'Happy Valentine's Day' Telugu Story Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
ప్రేమించిన బావతో త్వరలో పెళ్లి.
ఈలోగా వేలంటైన్స్ డే వస్తోంది.
బావ దగ్గరనుండి సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తోంది ఆమె.
అజ్ఞాత వ్యక్తి అందించిన ఉత్తరం లో ఏముంది?
ఆమె ఎందుకంత ఆందోళన పడింది?
సమాధానం ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారి కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం
వారంరోజుల శెలవు అనంతరం ఆరోజే ' యుక్త ' ఆఫీస్ లో జాయిన్ అయింది .
యుక్త తన సీట్ లో కూర్చోగానే ఆఫీస్ బాయ్ వచ్చి ఒక కవరు అందించి వెళ్లాడు .. ఏమిటిది అని అడగ్గా, " ఎవరో ఒక అతను బైక్ మీద వచ్చి మీరు ఆఫీస్ కు రాగానే మీకు అందచేయమన్నాడు మేడమ్” అంటూ కవరు అందించి వెళ్లిపోయాడు ..
ఏముంది కవరులో.. ఎవరిచ్చారో తెలియదు.. పర్సనలో, అఫీషియలో తెలియదు.. మొత్తానికి కవరు తెరిచింది. ఒక కాగితం ఫోల్డ్ చేసి ఉంది లోపల . కాగితం మడత విప్పగానే రెండు ఫొటోలు అందులోనుండి బైటకు వచ్చాయి.
ఫొటోలను నిశితంగా పరిక్షించి చూసింది . భూమి ఆకాశం ఏకమైపోయినట్లు, మేఘాలన్నీ కలసి ఒక ఉరుము ఉరిమినట్లుగా భావన. తలలో పెద్ద విస్ఫోటకం జరిగిందేమోనన్న అలజడి కలిగింది. కళ్లు గిర్రున తిరుగుతుండగా, కుర్చీ వెనుకకు జార్లపడి కళ్లుమూసుకుంది క్షణం సేపు . ఇది నిజమా అనుకుంటూ ఉత్తరంలో ఏమి ఉందో చదవనారంభించింది .
మిస్ ' యుక్తా ' ,
" మీకు ఈ విషయం బాధ కలిగిస్తుందని తెల్సు. అయినా సాటి స్త్రీగా మీకు ఈ విషయం తెలియచేసి మీ జీవితాన్ని కాపాడాలన్న మంచి ఉద్దేశ్యంతో వ్రాస్తున్నాను. నేనూ మీ బావ సుశీల్ ప్రేమించుకున్నాం. అమెరికాలో ఒకే యూనివర్సిటీ లో చదువుకున్నప్పటినుండి ప్రేమలో ఉన్నాం. నేనే సర్వస్వం అన్న సుశీల్ మిమ్మలని పెళ్లాడబోతున్నానని , మరో మూడు వారాలలో మీ ఇద్దరి పెళ్లని చెప్పాడు . ‘మరి నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు నా వెంటపడ్డావు’ అని నిలదీసి అడిగితే, ‘ ప్రేమ వేరు పెళ్లివే’రంటూ జోకుగా తీసిపారేసాడు.
నాతో అతని ప్రేమ కేవలం ఫేన్సీ మాత్రమేనని తేలిగ్గా కొట్టిపారేసాడు.. ఈ విషయం మీకు తెలియపరచాలని, సుశీల్ నిజస్వరూపమేమిటో మీకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో మేము ఇద్దరం కలసి తీసుకున్న ఫొటోలు , ఈ లెటర్ ఇండియాలోని మా తమ్ముడికి కొరియర్ లో పంపి మీకు అందచేయమని చెప్పాను. అందమైన రూపం వెనుక ఇంత కుత్సితమైన బుధ్ది ఉందని తెలియక సుశీల్ ను అమాయకంగా ప్రేమించి మోసపోయాను.. నాలా మరో అమ్మాయి బాధపడకూడదనే ఉద్దేశంతో మీకు ఇలా తెలియచేస్తున్నాను.. ఇలా మీ బావ గురించి తెలియచేసినందుకు ఏమీ అనుకోరుగా ? ఫైనల్ నిర్ణయం మీదే ! ఉంటాను, మీ శ్రేయోభిలాషిణి, చైత్ర ...." ..
ఉత్తరం చదివిన యుక్త మెదడు అంతా మొద్దు బారిపోయింది. తను, బావా చిన్నప్పటినుండి కలసి మెలిసి పెరిగారు. ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం. దెబ్బలాడుకోవడం, అలగడం... ఒకటేమిటీ, ఛీ ఫో అనుకున్నా, మరు నిమిషం ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేకపోయేవారు. అమెరికా వెళ్లినా బావలో ఏమీ మార్పు లేదు. ఫోన్లు, ఛాటింగ్, తనని ఏడిపించడం, తను మాట్లాడకుండా సీరియస్ గా ఉంటే తనని బ్రతిమాలి బుజ్జగించడం...
