top of page

పచ్చ జండా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Pachha Jenda' Telugu Story Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

ఒకప్పుడు ఆనందమంటే డబ్బుతోనే వస్తుందనుకుందామె.

కానీ మంచి మనసున్న వ్యక్తులతో మసిలినప్పుడు కలిగే ఆనందం, మరెక్కడా దొరకదని తెలుసుకుంది.

ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం


చేతిలో పుస్తకం పట్టుకుని ఏదో ఆలోచిస్తున్న మాధురి, ఫోన్ శబ్దానికి ఉలిక్కిపడింది . ఇలా ఒంటరిగా వున్నప్పుడు ఏ చిన్న శబ్దమైనా ఏదో తెలియని భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది మాధురి . తన ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటున్న గుండెను అదుపులోకి తెచ్చుకుని 'హలో' అంది.


వెంటనే అవతలి వైపు నుంచి “మధూ . . . బావున్నావా?

నేను శారదను మాట్లాడుతున్నాను . . . నిన్ను నిద్ర లేపలేదు కదా ? ఎంతకీ ఫోన్ తియ్యక పోతే ఇంట్లో లేరేమో అనుకుంటున్నా..” అంటూ గలగలా మాట్లాడుతోంది శారద..


“అబ్బే! శనివారం పూట పదింటికే ఏం పడుకోవడం? మావారు కాన్ఫరెన్స్ వుందని వేరే వూరికి వెళ్లారు. పిల్లలు స్నేహితులతో సినిమాకెళ్లాలంటూ బయటకు వెళ్లారు.. ఎలా వున్నావు ?.. ఎక్కడినించి మాట్లాడుతున్నావు ?” అంటూ లేని ఉత్సాహం తెచ్చుకుంటూ శారదను పలకరించింది మాధురి .


“మా అమ్మాయి అర్చన, నేనూ ట్రైన్ లో ఉన్నాం మధూ ! అర్చనకు బాంబేలో ఇంటర్వ్యూ వచ్చింది.. ఇద్దరం కలసి వస్తున్నాం.. అమ్మనడిగి నీ ఫోన్ నంబర్ తీసుకున్నాను.. ‘మా మధూ ఇంట్లో ఉండండి’ అంటూ నీ అడ్రస్ ఇచ్చింది.. మా రాకతో ఇబ్బంది పెడుతున్నాం నిన్ను” అంటూ మాట్లాడుతూ…


“చూసావా మధూ ! ఏనాడు మన ఊరి పొలిమేరలు కూడా దాటని నేను ఏకంగా ముంబాయే వస్తున్నాను ! మా అమ్మాయికి చెప్పేసాను మా మాధురి ఇంటికి వెడ్తున్నామని, నిన్ను చూసి కూడా చాలా ఆనంద పడుతుందని ! ఉండు దానికిస్తాను ఫోన్, అది మాట్లాడుతుం”దంటూ , . . . . . మాధురి సమాధానం కోసం ఆగకుండా ఫోను కూతురికి ఇచ్చింది శారద..


మాధురి ‘హలో’ అనగానే అర్చన “నమస్కారం ఆంటీ . . . . .బావున్నారా ? . . . మిమ్మల్ని చూడాలని అమ్మతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను ఆంటీ “ అంది.

“నిన్నూ చూడాలని నాకూ ఉంది అర్చనా. నీ ఇంటర్వ్యు పేరుతోనైనా అమ్మను తీసుకుని మీరిద్దరూ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది” అంటూ మాధురి మాట్లాడింది !

“ఆంటీ. . . . అమ్మ మీ గురించి భలేగా చెప్తుంది…” అంది అర్చన.


ఆ అమ్మాయి మాటలకు నవ్వుకుంటూ “ఏం చెప్పింది మీ అమ్మ నీకు ?” అంటూ అడిగింది మాధురి.


వెంటనే అర్చన “మీరు చాలా అందంగా ఉంటారట ! మీరు చాలా తెలివి గలవారుట ! ఆ రోజుల్లో బి..టెక్ . చేసింది మీరొక్కరేనట! పెళ్ళి చూపుల్లో అంకుల్ మిమ్మల్ని చూసీ చూడగానే ప్రేమించేసారుట కదా ? అంకుల్ చాలా పెద్ద పేరుమోసిన డాక్టర్ చెప్పింది అమ్మ. మా మాధురి పేరుతో సహా అన్నింట్లో ప్రత్యేకం అంటుంది అమ్మ” అంటూ పక పకా నవ్వింది !


