top of page

సంఘర్షణ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Samgharshana' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

ఆమె జీవితమంతా బాధలు అనుభవించింది.

పట్టించుకోని తండ్రి , జాలి చూపని సవతి తల్లి...

ఈ బాధలు చాలవన్నట్లు వయసు మళ్ళిన వాడితో వివాహం....

ఆమె మానసిక సంఘర్షణకు అంతం లభించిందా? లేక చివరి వరకు అలాగే బాధలు అనుభవించిందా?

ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారి కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం



“అమ్మాయ్ సీతారత్నం! ఏమి చేస్తున్నావ్?” అంటూ శేషమాంబ లోపలకు వచ్చింది.

తల్లిని చూడగానే సీత “రామ్మా” అంటూ లోపలకు ప్రేమగా పిలిచింది.

సీతారత్నం తల్లీ, తండ్రీ కూడా అదే ఊళ్లో ఉంటున్నమూలాన ఆవిడ తరచుగా కూతురింటికి రాకపోకలు సాగిస్తూ ఉంటుంది.


“ఇంట్లో ఎవరూ లేరా” అంటూ ఆరాగా ఆ ఇంటిని తన డేగ కళ్లతో పరీక్షగా చూస్తూ " నీ సవతి కూతురెక్కడా అంటూ" సైగచేస్తూ అడిగింది.


“మీ అల్లుడు గారు పొలం నుండి ఇంకా రాలేదు. బాబిగాడు, చంద్రకళ స్కూలికి వెళ్లారు” చెప్పింది సీతారత్నం.ఆమె కొడుకు బాబిగాడు ఒకటో క్లాస్, కూతురు చంద్రకళ రెండో క్లాసూ చదువుతున్నారు.


“అదిగో.. మా గుదిబండ పెరట్లో బట్టలు ఆరేస్తోంది” అంది సీతారత్నం, తన సవతి కూతురు, ఇరవై సంవత్సరాల రుక్మిణి గురించి చెబుతూ.

రుక్మిణి బంగారు బొమ్మలా జాజి మొగ్గలా ఉంటుంది.


“ఇదిగో.. నేను మీ అల్లుడిగారి కోసం ఎదురుచూస్తున్నాను. మధ్యాహ్నం భోజనాల సమయమైనా ఈయన ఇంటికి రారు. ఆకలితో శోష వచ్చి పడిపోతున్నా ఈయన గారికి పట్టదు. పనివాళ్లున్నా అన్నీ ఈయనే చూసుకోవడం ఎందుకో, చాదస్తం కాకపోతే” అంటూ మొగుడుమీద విసుక్కోవడం మొదలు పెట్టింది.


“అంతా నీ మెతకతనమేనే రత్నం. పొలాలు, పుట్రలూ ఉన్నాయని, నీవు సుఖపడతావనే రెండో పెళ్లి వాడయినా ఫరవాలేదనుకుంటూ నిన్ను కేశవరావు కిచ్చి పెళ్లిచేసాం. నీకు లోపాయికారం తెలియదు. భర్తను కొంగుకి ముడివేసుకోవడం అసలే రాదు. దీపమున్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవే తల్లీ! ఆ పది ఎకరాల వరిపొలం నీపేరున రాయించుకోవే అంటే పట్టించుకోవు. ఒట్టి చవట మొద్దువి. రేపు ఆ పొలాన్ని, నీ సవతి కూతురు, ఆ రాక్షసి రుక్మిణి కి కట్నంగా నీ మొగుడు ఇచ్చేస్తే, అప్పుడు లబోదిబో మంటావా ?

చూడు రత్నం! నీ సవతి కూతురు.. ఆ దరిద్రురాలికి ఒక మంచి సంబంధం తెచ్చాను. రెండో పెళ్లి వాడు. భార్యపోయి ఏడాదిన్నరే అయింది. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. . పెద్ద అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం , చిన్నమ్మాయి పదోక్లాస్ చదువుతున్నారు. అతనికి నలభై ఏళ్లు దగ్గరపడుతున్నపుడు పిల్లలు పుట్టారుట. భార్య, ఏదో కామెర్ల రోగం వచ్చి పోయిందని తెలిసింది. నీకు చేయలేదా రెండో పెళ్లి. ఆస్తీ అంతస్తుతో సుఖంగానే ఉన్నావుకదా. అలాగే నీ సవతి కూతురు కూడానూ. మంచి సంబంధం వెతికి బోల్డంత కట్నం, పొలం ఇచ్చి చేస్తానంటాడేమో మీ ఆయన. అంతా దానికే పెట్టేస్తే, నీకూ , నీ పిల్లలకూ చిప్పే మిగులుతుం”దని చెవిలో బాగా నూరిపోసింది ఆవిడ.

రత్నం భర్త ను ప్రేమతో ఆకట్టుకుంటూ, ఒకరోజు ఆమె ప్రేమలో తడసి ముద్ద అవుతున్న తరుణంలో తన తల్లి చెప్పిన రెండో పెళ్లి అతనితో రుక్మిణి పెళ్లికి అంగీకరింపచేసి ముహూర్తాలు పెట్టించేసింది.

