top of page

పల్లె పిలిచింది - 22

Updated: Jun 23

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ఉత్పలమాల, #నలిని, #నారాచ

ree

Palle Pilichindi - 22 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 20/06/2025

పల్లె పిలిచింది - 22 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



22.

తేటగీతి.


ధనము శాశ్వతంబను మాట తప్పు తప్పు!

ధైర్యమొసగెడి మిత్రులే దైవసములు 

నీతినియమాలు వీడక నిల్చియుండి 

పెద్దలివ్విధి మసలిరి ప్రేమతోడ.//


తాత్పర్యము.


ధనము మాత్రమే ముఖ్యమా?కాదు. కష్టంలో ధైర్యం చెప్పే స్నేహితులు దేవతలు. అలా పెద్దలు స్నేహంతో మెలుగుతున్నారు.//


23.

వచనం.


 పెద్దలు మణివికాస, వీరేశ, శ్రీనివాస, చిత్ర, మరియు హైమలకు మంచి వసతినేర్పరచిరి . హైమను , చిత్రను కలిపి మల్లనార్యుని సోదరి  శాంతమ్మ యింటిలో నుంచిరి.శాంతమ్మకు మంజరి యను కూతురు కలదు. హైమకు, చిత్రకు కూడా మంజరి సమవయస్కురాలు.మణివిశాస, వీరేశ, శ్రీనివాసులను కలిపి శ్రీకరుని మిత్రుడగు గోవిందుని యింటి పై భాగమున యుంచి, శంభు యను వంటవాడినుంచిరి. గోవిందుడు స్థానిక పాఠశాలలో నుపాధ్యాయుడుగా విధులు సల్పుచుండెను.గోవిందునికి వాణి యను కుమార్తెయు, జగదీశుడను బిడ్డలు కలరు. గోవిందుని పత్ని కనకవల్లి. చారుమతి యగు నామె తమ మిద్దెపై కల బిడ్డల బాగోగులు చూచుచున్నది.ఇటుల పల్లెను వదిలిన బిడ్డలు భాగ్యనగరమను పట్టణంబున చదువుకొంటున్నారు.


24.

ఉత్పలమాల.


గారపు బిడ్డలై పెరిగి కష్టము కోర్చుచు పట్టణంబునన్ 

ధీరత తోడ సాగిరట ధీమణులెల్ల కఠోరదీక్షతోన్ 

జేరిరి నెయ్యులై కలిసి చీకులు చింతలు విస్మరించుచున్ 

నేరుపుగన్ మెలంగి రనునిత్యము సాధన సల్పి ప్రాజ్ఞులై.//


తాత్పర్యము.


పల్లెలో తల్లిదండ్రుల దగ్గర గారాబంగా పెరిగిన బిడ్డలు నేడు దీక్షతో, స్నేహంగా మెలుగుతూ చదువుకొంటున్నారు.//


25.

నలిని 

స. స. స. స. స.

యతి -10.


జనవాహినిలో విధులన్ సలుపన్ హితులై 

ఘనమౌ చదువుల్ చదువన్ సమతన్ వరలన్ 

గనిపెంచిన పెద్దలనే గరిమన్ గనుచున్ 

వినయంబుగ నేర్చిరటన్ విబుధుల్ చదువుల్.//


తాత్పర్యం.


ఆ నగరంలో పనులు చేసుకుంటూ, ఆ మిత్రులు వినయముతో చక్కగా చదువుకొంటున్నారు.//


26.

నారాచ

త. ర. ర.

యతిలేదు.


వీరేశు డొక్కడే మూఢతన్ 

దీరంగ కోర్కెలన్ ద్రిమ్మరై 

పాఱంగ విద్యలన్ నేర్వకే 

జారెన్ తమస్సులో మున్గుచున్.//


తాత్పర్యము.


వీరిలో వీరేశు డొక్కడే ఏవేవో కోరికలతో తిరుగుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు.//


27.

నారాచ

త. ర. ర.

యతిలేదు.


కావంగ వీరునిన్ బ్రేమతోన్ 

గోవిందు డత్తరిన్ మేలుగన్ 

జీవంబు నిల్పునా విద్యలన్ 

దీవించి నేర్పె తానోర్పుగన్ //


తాత్పర్యము.


వీరేశుని రక్షించగటం కోసము గోవిందుడు ప్రేమతో, ఓర్పుతో చదువు నేర్పించసాగాడు.//




ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page