'Anandala Hela Sankranthi Panduga' Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
"సంక్రాంతి పండుగకు అమ్మమ్మ అందర్నీ రమ్మనమని ఫోన్ చేసి చెప్పిందే ప్రణూ, ఈసారి మామయ్యలూ పీన్నీ వాళ్ల కుటుంబాలే కాకుండా, మా పెద్దమ్మా వాళ్లంతా వస్తున్నారుట.. రెండు రోజులు ఆఫీస్ కి శెలవు పెట్టు.. నాన్న కూడా సరే నన్నారు.. వాసు కూడా వెడదామంటూ ఎగిరి గంతులేస్తున్నాడు.. వాడికెలాగూ శెలవలేకదా" అంటూ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన ప్రణవి తో తల్లి సుజాత చెప్పింది..
'నాకు మూడ్ లేదు అమ్మా, కొత్త ప్రాజెక్ట్‌కి మారిన దగ్గరనుండి నానా చికాకుగా ఉంది. ప్రాజెక్ట్ హెడ్‌తో పడలేకపోతున్నాను. నన్నే కాదు అందరినీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు’ అని నోటి దాకా వచ్చిన మాటను మింగేసాను. అమ్మకు నా సమస్య గురించి చెపితే వెంటనే లేస్తుంది, ' నేను చెప్పలేదూ, నీ చదువు అయిపోగానే పెళ్లి చేస్తాం అంటే నీవే ససేమిరా వినకుండా ఉద్యోగం చేస్తావన్నావంటూ' ఇప్పుడు ఉద్యోగం మానిపించేసి పెళ్లి చేసేస్తుందనుకుంటూ, తన సమస్యను కొన్నిరోజులు పక్కన పెట్టేసి అందరితో అమ్మమ్మగారి ఊరికి వెళ్లడానికి ఒప్పుకున్నాను..
రెండురోజుల తరువాత ప్రొద్దున్నే కారులో బయలుదేరి ఐదారు గంటలు ప్రయాణం చేసి అమలాపురం దగ్గర ఉన్న ఇందుపల్లె ఊరికి చేరుకున్నాం.. అమ్మమ్మ ఊరికి రెండు సంవత్సరరాలక్రితం మామయ్య కొడుకు పెళ్లికి వచ్చాం.. రోడ్ కు రెండువేపులా స్వాగతం పలుకుతున్న కొబ్బరి చెట్లు, పచ్చని పంటపొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మనసుని సేదతీరుస్తున్నాయి.. ఊరంతా సంక్రాంతి పండుగ కళతో సందడిగా ఉంది.. ఎక్కడ చూసినా ముంగిళ్లల్లో ముత్యాలతో తీర్చి దిద్దినట్లుగా పెద్ద పెద్ద ముగ్గులు మధ్యలో ముద్దుగుమ్మల్లా బంతిపూలతో సింగారించుకుని ఎవరిరాకకోసమో ఎదురుచూస్తున్నట్లుగా గొబ్బెమ్మలు కనువిందు చేస్తున్నాయి.. ఆ ఊళ్లో చాలావరకు ఎత్తు అరుగులున్న పెంకిటిళ్లు.. పెద్ద పెద్ద మండువా లోగిళ్లతో బారులు తీర్చినట్లుగా కనిపిస్తాయి..
అమ్మమ్మ ఇంటిముందు కారు ఆగగానే, ఇంట్లోని అత్తయ్యలూ, మామయ్యలు, పిన్నీ, బాబయ్య, అమ్మమ్మా, పిల్లలందరూ బిల బిల్లాడుతూ వచ్చేసారు.. అమ్మమ్మ నన్ను ముద్దు పెట్టుకుంటూ, ' ఏమిటే ప్రణూ, చిక్కిపోయావు? ఆఫీస్ ధ్యాసలో పడి తిండి తగ్గించావా ? అంటూ ఆప్యాయంగా ప్రశ్నించింది'. అమ్మమ్మా నేను ఇక్కడ ఉన్నన్ని రోజులూ నా ఆఫీసుని గుర్తుచేయకు, సరేనా అంటూ అమ్మమ్మను ప్రేమతో చుచ్టేసింది ప్రణవి.. ఇంటి గడపలకు బంతిపూల తోరణాలు, గడపకు పూసిన పసుపు కుంకుమలతో ఇల్లంతా కళగా ఉంది.. ఫ్రష్ అప్ అయి అందరం మండువా హాల్లోకి చేరాం.. సూర్యుడి వెలుతురు నేరుగా హాల్లోకొస్తోంది. ఈలోగా అమ్మమ్మా, పెద్ద అత్తయ్య వెండి పేట్లలో సకినాలు, జంతికలు, అరిసెలు, కజ్జికాయలూ, సున్ని ఉండలలాంటి తినుబండారాలెన్నో తెచ్చారు.. స్వఛ్చమైన నేతి వాసనతో పిండివంటలు ఘుమాయించి పోతున్నాయి.. ఎంతో రుచిగా ఉన్న పిండివంటలను తింటూ ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకున్నాం..
