top of page

తీరం చేరిన నావ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Thiram Cherina Nava' Written By A. Annapurna

రచన: A. అన్నపూర్ణ

జీవితమనే సముద్రంలో ఏర్పడ్డ అల్లకల్లోలాలకు

కోరుకున్న మనిషికి దూరమయ్యాడు మహేశ్వర్.

కోల్పోయిన జ్ఞాపకాల గుర్తులు తిరిగి అతన్ని చేరుకున్నాయి.

అతని జీవితానికి ఒక అర్థం ఏర్పరిచాయి.

ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు ఈ కథను రచించారు.



ఉదయమే నిద్ర లేచిన మహేశ్వర్ పాల పాకెట్ తెచ్చుకుందామని వీధి తలుపు తెరిచాడు.

ఎదురుగా దుప్పటిలో చుట్టి వున్న కదులుతున్న వస్తువేదో కనబడింది.

ఆరుబయట ఇంకా మసక చీకటిగా వుంది.

ఏమిటో అర్థం కాని మహేశ్వర్, ‘ఇదేమిటీ…’ అని కంగారుపడుతూ బయట వరండాలో లైటు వేసి దగ్గిరగా వెళ్లి చూసాడు.

అది ఒక పసిపాప.

కడుపునిండా పాలు తాగిందేమో ఏడవలేదు. నిద్రపోతోంది.

నాలుగువైపులా చూసి ''ఎవరది?" అంటూ పిలిచాడు.

ఎవరూ పలకలేదు.

నాలుగు మెట్లు కిందకి దిగి చుట్టూరా చూసాడు.

ఎవరూ కనబడ లేదు.

కావాలని.. నేను ఒంటరిగా ఉంటానని తెలిసి.. ఇక్కడ ఈ బిడ్డను వదిలిపెట్టారు.

‘ఏం చేయాలి ? ఈ ఒంటరి దగ్గర ఏం ఆశించి ఈ పసిబిడ్డను ఇక్కడ వదిలి వెళ్లారు?...’ అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పనిమనిషి నీలమ్మ వచ్చింది.


''ఏమిటి బాబుగారూ .... ఈ పసిబిడ్డ ఏమిటి? మీరిలా దిగులుగా కూర్చున్నారేమిటి?” అంటూ అడుగుతూ ఆ బిడ్డను ఎత్తుకుంది.


''ఏమో నీలమ్మా! నేను ఉదయం లేచేసరికి గుమ్మంలో ఎవరో వదిలి వెళ్లి నట్టు వున్నారు. కనబడింది. నాకు ఏం చేయాలో తెలియక ఇలా కూర్చున్నాను'' అన్నాడు మహేశ్వర్ .


''లోపలికి పదండి....ఈ బిడ్డను తీసుకువస్తాను....” అంటూ నీలమ్మ పసిబిడ్డను ఎత్తుకుంది.


''వద్దు ఎవరికైనా ఇచ్చేయి....నేను కొత్తగా బంధాలను నెత్తికి చుట్టుకోలేను....” అన్నాడు మహేశ్వర్.


''పాపను చూస్తే గొప్పింటి బిడ్డలా వుంది… ఎవరికైనా ఇస్తే దిక్కుమాలిన వ్యాపారం చేస్తారు బాబూ.... ఈ కాలంలో ఆడపిల్లకి రక్షణ ఏది? చూస్తూ వదిలిపెడితే పాపం చుట్టుకుంటుంది నేను సాయంగా వుంటాను.. రాత్రికి ఇంటికి పోయి ఉదయాన్నే వస్తాను. మీకు ఇబ్బంది ఉండదు'' అంది నీలమ్మ.


''ఆలా కాదు. నీ ఇంటికే తీసుకెళ్ళు......నేను పోషణకి డబ్బు ఇస్తాను.'' అన్నాడు మహేశ్వర్.


''నామొగుడు అసలే అనుమానం మనిషి. తాగుబోతు. నా కొడుకులు సరి ఐన వాళ్ళు కారు. అదీకాక రాజకుమార్తెలాంటి ఈ బిడ్డ నా ఇంట్లో పెరగడం సరికాదు.'' చెప్పింది నీలమ్మ.


''ఈబిడ్డ ఎవరని అడిగితే ఏమి చెప్పాలి నీలమ్మా ....” సందేహంగా అన్నాడు.


