top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16

Updated: Feb 24

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Udayaraga Udvegalu - Part 16 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 19/02/2026

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:


తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.


తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.


సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది.


కమలవాణి డిప్యూటీ ఎమ్.డి.గా ఉన్న ఆఫీసులో ఇంద్ర కిరణ్‌కు ఉద్యోగం వస్తుంది. శివగామి వల్ల ఉద్యోగం పొందిన వాళ్ళు ఆమెను అభినందిస్తారు.

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 16 చదవండి.


శుక్రవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి వచ్చిన ఉమాదేవీ, సదానందమూ ఇంట్లోకి అడుగు పెడుతూ హాలులో ఒక్కడూ ఓ మూల నిశ్శబ్దంగా కూర్చున్న ఇంద్రకిరణ్‌ని చూసి ఉన్నపాటున ఆగారు. కమలవాణితో చిన్నకొడుక్కి మళ్ళీ సమస్సేదైనా వచ్చిపడిందా! ఎప్పుడో ఏదో సందర్భాన ఏదో ఆవేశంలో పడి ఇంద్రకిరణ్ అన్నమాటకు కమలవాణి మరచిపోకుండా పగపట్టిన త్రాచులా కక్ష సాధిస్తూనే ఉందా! ఇకపైన ఊరుకోకూడదు. తిన్నగా వెళ్లి ముఖాన ఎడాపెడా వాయించేయాల్సిందే—అటువంటి స్త్రీ చేతిలో కొడుకు భవిష్యత్తునుంచడం ఏమాత్రం క్షేమదాయకం కాదు. ఆవిడ వద్దకు దూసుకు వెళ్ళేముందు ఇంట్లోనే ఉన్న ఆమె ప్రేమికుడికి ఓమాట చెప్పే వెళ్ళాలి. అదే సాకుతో ఆవిడతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీణ్ణి కూడా ఎడా పెడా వాయించే తీరాలి. ఇద్దరూ దగ్గరకు నడచి వచ్చి అడిగారు-“అదేమిట్రా అలా ఒంటరిగా ముభావంగా కూర్చున్నావు! ఎనీ ప్రాబ్లమ్?”


లేచి నిల్చుని బదులిచ్చాడతడు-“ఏం లేదు బాబూ! సింప్లీ రిలాక్సింగ్.”


“మరి మాకలా అనిపించడం లేదే! దీర్ఘమైన యోచనలో లీనమైనట్టు కనిపిస్తున్నావోయ్“


అంతలో అక్కడికి మధులిక, నర్సమ్మ ఇద్దరూ చేరుకున్నారు. కాంతమ్మ ప్లేటులో టీ కప్పులు తెచ్చి అందరికీ ఇవ్వసాగింది. ఒక కప్పు అందుకుంటూ ముఖాన నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అసలు విషయానికి వచ్చాడు ఇంద్రకిరణ్- “ఓ గంట ముందు కమలవాణి గారి ఛాంబర్‌కి వెళ్ళి వస్తున్నాను బాబూ!”


భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు- “మనం ముందే అనుకున్నాంగా ఇటువంటిదేదో జరుగుతుంటుందని” అన్న ముఖభావం ప్రకటిస్తూ-- ఈసారి నర్సమ్మ మనవణ్ణి అడిగింది ”నువ్వెందుకు పనిలేని గానుగులా ఆవిడ గదికి వెళ్ళావు! కొరివితో తల గోక్కోవడం అంటే ఇదేరా--”


ఇంద్రకిరణ్ అదోలా ముఖం పెట్టాడు- “నేను వెళ్ళలేదు బామ్మా! ఆమెగారే నన్ను పిలిచారు. ట్రైనింగ్ అసెంబ్లీ హాలుకి వచ్చి అందరికీ కోర్సుకి సంబంధమైన నోట్సు ఇస్తూ నన్ను తన ఛాంబర్‌కి పిలిచారు”


మళ్ళీ నర్సమ్మ స్పందించింది- “అదేమిట్రోయ్ ఆవిడ పట్ల అంతటి మన్నన చూపిస్తున్నావు! పొంగారిన పాలలా మారిన నీ వాలకం చూస్తుంటే ఒళ్ళు మండుతూంది!”


