కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Manasu Padindi Sannayi Pata' Telugu Story Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
రత్తమ్మ ఆ ఊరివారందరకూ తలలో నాలుకలా ఉంటుంది.. పేరు రత్తమ్మ అయితే ఆమె ఆ ఊరిలోని చిన్నా, పెద్దా అందరికీ రత్తమ్మత్తగా స్తిరపడిపోయింది.. ఆమె భర్త మల్లన్న .. ఆ ఇద్దరి దంపతులకూ ఎంతో కాలం తరువాత పుట్టిన కూతురు " నందిని " ..
తమ నోముల పంట, వరాలమూట అయిన నందిని అంటే ఆ తల్లితండ్రులకు పంచప్రాణాలు..
నందిని ఒక అందమైన అమ్మాయి బొమ్మలా ఉంటుంది. కళ్ళ దగ్గర రెండు కలువలుంచాడు ఆ బ్రహ్మ. ముక్కుండాల్సిన చోట ఒక సంపెంగ పువ్వు, పెదాలకు బదులు రెండు దొండపండ్లు, మెడ దగ్గర శంఖమూ, చేతులూ కాళ్ళూ తామర తూళ్ళూ– ఇలా ఒక ప్రబంధ సుందరిని తలపించేలా ఉంటుంది నందిని..
ఉన్న రెండెకరాల పొలం లో వ్యవసాయం చేసుకుంటూ గేదెలనూ ఆవులనూ మేపుకుంటూ, పాలూ పెరుగూ నెయ్యీ అమ్ముకుంటూ తమ గారాలపట్టీని ఏలోటూ లేకుండా పెంచుకుంటున్నారు..
నందిని అన్నింట్లోనూ చురుకే.. మహా తెలివైనది.. ఆ ఊర్లోనే ఉన్న స్కూల్లో పదోక్లాస్ చదివి రాష్ట్ర స్తాయిలో నే మొదటి రేంక్ విద్యార్ధినిగా నిలబడింది..
‘ఇంక సదివిన సదువు చాలు నందినమ్మా, పెళ్లి చేస్తా’మంటే, ససేమిరా పెళ్లిచేసుకోనంటూ, ‘ఇంటర్ మీడియట్ చదువుతా’నంటూ కాళ్లు నేలకు దబ దబా కొట్టేసుకుంటూ ఏడ్పు మొదలెట్టింది.. దానికి తోడు ఆ ఊరికి చుట్టుపక్కల ఉన్న జూనియర్ కాలేజ్ యాజమాన్యం ప్రత్యేకంగా వీరింటికివచ్చి నందినికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామనేసరికి ఆ ఊరి మునసబు గారి కుటుంబం, నందిని చదివిన స్కూల్ హెడ్ మాస్ట్రగారు నందినిని చదివించమని ప్రోత్సహించారు..
ఇంక నందినిని ఆప శక్యం కాలేదు.. చక చకా ఇంటర్ పరీక్షలో మళ్లీ స్టేట్ రేంక్ సంపాదించడమే కాకుండా ఎమ్ సెట్ పరీక్షలోనూ సింగిల్ డిజిట్ లో రేంక్ సంపాదించింది..
మెడిసిన్ లో హైద్రాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చేసింది..
నందిని ఎంత గారాబంగా పెరిగినా ఆమె వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను మెచ్చుకుని తీరవలసిందే.. ఒక్క క్షణం సమయాన్ని వృధా పోనీయకుండా ఏదో ఒకటి అలా చదువుతూనే ఉంటుంది..
హైద్రాబాద్ లో మెడిసిన్ చదవడానికి రత్తమ్మ మల్లన్న అభ్యంతరం చెప్పారు.. నీవు అంత పెద్ద సదువులు సదువుకుంటానంటే ఎలానే తల్లీ, మన కులంలో నీకు తగిన వరుడు దొరకడం కష్టం బిడ్డా , మా మాట వినమ్మా అన్నా వినలేదు..
“నాకు స్కాలర్ షిప్ కూడా వస్తుందే రత్తమ్మత్తా, నేను డాక్టర్ చదివి, గైన్కాలజిస్ట్ ని అవుతా..”