మాధురి వెంటనే మొహమాటంగా . . . . “అయ్యో అదేమీ లేదు అర్చనా, నా మీద ప్రేమతో అమ్మ అలా అంటుంది కాని నేనూ అందరిలాంటి దాన్నేనమ్మా” అంది.


“లేదు ఆంటీ , అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు . అమ్మ ఇంతగా ఎడ్మైర్ చేసే మిమ్మల్నిఎప్పుడు చూస్తానా అని వుంది ! మీలాంటి గొప్ప ఫ్రెండు తనకే వుందని అమ్మకు గర్వం ఆంటీ !. . . . . .”అంది అర్చన.



శారద కబుర్లతో, అర్చన మాటలతో మాధురికి తన ఒంటరితనం, భయం తగ్గి మనసు కాస్త కుదుట పడినట్టనిపించింది . బెడ్ మీద ఎత్తుగా అమర్చివున్న దిండు మీద తల ఆన్చి మా అమ్మకు గర్వం అన్న అర్చన మాటలు గుర్తు చేసుకుని మాధురి నవ్వుకుంది. పాపం పిచ్చి పిల్ల , నేనేదో చాలా గొప్ప వ్యక్తిననుకొని ఏవేవో ఊహించుకుంటోంది . తనను ఎప్పుడూ చూడకపోయినా ఫోనులో ఎంత చక్కగా మాట్లాడింది !


ఆ సంతోషం . . . . . మెచ్యూరిటీ మాటల్లోనే తెలిసిపోతోంది. తన కూతురు పీయూష కూడా ఇలా పెరిగితే ఎంత బావుండును. . .


శారద పిల్లల్ని ఎంత చక్కగా పెంచింది !. సెకండు ఫారం కూడా చదవని శారద . . . ..ఇంటరు కూడా పూర్తి చెయ్యని వ్యక్తిని పెళ్ళాడిన శారద . . . . ఓ మారుమూల పల్లెటూరిలో వుండే శారద జీవితం ఇంత నిండుగా, ఆనందంగా వుంటుందని తను ఎప్పుడైనా ఊహించిందా?

* * * * * *


మాధురికి శారద చిన్నప్పటినుంచి తెలుసు . మాధురి ఇంటికి రెండు ఇళ్ళ అవతలే శారద వాళ్ళ ఇల్లు . మాధురి హైస్కూల్ చదువు అయి పైచదువుకు విజయవాడ వెళ్లేంతవరకు రోజు శారదను చూస్తూనే వుండేది. మాధురి కంటే శారద ఒక్క ఏడాదే పెద్దది. హార్ట్ ఎటాక్ వచ్చి శారద తల్లి హఠాత్తుగా పోవడంతో చదువుతున్న సెకండు ఫారం అర్ధాంతరంగా ఆపేసి తండ్రిని , తమ్ముళ్ళను చూసుకుంటూ ఇంట్లో ఆరిందైపోయింది .


మాధురి విజయవాడ వెళ్ళిన సంవత్సరం లోనే శారదకి ఆ వూళ్ళోనే వున్న వెంకట్రావ్ తో పెళ్ళి అయిపొయింది . మాధురి పీయూసీ అయిన తర్వాత తండ్రిని ఒప్పించి కాకినాడ లో ఇంజనీరింగ్ లో చేరింది . అది పూర్తి అవుతుండగానే చదువు , ఆస్తి వున్న శ్రీకాంత్ తో మాధురి పెళ్ళి సెటిల్ అయింది .


ఆ సంవత్సరమే మాధురీ శ్రీకాంత్ బాంబే వచ్చేసారు. నాలుగేళ్ల తర్వాత మాధురి తండ్రి ఆ వూళ్ళో వున్న భూములన్నీ అమ్మేసి విజయవాడకు మకాం మార్చడంతో మాధురికి ఆ వూరు వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది . అలా మాధురికి శారద తో వున్న పరిచయం , అనుబంధం ఆమె జ్ఞాపకాల పొరలో అట్టడుగుకు వెళ్ళిపోయాయి.


