top of page

పల్లె పిలిచింది - 23

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 23 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 23/06/2025

పల్లె పిలిచింది - 23 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



వీరేశునికి గోవిందుడు బోధచేయుచు చెడుదారిన పయనించు యువతను హెచ్చరించుట.


28.

తేటగీతి 


ధూమపానంపు మత్తులో దొరలి దొరలి

పోవు చుందురీ యువకులు మూఢ మతిని

శ్వాస కోశము నాశమై చావు వచ్చు

మరచి పోదురీ నిజమును మందమతులు.//


తాత్పర్యము.


యువత సిగిరెట్లు కాలుస్తూ మూర్ఖుల్లాగా తిరిగితే శ్వాసకోశము చెడిపోతుంది.దాని వల్ల చావు వస్తుందని మరచి పోతే ఎలాగా?//


29.

తేటగీతి.


తగని ప్రేమను జూపుచు తల్లి దండ్రి

కనక మొసగుచు బిడ్డలన్ గాంచరకట!

పిచ్చి యలవాట్లు మరగిన పిల్లలిపుడు

పెద్దలన్ దూల నాడుచు పెరుగు చుంద్రు.//


తాత్పర్యము.


తల్లిదండ్రులు బిడ్డలకు అనవసరంగా డబ్బులు ఇస్తూ ఉంటారు. పిచ్చి అలవాట్లను మరిగి పిల్లలు పెద్దవాళ్ళను తిడుతూ ఉంటారు.//


30.

తేటగీతి.


కాన్సరను జబ్బు వచ్చునీ కాలమందు

కాల మెప్పుడు మన వెంట కలిసిరాదు

వెఱ్ఱి పోకడల్ జూపుచు వీథులందు

తిరుగు చుందురీ హీనులు తెలివి తప్పి .//


తాత్పర్యము.


ఈ దురలవాట్లతో క్యాన్సర్ అనే జబ్బు వస్తుంది. ఈ కాలం పిల్లలు

 వెర్రిపట్టిన వాళ్ళలాగా వీథుల్లో తిరుగుతూ ఉంటారు.//


31.

తేటగీతి.


ఆయువంతయు తరుగంగ నాశవీడి 

కుములు చుందురు చివరకు క్రుంగి క్రుంగి

ముందు జాగ్రత్త పడుకున్న ముప్పు వచ్చు

మాను కొన్నచో మిగులును మంచి బ్రతుకు.//


తాత్పర్యము.


చివరకు జబ్బున పడి ఏడుస్తూ ఉంటారు. అందుకని ముందు జాగ్రత్త పడి దురలవాట్లను మానుకోవాలి.//


32.

తేటగీతి.


మంచి యలవాట్లతో ప్రజ మసలు చుండ

బలము తెలివియు కల్గిన భావితరము

జాతి మనుగడ నిల్పుచు సాగుచుండ

ప్రగతి బాటలో దేశము పరుగులిడును.//


తాత్పర్యము.


మంచి అలవాట్లతో ఉన్న యువత వలన దేశానికి ప్రయోజనము. వారి వలన దేశ ప్రగతి పరుగుపెడుతుంది.//


(సశేషం)


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page