తల్లిని సరదాగా రత్తమ్మత్తా అని పిలుస్తూ ఆటపట్టించడం నందినికి చాలా ఇష్టం.. నందిని ప్రవర్తన బయటవారికి ఎంత వినయంగా కనిపించినా, ఇంట్లో ఆమె చిలిపితనానికి హద్దేలేదు.. ఆ చిలిపితనమే లేకపోతే వారిల్లే చిన్నబోతుంది..
“నా పెళ్లి గురించి ఎందుకే అంత చింత రత్తమ్మత్తా ? నేను పెద్ద డాక్టరమ్మను అయితే, నన్ను ఎవరూ పెళ్లాడరా చెప్పు.. మన కులం వాళ్లు కాకపోతే మరోకులం.. మంచి, మానవత్వం ముఖ్యంకానీ, ఈ కులాలు గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారమ్మా..”
అప్పుడే ఒక పెద్ద డాక్టరైపోయినట్లు పోజు కొడుతూ, డాక్టర్ లా ఇమిటేట్ చేస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తూ తనకేదో భోధిస్తున్న కూతురిని చూడగానే ఫక్కుమంటూ నవ్వేసింది రత్తమ్మ..
ఆమె తెల్లని ఎత్తుపళ్లు ముందుకు ఉరికాయి ఒక్కసారిగా..
హమ్మయ్య, రత్తమ్మత్త నవ్వేసింది, ఇంక నేను డాక్టేరమ్మను అయిపోయానంటూ రత్తమ్మ బుగ్గలమీద ముద్దు పెట్టుకుంది..
నందని హైద్రాబాద్ వెళ్లేముందు తమ ఇంటికి ఫోన్ కనెక్షన్ పెట్టించింది.. తల్లీ తండ్రితో ప్రతీరోజూ మాట్లాడడానికి.. అలాగే వాళ్లు తనకు ఫోన్ చేసే విధానాన్ని దగ్గరుండి చూపించింది..
నందినికి హైద్రాబాద్ లో హాస్టల్ అకామిడేషన్ కూడా దొరికింది.. ఒక మంచిరోజున రత్తమ్మ, మల్లన్న నందిని ను తీసుకుని హైద్రాబాద్ బయలదేరి ఆమెను దగ్గరుండి హాస్టల్ లో చేర్చి వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు రత్తమ్మ కూతురిని పట్టుకుని ఏడ్చేసింది.. దగ్గరగా ఆరుసంవత్సరాలు నందిని తమకు దూరంగా ఉంటుందన్నభావన..
నందినికి కూడా దుఖం పొంగుకు వచ్చినా తన ఆశయం కళ్లముందు కదలాడుతుంటుంటే దుఖాన్ని కంట్రోల్ చేసుకుంది..
కాలచక్రం గిరగిరలు, కడలి కెరటాలు ఎవరి కోసం ఆగవు కదా!
నందినికి తన కాలేజ్,చదువు, లైబ్రరరీ లో గడపడం తో సమయం తెలియకుండా గడచిపోతోంది.. చదువులో చురుకుగా ఉంటూ, తన ప్రవర్దన , అందంతో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఆమెతో పరిచయం చేసుకోవాలని చాలామంది తహ తహ లాడుతున్నారు..
ఫస్టియర్ పరీక్షలు అయిపోయాయి.. ఆ సంవత్సరం కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఆ కాలేజ్ లో చదువుతున్న మెరిటోరియస్ విద్యార్ధీ, విద్యార్ధినులకు ప్రశంసాపత్రాలను ఆ కాలేజ్ యాజమాన్యం అందచేస్తుంది..
ముందస్తుగా ఫైనల్ ఇయర్ నుండి మొదలు పెట్టారు.. ఆ విద్యార్ధి/విద్యార్ధిని పరిచయం, ఎకడమిక్ రికార్డ్ చెపుతూ ప్రశంసాపత్రాన్ని అందిస్తున్నారు.. ఆతరువాత మూడో సంవత్సరం విద్యార్ధి మిస్టర్ సిధ్దార్ధ అని చదవగానే ఆడిటోరియం దద్దరిల్లిపోయింది..
అందమైన, స్పురద్రూపి అయిన ఒక అబ్బాయికి ప్రశంసా పత్రాన్ని అందిస్తూ, ఇప్పటివరకూ ప్రతీ సంవత్సరం అతనే కాలేజ్ టాపర్గా వస్తున్నట్లు చెప్పారు..