''ఉన్నమాట చెబుతారు. నేను కూడా చూశానని చెబుతాను. ఏమీ పర్వాలేదు బాబూ… ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ నాలుగురోజులు పొతే పాపను వదలమన్న వదలరు.'' అంటూ పాపకు స్నానం చేయించి పడుకోబెట్టింది.


ఇంటిపని చేసి, “మళ్ళీ వస్తాను బాబూ …” అంటూ వెళ్ళిపోయింది.


మహేశ్వర్ అనుకోని అతిధిగా వచ్చిన ఆ పసిబిడ్డను దగ్గరగా వెళ్లి చూసాడు. ఏదో తెలియని మమకారం, దయ పుట్టుకు వచ్చాయి. ‘ఇది కూడా నాకు ఒక బాధ్యత ఏమో…’ అనుకున్నాడు.

నీలమ్మ ఇళ్లలో పనులు చేసి వంట చేయడానికి వచ్చేసరికి నిద్ర లేచిన పాప ఆకలివేసి ఏడవడం మొదలు పెట్టింది.


పాలు పట్టి.... ‘బాబుగారూ! పాపకి ఏమి కావాలో షాపులో తెస్తాను…” అంటూ చెప్పి డబ్బు తీసుకుని,

అన్నీ తెచ్చింది. బిడ్డ బాధ్యత తీసుకుంది. పాప ఏడుపు విని తొంగిచూస్తున్న ఇరుగు పొరుగు వారితో జరిగింది చెప్పింది.


''బాబుగారూ! పాపకి పేరు చెప్పండి....” అంది.


''మంగళవారం మన ఇంటికి వచ్చింది కదూ ‘మంగళ’ అని పెడదాం…” అన్నాడు మహేశ్వర్.


''బాగుంది బాబూ.... మంగళ.... చక్కనిపేరు.!...ఈ ఇంటికి మంగళ ప్రదం ....” అంటూ మెచ్చుకుంది.


పాప పుట్టినరోజు తెలియదు కనుక డాక్టరు దగ్గిరకి తీసుకువెళ్లి పరీక్షలు చేయిన్చాడు. ఆవిడ చెప్పిన ప్రకారం పుట్టినతేదీని సుమారుగా నమోదు చేయించి వచ్చాడు.


నాలుగేళ్లుగా నీలమ్మ పనిచేస్తోంది కానీ మహేశ్వర్ గురించిన వివరాలు తెలియవు.

ఆ ఇంట్లో ఆయన భార్యతో తీసుకున్న ఒక్క ఫోటో లేదు. పిల్లల ఫోటోలు కూడా లేవు.


ఆ ఊరి చివర ఒక్కడూ ఎందుకు వున్నాడో ..... ఎక్కడనుంచి వచ్చాడో ..... తెలియదు. నిశ్శబ్దంగా వుండే ఆ ఇంట్లో ఇంటిపని, వంటపని నీలమ్మే చేస్తూ పని తప్ప మరే విషయమూ పట్టించు కోకుండా ఉండేది.


ఈ రోజు మంగళ వచ్చాక ఇంట్లో సందడి వచ్చింది.

మహేశ్వర్ కి కూడా పాప రావడం కాలక్షేపంగా వుంది. ఇల్లు మంగళ ఆటపాటలతో కళ కళ లాడుతోంది.


‘ఒక్కడిని....నాకేంకావాలి’ అనుకునేవాడు.


ఇప్పుడు ''మంగళకు ఇది...మంగళ కోసం అది తేవాలి…” అనుకుంటూ అన్నీ అమరుస్తున్నాడు.

అదేమోకానీ, మంగళ రాత్రిళ్ళు నీలమ్మ కోసం అడగటం లేదు. పేచీలు పెట్టదు. అక్కడికీ మనసు ఆగని నీలమ్మ, పడుకోబోయే ముందు వచ్చి చూసి వెళ్ళేది.


ఆలా మంగళ పెరిగి పెద్ద అవుతోంది నీలమ్మ, మహేశ్వరుల పెంపకంలో.


''మహేశ్వర్ ని డాడీ అనీ, నీలమ్మను ఆయమ్మ '' అనీ పిలుస్తుంది. నీలమ్మే అలా పిలవమని నేర్పింది.


స్కూల్కి వెడుతోంది. చదువులో మహా చురుకుగా ఉంటుంది. ఆటలు, పాటలు, నాటికలు… అన్నిటికి నేను ఉంటానంటూ పాల్గొంటుంది. పదహారేళ్ళ పడుచుగా ఎదిగింది. అన్ని విషయాలు గ్రహిస్తోంది.


