top of page

పల్లె పిలిచింది - 25

Updated: Jul 2

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ద్విరదగతిరగడ

ree

Palle Pilichindi - 25 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 30/06/2025

పల్లె పిలిచింది - 25 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


38.

తేటగీతి.


ఇట్లు ఛాత్రులు చదువంగ నిరవుగాను 

కాలమంతయు బిరబిరా కదలుచుండ 

వర్షఋతువరుదెంచె నీ వసుధయందు 

పట్టణంబును ముంచెత్తె వానలపుడు.//


తాత్పర్యము.


ఇలా పల్లెటూరు నుండి వచ్చిన విద్యార్థులు చదువుకొంటూ ఉంటే కాలము వేగంగా గడిచింది. అప్పుడు వర్షఋతువు వచ్చింది. పట్టణాన్ని వానలు ముంచివేశాయి.//


39.

ద్విరదగతిరగడ.


దవ్వులందుమెఱుపులు తళతళా మెరయగన్ 

జివ్వుమని వాయువులు చేవతో వీయగన్ 


ఫెళఫెళా మేఘములు పెద్దగా గర్జించ 

జలజలా జడివాన జగతిపై వర్షించ 


పట్టణంబున జనులు భయముతో వణకగన్ 

చుట్టుప్రక్కల నీరు చుట్టుకొని నిలువగన్ 


భీకరంబగు వాన బెదురు పుట్టించింది 

ప్రాకటంబగు వాన పరుగు పెట్టించింది.//


తాత్పర్యము: సులభంగానే ఉంది.//

40.

తేటగీతి.


వాననీటితో నిండెనా పట్టణంబు 

వీథులన్నియు మునుగంగ వెతలు పెరిగె 

కాంకిరీటుతో హర్మ్యాలు కట్టుచుండ 

జలము పారగా దారేది జగతియందు?//


తాత్పర్యము.


ఆ నగరము మొత్తం వాన నీటితో నిండి పోయింది. వీథులన్నీ మునిగిపోయాయి. అంతటా కాంక్రీటు భవనాలు ఉండటంతో నీళ్లు పోవటానికి దారిలేదే!//

41.

తేటగీతి.


ప్రాణములఁ బట్టు కొనుచుండి ప్రజలు నేడు 

బెదురు చుండిరి భీతితో వీడి జవము 

వాడలందున నీరము వచ్చిచేర

వరద నదివోలె కనుపించె పట్టణంబు.//


తాత్పర్యము.


వరద వచ్చిన నదిలాగా పట్టణము కనిపిస్తుంది. వీథుల్లో నీరు వచ్చి చేరుతుంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భీతితో బ్రతుకుతున్నారు.//


42.

తేటగీతి.


పాలు దొరకవు హతవిధీ!పాపమచట 

త్రాగు నీరము లేదయ్యొ దప్పి తీర

చిన్న బిడ్డల యాకలిన్ దీర్చు దారి 

కానుపించక పౌరులు కలత పడిరి.//


తాత్పర్యము.


పాలు, నీళ్లు దొరకటం లేదు. చిన్నబిడ్డలు ఆకలికి ఏడుస్తుంటే ప్రజలు బాధపడుతున్నారు.//


43.

తేటగీతి.


పడవ లందున తిరుగుచు పాలకతతి 

వచ్చి గాంచుచు ప్రజలకు వసతిఁ జూప 

నిండ్ల నుండి జనుల తరలించ సాగి 

కొంత సాయముఁ జేసిరి చింత విడగ.//


తాత్పర్యము.


కొంతలో కొంత మేలుగా ప్రభుత్వపు అధికారులు పడవల్లో తిరుగుచూ ప్రజలను ముంపు ప్రాంతముల నుండి తరలించి, వసతి చూపిస్తున్నారు. //


44.

తేటగీతి.


మశకజాతులు ప్రబలంగ మనుజతతికి 

వివిధ రోగముల్ పుట్టగా బెంగ పెరిగె 

వర్షఋతువున కష్టముల్ పట్టణమున 

మిక్కుటంబుగ చెలరేగ మేలు కలదె?//


తాత్పర్యము.


వానాకాలంలో దోమలు పెరిగిపోయాయి. ప్రజలు  రోగాలతో బాధపడుతున్నారు.పట్టణములో వర్షాకాలం ఇలా ఉంటే ప్రజలకు మేలు కలుగుతుందా?//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page