ఆ తరువాత రెండోసంవత్సరం పూర్తయిన విద్యార్ధిని పేరు చదివారు..
ఆ తరువాత ఫస్టియర్ క్లాస్ ఫస్ట్ వచ్చిన నందిని పేరు ఎనౌన్స్ చేసారు..
నందినిలో ఎంతో ఉద్విగ్నత.. అంతమంది మెడికోస్ సమక్షంలో స్టేజ్ మీదకు రావడానికి ఒక చిన్నపాటి వణుకు, చిరుచెమటలు పోస్తున్నాయి..
పోచం పల్లి కాటన్ చూడీదార్ డ్రస్ లో పిరుదులు దాటిన జడ ముందుకు పడుతుంటే వెనక్కితోసుకుంటూ స్టేజ్ మీదకు వచ్చింది నందిని . చక్కటి శరీరాకృతి, అందమైన కనుముక్కు తీరుతో, విజ్నాంతో ప్రకాశిస్తున్న ఆమె విశాలనయనాలు అక్కడ ఉన్నవారందరినీ అబ్బురపరచింది.. ప్రశంసాపత్రాన్ని అందుకుంటూ అందరికీ ధాంక్స్ చెపుతూ స్టేజ్ దిగింది.. కరతళాల ధ్వనులతో ఆ ఆడిటోరియం దద్దరిల్లి పోయింది..
ఫస్టియర్ శెలవలకు అమ్మానాన్నను చూడడానికి వెడ్తూ వారికి మంచి బట్టలుకొని తీసుకు వెళ్లింది నందిని..
డాక్టర్ చదువున్న తమ చిన్నారి కూతురిని చూసి పొంగిపోయారా దంపతులు..
“బిడ్డా! ఇంకో నాలుగుసంవత్సరాలు తొందరగా గడచిపోతే బాగుండును.. నిన్నో అయ్యచేతిలో పెట్టే వరకూ మాకు దిగులే..”
" సరే నండీ రత్తమ్మత్తగారూ, అదిగో ఒక అయ్య రోడ్డున పోతున్నాడు, చూడు చూడు పిలవనా? ఇప్పుడే మూడుముళ్లూ వేయించేసుకుంటా”నంటూ తల్లిని వేళాకోళం చేసింది..
నందిని రెండో సంవత్సరం మధ్యలో ఒఉండగా, ఒకరోజు లైబ్రరీలో కూర్చుని ఏదో మెడికల్ జర్నల్ సీరియస్ గా చదివేస్తోంది..
“హలో నందినిగారూ” అని ఎవరో పిలిచేసరికి తలెత్తి చూసింది.. ఎదురుగా నాల్గోసంవత్సరం చదువుతున్న సిద్ధార్ధ..
“హలో” అంటూ విష్ చేసింది..
“ఏమిటి చదువుతున్నా”రని అడిగేసరికి ఒక ఆర్టికల్ చూపించింది.
“ఓ మహిళకు కవల పిల్లలు పుట్టారు. కానీ, జతగా పుట్టలేదు. పుట్టిన బిడ్డ కడుపులో, పిండం రూపంలో మరో బిడ్డ పెరుగుతోంది. కొలంబియాకు చెందిన ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమెకు పుట్టింది ఒక బిడ్డ కాదు, కవల పిల్లలు.
క్వైట్ ఇంటరెస్టింగ్ కదూ!” అని సిద్ధార్ధ అనగానే అవునంటూ తలూపింది..
అప్పుడన్నాడు సిద్ధార్ధ " ఈ మధ్య ఇండియా, సింగపూర్‌లో కూడా ఇటువంటి జననాలు ఏర్పడినట్లు తను చదివానని.."
కొంతసేపు సబ్జక్ట్ గురించి ఏవో చర్చించుకుని ఆమెనుండి వీడ్కోలు తీసుకున్నాడు సిద్ధార్ధ.. అలా అప్పుడప్పుడూ లైబ్రరీలో కలుసుకుని మాట్లాడుకోవడంతో వారిమధ్య మరింత చనువు పెరిగింది..
సిద్ధార్ధ మెడిసన్ పూర్తవడంతో వన్ ఇయర్ ఇంటర్నషిప్ చేస్తున్నాడు..