'ఎక్కడో పుట్టింది...నాయింట పెరుగుతోంది... ఇంట్లో అన్నిపనులు చేస్తాను అంటుంది. ఏమిటీ బంధం? వద్దు అనుకున్నాను. మెడకు పూలదండలా సుతిమెత్తగా చుట్టుకుంది' అనుకుంటూ ఉంటాడు మహేశ్వర్.


ఒకరోజు నీలమ్మ అడిగింది. మంగళ కూడా అక్కడే వుంది. కుతూహలంగా వింటోంది.

''బాబూ! ఏమనుకోవద్దు. ఓప్రశ్న అడుగుతాను.....” అంది.


''నువ్వు అడగబోయేది నాకు తెలుసు. నీకు భార్య బిడ్డలు లేరా? ఒక్కడివే ఎందుకు ఉంటావు… అని.!”


''అవును బాబూ ..నాకు ధైర్యం చాల్లేదు. ఇప్పుడు మీ తోబుట్టువుగా అనుకుంటున్నా ....” అంది.


''ఏదో ఒకరోజు చెప్పాలి నీలమ్మా… ఇంతవరకూ ఎవరికీ చెప్పవలసిన అవసరం రాలేదు. కానీ మంగళాకి కూడా తెలియాలి. తెలియకపోతే నష్టం లేదు కానీ తెలిస్తే మంచిది. నేను రాజమహేంద్రవరం అనీ.. ఆవూరు జమిందారుగారి అబ్బాయిని. ....”


''నాకు తెలుసు బాబూ ...మా అమ్మమ్మ, వారింట పనిచేసేది. ఆరోజుల్లో జమిందారుగారింట్లో పని చేయడం గొప్పగా చెప్పుకునే వారు. ఆ ఇంటి వైభోగం చూపించాలని నన్ను తీసుకు వెళ్ళింది. నాకు బాగా గుర్తు వుంది బాబూ.....” సగంలో ఆపి ఉత్సాహంగా చెప్పింది నీలమ్మ.


''అలాగా.... నాకు తెలియదు. ఆ కుటుంబంలో ఆడవారికి స్త్రీలు, మగవారికి పురుషులు పనిచేసేవారు . అదొక పధ్ధతి. నేను ఇంటర్ చదువు మహేంద్రవరంలో పూర్తి చేసాక ఇంజినీరు చదువుకి మా మేనమామ దగ్గిరకి కన్నడ రాష్ట్రం పంపించారు. మహేంద్రవరంలో వున్నప్పుడు నాన్నగారి బంధువు.. సవతి చెల్లెలు రత్నావళి, ఆమె కూతురు మాఇంట్లో ఉండేవారు.


ఆవిడ భర్త వ్యసన పరుడు. స్నేహితుల గొడవల్లో ఆయన ఇద్దరిని హత్యచేసి జైలుకి వెళ్ళాడు. చెల్లిని, కూతురును నాన్నగారు తీసుకువచ్చారు. ఆ అమ్మాయిపేరు సుగంధి. నా... వయసే ! నా క్లాస్ కూడా. ఇద్దరం కలసి స్కూల్కి వెళ్లే వాళ్ళం. కలసి ఆడుకునేవాళ్ళం. నాకు ఒక అన్న, ఒక అక్క వున్నారు. వాళ్ళకి నాకు వయసు చాలా తేడా వుంది. అందువల్ల చేరిక లేదు. వాళ్లు పెళ్లి చేసుకుని వేరే దేశాలకు వెళ్లిపోయారు.


అమ్మకి వాళ్ళ అన్న కూతురితో నాకు పెళ్లి చేయాలని కోరిక. నాన్నగారికి మనసులో ఏముందో మరి… తెలియదు. మామయ్య కూతురు పారిజాత మంచి అమ్మాయి. ఆధునిక భావాలు కలది. నాతో ఫ్రెండ్లీగా ఉండేది తప్ప, బంధువుగా అనుకునేది కాదు. నేను నా ప్రేమ విషయం పారిజాతకి చెప్పాను.


''నాకు నువ్వు కాబోయి భర్తవని మా అమ్మ, నాన్న, నేను కూడా… అనుకోవడంలేదు. డోంట్ వర్రీ …” అని చెప్పింది.


నేను వారి ఇంటినుంచి హాస్టల్కి వెళ్ళిపోయాను. మా అమ్మకీ నాన్నకే తెలియదు.

‘మామయ్య ఇంట్లోనే వున్నాను’ అనుకునేవారు.