మరునాడు భోగిపండుగ. చిన్నా పెద్దా అందరూ తెల్లనారు ఝామునే లేచిపోయారు. మగవాళ్లంతా కలసి భోగిమంటలు వేయడం మొదలెట్టారు.. ఆ తెల్లవారుఝామున చలిలో ఆకాశానికి అంటుతున్నట్లుగా ప్ర కాశిస్తున్న భోగిమంటలు శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తున్నాయి.. ' పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగట'. అమ్మమ్మ పెద్దగా చదువుకోపోయినా, పండుగలూ, సంప్రాయాదాల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ బ్రహ్మాండంగా చెప్పేస్తుంది..
కుంకుడుకాయల రసంతో తలంట్లు పోసుకుని, సాంబ్రాణి పొగతో జుట్టునారబెట్టుకుని అందరం కొత్తబట్టలు ధరించడం చాలా హుషారుగా అనిపించింది.. అమ్మమ్మ వండిన చక్రపొంగలి, అప్పుడే కొట్టిన కొబ్బరికాయలను కోరి చేసిన కొబ్బరన్నం, పలుచని బొబ్బట్లు, పనసపొట్టుకూర, దప్పళం, మామిడికాయ పప్పు, దోసావకాయ ఓహ్, అన్నీ తినేసరికి భుక్తాయాసం వచ్చేసింది.. అవేకాకుండా మధ్య మధ్యలో మన ఇంట్లో గేదె ఈనిందంటూ, అప్పటికప్పుడు తయారుచేసిన జున్ను మిరియాల సువాసన, కొత్తబెల్లం తో ఎన్నిరోజులైందో అటువంటి జున్ను తిని అనుకున్నాం.. సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్ల పేరంటాలూ, పట్టుపరికిణీ ఓణీ వేసుకుని గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బిళ్ల పాటలతో సరదాగా గడచిపోయించి.. అమ్మమ్మ అటకమీదనుండి తీయించిన బొమ్మలు, వంద సంవత్సరాల కాలంనాటివి, భోషాణంలో బట్టలకు చుట్టపెట్టి దాచినవెన్నో బయటకు తీయించి మా చేత బొమ్మలకొలువులు పెట్టించింది..
సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. అలాగే , సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారుట. అమ్మమ్మ అలా వివరంగా చెపుతుంటే అమ్మమ్మ ఒక ' ఎన్సైక్లోపీడియా' అనిపించింది.. జ్నానం రావాలంటే డిగ్రీలూ, సర్టిఫికెట్లు ఒకటే కారణం కాదు.. అమ్మమ్మ తెలుగు వారపత్రికలు, పురాణ గ్రంధాలనెన్నో చదువుతుంది . నువ్వు పొడి కలిపి చేసిన పులిహోర, బూర్లు, వేడి వేడి అరటికాయ బజ్జీలు, కందబచ్చలి ఆవకూర, మజ్జిగపులుసూ, ముద్దపప్పూ, ఊరమిరపకాయలతో అమ్మమ్మ వంట కి సలాం కొట్టేసాం..