మధ్యలో లైబ్రరీ కి వస్తూ ఎమ్ ఎస్ ఆర్ధోపెడిక్స్ ఎంట్రన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు.. ఆ సమయంలో నందిని కనిపించినపుడు ఆమెతో సరదాగా మాట్లాడుతున్నాడు..
నందిని కూడా ఆఖరి సంవత్సరానికి వచ్చింది.. తరువాత తనుకూడా ఇంటర్న్షషిప్ చేయాలి..
ఆ తరువాతే తను పిజీ గురించి ఆలోచించాలి..
ఒకసారి మాటల సంధర్భంలో నీ ఫ్యూచర్ ప్లేన్ ఏమిటని సిద్ధార్ధ అడిగాడు..
గైనకాలజీలో పిజీ చేయాలనుకుంటున్నానని చెప్పింది..
మాటల విషయంలో ఒకరినొకరు తమ కుటుంబం గురించి మాట్లాడుకున్నారు..
సిద్ధార్ధకి ఎనిమిది సంవత్సరాల వయసున్నపుడు, ఒక శివరాత్రి పర్వదినాన్న తల్లీ తండ్రీ మోటార్ బైక్ మీద కీసర గుట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ ను లారీ గుద్దేయడంతో తల్లీ తండ్రీ ఆన్ ది స్పాట్ చనిపోయారని, తను ఆ సమయంలో వాళ్లతో వెళ్లనందుకు బ్రతికి ఉన్నానని చెప్పాడు..
తల్లీతండ్రీ ఇద్దరూ బేంక్ ఉద్యోగస్తులైనందువలన ఇన్సూరెన్స్ అవీ వచ్చాయని, అదికాక తన తండ్రి సంపాదించిన ఆస్తికూడా ఉన్నందువలన తన చదువు నిరాటకంగా సాగిపోతోందని చెప్పాడు.. తన తల్లీ తండ్రిదీ కులాంతర ప్రేమ వివాహమైనందువలన బంధువులతో సన్నిహిత సంబంధాలు లేవని, తాతగారు అమ్మమ్మ తనని దగ్గరకు తీసుకుని పెంచారని తను ఇంటర్ మీడియట్ లో ఉండగానే వారిరువురూ స్వర్గస్తులైనారని చెప్పాడు.. తరువాత మామయ్య దగ్గరే ఉంటున్నానని చెప్పాడు..
నందినికి చాలా జాలి కలిగింది అతనిమీద.. తల్లీతండ్రీ లేకపోయినా, ఎంత జీనియస్.. ఎంతో క్రమ శిక్షణతో కష్టపడి చదువుకుంటూ ప్రతీ సంవత్సరం మెరిట్ స్కాలర్ షిప్ అందుకుంటున్న సిద్ధార్ధ పై ఒక ప్రత్యేకమైన అభిమానం ఇష్టం కలిగాయి ఆమెలో..
నందిని తన గురించి సిద్ధార్ధకి చెప్పినపుడు, మేము పేదవాళ్లమని, నా తల్లితండ్రులు నిరక్షరాస్యులని చెపుతూ, ఎంతో కష్టపడి తనను చదివిస్తున్నారని, వాళ్ల ప్రాణాలన్నీ నామీదే పెట్టుకుని బ్రతుకుతున్నారని చెప్తున్నపుడు ఆమె కళ్లల్లో సన్నని కన్నీటి తడి..
నందిని విషయం విన్న సిద్దార్ధ ఆశ్చర్యపోయాడు.. నందిని చూడడానికి అలా ఉండదు. బాగా చదువుకున్న తల్లితండ్రులకు పుట్టిన అమ్మాయిలా ఉంటుంది.. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉంటుంది.. చదువుపట్ల నందినికి ఉన్న ఆరాధనకు అతను ఆశ్చర్యపోతూ ఉంటాడు..
చదువుకోకపోయినా చక్కని సంస్కారంతో పెంచిన నందిని తల్లితండ్రులపట్ల అతనికి పూజ్యభావం కలిగింది.. అలాగే నందినిపట్ల అతనిలో ఏవో మధురమైన ఊహలు చెలరేగాయి.