నేను సుగన్ధితో చనువుగా ఉండటం అమ్మకి నచ్చలేదు. వాళ్లంటే చిన్న చూపు చూసేది.

అందుకే చదువు వొంకతో నాన్నగారిని ఒప్పించి కన్నడ రాష్ట్రం పంపేసింది.


నేను సుగంధికి ఉత్తరాలు రాస్తే ఇవ్వలేదు. ఫోను చేస్తే మాటాడనివ్వలేదు. సెలవులకు వస్తే సుగంధిని, వాళ్ళ అమ్మగారిని వేరే చోటుకి పంపేది. నాన్నగారికి తెలిసినా అమ్మ మాట కాదనలేదు.


నేను ఎలాగో మా పనివాడితో వెళ్లి, సుగంధిని రహస్యంగా కలిసి, 'నా చదువు పూర్తి కాగానే వచ్చి తీసుకువెడతాను. మనం పెళ్లి చేసుకుందాం ' అని ధైర్యం చెప్పాను. మాట ఇచ్చాను.

సుగంధి అలాగే నమ్మింది. కానీ మేము అనుకున్నట్టు జరగలేదు.


నా చదువు పూర్తిచేసి వచ్చేసరికి సుగంధికి వేరే అబ్బాయితో పెళ్లిచేసి పంపేసింది మా అమ్మ.

ఆ కోపంతో ఇల్లువిడిచి వచ్చేసాను. నేను పెళ్లి చేసుకోలేదు. ఉద్యోగంలో చేరి నా వాళ్లకి తెలియకుండా దూరంగా ఉండిపోయాను.....” అంటూ తన సంగతి చెప్పాడు.


''అయ్యో బాబూ ! మీ మేనత్త, మా అమ్మకు బాగా తెలుసు.. వాళ్ళు చాలా కష్టపడ్డారని చెప్పేది. రత్నావళి గారికి తోడుగా జమిందారుగారు మా అమ్మ ను పంపారట. మీరు చెప్పిన సుగంధి, మా అమ్మకు తెలిసే ఉంటుంది..... అమ్మ ఇప్పుడు బాగా ముసలి అయిపొయిన్ది. ఐనా మిమ్మల్ని గుర్తు పట్టచ్చు....” అంది నీలమ్మ.


వాళ్ళ కబుర్లు వింటున్న మంగళ .....''తాతగారూ… మీకు ఏమికానా... అనాధనా....?” అంది కన్నీటితో.


''అయ్యో చిట్టి తల్లీ! నువ్వు అనాధవి కాదమ్మా … నా కోసం ప్రేమతో వచ్చిన శ్రీ మహాలక్ష్మివి.. నా ప్రాణానివి'' అన్నాడు మహేశ్వర్.


''ఊరుకో చిన్నమ్మా .... బాబుగారు చెప్పినట్టు, అయన ముద్దు ముచ్చట తీర్చడానికి వచ్చిన బంగారు తల్లివి'' అంటూ కన్నీళ్లు తుడిచి ఓదార్చింది నీలమ్మ.


ఇంటికి వెళ్ళాక మహేశ్వర్ చెప్పిన ఆయన కథ విన్నాక ఏదో ఆలోచన వచ్చింది. మర్నాడు ఆ ఊళ్లోనే వున్న వృద్ధురాలైన తల్లిదగ్గిరకు వెళ్ళింది. సుగంధి రత్నావళి లను గురించి అడిగి తెలుసుకుంది. నిర్ధారణ చేసుకుంది.


‘సందేహం లేదు. నా ఆలోచన నిజమే!’ అనుకుంది.


ఆ తర్వాత మంగళ కాలేజీకి వెళ్ళినపుడు మహేశ్వర్ తో చెప్పింది.

''బాబుగారూ… ఇక ఈ అజ్ఞాత వాసం ఎందుకండీ… మీరు చిన్నమ్మను తీసుకుని మహేంద్రవరం వెళ్ళండి. మంగళకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. ఎవరూ లేనట్టు ఇక్కడ ఊరి చివర ఆ చిన్న ఇంట్లో ఉండటం సరి కాదు .వెళ్ళండి. పంతాలు పట్టింపులు మంచిది కాదు. సుగంధికి కూడా మీ తాతగారి ఆస్తిలో వాటా ఉంటుంది. ఇప్పుడు మీకు కొత్తగా బాధ్యత వచ్చింది. మీకు వారసత్వంగా వచ్చిన ఆస్తి హక్కు తీసుకుని సుఖంగా వుండండి......ఈ అమ్మాయి మంగళ మీరు ఇష్ట పడిన సుగంధి కూతురు అని అర్ధం ఐనదికదా” అంటూ నచ్చ చెప్పింది.


