు?"


"పోనీ నేనూ ఓ చెయ్యి వెయ్యనా?” అడిగేడు ఆయనగారు.


"చెయ్యి వెయ్యొద్దు గాని నన్ను చేసుకోనివ్వండి చాలు." అంది అర్థాంగి.


"ప్చ్! ఇప్పుడేం మాట్లాడకూడదు."అనుకుంటూ అక్కడనుండి నిష్క్రమించేడు పతిదేవుడు.

∙ * *

భోజనాలయిపోయేక పార్వతి అడిగింది భర్తని "అవునూ! టాయ్ లెట్లు క్లీన్ చేయడానికి వచ్చిన ఆ పనివాడితో మీ పలకరింపులేంటి? వాడు వచ్చిన పని వాడు చేసుకుపోతాడు. వాడు చేసిన పనికి వాడికి మనం డబ్బులిస్తాం. అంతే. అంతవరకే. కాని వాడి యోగక్షేమాలు మీకెందుకు?"


"వాళ్ళు బాగుంటేనే మన టాయ్ లెట్స్ బాగుంటాయ్ పార్వతీ! మనం వాడే టాయ్ లెట్స్ మనమే క్లీన్ చేసుకోలేం. అలాంటిది అందరిళ్ళల్లో టాయ్ లెట్స్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారంటే వాళ్ళు గ్రేట్. అలా చేసినందుకు వాళ్ళు అడిగినంత ఇవ్వకుండా బేరం ఆడతాం. అంత ఇస్తాం, ఇంత ఇస్తాం అంటూ.


రోడ్డు మీద పోతూ ప్రక్కనున్న మురుగుకాలువ చూసి,చెత్తకుండీ చూసీ మనం ముక్కు మూసుకుంటున్నాం. కాని ఆ కాల్వల్లోని మురుగూ, కుండీల్లో చెత్తా తీసే వాళ్ళూ మనుషులే. ఆ పనులు ఎలా చెయ్యగలుగుతున్నారా అని ఆలోచిస్తే తెలుస్తుంది మనకు వాళ్ళు పడే కష్టం, బాధాను."


భాస్కరరావు వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అంది పార్వతి. "మహాప్రభో! ఇంక ఆపండి. నేరకపోయి కదిపేను. ఈ ఎండల వేడికే తట్టుకోలేకపోతున్నాం అనుకుంటే మీ ఉపన్యాసాల ధాటికి నా బుర్ర వేడెక్కిపోతుంది."


"అందుకే అదిగో తాటి ముంజులు వస్తున్నాయి. పిలుస్తానుండు." అంటూ బయటకు వెళ్ళేడు భాస్కరరావు.

. * *

"ఏమోయ్! డజను ఎంత?"ముంజులు అమ్మేవాడ్ని అడిగింది పార్వతి.


"30 రు. అమ్మా!"చెప్పేడు వాడు.


"అదేంటి? ఎక్కువ చెప్తున్నావ్. 20 రు. లే. అలా ఇస్తే ఓ డజను ఇయ్యి. లేకపోతే లేదు."


"మేం తక్కువ చెప్పినా ఎంతో కొంత బేరమాడందే ఎవరూ కొనరు కదమ్మా! అందుకే ఓ ఐదో, పదో ఎక్కువ చెప్తుంటాం. సరే! 25 రు. ఇవ్వండమ్మా! మీదే బోణీ బేరం."అన్నాడు వాడు.


"ఆ! అందరూ అలాగే అంటారు. మిట్ట మధ్యాహ్నం బోణీ ఏంటి?"


"సరేలేవోయ్! 25 రు. చొప్పునే తీసుకో. ఓ 2 డజన్లు ఇయ్యి."చెప్పేడు భాస్కరరావు.


"మధ్యలో మీరేంటి? మీకు ఏదో తెలిసినట్లు?" అంది పార్వతి.


"అదేం కాదు గాని అవి తీసుకుని ఈ 50 రు. అతనికి ఇచ్చేసి రా."అని 50 రు. నోటు ఇచ్చేడు పార్వతికి, భాస్కరరావు.


"అమ్మగారూ! కాస్త మంచినీళ్ళివ్వండి."అని అడిగేడు ఆ ముంజులమ్మేవాడు.