నందిని ఫైనల్ ఇయర్ లోకూడా కాలేజ్ టాపర్ గా వచ్తింది.. ఇంటర్న్ షిప్ కు అప్లై చేసుకుంది..
ఈలోగా సిద్ధార్ధకు అపోలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్, హైద్రాబాద్ లో పి..జి ఆర్ధొపెడిక్స్ లో అడ్మిషన్ దొరికింది.. అక్కడే పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా వచ్చింది.
ఆ శుభవార్తను నందినితో పంచుకున్నాడు ఒకరోజు టేంక్ బండ్ వద్ద కలిసి.. అభినందనలు చెప్పింది నందిని..
“పీజీకు ప్రిపేర్ అవుతున్నావా నందినీ?” అని అడిగాడు..
“హా...... సిద్ధార్ధా. ముందు ఇంటర్న్ షిప్ పూర్తికాగానే మా ఊరెళ్లిరావాలి ..
డాక్టర్ పట్టా చూపించి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోవాలి.. మరో రెండు సంవత్సరాలు చదవాలంటే ఒంటికాలిమీద లేస్తుంది అమ్మ” అని చెపుతూ ఎందుకో ఫక్కున నవ్వేసింది పరిసరాలు చూసుకోకుండా..
ఎంత అందమైన నవ్వు! ఆ నవ్వుల పువ్వులను కట్టుకోబోయే అదృష్టవంతుడెవరో అని అనుకోకుండా ఉండలేకపోయాడు సిద్ధార్ధ..
“ఎందుకు నవ్వుతున్నావు నందూ” అంటూ నాలిక కొరుక్కుంటూ, “సారీ! నందినీ..” అన్నాడు..
“ఫరవాలేదు, నందూ అనే పిలువు సిద్ధార్ధా!”
“ఏమీలేదు.. ఎప్పుడూ మా అమ్మ అనేమాటలు గుర్తొచ్చాయి.. నన్ను ఓ అయ్యచేతిలో పెట్టేయాలన్న ఆవిడ ఆత్రుత, మాటలూ!” అంది.
“ఈసారి ఇంక మా అమ్మ ఊరుకోదు సిద్ధార్ధా.. ముందు ఓ అయ్యకు నన్ను కట్టపెట్టాకనే తరువాత నన్ను చదువుకోమంటుంది.. అదే ఆలోచిస్తున్నానంటూ దీపాల వెలుగులో టేంక్ బండ్ నీళ్లవైపై దృష్టి సారిస్తూ మాట్లాడుతోంది..
" నన్ను చేసుకోబోయే ఆ అయ్యెవరో ముందే తెలిస్తే బాగుండును, కాళ్లమీద పడి, ఓ రెండేళ్లు ఆగమని ప్రార్ధించేదా”న్నంటూ కొంచెం అలక ముఖంపెట్టి మాట్లాడుతున్న నందిని మాటల్లో చిలిపితనం తొంగిచూసింది.
“ఈసారి నీవు మీ ఊరు వెళ్లినపుడు నేనుకూడా నీతో వస్తాను నందూ. నాకు పచ్చటి ఆ పల్లెటూళ్లను చూడాలని కోరిక.. ఆ తరువాత......” అంటూ ఒక్క క్షణం సంకోచంతో ఆగిపోయాడు.
“ఏమిటి సిద్దార్ధా ఆగిపోయావేం ?”
“ఏమీలేదు నందూ! నీ ఎదురుగా నిల్చుని నీతో మాట్లాడుతున్న ఈ అయ్యపై నీ అభిప్రాయం?” కొంటెగా ప్రశ్నించాడు సిద్దార్ధ..
“నీవు కాళ్లమీద పడి ప్రార్ధించాలనుకుంటున్న ఆ అయ్యను నేనే అయితే ?”
అనురాగంగా ఆమె కళ్లల్లోకే చూస్తూ అడిగాడు సిద్ధార్ధ..
ఊహించని హఠాత్పరిణామం… నందిని గుండెల్లో ఏదో అలజడి, తలెత్తి సూటిగా అతని కళ్లల్లోకి చూడలేని సిగ్గు. ముఖం సిగ్గుతో కందిపోగా తలదించుకుంది..
“ఏం మాట్లాడవే నందూ? నేనంటే ఇష్టమేనా” అంటూ అడిగిన ప్రశ్నకు ‘ఇష్టమే’ అన్నట్లుగా తలూపింది..