అటువంటి బావకు మరొకరితో లవ్ ఎఫైర్. దానికి ప్రూఫ్, బావ చైత్రా కలసి తీయించుకున్న ఫొటోలు. చాలా సన్నిహితంగా ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ , బావ ఆమెను ప్రేమగా భుజాలచుట్టూ చేతులు వేసి దగ్గరగా పొదుపుకోవడం.... ఛీ.... బావా నీవు ఇటువంటివాడివా ? ప్రేమ ఒకరితో, పెళ్లి మరొకరితోనా ? నేను నిన్ను పెళ్లిచేసుకోలేను బావా ! ఇంట్లో నీ విషయం చెప్పేసి పెళ్లి కేన్సిల్ చేస్తానంటూ ఒక నిర్ణయానికి వచ్చేసింది. వారం రోజులనుండి జ్వరంతో బాధపడి, ఈరోజే ఆఫీస్ లో జాయిన్ అయిన యుక్త ఈ విషయం తెలిసి తట్టుకోలేకపోతోంది. తల పగిలిపోతోంది. తిరిగి జ్వరం వచ్చినట్లుగా శరీరం వేడిగా అయిపోయింది . ఎలాగో సాయంత్రం వరకు కూర్చుని ఇంటికి బయలదేరింది .
ఇంటికి రావడం తడువుగా యుక్త సీరియస్ గా ఎవరితోనూ మాటాలాడకుండా తన గదిలోనికి వెళ్లి పడుకుండిపోయింది. కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
ఇంతలో యుక్త తల్లి కాఫీ తీసుకుని గదిలోకి వచ్చి యుక్తని లేపుదామని ఒంటి మీద చేయేసేసరికి ఒళ్లు వేడిగా కాలిపోతోంది.. అమ్మలూ ఒంట్లో బాగాలేదా , అప్పుడే ఆఫీస్ కు వెళ్లద్దంటే వినలేదు, మొండిఘటానివనేసరికి యుక్త ఏడుస్తూ తల్లి ఒడిలో దూరిపోతూ ఆరోజు జరిగిన సంఘటన చెపుతూ, బావతో తన పెళ్లి కేన్సిల్ చేయమని నాన్నకు చెప్పమంటూ ఏడ్వడం మొదలు పెట్టింది .
ఆవిడ ముందర యుక్త మాటలకు తెల్లబోయింది. కానీ వెంటనే వారిరువురి అలకలు, కోపాలూ, ఒకరినొకరు బ్రతిమాలుకుంటూ మామూలుగా అయిపోవడం బాగా తెలుసున్నావిడ కాబట్టి మనసులో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, కూతురి చేత వేడి వేడి కాఫీ తాగించింది.. ఈలోగా యుక్త అన్నయ్య ఆనంద్ అక్కడకు వస్తూ , ' 'చెల్లాయ్, బావనుండి ఫోన్ వచ్చింది మాట్లాడు, నీ ఫోన్ కు చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోందిట అంటూ' చెల్లెలికి ఫోన్ ఇవ్వబోతుంటే... నేను ఆ ఇడియట్ తో మాట్లాడనన్నానని , ఇప్పుడేకాదు, జీవితంలో ఎప్పుడూ మాట్లాడనన్నానని చెప్పు అన్నయ్యా అంటూ భోరున ఏడ్వడం మొదలు పెట్టింది .
ఇదే విషయం ఆనంద్ ఫోన్ లో సుశీల్ కు చెప్పేసరికి సుశీల్ వీడియో ఆన్ చేయమని చెప్పి మాట్లాడ సాగాడు. అక్కడే ఉన్న యుక్త తల్లి, అన్నయ్య ఆ రూమ్ లో నుండి బయటకు వచ్చేసారు..
ఆ...ఏమన్నావు యుక్తా... జీవితంలో మాట్లాడవా ?
అవతలివైపు నుండి సుశీల్ అల్లరి నవ్వు !
నీకు అన్నీ తెలుసు, నీ అంత తెలివైన వాళ్లెవరూ లేరంటూ పోజ్ కొడ్తావు కదా అనేసరికి , అవును తెలివైన దాన్ని కాబట్టే నీ మోసం నుండి బయటపడ్డాను.. ఇన్నాళ్లూ నీలాంటి ఛీటర్ తోనా నేను ప్రేమ వ్సవహారం నడిపాను? నీవే నా సర్వస్వం అనుకున్నాను.. మరి నీవు ? నీవు లేనిదే నా జీవితానికే అర్ధం లేదంటూ తీయని కబుర్లు చెప్పావు .. ఛీ....ఛీ........ ఇంక నీకూ నాకూ ఏ సంబంధం లేదు మిస్టర్ సుశీల్.. బై....అంటూ తలగడలో ముఖం దాచేసుకుంది..
ఇప్పటకీ అదే అంటాను యుక్తా! ఇదిగో కాస్త తల పైకెత్తి నావైపొకసారి చూడు ..
నీకు సిగ్గులేదు సుశీల్......
" నేను ఇంత చెపుతున్నాకూడా ఇంకా ఏదో చెప్పాలని నన్ను కన్విన్స్ చేయాలని ప్రయక్నిస్తున్నావ్ ", ఇంకా నమ్మేస్తాననే?