వాడికి మంచినీళ్ళిచ్చి వాడు వెళ్ళి పోయేక వచ్చిన పార్వతితో అన్నాడు భాస్కరరావు

"చూసేవా? వాడి కష్టం. తాటి చెట్టెక్కి కాయలు కొట్టడం ఒక కష్టం. నీళ్ళు పోకుండా వాటిలోని ముంజుల తీయడం మరో కష్టం. తట్టనిండా వాటి బరువుతో ఈ ఎండలో తిరిగి అమ్ముకోవడం ఇంకా కష్టం. అలాంటివాళ్ళ దగ్గర బేరమాడతాం. డ్రింక్ బాటిల్ మాత్రం 70 రు. ఇచ్చి కొంటాం. అదీ మనం కష్టానికిచ్చే విలువ."


"మీరు ఆఫీస్ లో ఆఫీసర్ అయిపోయేరుగాని ఏ స్కూల్లో టీచరో, కాలేజీలో లెక్చరరో, యూనివర్సిటీలో ప్రొఫెసరో అయి ఉంటే క్లాసులు బాగా తీసుకుందురు." అంది పార్వతి.


"క్లాసులు సంగతి తర్వాత గాని ముందు గ్లాసులు పట్టుకురా. ఈ ముంజుల నీళ్ళు త్రాగి నువ్వు కూల్ అవుదువుగాని."


"మాటలకేం కొదవ లేదు."అంటూ మూతి ముడుచుకుంటూ వెళ్ళింది పార్వతి.


అటునుండి వచ్చి "మొన్న రైతు బజారు నుండి కూరగాయలు తెండీ అంటే రోడ్డు ప్రక్కన ముసలమ్మ దగ్గర కొని తెచ్చేసేరు." నిష్టూరంగా అంటున్న భార్యతో అన్నాడు సానుభూతిగా భాస్కరరావు


"పార్వతీ! రైతు బజార్లో కొనే వాళ్లకు కరువు లేదు. కాని ఆ ముసలమ్మ దగ్గర కొనే వాళ్ళెంతమంది? ఎంత పూటకి గడవకపోతే అలా రోజంతా కూచుంటుంది అమ్ముకోడానికి? ఆ అవ్వ అన్నీ అమ్మినా దాంతో ఆ పూట గడవదు ఆమెకు."


"మీ సామాజిక స్పృహకి జోహార్లు కాని సాయంకాలం అలా ఏదైనా గుడికి వెళ్ళొద్దాం."అంది భార్యామణి.


"ఓ.కే. పెర్మిషన్ గ్రాంటెడ్. అన్నాడు భాస్కరరావు.

∙ * *

( గుడి దగ్గర )

"అయ్యో! అయ్యో! అదేంటండీ? దేవుడికని తెచ్చిన అరటిపళ్ళు ఆ ముసలాడికి ఇచ్చేస్తున్నారేంటీ? అపచారం. అపచారం." అంది పార్వతి నొచ్చుకుంటూ.


"అపచారం కాదు. పాపం ప్రొద్దుటినుండీ తినడానికి ఏం లేదట. ఆకలితో నకనకలాడిపోతున్నాడు. అతని ఆకలి కొంత తీర్చినా అదీ మనం భగవంతుడికి చేసే ఉపచారమే." అంటూ అక్కడున్న ఒక్కొక్క ముష్టివాడికీ పదేసి రూపాయలు వేస్తున్న భర్తతో "ముష్టివాళ్ళకు ముష్టిలా వెయ్యాలిగాని చందాలా ఇవ్వకూడదు." అంది పార్వతి.


అది విని నవ్వుకుంటున్న భర్తను చూసి "మిమ్మల్ని అమాయకులనాలో, ఆదర్శవాదులనాలో లేక మనసున్న మనిషి అనాలో నాకు తెలియడంలేదు"అంది పార్వతి.


మరి మీరేమంటారు?

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం95 views2 comments

2 comentarios


ravuri naresh • 3 days ago

చాలా బాగుందండి గురువుగారు కథ

Me gusta
Contestando a

బహు ధన్యవాదాలండీ

Me gusta
bottom of page