“మేటర్ అది కాదు బామ్మా! నిజానిజాలు తెలియకనే నిందలు వేస్తే పొరపాటు- అని ఘంటసాలవారు పాడలేదూ-- ఆమెగారి గురించి తెలియకుండానే మనం ఆమె గురించి ఎడాపెడా మాట్లాడేస్తున్నాం. అదే నన్ను అఫెక్ట్ చేస్తూంది”


అప్పుడు ఉమాదేవి కలుగచేసుకుంది- “సరే-- మాకు ఆ మహాతల్లి గురించి తెలియదనే అనుకుందాం. వాళ్ళ కార్పొరేట్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్న నువ్వు చెప్పవచ్చుగా ఆమె గొప్పలేమిటో--”


అప్పుడు ఇంద్రకిరణ్ తనను తను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ బదులిచ్చాడు- “మీరందరూ నన్ను చెప్పనిస్తేగా! అందరూ నన్ను మింగేటట్టు చూస్తుంటే నేనేమి చెప్పేది? ” అంటూ టీ-తాగడం పూర్తిచేసి వదిన వైపు చూసాడు.


మరది సంజ్ఞ గమనించి చేతిలోని టీ-కప్పుని టీపాయ్ పైన ఉంచి అతడి ప్రక్కకు వచ్చి కూర్చుంది మధులిక. రవంత సేపు ఆగి నిదానం తెచ్చుకుంటూ చెప్పాడు-“మనం అనుకుంటున్నట్టు ఆమె మామూలు స్త్రీ కాదు.”


ఆ మాటకు నర్సమ్మ చటుక్కున అందుకుంది నిరసనగా-- “అది నువ్వు మాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? పెళ్ళయిన వాడి వెంట సిగ్గూ ఎగ్గూ లేకుండా వెంట పడటంలో తెలియటం లేదూ అది మామూలు ఆడది కాదని, శూర్పఖ వంశానికి చెందినదని.”


ఇంద్రకిరణ్ కట్ చేసాడు. “ప్లీజ్—కొంచెం ఆగు బామ్మా! నేను చెప్పొచ్చేదేమంటే ఆమె రియల్లీ ఏ గ్రేట్ వుమన్ అని. వుమన్ ఆఫ్ గ్రేట్ సబ్‌స్టెన్స్‌ని—“


ఆ మాట విన్న అక్కడున్న వారందరికీ దిగ్భ్రాంతి కలిగింది. అతడి వైపు తదేకంగా కన్నార్ప కుండా చూడసాగారు. సదానందం ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అడిగాడు- “నువ్వు నీ బాస్‌ని మెచ్చుకుంటున్నావు- ఇందులో మాకేమీ ఆక్షేపణ లేదు. కాని—దానికి కారణం చెప్పాలి కదా! మరొకటి— నీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో తెలిసి మాట్లాడు- అప్పుడే విషయం క్షేమదాయకంగా ఉంటుంది.”


“వదినెను గుర్తు పెట్టుకునే మాట్లాడుతున్నాను బాబూ! అందరికంటే నాకు వదినె గురించి బాగా తెలుసు. మన చూపుకి ఆనని విషయాలను మనకు తెలియని వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా బాబూ! ఇక మీరడిగిన ప్రశ్నకు బదులు చెప్తాను బాబూ! షీ ఈజ్ ఎ ఫైన్ హ్యూమన్ బీయింగ్. కంపెనీ ల్యాబ్ నిర్వహణా- రీసెర్చ్ ఆపరేషన్స్ అన్నీ ఆమె నిర్వహణలో ఉంటాయి.