నీవు నాతో చెప్పిన ప్రేమ కబుర్లు లాంటివి ఇప్పటిదాకా ఎంతమందితో చెప్పావు సుశీల్ ? చైత్రా, నేను........ ఇంకా ఎంత మందితో ?
ఓ మైగాడ్, సుశీల్ ఫకాలున నవ్వేస్తూ, వాలెంటైన్స్ డే నాడు కూడా నిన్ను బాధపెట్టానుకదూ, సారీ యుక్తా !
" నువ్వులేని ఈ ఏకాంతంలో నీ జ్నాపకాలే తోడై, నీతో సరదాగా పోట్లాట పెట్టుకోవాలనుకుని ఒక చిన్న నాటకం ఆడాను యుక్తా".....
"చాలు మాట మార్చాలని ప్రయత్నించకు” బావా రోషంతో జవాబిచ్చింది యుక్త.
“నేను చెప్పేది నిజం యుక్తా, అంతా నాటకం, ఒట్టు........”
“నాటకమా! నామీద ఒట్టేయి” అంటూ చటుక్కున లేచి కూర్చుంది..
“నీమీద ప్రామిస్ !”
“మరి ..మరి... ఆఫొటోలు, ఉత్తరం? “
బావ తనతో ఏదో మాట్లాడి మేనేజ్ చేయాలని చూస్తున్నాడేమోననుకుంటూ … అనుమానంగా ప్రశ్నించేసరికి ...
" జస్ట్ ఫన్ యుక్తా " ... నా ఫ్రండ్ గురించి అదివరలో ఒకసారి చెప్పాను గుర్తుందా, గౌతమ్. ఆడపిల్ల రూపురేఖలతో ఉంటాడు. ఫైనల్ ఇయర్ ఫేర్ వెల్ పార్టీకి ఫాన్సీ డ్రస్ వేయించాం అతనితో సరదాగా . అమ్మాయి డ్రస్ వేసి మేకప్ చేయించాం. ఆ వేషంలో గౌతమ్ ను చూసి మేమే నమ్మలేకపోయాం. అప్పుడు సరదాగా మా గౌతమ్ తో స్నాప్స్ తీయించుకున్నాను! వాటితో నిన్ను కాసేపు ఏడిపిద్దామన్న బుధ్ది పుట్టింది.. ఇండియాలో ఉన్న మా గౌతమ్ తమ్ముడిని దీనికోసం వాడుకున్నాను .
" నా జీవితానికి మరో చైత్ర కూడానా, గొంతుకలో నిరాశ ధ్వనిస్తుండగా మాట్లాడసాగాడు", నాకంత అదృష్టమా అంటూ. సుశీల్ గొంతుకలోని అల్లరిని గ్రహించికూడా గ్రహించనట్లుగా యుక్త కూడా " ఒక్క చైత్రేమి ఖర్మ బావా, వేయి చైత్రలతో ఊరేగు, నేను తప్పుకుంటాననేసరికి .... .. చాల్లే రాక్షసీ... .. నేను మరో అమ్మాయిని కట్టుకుంటే ఇదిగోఇప్పుడు నాతో పోట్లాడుతున్న .....
ఈ అందాల రాక్షసి 'నిను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే... అంటూ నన్ను అదేపనిగా దెయ్యమై వెంటాడి వేధించేస్తుంది...." చాలు తల్లీ చాలు నన్ను నీతోనే ఉండనీయ్ అనేసరికి" , యుక్త ' నిజం బావా, కలలో కూడా మరెవరితో నిన్ను ఊహించుకోలేను' ..
జీవితమంతా నీ ప్రేమలో కరిగిపోతాను, నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ...బావా ?
ఏయ్ మొద్దూ, ఎందుకా సందేహం, నిన్ను చూడాలని తపించే కనులకు ఎలా చెప్పను నువ్వు నాలోనే ఉన్నావని, నీవే నా ప్రాణమని .
' ఇంతకీ గుడ్ న్యూస్ ఏమిటంటే ' వచ్చేవారం బయలుదేరి ఇండియా వస్తున్నాను, నా అందాల రాక్షసి ని పెళ్లి చేసుకోడానికని చెప్పేసరికి... యుక్త ఆనందంతో సిగ్గుల మొగ్గ అయింది.
సుశీల్ యుక్త కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారుచేయించిన వేలెంటైన్ డే గులాబీల ఫ్లవర్ బొకేను ప్రేమగా చేతుల్లోకి తీసుకుని సుతారంగా తన పెదవులతో స్పృశించింది !
ఇంతలో ఆ ఇంటి పెరటులో ని పచ్చని మామిడి చెట్టు కొమ్మపై కూర్చుని ఊసులాడుకుంటున్న రెండు జంటపక్షులు వెంటనే యుక్త బెడ్ రూమ్ కిటికీపై వాలి లోపలికి తొంగిచూస్తూ, ఏయ్ యుక్తా మీ బావపై అలక పోయినట్లేకదూ, హేపీ వేలంటైన్స్ డే" అని విష్ చేస్తూ జంటగా ఎగురుకుంటూ పారిపోయాయి !!
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
Comments