మూడవరోజున కనుమ పండుగ.. వంటింట్లో పొట్టు మినపప్పుతో తయారు చేస్తున్న గారెలు కమ్మని వాసనలను వెదజల్లుతున్నాయి.. పిన్ని పాకం గారెలు చేయమంటే, మామయ్య ఆవడలు కూడా చేయమన్నాడు. చేమదుంపల వేపుడూ, పప్పు పులుసూ, కొబ్బరి మామిడికాయ పచ్చడి, కంది పచ్చడి, బూడిదగుమ్మడికాయ వడియాలు, అప్పడాలతో కడుపు పట్టలేనంతంగా తినేసి వాలిపోయాం.. అమ్మమ్మా కనుమ పండుగ ప్రత్యేకత ఏమిటంటూ అడిగేసరికి ఈ పండుగ వెనుక కూడా ఓ కథ ఉంది.. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట.
అలాగే సంక్రాంతిలో మూడోరోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదన్న నియమం ఉంది. కాబట్టి ఇంటికి వచ్చిన ఆడపడుచులని సత్కరించుకుని, మనసారా బహుమతులు ఇచ్చుకుని ముక్కనుమనాడు వీడ్కోలు పలుకుతారు. మరోసంగతి ఉంది.. కనుమనాడు రథం ముగ్గు వేయడం ఆచారం.. కొందరు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గు వేస్తుంటారు. సంకురుమయ్య ఉత్తరాయణం వైపుగా మరలే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకు అన్నట్లుగా ఇలా రథం ముగ్గుని వేయడం సాంప్రదాయం.. ఈ ముగ్గుకి ఉన్న కొసను మాత్రం ఇంటి బయటకు వెళ్లేలా దిద్దుతారనగానే ' వావ్ అమ్మమ్మా అంటూ అమ్మమ్మ బుగ్గలమీద ముద్దు పెట్టుకున్నాను' ..
ముక్కనుమ మరునాడే మా ప్రయాణం.. ఆరోజు రాత్రి అమ్మమ్మ పక్కలో దూరిపోయాను.. ' ఏమిటే ప్రణూ వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను, ఒకోసారి ఉత్సాహంగా కనిపిస్తావు, మరోసారి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా, ఏమిటీ నీ సమస్య'? నాకు చెప్పకూడదా అంటూ లాలనగా అడిగేసరికి నీకు చెప్పాలనే నీ పక్కన చేరాను అమ్మమ్మా.. అమ్మకు చెపితే వెంటనే ఉద్యోగం మానేయ్ అంటూ నాకు పెళ్లిచేసి పంపేస్తుంది.. కొత్త ప్రాజెక్ట్‌లోకి మారి నాలుగు నెలలు కూడా అవ్వకముందే మా బాస్‌తో అవస్థలు మొదలయ్యాయి . మా బాస్ నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు.. ఆఫీస్ కు వెళ్లాలంటే భయం, ఎవరికైనా చెపుదామంటే ఏమను కుంటారోనన్న సంశయం కలుగుతోంది.. ఏమి చేయాలి అమ్మమ్మా ?
అమ్మమ్మ ముసి ముసి నవ్వులు నవ్వసాగింది.. నా బాధ నీకు నవ్వు తెప్పిస్తోందా అంటూ కినుకగా అడిగేసరికి అమ్మమ్మ ఏనాడో తనకి జరిగిన అనుభవాన్ని చెప్పడం మొదలు పెట్టింది.. అప్పట్లో నాకు పదమూడేళ్ల వయస్సు. మా ఇంటికి ఒక బంధువుల అబ్బాయి వచ్చాడు.. నాకు వరుసకు బావ అవుతాడని ‘మా ఊరిలోని ప్రాథమిక పాఠశాలలో తనకు లెక్కల అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చిందని, నాన్న అంగీకరిస్తే ఇల్లు దొరికే దాకా మా ఇంట్లో ఉంటానని’ వచ్చాడు.. నాన్న సరే ఉండమన్నాడు.. వాడు బావ కాదు. ఒట్టి వెధవ. వాడిని తలచుకుంటేనే ఒళ్లు మండిపోతుంది.. నాకేసి ఆబగా చూసేవాడు.. నీకు పమిట వేసుకోవడం సరిగా రాదంటూ దగ్గరకు వచ్చి సర్దేవాడు.. నన్ను ఒంటరిగా చూసి అతి చనువుగా నా శరీరాన్ని తాకేవాడు..