ఆమె తీర్చి దిద్దిన విజన్ డాక్యుమెంటు ప్రకారం ప్రతి సంవత్సరం ఫార్మా కంపెనీ కనీసం రెండు కొత్త మెడిసిన్స్ కనిపెట్టాలి. అవి అందరికీ ముఖ్యంగా పేదసాదలకు అందుబాటులో ఉండాలి. అంతేకాదు—వాటిని పేద ప్రాంతాలకు ముఖ్యంగా ఆఫ్రికా, ఏసియాలోని పేద దేశాలకు చౌకగా పంపిణీ చేస్తుండాలి. ఆమె మెడిసిన్ మాత్రమే చదువుకోలేదు. సి-ఏ కూడా చేసినట్లుంది. షేర్ హోల్డర్సు అత్యాశకు పోకుండా ఆమె మందుల ధరలను ఇంటర్నల్ అసెస్‌మెంట్ కమిటీ ద్వారా నిర్ణయిస్తుంటారు. బయోకెమిస్ట్సు- ఇతర ల్యాబ్ సిబ్బందీ ఆమెగారి పర్యవేక్షణలో ల్యాబ్‌లో పనిచేస్తుంటారు. ఆ విధంగా ఆమెగారు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడుతుంటారు.


ఆరోజు అన్నయ్య చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఆమె హౌస్ సర్జన్‌గా తానుగా వెళ్ళి జబ్బు తెచ్చుకోలేదు. రెండు మూడు గ్రామాలలో జబ్బున పడుతున్న జనం కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పని చేస్తూ విష జ్వరాన పడ్డారు. ఆ ఊపున ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను వాళ్ళ తల్లిదండ్రులు తిన్నగా జర్మనీ తీసుకెళ్ళి పోయారు. కొన్ని నెలలు ట్రీట్‌మెంట్ తరువాతనే ఆమె అక్కడ కోలుకున్నారు. ఆమె తలచుకుంటే—ఆమె అక్కడే యూరప్‌లోనో అమెరికాలోనో స్థిరపడిపోవచ్చు. లేదా—మరెక్కడైనా ఆమె ఇచ్ఛానుసారం ఇష్టపడ్డ రీతిన జీవితం కొనసాగించవచ్చు. సౌకర్యవంతంగా పూలతేరులా సాగిపోవచ్చు. కాని—ఆమెగారు అలా చేయలేదు- పనిగట్టుకుని అన్నయ్య కోసం గాలిస్తూ ఇండియా వచ్చింది. ఇప్పుడిక్కడకు వచ్చి అందరి వద్దా శాపనార్థాలు భరిస్తుంది.


నేనక్కడే నా ట్రైనింగ్ పీరియడ్ ముగించి వాళ్ళు పెట్టే క్వాలిఫైయింగ్ ఇంటర్నల్ ఎగ్జామ్ పాస్ చేసి అక్కడే ఉద్యోగంలో ఫిక్స్ అయిపోతాను. కమలవాణి గారి ఫేవర్ కోసం కాదు. నా తృప్తి కోసం నేనక్కడ పని చేస్తాను” అని చెప్పడం పూర్తి చేసి వదిన వైపు తిరిగి ఆమె చేతిని అందుకుని- “సారీ వదినా! నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు. తెలిసిన వాస్తవాలను మరుగుపరచకుండా ఉన్నది ఉన్నట్లు చెప్తే అందరికీ మంచిది కదా! అన్ని జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు అందుకున్న కమలవాణిగారు వంటి స్త్రీ తన వ్యక్తిత్వాన్ని మరచి అన్నయ్య ముందు ఎందుకలా పెంపుడు గువ్వలా ఒదిగిపోతుందో అంతుపట్టడం లేదు. సున్నితమైన అటువంటి అంశాన్ని అర్థం చేసుకునేంత అనుభవం నాకింకా కలగలేదేమో!


ఇప్పుడు మా బామ్మగారి ధోరణి వ్యవహారానికి వస్తాను. రూపంలో, వాక్కులో బామ్మకు సుకుమారమైన పల్లెపట్టు చైతన్యమే ఉంది. ఇప్పటి రోజుల పోకడ గురించి పూర్తి అవగాహన లేదు బాబూ!” అంటూ లేచాడు ఇంద్రకిరణ్.


రాత్రి పూట సముద్రం నడి మధ్యన తాండవించే గాఢ నిశ్శబ్దం అక్కడ వ్యాపించింది. లేవబోతున్న కోడల్ని పిలిచింది నర్సమ్మ. ఉమాదేవి “చెప్పత్తయ్యా”- అని దగ్గరకు వచ్చింది.