శారదకు మాధురి అంటే మొదటినుంచీ వల్లమాలిన ప్రేమ . మాధురి ఏం కట్టుకున్నా , ఎలా అలంకరించుకున్నా మాధురికి మంచి మార్కు లోచ్చినా, పై చదువుల కెళ్ళినా, పెళ్ళి చేసుకున్నా, చివరకు బాంబే వెళ్ళినప్పుడు కూడా శారద అవన్నీ తనకే జరిగినంతగా సంతోష పడిపోయేది ! మాధురి ని అలా దూరం నుండి చూడడం కూడా అపురూపంగా తోచేది శారదకు ! ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత నాజూకుగా ఉండేది మాధురి.. చదువు, అందం, సంపద అన్నీ ఒకేచోట పోగేసినట్లు ఉండే మాధురి అంటే శారదకు పిచ్చి ప్రేమ ! అందంగా కట్టిన పూల చెండ్లు మాధురి బారెడు జడలో పెట్టి ఆమె బుగ్గలు పుణికి పుచ్చుకునేది! పనులన్నీ అయ్యాక రాత్రి పూట కూర్చుని కర్చీఫుల మీద ఎంబ్రాయిడరీలు , పూసల బ్యాగులు, లేసులు అల్లి పుట్టిన రోజులకు, పండుగలకు మాధురికి ఇచ్చి మురిసిపోతుండేది!


తండ్రి గారాబంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న మాధురి , తను ఆడింది ఆటగా పాడింది పాటగా జరుగుతున్న మాధురి , తన అందం - తెలివితేటలతో ఎప్పడూ అందర్నీ తన చుట్టూ తిప్పుకునే మాధురి , శారద ప్రేమగాని, దాని వెనుక వున్న ఆమె హృదయం కానీ కనిపించేదికాదు. సన్నగా, నల్లగా ఎప్పుడూ సాదా సీదా బట్టల్లో అతి సాధారణంగా వుండే శారదని , మాధురి ఎప్పుడూ పట్టించుకునేది కాదు. శారద చదువుకోకుండా అక్కడి అబ్బాయినే పెళ్ళి చేసుకుని ఆ వూళ్ళోనే వుండిపోవడంతో మాధురికి ఇంక శారదని చూడాల్సిన అవసరం కానీ ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ కనపడలేదు. శారద అంటే ప్రత్యేకించి కోపం, ద్వేషం లేకపోయినా ఆమె అంటే ఒక చిన్న చూపు, తేలిక భావన మాధురి మనసులో చోటుచేసు కున్నాయి .


ఇంట్లో పూజలు. . . వ్రతాలు. . . . పేరంటాలు జరిగినప్పుడు వచ్చిన వాళ్లకు పసుపు - కుంకుమ ఇవ్వమని తల్లి మాధురికి పురమాయించేది. నల్లగా , బిరుసుగా వుండే శారద కాళ్ళకు పసుపు రాయాలంటే మాధురికి అసహ్యం వేసేది . శారద అనగానే మాధురికి గుర్తుండి పోయిన సంఘటన ఇదే .


తను అడగక పోయినా తల్లి చెప్పే ఆ వూరి సంగతులు, శారద కబుర్లు మాధురికి ఎప్పుడూ విసుగ్గా అనిపించేవి . చీకు, చింతా లేని బాల్యం. . . . . కాలేజీలు. . . . .సినిమాలు. . . . . స్నేహితులు . . . . ..శ్రీకాంత్ తో పెళ్ళి. . . . .బాంబే లాంటి నగరంలో కాపురం. . . . కొత్త ఫ్రెండ్స్ . . . . పార్టీలు . . . .పిక్నిక్ల్ లు ఓహ్ జీవితం అంటే ఇదే అనుకుంది మాధురి.. . కానీ, క్రమేణా మాధురికి తెలియకుండానే ఆమె ఆనందం హరించుకుపోవడం మొదలైంది.


శ్రీకాంత్ కి, తన మీద ప్రేమ నెమ్మదిగా తరిగి పోతున్నదని మాధురి గ్రహించింది .

ఎప్పుడూ హాస్పిటల్, పేషెంట్లు అంటూ భర్త ఎందుకు తనకు దూరమై పోతున్నాడో మాధురికి తెలిసేది కాదు. పిల్లలు తన మాటను లెక్క చెయ్యకుండా ఎప్పుడూ బయటికి పారిపోతూ వాళ్ళ ఆనందాన్ని, ఆలోచనల్ని, చివరికి వాళ్ళ సమస్యల్ని కూడా బైటవాళ్ళతోనే ఎందుకు పంచుకుంటారో మాధురికి అర్ధం అయ్యేది కాదు. అసలు అన్నీ వున్న తనను తన వాళ్ళు ఎందుకు గుర్తించరో మాధురికి అంతుబట్టని విషయం .