“ఓ ధాంక్ గాడ్...... అయితే ఇంకేమీ ఆలోచించకు నందూ! నేను నీతో మీ ఊరు వచ్చినపుడు మీ పేరెంట్స్ తో మాట్లాడతాను.. నాకంటూ ఎవరూ లేరు.. రెండు సంవత్సరాల క్రితమే మా మామయ్య దగ్గరనుండి బైటకు వచ్చేసి విడిగా ఒక్కడినీ ఉంటున్నాను.. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మా అమ్మా నాన్ననూ ఏదో ఒక విషయంలో సూటీపోటీ మాటలనే మామయ్యతో నాకు పడలేదు.. మా అమ్మా నాన్నే లేనపుడు ఇంక ఆ మాటలన్నీ భరించడం అవసరమా అనిపిస్తుంది.. మరో సంవత్సరంతో నా పిజీ అయిపోతుంది.. మన వివాహం అయ్యాక కూడా నీవు పిజీ చేయొచ్చు.. నీ ఇంటర్న షిప్ పూర్తి అవగానే నేనూ వస్తాను మీ ఊరికి నందూ.. ఇంక వెడ్దామా” అంటూ నందిని అరచేయినందుకుని తన పెదవులతో మృదువుగా సృశించాడు..
నందిని ఇంటర్న షిప్ కూడా పూర్తి కావస్తోంది.. అఫ్పుడప్పుడు వీలున్నప్పుడల్లా సిద్ధార్ధ నందిని ఎక్కడో ఒకచోట కలుసుకోవడం, కబుర్లాడుకోవడంతో రోజులు వేగంగా ముందుకు పరుగెడుతున్నాయి..
ఒకరోజు నందిని ఇంటర్న షిప్ చేస్తున్న హాస్పిటల్ డైరక్టర్ నందినిని పిలిచాడు..
“మిస్ నందినీ! మీ ఇంటర్న షిప్ పిరియడ్ అయిపోతోందనుకుంటాను.. తరువాత మీ ప్లేన్ ఏమి”టని అడిగారాయన.
“పి..జి.. ఇన్ గైనకాలజీ చేయాలనుకుంటున్నాను డాక్టర్. ప్రిపేరేషన్ మొదలు పెడదామనుకుంటున్నాను..”
“గుడ్! ఆల్ ది బెస్ట్ నందినీ ! నీకో చిన్న అవకాశం. నీకిష్టమైతేనే..” అంటూ, “మన హాస్పటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మధుమతిసంజయ్ దగ్గర పనిచేస్తున్న డాక్టర్ హరిత అర్జంట్ గా ఒక ఎనిమిది నెలలు అమెరికా వెళ్లాల్సి వచ్చిందట.. ఈ పిరియడ్ లో డాక్టర్ మధుమతికి మీరు అసిస్ట్ చేయగలరా ?”
ఈమాట వినగానే నందిని మనస్సు ఎగిరి గంతులేసింది. ఇటీజ్ ఏ రేర్ ఆపర్ట్యునిటీ..
చక్కని అనుభవం వస్తుంది. ఒకవైపు తను పిజీ కూడా ప్రిపేర్ అవచ్చు.
ఉరకలేస్తున్న తన భావోద్వేగాన్ని కప్పి పుచ్చుకుంటూ, “ష్యూర్ సర్! ఐ కెన్ వర్క్ ఫర్ డాక్టర్ మధుమతి”
“మీరు ఒక నెలరోజులలో వచ్చి జాయిన్ అవగలరా?” అనగానే యస్ చెప్పేసింది..
ఆలోచించుకోవాలంటే ఎక్కడ తనకీ అవకాశంజారి పోతుందోనని భయం..
ఆయన చాలా హేపీ అవుతూ, గుడ్ లక్ చెప్పారు.. ఈ శుభవార్తను సిద్ధార్ధతో పంచుకుంది వెంటనే.. కంగ్రాట్స్ చెప్పాడు .. తన ఇంటర్న షిప్ ఒక రెండురోజుల్లో ముగిసిపోతుందని, మరో రెండురోజులో మా ఊరికి మన ప్రయాణం ఉందని టిక్కెట్లు కూడా బుక్ చేసానని చెప్పింది..