“వాడేదో కుర్ర కుంకలా వాగేసి వెళ్ళిపోతున్నాడు- పిచుక్కేమి తెలుసు ఉండేలు దెబ్బన్నట్టు-- అసలు విషయం మరొకటి ఉంది- విను. మనకు తెలియకుండానే మన కళ్ళముందే ఆ మహాతల్లి కొంచెం కొంచెంగా ఆలయ శిఖరంలా తయారవుతోంది. ఆలయం ఎంత గొప్పదైనా ఆలయ శిఖరపు నీడ ఇంటిపైన పడకూడదంటారు. ఇలా సాగడం మంచికా లేక చెడుకా అన్నది నువ్వే తేల్చుకోవాలి.”


మధులికా, ఉమాదేవి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు; నర్సమ్మగారి భావస్రవంతి అర్థం కానట్టు.


“ముఖాలు అలా పెట్టుకుని చూస్తారేమిటి కొత్తగా చూస్తున్నట్టు?” అని విసుగ్గా చూస్తూ అడిగింది నరసమ్మ.


అప్పుడు ఉమాదేవి స్పందించింది. ”కమలవాణి ఆలయ శిఖరంలా ఎదుగుతుందా! లేక- మీరు దానిని మాముందు మెచ్చుకుంటున్నారా-- లేక దిగదిడుపుగా అంటున్నారా అత్తయ్యా!” అయోమయంగా చూపులు సారిస్తూ అడిగింది ఉమాదేవి.


నర్సమ్మ చిరాగ్గా ముఖం పెట్టింది- “నేనెందుకు దానిని మెచ్చుకోవాలి? నాకు వేరే పని లేదా!”


అప్పుడు మధులిక అభ్యర్థన పూర్వకంగా అడిగింది-“మీరు చెప్తేనే కదా తెలుస్తుంది! చెప్పండి అవ్వా!”


“చెప్తానే—చెప్పకుండా ఎక్కడికి పోతాను? గుడి శిఖరపు నీడ ఎట్టి పరిస్థితిలోనూ ఇంటిపైన పడకూడదంటారు. అలా జరగడం ఇంటికి చేటు తెస్తుందంటారు. అందుకే గుడికి ఎదురుగా గాని, ప్రక్కల గాని, వెనుక గాని ఇండ్లు ఉండకూడదంటారు. అర్థమైందా!”


అత్తాకోడలిద్దరూ తలలూపుతూ అక్కణ్ణించి కదిలారు. తమ కళ్ళ ముందే గుడి శిఖరపు నీడలా తయారవుతున్న కమలవాణి ఉనికి వల్ల కుటుంబానికి చెడు జరగవచ్చన్నదానికి ఎంతటి చక్కటి సూటైన ఉపమానం! ఇద్దరికీ క్షణకాలం జలదరింపు వంటిది కలిగింది.


ఆరోజు సాయంత్రం దీపాలు పెట్టేవేళకు ముందే సోమశేఖరం ఇల్లు చేరాడు. గదిలోకి వచ్చీ రావడం తోడనే మధులిక వద్దకు వచ్చి “నేను స్నానం చేసి వస్తాను. ఇక్కడింత పనుందీ- అక్కడ అంత పనుందీ అని దీర్ఘాలు తీయకుండా ఈ


స్టేట్‌మెంటులోని సమాచారాన్ని సిస్టమ్‌లో ఉన్న డేటాలోకి ఎక్కించు. మా కంపెనీ ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మేటర్. తుమ్మినప్పుడు కూడా దీనిని ఎక్కడా పొక్కనివ్వకూడదు. తెలిసింది కదూ!”


“తెలిసింది మహాప్రభూ! కాని—ఇంత ముఖ్యమైన డేటా ఫీడ్ చేసి ఇస్తున్నందుకు మీరు నాకు ఏమి ఇచ్చారని?”


“నేను నిన్ను పెళ్ళి చేసుకుని నువ్వెదురు చూసిన దానికన్నా ఎక్కువే ఇచ్చాను. మనసా వాచా కర్మణా ఇంకా ఇస్తూనే ఉన్నాను. ముందు ల్యాప్‌టాప్ ముందుకి వచ్చి కూర్చో—మిగతాది తరువాత మాట్లాడుకుందాం” అని బాత్‌రూము వైపు వెళ్ళి పోయాడు. నిజానికి ఆమె అటువంటి అవకాశం కోసమే కొన్ని రోజులుగా ఎదురు చూస్తూంది.