వృత్తి పరంగా బిజీగా వుండే భర్తను, పెరిగే పిల్లల్ని ఎలా చూసుకోవాలో, వారికి కావాలిసినదేమిటో, వాళ్ళ దగ్గరనుంచి తను పొందవలసినదేమిటో తెలుసుకోలేక పోయింది మాధురి . తన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఎలా బాలెన్స్ చేసుకోవాలో తెలియక తికమక పడింది. ఆ తికమక లో మాధురికి తెలియకుండానే తనలో దాగి వున్న అహంభావము నిర్లక్ష్యం సోమరితనం బయటకు తన్నుకు వచ్చేవి.. దాంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు . . . పోట్లాటలు. . . కోపతాపాలు. మౌనం. . . .

* * * *

కిందటి ఏడాది మాధురి పుట్టింటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఎన్నో ఏళ్ల తర్వాత శారదను చూడటం జరిగింది .


మాధురి తల్లికి ,అనకాపల్లి దగ్గర పల్లెటూర్లో వున్న అమ్మవారికి ప్రతి ఏటా పూజ చేయించటం అలవాటు . ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్న హడావిడిలో మాధురి తల్లి కాలు జారి పడింది. చివరి నిముషంలో అనుకున్న ప్రయాణం ఆగిపోయిందని తల్లి బాధపడుతుంటే ఆ టైములో అక్కడే వున్న మాధురి నేను వెళ్ళి చేయిస్తాలే అంది . ఆ మాటకే మాధురి తల్లి ఎంతో ఆనందపడి పోయింది. అమ్మవారి చీర దగ్గరనుంచి అన్నీ శాస్త్రి గారికి చేరాయి. ప్రతి ఏటా చేసే ఆయనకు అన్నీ తెలుసు. అంతగా ఏమన్నా కావాలంటే శారద చూసుకుంటుంది. నీకేమి ఇబ్బంది వుండదు. నువ్వు కారులో వెళ్ళి కారులో రావడమే అంటూ మాధురిని పంపించింది తల్లి .


శారద పెట్టిన కమ్మని భోజనం తిని దొడ్లో ఆరుబయటకు వచ్చిన మాధురి , ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలను చూసి , చిన్నప్పుడు వాటిని లెక్కపెట్టటం గుర్తొచ్చి తనలో తాను నవ్వుకుంది .

శారద అంతకు ముందే అక్కడ నవారు మంచాలు వాలుస్తూ “ఈ రోజు రాత్రి నీతో తనివితీరా మాట్లాడుకోవాలి! నీ కబుర్లు విని ఎన్నాళ్ళో అయింది !” అంది .


మెత్తటి పరుపుల మీద పరచిన దుప్పట్లు చిరుగాలికి అల్లల్లాడుతున్నాయి . ఈ మట్టి . . ఈ గాలి. . . .ఈ భోజనం మాధురికి తనలో ఏదో కొత్త ప్రాణం పోసినట్లు అనిపించింది. మంచం మీద కూర్చుని తను ఎప్పుడో మర్చిపోయిన ఈ అందాల్ని గుర్తుచేసుకుంటూ... ఆస్వాదిస్తున్న మాధురి , వెంకట్రావు రావడం గమనించలేదు .


“మీరు మా ఇంటికి వచ్చారని మా శారద మహా సంబరపడి పోతోందండి ! మా పిల్లలకు ఎప్పుడు మీ గురించి చెబుతూ, వాళ్ళు మీ అంత గొప్పవాళ్ళు కావాలంటుందండీ” అంటూ నవ్వుతూ కొంచెం దూరంలోవున్న మంచం మీద కూర్చున్నాడు వెంకట్రావు .


“అప్పట్లో మా నాన్న హటాత్తుగా పోవడంతో తప్పని పరిస్థితుల్లో చదువు ఆపేసుకుని నా వాళ్ళను చూసుకోడానికి ఇక్కడే వుండి పోవాల్సి వచ్చింది. అప్పుడు నా చదువు ఆగిపోయిందని భగవంతుడ్ని తిట్టాను . కానీ ఆ తర్వాత శారదను భార్యగా ఇచ్చి భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు మాధురిగారూ . . . . శారద నా పక్కన వుండబట్టే ముగ్గురు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేసి నా బాధ్యతల్ని నెరవేర్చగలిగాను. . . .” అంటూ నెమ్మదిగా చెప్పుకు పోతున్న వెంకట్రావ్ వంక ఆశ్చర్యంగా చూసింది మాధురి !


చదువుకోని వెంకట్రావ్ . . . . మట్టి పిసుక్కునే వెంకట్రావ్ . . . . . పల్లెటూరి గబ్బిలాయి వెంకట్రావ్ ఇంత బాగా మాట్లాడగలడని , భార్యని ఎంతో గౌరవంగా ప్రేమగా చూడగలిగిన సంస్కారవంతుడని ఆ రోజే తెలుసుకుని ఆశ్చర్య పోయింది. శారద కూడా వెంకట్రావుకి ఏ మాత్రం తీసిపోలేదు .