ఒకరోజు సాయంత్రం అందరూ గుడికి వెళ్లారు.. నేను స్కూల్ హోమ్ వర్క్ చేసుకుంటున్నాను.. పెన్సిల్ ముల్లు విరిగిపోతే కొత్త బ్లేడ్ తో చెక్కుకుంటూ ఉండగా నన్ను వెనకనుండి రెండు చేతులతో గట్టిగా బిగించి పట్టుకున్నాడు బావ. గమ్మున లేచి నిలబజ్డాను.. గట్టిగా అరవబోయాను. చేత్తో నోరు మూసేసాడు. ఊపిరి ఆడలేదు. ‘అరవకు. అరిస్తే నువ్వే నా మీద పడ్డావని చెపుతానంటూ నా నోటి మీద చెయ్యి తీసేసి నన్ను అతని కౌగిలిలో కి గట్టిగా లాక్కుంటున్నాడు.. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. విదిలించి కొట్టాను. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. వాడి చెయ్యి లాగి, గట్టిగా పట్టుకుని చేతిలోని బ్లేడుతో సర్రున గీసాను. రక్తం చిమ్మింది. ఏమయ్యిందో అర్ధమవ్వక బిత్తర బోయి చూసాడు. మరోసారి గీసాను. చెయ్యి విదిలించుకుని చిన్నగా కేక పెట్టాడు. నా మొహంలోని తీవ్రతకనుకుంటా వాడి మొహం నిండా భయం. చేతినుండి రక్తం కారిపోతోంది.. అడుగు ముందుకు వెయ్యలేకపోయాడు.. నేను పరుగెత్తుకుంటూ మరో గదిలోకి పారిపోయి తలుపు వేసేసుకున్నాను.. బావ ఆరోజు రాత్రి ఇంట్లోనుండి వెళ్లిపోయాడు.. తిరిగి రాలేదు, ఆరోజే కాదు, ఎప్పటకీ నా కళ్లపడలేదు.. ఆ క్షణంలో ఆ ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలియదు..
అంతచిన్న వయసులో అమ్మమ్మ తన బంధువు దురాగతానికి ఎదురు దాడి చెయ్యటం అద్భుతంగా అనిపించింది. అప్పటి కాలంలో అమ్మమ్మ లాంటి మరెందరో బయట ప్రపంచం తెలియని అమాయకులైన ఆడపిల్లలు అరాచకానికి గురయ్యారు అనుకుంటే ఈ రోజుల్లో కూడా ముక్కుపచ్చలారని పిల్లలే కాక చదువుకుని ఆకాశమే హద్దుగా ఎదిగిన స్త్రీలూ రావణాసురులు, కీచకుల బారీన పడక తప్పటం లేదు. అర్ధరాత్రి నడిచి వెళ్లటం కాదు ఆధునికమైన వాతావరణంలో కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అమ్మమ్మ చూపిన ధైర్యం నాలో పిరికితనాన్ని పారద్రోలి ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేసింది. ‘ఎవరో ఏదో అనుకుంటారనో, అంటారనో లేదా ఉద్యోగం పోతుందనో ఆలోచన ప్రక్కన పెట్టి ఆత్మగౌరవం కోసం పోరాడాలి. బాస్ దుష్ప్రవర్తన మీద దాడి మొదలు పెట్టాలి. ముందస్తుగా గ్రీవెన్స్ కమిటీకి కంప్లైంట్ చెయ్యాలి’ అని స్థిర నిర్ణయం తీసుకున్నాను.
మరునాడు అమ్మమ్మ నుండి అందరం వీడ్కోలు తీసుకుంటూ బయలదేరాం.. నేను అమ్మమ్మను ప్రత్యేకంగా ఎవరూ లేకుండా చూసి గట్టిగా కౌగలించేసుకుని అమ్మమ్మ మెడచుట్టూ చేతులేస్తూ ' యూ ఆర్ గ్రేట్ అమ్మమ్మా' , ఈ సంక్రాంతి పండుగ నాకు మాత్రం ఒక గొప్ప అనుభూతిని సంతోషాన్నే కాదు, నాలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పంచి ఇచ్చింది.. నీవే నాకు ఎప్పటకీ స్పూర్తి అంటూ వీడ్కోలు తీసుకున్నాను..
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
Opmerkingen