''నీలమ్మా .... మరి సుగంధి ఏమైనట్టు....?” అడిగాడు మహేశ్వర్.


''అది తెలుసుకోవలసిన బాధ్యత మీదే. ఈ పని ఆరోజే చేసివుంటే సుగంధి మీకు దక్కేది. ఎవరిని ఉద్ధరించారు చెప్పండి.... ఇలా అజ్ఞాత వాసంలో ఉండి? చాలా పోగొట్టుకున్నారు. నన్ను మన్నించండి..... చనువు తీసుకున్నాను'' అంది నీలమ్మ.


''లేదు నీలమ్మా నాకళ్ళు తెరిపించావు. ఇప్పటికే ఆలస్యం ఐనది. నువ్వన్నట్టు మంగళకి ఆస్తిలో వాటా దక్కాలి. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి.... అదే పరిష్కారం.... నా బాధ్యత కూడా'' అన్నాడు మహేశ్వర్.


ముఫై ఏళ్లపాటు ఆ వూళ్ళో మహేశ్వరుని కనిపెట్టి వుండిన బంధంతో, పదహారేళ్ళ పాటు పెంచిన మంగళ మీద మమకారంతో.....


ఆ వూరు విడిచి వెడుతుంటే సగం సంతోషంగా ...సగం బాధతో వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ, ఆ ఇద్దరికీ వీడుకోలు చెప్పింది నీలమ్మ.


''నీ మేలు మర్చిపోను. ఒక తోబుట్టువులా నన్ను చూసావ్. మంగళ ఇంటికి వచ్చాక అనుబంధం ఏమిటో చెప్పేవు. చివరగా నా బాధ్యతను గుర్తుచేసావ్.... నీకు ఎంతో రుణపడి వున్నాను. ....” అంటూ మహేంద్రవరానికి బయలుదేరాడు మహేశ్వర్.


కొడుకు దూరమయ్యాడనే బెంగతో… మహేశ్వర్ తల్లి కన్నుమూసింది. జమీందారు భానుమూర్తి గారు నూరేళ్ళ వయసులో వున్నారు. ఆ కొడుకు కోసమే ఎదురు చూస్తూ.

డబ్బు వుంది.. పనిమనుషులు వున్నారు. పోలీసు రిపోర్ట్ ఇస్తే మహేశ్వర్ ఆచూకీ తెలియడం కష్టం కాదు.


కానీ ఆయనకు భార్య మరణించినప్పటికే, 'అల్జీమర్త్స్' వ్యాధి రావడం వలన ఏమీ గుర్తులేదు.

కర్ణాటక రాష్ట్రంలో వుండే మహేశ్వర్ మేనమామ, పారిజాత చదువుకోసం లండన్ వెళ్లిపోయారు. చెల్లి కుటుంబంతో పెద్దగా సంబంధాలులేవు. ఆయనకు ఆధునిక భావాలు ఎక్కువ . ఆయనకు విరుద్ధం చెల్లెలు- ఆమెభర్త..... కావడంతో పట్టించుకోలేదు. ఆయనకు ఈ విషయాలు తెలియవు.

మహేశ్వర్ చాలా కాలానికి మహేంద్ర వరం రావడం, అక్కడి విషయాలు గ్రహించి భాను ప్రసాదుకి నమ్మకస్తుడు ఐన కేశవ గారిని కలిసి అన్నీ చక్కబరిచాడు.


''చిన్నబాబూ.... మీకోసమే కాబోలు నాన్నగారి ప్రాణాలు నిలబడ్డాయి. నేనుకూడా మీరు ఎప్పటికైనా వస్తారు అనే ఆశతో ఎదురు చూస్తున్నాను. నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడంతా మారిపోయింది. ఇదిగో బాబూ ముఖ్యమైన పేపర్లు, బ్యాంకు లాకర్ తాళాలు. నా బాధ్యత తీరింది ''. అంటూ అప్పగించాడు.


''కేశవ్ గారూ ! బాధ్యతలనుంచి తప్పించుకుని పారిపోయిన పిరికివాణ్ణి..... నన్ను మన్నించండి. నాన్నగారిని, ఈ ఆస్తిని కాపాడుతూ మీ బాధ్యత నిర్వహించిన మీరు చాల గొప్పవారు. ఇకనుంచి మీరు కూడా మా నాన్నగారితో సమానం.....నేను మిమ్మల్ని కూడా చూసుకుంటాను. మీరు అన్నీ తెలిసిన వారు. పేరుకే నేను వారసుడిని.... మీరు నావెనుక ఉండి నన్ను నడిపించాలి.'' అన్నాడు మహేశ్వర్.