“ఆ దేముడు నాకు అందం ఇవ్వలేదు, చదువుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ బంగారం లాంటి భర్తనిచ్చాడే మధూ ! ఆయన మనిద్దరం పెళ్ళి చేసుకుందాం అన్నప్పుడు ముందు చాలా భయపడ్డాను. కానీ ఆయన అన్నట్లు మా ఇద్దరిదీ ఒకటే పరిస్థితి.


‘ఆడ దిక్కులేని ఇల్లు మాదైతే, మగ దక్షత అవసరం వున్న ఇల్లు మీది. మన రెండు కుటుంబాలు నిలబడాలంటే ఇదే మార్గం’ అన్నారు ఆయన. ఆలోచిస్తే నిజమే అనిపించింది. పెళ్ళిచేసుకుని నా పాటికి నేను దూరంగా వెళ్ళి పోతే నా స్వార్ధం చూసుకున్న దాన్ని అవుతాను కాని ఆడదాన్ని ఎలా అవుతాను ? అందుకే సరే అన్నాను . ఆయన సహకారం వుండబట్టే తమ్ముళ్ళు పెద్దవాళ్ళై , ఆ ఇంటికి కోడలు వచ్చేంతవరకు వాళ్ళను కనిపెట్టుకోగలిగాను” అంది శారద..


పౌరోహిత్యం చేసుకుంటూ వూళ్ళు తిరిగే శారద తండ్రి, గంతకు తగ్గ బొంత అన్నట్టు శారదను వెంకట్రావుకి అంటగట్టి చేతులు దులిపేసుకున్నాడని ఇన్నాళ్లుగా అనుకుంటున్న మాధురి మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది ! గోరు వెచ్చని మీగడ పాలు గ్లాసులో పోసి మాధురి చేతికిచ్చి ఆ రోజుల్లో అమ్మ సహాయమే లేకపోతే మేము ఏమైపోయేవారమో?


మీ పిల్లల్ని నేను కనిపెట్టుకుని వుంటాను మీరు నిశ్చింతగా వూరు వెళ్ళండి అంటూ నాన్నకు ధైర్యం చెప్పేవారు అమ్మ . నాకు ఏది తెలియక పోయినా . . . . అనుమానం వచ్చినా . . . . భయం వేసినా . . .ఆనందం వచ్చినా . . దుఖం వచ్చినా అన్నింటికీ అమ్మ దగ్గరకు పరిగెత్తుకు వచ్చేదాన్ని! ఇప్పటికీ అమ్మ ఆశీర్వాదం తీసుకోకుండా ఏ పని చెయ్యను . అమ్మ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను’ అంటూ కళ్ళు వత్తుకుంది శారద..


మాధురికి అప్పుడు అర్ధమైంది శారద రోజూ తమ ఇంట్లో ఎందుకు కనిపించేదో . అమ్మ ఎప్పుడూ శారదకి ఏదో చేసి చూపించడం . . . ఇద్దరూ గుమ్మాల దగ్గరా. . . . .దొడ్లో చెట్ల కిందా ఏవో మాట్లాడుకోవటం . . . .మాధురి కళ్ళముందు కదలాడాయి .


ఆ రోజు పిల్లల గురించి కూడా శారద ఎంతో ఆనందంగా, గర్వంగా చెప్పుకుంది . . .మాధురి పక్కన కూర్చుని ఆల్బం చూపిస్తూ “ఇదిగో.. ఇది మా పెద్దమ్మాయి అర్చన. నీలాగే చదువుల సరస్వతి! పుస్తకాలు తప్ప దానికి వేరే ప్రపంచం లేదు. స్కాలర్షిప్పులు తెచ్చుకుని దాని చదువు అది చదువుకుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉంది.. ఉద్యోగంలో సెటిల్ అయ్యాక వివాహ ప్రయత్నాలు చేయాలని నేను మీ అన్నయ్స అనుకుంటున్నాం మధూ ! ఇక రెండోది అరవింద ....... సిసింద్రీ.. మహా పెంకిది సుమా ! వాళ్ళ నాన్న కూతురు ! ఎప్పుడూ బట్టలు . . . డిజైన్లు . . . ఫ్యాషన్లు అంటుంది . వాళ్ళ అత్తయ్య దగ్గర వుండి వాటికి సంబంధించినదే , ఆ పేరు కూడా నా నోటికి సరిగ్గా రాదు ఆ చదువు చదువుతోంది !