ఆరోజు రాత్రి తల్లీ తండ్రికీ ఫోన్ చేసి చెప్పింది.. తను ఫలానారోజు వస్తున్నానని, తనతోపాటూ చదువుకున్న తన ఫ్రెండ్ మన ఊరు చూడాలనుకుంటుంటే ఇద్దరం కలసి వస్తున్నామని చెప్పింది..
తల్లి వెంటనే ఫోన్ లో “అయితే నందినమ్మా! నీ డాక్టేర్ సదువు మొత్తం అయిపోయింది కదా ?”
“హా అమ్మా! అయిపోయింది.. నేను వచ్చాకా అన్నీ వివరంగా చెపుతా”నని ఫోన్ పెట్టేసింది..
నందిని వచ్చేది ఉగాది పండుగ రోజున.. ఇంక రత్తమ్మత్త కాళ్లూ చేతులూ ఒక చోట నిలవడంలేదు.. బిడ్డ డాక్టేరు సదువు పూర్తి చేసుకుని వచ్చేస్తోంది. ..
ఇల్లంతా దులిపింది.. శుభ్రంగా కడిగి.. వాకిళ్లు ఊడ్చింది.. పూలచెట్లూ, కాయగూరల చెట్లదగ్గర శుభ్రం చేసింది.. నందినికి శుభ్రత ఎక్కువ.. ఇల్లు అద్దంలా మెరుస్తూ ఉండాలి..గడపలకు పసుపు, కుంకుమ బొట్లూ పెట్టింది.. చక్కని ముగ్గులు వేసింది..
ఆతరువాత బిడ్డ కిష్టమని కజ్జికాయలూ, స్వఛ్చమైన నేతితో పూతరేకులు చుట్టింది.. పాలూ, వెన్నా, పెరుగుకీ లోటులేని కుటుంబం.. అలాగే కర కరలాడే సన్నని కారప్పూస చేసింది.. చిక్కని పాలు పొయ్యిమీద కుండ పిడతల్లో ఎర్రగా కాచి, వాటిమీద మీగడతీసి, వెన్న చేసి ఉట్టిమీద ముంతల్లో జాగ్రత్త చేసింది.. అలాగే నెయ్యి కాచి పెట్టింది..
నందిని వాళ్లూ కొద్దిసేపట్లో వస్తారనగా ఇంటి పెరట్లో ఉన్న మామిడాకులు కోయించి గడపకు తోరణాలు కట్టింది.. కూతురికి దిస్టి తీయాలని ఎర్రని నీళ్లు రెడీ చేసుకుంది..
అనుకున్నట్లుగా నందినీ, సిద్ధార్ధ టాక్సీ లో వారింటి ముందు దిగారు.. నందిని తో స్నేహితురాలు వస్తుందన్నుకున్న వారికి ఒక అబ్బాయి రావడం చూసారు.. నందినికి తల్లి దిష్టి తీసింది..
నందినీ సిద్దార్ధ లోపలికిరాగానే నందిని తల్లి తండ్రులను కౌగలించుకుని చిన్నపిల్లే అయిపోయింది.. సిద్ధార్ధ తనతో చదువుకున్న డాక్టర్ అని పరిచయం చేయగానే సిద్ధార్ధ వారిరువురికీ పాదాభివందనం చేసాడు..
సిద్దార్ధకు పొందికగా పరిశుభ్రంగా ఉన్న వారిల్లు, ఆ ఇంటి ప్రాగంణంలోని పచ్చని చెట్లు భలే నచ్చేసాయి..ఆ చెట్లకు ఆకులెంత అందంగా ఉన్నాయో, కొన్ని పూర్తిగా ఆకుపచ్చగా ఉంటే మరికొన్ని లేత ఆకులు కుంకుమరంగు అందంతో కలగలిసి వింత అందంతో మిడిసిపడ్తున్నాయి.. వేపచెట్టునిండాపూత, మామిడి చెట్లకు కాయలు చేతికి అందేటట్లుగా వ్రేలాడుతున్నాయి. కోయిలలు ఆలపించే మధుర గానాలు మనసును మధురభావాలతో నింపేస్తున్నాయి . ఆ ఇల్లు అతి సామాన్యమైన పాత ఇల్లు.. అయితేనేం, పచ్చని చెట్లతో, పూలతో సహజ అలంకార శోభితంగా ఉంది..