కేశవ్ గారికి సంతానం లేరు. భార్య, భర్త. నిరాడంబరంగా భాను ప్రసాద్ గారికి నమ్మకస్తులుగా వున్నారు. అందుకే మహేశ్వర్ వారి బాధ్యత తీసుకున్నాడు.


''కేశవ గారూ.... మీకు మా మేనత్త రత్నావళి, సుగంధి గురించి తెలిసే ఉంటుంది.....వాళ్ళు ఏమయ్యారు? తెలుసా!” అని అడిగాడు మహేశ్వర్.

''ఆ తెలుసును బాబూ ! సుగంధి పెళ్లి చేసాక మీ అత్తా ఆమెతోనే వున్నారు. సుగంధికి చాలా అన్యాయం జరిగింది.....పెళ్లినాటికే అతగాడికి కేన్సరు ఉంది. సంవత్సరం తిరగ కుండా చనిపోయాడు.


మీ అత్తా, సుగంధి తిరిగి నాన్నగారి దగ్గిరకి వచ్చారు. కొన్నిరోజులకి అత్త అనారోగ్యంతో చనిపోయారు.


సుగంధి మీ అమ్మగారి వేధింపులు తట్టుకోలేక ఏటో వెళ్ళిపొయిన్ది ....”


''అదేమిటి.... సుగంధి డిగ్రీ చదివింది. వుద్యోగం చేయవచ్చు..... ఇంటి నుంచి వెళ్లిపోవడం ఎందుకు?”


''అప్పటికే మీ నాన్నగారికి మతిమరుపు వచ్చింది. అమ్మగారిదే ఇష్టం . అమ్మకు మొదటినుంచి...

తల్లీ కూతుళ్ళంటే పడదు. ‘వారికీ ఆస్తిలో భాగం ఇవ్వాలి....’ అనే ఉక్రోషం మనసులో పెట్టుకుని ...... నిర్లక్ష్యం చేసారు. వేధించారు. సుగంధి కి పుట్టిన బిడ్డను గురించి ''అక్రమ సంతానమని'' నిందవేసారు. అది భరించలేక సుగంధి వెళ్ళిపొయిన్ది.'' అంటూ చెప్పాడు.


మహేశ్వర్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చి సుగంధికోసం వెదికించాడు..... చివరికి ఏడాది తర్వాత తెలిసింది.

సుగంధి రోడ్డుప్రమాదంలో చనిపొయిన్ది.... బిడ్డ గురించి మాత్రం తెలియదు.

***

''డాడీ ! నేను డాక్టర్ని అయ్యాను. మీకోరిక తీరింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది'' అంటూ గుడ్ న్యూస్ చెప్పింది మంగళ.


''సంతోషం తల్లీ! ఇదంతా తాతగారి బ్లెస్సింగ్స్ వలన జరిగింది. పద ఆయనకు చెప్పు.'' అంటూ ఏటో శూన్యంలోకి చూస్తూ తనలో తానే మాటాడుకుంటూ వున్న భాను ప్రసాద్ దగ్గిరకి వెళ్లారు మహేశ్వర్, మంగళ.


''తాతయ్యా...నేను నీ మనుమరాలిని.. నీ దీవెనలు ఇవ్వు” అంటూ తాతగారి చేతిని తలమీద ఉంచుకుంది...మంగళ.


''అవును నాన్నగారు....మంగళ ఇప్పుడు డాక్టర్. పేదలకు ఉచితంగా సేవలు చేస్తుంది.'' అన్నాడు మహేశ్వర్.


భాను ప్రసాద్ దీక్షగా మంగళ కళ్లలోకి చూసాడు.... తనలో తాన అనుకుంటూన్నట్టు చెప్పేడు ''సుగంధి.... నువ్వు సుగంధివి .... నన్ను క్షమించు....’ అంటూ గొణిగాడు.


మహేశ్వర్ మంగళా ఒకరి నొకరు చూసుకున్నారు. వాళ్లకి పూర్తిగా అర్థం అయింది.


కల్లోల కడలి లోని నావ, తీరానికి చేరిన ఆనందం పొందారు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.









78 views0 comments

Comentários


bottom of page