‘ఇది చదువు కాదు, వద్దంటాను’ నేను. ‘దానికి దేనిమీద ఇంటరెస్టు వుంటే అదే చదువుతుంది’ అంటారు వాళ్ళ నాన్న ! ఇక నా కొడుకు వాసు, డాక్టరు చదువు చదువుతానంటాడు. మా మాధురి మొగుడి లాగా పెద్ద డాక్టరై పేరు తెచ్చుకోవాలని చెప్తుంటాను వాడికి” అంటూ ఫక్కున నవ్వింది శారద !


మొత్తం మీద శారదే ఎక్కువ మాట్లాడింది. ఎన్నో కబుర్లు చెప్పింది. తన దగ్గిర ఏమున్నాయి చెప్పడానికి. అందులోనూ శారద దృష్టిలో తను ఓ ఆదర్శ మహిళ!

ఆ ఇంట్లో గడిపిన ఇరవైనాలుగు గంటల్లో మాధురికి కనువిప్పుతో పాటు అసలు శారద అంటే ఎవరో అప్పుడే తెలిసింది . నవ్వుతూ సౌమ్యంగా మాట్లాడుతూ, ఇంట్లో అందరి అవసరాలు చూస్తూ, పనివాళ్ళకు పనులు పురమాయిస్తూ వచ్చేపోయే వారిని పలకరించి తగిన సమాధానాలు ఇస్తున్న శారద సమర్ధత చూసి ఆశ్చర్య పోయింది మాధురి .


ఆమెలో తొణికిసలాడుతున్న ఉత్సాహం, ఆమె మాటలలోని నైపుణ్యం, అందరి పట్ల ఆమె ప్రవర్తించే తీరు చూసి మాధురి అబ్బురపడింది. తల్లి కళ్ళ నీళ్ళు తుడవటానికి అన్నట్లు, మొక్కుబడిగా ఇలా వెళ్ళి అలా వచ్చేయడమే అనుకుని చేసిన ఆ చిన్ని ప్రయాణంలోనే మాధురి మనసు నిద్ర లేచింది. ఈ శారద దగ్గరనుంచి తనలాంటి వాళ్ళు తెలుసుకునేది ఏమీ లేదనుకున్న మాధురి , తను నేర్చుకోవలసినదంతా ఈ శారద దగ్గరే వుందని ఆ ప్రయాణంలోనే తెలుసుకుంది .


కుటుంబ వ్యవస్థకు ఆడదే మూలాధారం అని, దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనమీదే వుందని మాధురి ఆ రోజే గుర్తించింది . మనిషి ఎదగడం అంటే ఎదుటివాళ్ళు అన్నీ అమర్చి పెడుతుంటే ఆడంబరంగా పుట్టిన రోజులు జరుపుకోవడం కాదని, తన చుట్టూ వున్నవారితో కలిసి బతుకుతూ ఎదుటివారిని గౌరవిస్తూ వారి దగ్గరనుంచి నేర్చుకుంటూ పెరిగినదే నిజమైన ఎదుగుదల అని మాధురి ఆ ప్రయాణంలోనే తెలుసుకుంది . బాంబేలో పుట్టి నగర వాతావపణంలో పెరుగుతున్న తన పిల్లల్ని పెంచడానికి తల్లిగా తనకు ఎంతో సహనం. . .ఓర్పు . . అప్రమత్తత . . వుండాలని ప్రేమ ఒక్కటే చాలదని, వాళ్ళ ఇష్టాలను అభిరుచులను గుర్తిస్తూ జాగ్రత్తగా పిల్లల్ని ముందుకు నడిపించాలని ఆ శారద ఇంట్లోనే తెలుసుకుంది మాధురి .


భర్త హోదా , సంపాదన అనుభవించడం తన హక్కు అని అనుకునే మాధురికి , అలసిపోయి ఇంటికి వచ్చే శ్రీకాంత్ ని ఎలా చూసుకోవాలో, భార్యగా అతనితో కలిసి ఎలా నడవాలో ఈ పల్లెటూరి శారదను చూసాక తెలిసింది మాధురికి . ఇన్నేళ్ళుగా తను ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తూ వచ్చిందో , శారదతో గడిపిన ఆ కొద్ది సమయంలో మాధురికి తెలిసొచ్చింది. తన తల్లి ఎప్పుడూ ఎందుకు శారద గురించి మాట్లాడుతుందో మాధురికి ఆ రోజే అర్ధం అయింది.