ముఖ్యంగా నందిని తల్లితండ్రులు తన మీద కనబరుస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు అతని తల్లీతండ్రీ గుర్తొచ్చారు.. స్నానాదికాలు పూర్తికాగానే నందిని తల్లీ తండ్రిని పిలిచి ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోమని చెప్పింది.. తను తెచ్చిన కొత్తబట్టలతోబాటూ, డాక్టర్ పట్టాను ఒక బరువైన కవరు ను వారికి అందచేసి వారి పాదాలకు నమస్కరించింది..
“ఆ కవరులో నా ఇంటర్న షిప్ లో నాకు వచ్చిన స్టైఫండ్ అంతా దాచిపెట్టాను.. మూడు లక్షలు పైగానే ఉంది.. నాకు ఉద్యోగం వచ్చింది. ఇంకా డబ్బు పంపిస్తాను.. నీవన్నట్లే ఒక అయ్య చేతిలో నన్ను పెట్టేసే ప్రయత్నాలు చేసుకో అమ్మా” అంటూ సిగ్గుతో తల్లి ఒడిలో ముఖం దాచుకుంది..
అప్పుడు వెంటనే సిద్ధార్ధ, “అవును రత్తమ్మత్తగారూ! మల్లన్న మామయ్యగారూ! మీరు నందినికి చూడాలనుకుంటున్న ఆ అయ్యను నేనే.. నేనూ నందిని ఒకరికొకరం ఇష్టపడ్డాం.. పెళ్లి చేసుకోడానికి మీ ఇద్దరి పర్మిషన్ తీసుకోవాలని నందూ చెప్పింది.. అందుకనే మీ అమ్మాయితో నేను వచ్చా”నంటూ చెప్పగానే ఆ అమాయకపు దంపతులు సిద్ధార్ధవైపు కళ్లు వెడల్పు చేసుకుంటూ చూస్తుండిపోయారు..
రత్తమ్మ వెంటనే కూతురి కళ్లల్లోకి చూస్తూ, “ఇది నిజమా బిడ్డా” అంటూ మురిపంగా చూసింది.. నందిని అవునంటూ సిగ్గుతో తలదించుకుంది..
ఆ ఇంట ఉగాది సంబరాలు మిన్నంటాయి.. రత్తమ్మత్త చిన్న చిన్న బాదం ఆకులతో తయారు చేసిన దోనెల్లో ఉగాది పచ్చడి పెట్టి అందరికీ అందించింది.. ఆ పచ్చడి అమృతంలా వేపపూవు సువాసనతో రుచికరంగా ఉంది.. ఆతరువాత ఆకుల్లో పూతరేకులూ, కజ్జికాయలూ పెట్టింది.. స్వఛ్చమైన నేతి ఘుమాయిపుతో ఆపిండివంటలు అదిరిపోతున్నాయి..
“ఆ, సూడండి సిద్ధార్ధ బాబూ! పెళ్లి ముహూర్తాలు శ్రావణ మాసంలో పెట్టుకుంటే బాగుంటుంది కదూ.. అప్పటికి మీ సదువుకూడా దగ్గరౌతాది” అంటూ అప్పుడే తెగ సంబరపడిపోతూ, హడావుడి పడుతున్న రత్తమ్మత్త వైపు చూస్తూ, “మీ ఇష్టం అత్తమ్మా! మీరుఎప్పుడంటే అప్పుడే నందిని మెడలో మూడు ముళ్లూ వేసేస్తా”నంటూ నందిని వైపు కొంటెగా చూసాడు..
నందినితో మాట్లాడుతూ, నందిని విశాలనయనాలవైపు అపురూపంగా చూస్తున్న సిద్ధార్ధకు నందిని ముఖంలో పెళ్లికళతో బాటూ ఆమె కనులలో మామిడాకు తోరణాలతో అలంకరించిన పెళ్లిపందిరి, తనూ నందినీ పక్క పక్కనే పెళ్లిదుస్తుల్లో కూర్చున్న దృశ్యం మెరుపులా కనబడింది..
అతని మనసు సన్నాయి రాగం ఆలపించింది..
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం
Commentaires