అతడు అరగంటలోపల స్నానం చేసి పూజాగదిలో ధ్యానం చేసి నుదుట విభూతి రేఖ దిద్దుకుని తిన్నగా వెళ్ళి బామ్మ కాళ్ళకు మొక్కి గదిలోకి వచ్చాడు. మధులిక కదలిక లేకుండా కుదురుగా కూర్చోవడం చూసి ఆశ్చర్యంతో అడిగాడు-


“ఇంకా స్టార్ట్ చేయలేదా!” ఆమె చేతికి అక్కడున్న పారిజాతాలు అందిస్తూ—ఆమె చెక్కు చెదరకుండా పూలను నవ్వుతూ తీసుకుని అందామె-“పూర్తి చేసి రీడింగ్ కూడా ఇచ్చాను.”


అతడు నమ్మలేనట్టు చూసాడు-“నిజంగానా! మరి పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించావా?”


అది కూడా పూర్తయిందని బదులిచ్చిందామె. అతడు కన్నార్పకుండా ఆమె ముఖంలోకి చూసాడు.


“ఏం చూస్తున్నారు? నాలో చూడనిది మీకేమీ లేదుగా!”


అతడు దగ్గరగా వచ్చాడు- “గుండ్రటి కుంకుమబొట్టుతో అలరారే ఇటువంటి గుండ్రటి ముఖమంటే నాకు ఇష్టం.”


“మరి—ఆ ముఖం?”


అతడేమీ అనలేదు. విస్మయంగా చూస్తూ దూరంగా జరిగాడు. ముఖంలో మేఘాలు క్రమ్ముకున్నాయి. అది గమనించి-“సారీ! నాకు తెలియకుండానే అలా అడిగేసాను” అందామె.


అతడు కొన్ని క్షణాల సేపు మౌనపు పరదా వెనుక ఉండి పోయి-“నాకు తెలుసు. నీ గురించి కచ్చితంగా చెప్పలేను గాని, ఆమె గురించి గాని అడ్వర్సుగా ఏమైనా అంటే ఇంట్లోవాళ్ళకు ఊరట కలగవచ్చని. కాని ఇంట్లోవాళ్ళకు తెరపి కలగడం కోసం లేనివి ఉన్నట్లు చెప్ప లేను. అది నా తత్వం కాదని నీకూ తెలుసు. సరే—అదలా విడిచిపెట్టు. నీకేం కావాలి? నీ పుట్టిన రోజు వస్తుంది కదా—సెంచరీలు కొట్టే వయసు మాది- బౌండరీలు దాటే మనస్సు మాది- డ్యూయెట్ ఆడదామా!”


ఆమె నవ్వి అతడి మెడ చుట్టూ చేతులు పోనిచ్చి అంది-“ఇప్పుడు డ్యూయెట్ ఆడే స్థితిలో నేను లేను. ఇప్పుడిప్పుడే ఏమైనా కావాలా అని అడిగారు కదా! ఇప్పుడు నాకేమి కావాలో అడిగేదా? ఆర్ యు రెడీ!”


అతడు కూడా నవ్వి మధులిక నడుం చుట్టూ చేతుల్ని సంకెళ్ళలా బిగిస్తూ అన్నాడు “ఉఁ అడుగు. మాటంటే మాటే! షాపింగ్‌కి ఇప్పుడే వెళదాం. ఇద్దరమూ కలసి షాపింగ్ చేద్దాం. ఓకే!”


ఆమె అదేమీ కాదన్నట్టు తల అడ్డంగా ఆడించింది. “ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ఇక్కడే ఇప్పుడే నా కోరిక తీర్చగలరు.”


“మరింక ఆలస్యం దేనికీ! అడుగు నా ప్రేయసీ—“


“ఒకసారి మీరు అందరి ముందూ చెప్పారు—కమలవాణిని చాచి లెంపకాయ కొట్టారని. అదే విధంగా నన్ను కూడా లెంపకాయ కొట్టండి. ప్లీజ్!”