ఇప్పుడు నేర్చుకుంటే ముందు ముందు నీకే ఉపయోగం అంటూ తనకు పని – పాటలు, మంచి - చెడు నేర్పాలని తల్లి ఆ రోజుల్లో ఎందుకు అంత తాపత్రయపడేదో ఇప్పుడు శారదను చూసాక తెలిసింది మాధురికి . శారద కూతురు అర్చన ఎంత అందంగా ఉంది ? పల్లెటూర్లో పుట్టి పెరిగిన అర్చన చక్కగా పెద్ద చదువులు చదువుకుని తల్లి తండ్రుల సంస్కారాన్ని పుణికి పుచ్చుకుంది.. అంత చదువుకున్నా ఆమెలో ఎంత అణుకువ, ఒద్దికతనం.. ఇంట్లో కలివిడిగా తిరిగేస్తూ తనకు వంటలో సాయం చేస్తూ ఆంటీ అంటూ ఒక్క క్షణం తనని వదలలేదు.. తన కూతురు పీయూష కూడా ఇంత అణుకువుగా, ఒద్దికగా ఉంటే బాగుండునని నిట్టూర్చుంది.. డిగ్రీ ఫైనలే ఇయర్ చదువుతున్న పీయూషలో అహంకారం, పొగరు.. తల్లిగా తను ఏదిచెప్పినా నాకు తెలుసునన్నట్లు మాట్లాడుతుంది.. స్నేహితులు, పార్టీలతో ఎప్పుడూ బిజీనే.. తన భర్త శ్రీకాంత్ కు చెపితే ఆ వయస్సులో పిల్లలు అలాగే ఉంటారని కొట్టి పడేస్తాడు.. ఇంకా అమెరికాలో మెడిసన్ ఎమ్..ఎస్ పూర్తి కాబోతున్న తన కొడుకు ' ఆకాశ్' చాలా నయం.. తన మాటకు విలువనిస్తాడు.. అమ్మ తో ప్రతీదీ పంచుకుంటాడు..

శారదను చూసాక , ఇప్పుడు మాధురి నెమ్మదిగా తనని తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ, తన కుటుంబాన్ని సరిదిద్దాలని తపన పడుతోంది .

అర్చన ఇంటర్వ్యూ విజయవంతంగా ముగిసింది.. ఒక నెలరోజుల లోపు వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవమన్నారు ! అంతా మీ ఇంటి మహిమే ఆంటీ అంటూ అర్చన మాధురిని పొగిడేసింది ! ఇంక తిరుగు ప్రయాణానికి రెడీ అవుతున్నారు తల్లీ కూతుళ్లూ !

హాలు మధ్యలో మెత్తని కుర్చీ వేసి అందులో శారదను కూర్చోపెట్టి, ఒక చేత్తో శారద పాదం పట్టుకుని రెండో చేత్తో శ్రద్ధగా పసుపు రాస్తున్న మాధురి వంక శారద ఎప్పటిలాగే నవ్వుతూ ప్రేమగా చూసింది !


శారదకూ, అర్చనకూ ఖరీదైన పట్టు చీరలు పెడుతూ, అర్చన బుగ్గలను చిదిమి ముద్దు పెట్టుకుంది !

ముంబాయ్ నుండి కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఒక పది నిమిషాలలో బయలదేరడానికి సిధ్దంగా ఉంది.. శారద, అర్చన తమ సీట్లలో సెటిల్ అయ్యారు.. శారద స్టేషన్ చేరుకున్నామని, సీట్లలో కూర్చున్నామని, ఒక పది నిమిషాలలో ట్రైన్ బయలదేరడానికి సిధ్దంగా ఉందని, మాధురికి చెప్పాలని ఫోన్ కనక్ట్ చేస్తూ కిటికీలోనుండి బయటకు చూసింది.. మాధురి తమ కంపార్ట్ మెంట్ ను చూసుకుంటూ హడావుడిగా రావడం కనబడి చేయి ఊపుతూ పిలిచింది..

" సరిగ్గా రైలు కదలడానికి సిధ్దంగా ఉంది ".......


మాధురి కంపార్ట్ మెంట్ లోపలకు వస్తూ........ “ఊ...... దిగండి త్వరగా ముందు” అంటూ హడావుడిగా వాళ్ల సూట్ కేస్ లను బయటకు తీసేసింది..

"నడు అర్చనా తొందరగా” అంటూ, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఇద్దరినీ దింపేసింది. వీళ్లు ట్రైన్ నుండి దిగడం, ట్రెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒకేసారి జరిగింది..


శారద నిర్ఘాంతపోతూ, “ఏమైంది మధూ, ఇంట్లో అందరూ బాగున్నారుకదూ” అంటూ కంగారుపడుతూ ప్రశ్నించింది..