సోమశేఖరం తెల్లబోయి చూసాడు. ఊపిరి ఎగబీలుస్తూ అన్నాడు-“ఏం మాట్లాడుతున్నావో తెలుసా! మూడ్ గాని చెదరి పోలేదు కదా!”


“కచ్చితంగా లేదు.”


అతడికి మాటలందక తల విదిలించాడు-“సరే—అలాగే అనుకో! మొదట దీనికి బదులియ్యి. ఎందుకు కొట్ట మంటున్నావు?”


ఆమె తలదించుకుంది.

"ఉఁ చెప్పు”- రెట్టించాడతడు.


అప్పుడామె మనసార స్పందించింది “మీరు నాతో ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. కమలవాణి విషయంలో మీరు చొరవ తీసుకుని చాచి లెంపకాయ కొట్టారంటే- మీకు ఆమెతో ఎమోషనల్ బాండ్ ఎక్కువని తెలుస్తుందిగా!”


“నీకు తిక్క పట్టినట్లుంది. నేను దానిని కొట్టలేదు. అది నన్ను రెచ్చగొట్టి- చేయి చేసుకునేలా చేసింది. అలా తొందరపడినందుకు నేను దానికి సారీ చెప్పాను. గుర్తుంచుకో—మరొకటి చెప్తాను వినుకో-- అది పెద్దింటి అమ్మాయే—కాదనను. విషయ పరిజ్ఞానం గల సమర్థురాలే—వుమెన్ ఆఫ్ డైనమిజమే, కాదనను. కాని—అధికార దర్పంతో, ధిక్కార స్వరంతో శుక్రాచార్యుడి ప్రియ తనయ దేవయానిలా ప్రవర్తిస్తుండేది. సర్వమూ తనదే అన్నట్టు, తనకే అన్నట్టు అధికార వాంఛ చూపిస్తుండేది.


నువ్వేమో చిత్ర వీణను చేత బట్టి కళ్యాణి రాగంలో ఆలపించే ప్రభావతిలా ఉంటావు. మీ ఇద్దరి మధ్యా పోలిక ఎలా ఉంటుంది? ఐనా- అదంతా అప్పటి మాట- నేను గ్రాడ్యుయేషన్ చేసిన కొత్త రోజులు—ఆమె హౌస్ సర్జన్సీ చేస్తున్న రోజులు. గతజల సేతుబంధనం కదూ!”


ఆ మాటతో ఆమె నయనాలు కలువ పూవుల్లా విచ్చుకున్నాయి. చంద్ర కిరణాల్లా మెరిసాయి. అతడు బల్లపైనుంచిన కమల పండుని చేతులోకి తీసుకుంటూ అద్దం ముందు వికసిత వదనంతో కూర్చున్న మధులిక వైపు తదేకంగా చూసాడు. మనిషి జీవితంలో—ముఖ్యంగా మగాడి మనస్తత్వంలో చాపల్యం ఎంత ఘాటుగా విలయతాండవం చేస్తుంది కదూ! ఇక్కడుంటే తనకు సర్వస్వమూ ఇక్కడే తన కోసం వ్యాపించి ఉన్నట్లు- అక్కడ కమలవాణి వద్దనుంటే అక్కడే విధి- సిద్ధి- సమృద్ధి వ్యాపించినట్లుంటుంది.


అప్పుడతడు చివరి షాట్‌లా మధులిక వైపు చూస్తూ అన్నాడు. ”నేనొకటి చెప్తాను. వింటావా!”

ఉఁ అందామె.

”నాకు కమలవాణి గుర్తుకి వచ్చినప్పుడల్లా నాకు కలలో, ఊహలో గాంధర్వకన్య వరూధిని మనసున మెదులుతుంది. నువ్వు ఊహలో మెదలినప్పుడల్లా మా అమ్మ ఉమాదేవిగారు గుర్తుకి వస్తారు. డిడ్ ఐ మేక్ మై పాయింట్ క్లియర్?” ఆమెకు మాటలు కరువయాయి. శేఖరాన్ని గాఢంగా కౌగలించుకుంది. ప్రేమ, పరువం కలగలసి పండగ చేసుకున్న మధుర క్షణాలవి.


===============================================

                                                ఇంకా వుంది

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page