“అందరం బాగానే ఉన్నాం శారదా ! మిమ్మలని మళ్లీ రెండురోజుల్లో ఫ్లైట్ లో మీ వైజాగ్ పంపిస్తాను.. మీతో అర్జంట్ పనుంది.. అమ్మకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను.. అన్నయ్య గార్కి తెలియచేయమన్నాను” అంది. వాళ్ల కారులో తిరిగి వాళ్లింటికి చేరుకున్నాం !


శారదకు అంతా అయోమయంగా ఉంది ! హఠాత్తుగా ప్రయాణం కేన్సిల్ చేయించింది, ఏమైందబ్బా అంటూ ఇంకా విస్మయంలోనే ఉండిపోయింది !


ఇంటికి చేరాక మాధురి నెమ్మదిగా శారద ఒళ్లో చేరి, “నిన్ను ఒకటడగనా శారదా, నా కోరిక తీర్చవూ” అంటూ అభ్యర్థనగా చూసింది!


“ఏమైంది మధూ, నేను నీ కోరిక తీర్చడం ఏమిటి ? ఆగర్భ శ్రీమంతురాలివి, చదువుకున్నావు, చక్కని సంసారం, పిల్లలు, నీకేమి తక్కువ ! మా మధూ ఎప్పుడూ ఇంత ఆనందంగా ఉండాలని కోరుకుంటాను ! నీవు నవ్వితే పరవశించిపోతాను, మాట్లాడితే మా మధూ ఎంత చక్కగా మాట్లాడుతుందనుకుంటాను.. నాకు నీవు ప్రతీ విషయంలోనూ ఆదర్శమే ! చిన్నప్పటినుండీ నీవంటే ప్రాణం నాకు.. నేను........ నేను........నీకోరిక తీర్చడమేమిటి ? అయినా నా మధూ అడిగితే ఏదైనా ఇచ్చేస్తాను.. చెప్పు మధూ” అంటూ బుగ్గలు నిమురుతూ ఆప్యాయంగా అడిగింది శారద !


“మీ అర్చనను నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను శారదా ....” అంది మాధురి.


“నిజమేనా మధూ ? అమెరికాలో డాక్టర్ గా ఉన్న నీకొడుక్కి మా అర్చనను కోడలిగా చేసుకుంటావా ?”


“నిజం శారదా ! అర్చన లాంటి అమ్మాయి కోడలిగా మా ఇంటికి రావాలి.. నేను కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను.. స్వేఛ్చగా స్వతంత్రంగా పెరిగాను.. ఆడింది ఆట, పాడింది పాటగా జరిగిపోయింది నా జీవితం.. ఫలితం నా పిల్లలకు స్వేఛ్చనిచ్చేసాను.. నా భర్త డబ్బు సంపాదించే ఒక సాధనంగా అనుకున్నానే తప్ప, ఏ నాడూ ఆయన్ని ఆప్యాయంగా దగ్గరకు చేరలేకపోయాను.. డబ్బు ఉందికదా చాలదా అనుకున్నాను.. నాకు......నాకు అర్చన లాంటి కోడలు కావాలి శారదా ! మా ఇల్లు కళ కళ లాడుతూ, మమతానురాగాలకు ప్రతీకగా ఉండాలి.. మా అబ్బాయి ఆకాశ్ వచ్చేనెల ఇండియా వచ్చేస్తున్నాడు.. ఇక్కడే ప్రాక్టీస్ పెడ్తానంటున్నాడు !

ప్లీజ్ శారదా ! అమ్మకు కూడా ఈ విషయం చెపితే ఎంత ఆనంద పడిందో తెలుసా, నీవు వైజాగ్ వెళ్లిపోతే ఇవన్నీ మాట్లాడలేనేమో, ఆలస్యం అమృతం విషమనుకుని పరుగెత్తుకువచ్చాను” అంది మాధురి.


శారద " నాకు అభ్యంతరం ఏముంటుంది మధూ! నీవే నాకు ప్రాణం అయితే, ఆకాశ్ కూడా నా ప్రాణమే” అంది.

మాధురి అర్చన వైపు చూస్తూ, " అర్చనా! నీకు సమ్మతమేనా తల్లీ?” అనగానే

"అమ్మకు ఇష్టమైతే నాకూ ఇష్టమే ఆంటీ” అంటూ సిగ్గుతో తల దించుకుంది అర్చన !

ఇంట్లో అందరూ పచ్చజండా ఊపేసరికి ఆ ఇంట సంతోషం చిందులేసింది !

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.



135 views0 comments
bottom of page