విషయం తెలిసిన రుక్మిణి నాన్నను పట్టుకుంటూ, “నాకీ పెళ్లి చెయ్యకు నాన్నా!” అంటూ గుండెలు పగిలేలా ఏడ్చింది.

“చూడు రుక్కూ! మనకా.. పెద్ద ఆస్తి పాస్తులు లేవు. పేరుకి పొలాలూ అవీ బాగానే ఉన్నా, అవి పంటలు సరిగా పండక రాబడి తగ్గిపోయింది. ఊళ్లో అన్నీ అప్పులే నాకు. నీ తరువాత బాబిగాడు, చంద్రకళా ఉన్నారు కదా. ఏదో కాస్త వయస్సు ఎక్కువేగాని అలాగేమీ కనిపించడు. ఒక ఐశ్వర్యవంతుడింటికి ఇల్లాలుగా వెడుతున్నావు. నీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం చేసాను. చక్కగా ఆనందంగా పెళ్లి చేసుకో. మహారాణీ లా బ్రతు”కంటూ కూతురి కి హితోపదేశం చేసాడు.


“ఏమిటి నాన్నా, ఏభై అయిదు సంవత్సరాల వయస్సు కలవాడితో పెళ్లి నిర్ణయించి నా బరువుని వదిలించుకోవాలనుకుంటూ, ఏదో నా చక్కని భవిష్యత్ కోసమే ఇదంతా అనడం సబబేనా నాన్నా? అమ్మే ఉండి ఉంటే ఇలా చేసేదా ?


టెన్త్ లో నా కు వచ్చిన మార్కులు చూసి అమ్మ మురిసిపోతూ, ‘నిన్ను సిటీకి పంపి ఇంటర్, ఆ తరువాత డిగ్రీ చదివిస్తాను రుక్కూ. ఆ తరువాత టీచర్ ట్రైనింగ్ అవుదువుగా’నని అమ్మ మీ ఎదురుగానే అనడం మీరు వినలేదా ? నా దురదృష్టం కాకపోతే అమ్మ అప్పుడే పోవాలా ? పదో క్లాస్ తోనే నా చదువు ఆగిపోయింది. ఇప్పుడు ముసలాడితో నా పెళ్లి. నాకీ పెళ్లి వద్దు నాన్నా” అంటూ తండ్రి చేతులు పట్టుకుని ఏడుస్తున్న రుక్మిణిని చెంప పగలగొట్టాడు.

“నోరు మూసుకో. నేను నిర్ణయించిన వ్యక్తితోనే నీ వివాహం” అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ అక్కడనుండి వెళ్లిపోతున్న తండ్రి వైపు మ్రాన్పడిపోయి చూస్తూ ఉండిపోయింది రుక్మిణి.


ఒక శుభ ముహూర్తాన రుక్మిణి మెడలో పాపారావు మూడు ముళ్లూ వేసాడు చిద్విలాసంగా. రుక్మిణికి అవి మూడుముళ్లూ కావు. మెడకి ఉరితాడు వేసినంతంగా బాధపడింది. పెళ్లి పీటలమీత తలవంచుకుని కూర్చున్న ఆమె ముఖంలో లేలేత సిగ్గుదొంతరలేమీ లేవు. కళ్లు కన్నీటి చెరువులయినాయి. కుందనపు బొమ్మలాంటి రుక్మిణి పక్కన తండ్రి వయస్సులో భీకరంగా కనిపిస్తున్న పాపారావు.


అత్తవారింటికి వచ్చింది దైన్యంగా. రాజసం ఉట్టిపడుతున్న పెద్ద బంగళా, పనివాళ్లతో సందడిగా ఉంది. తనను పలకరించడానికి ఎవరూ పెద్దవాళ్లు కనపడలేదు. ఒక పనిమనిషి రుక్మిణికి ఇల్లంతా చూపించి, ఆమెకు గదిచూపించి వెళ్లిపోయింది. బంధిఖానా లాంటి ఆ బంగళాలో తను శాశ్వత ఖైదీ. నీ భర్తను వదిలి ఇక్కడకు వచ్చేస్తే నా పిల్లల భవిష్యత్ పోతుందని, మా పరువుని మంటకలపవద్దని రుక్మిణి సవతి తల్లి చాలా గట్టిగానే హెచ్చరించింది.


ఆరోజు రాత్రి బంగళా అంతా సర్దుమణిగాకా ఒక పనిమనిషి వచ్చి కుబుసంలా మెరిసిపోతున్న ఒక తెల్లని జరీ పట్టుచీర, మల్లెపూలు తెచ్చి రుక్మిణిని అలంకరించి పాలగ్లాసు చేతికిచ్చి పాపారావు గదిలోకి పంపించింది. భీతహరిణిలా వణికిపోతున్న ఆమె వైపే చూస్తూ క్రూరంగా నవ్వుతూ ఆమె చేయి పట్టుకున్నాడు. రుక్మిణి వంటినిండా చెమటలు కారిపోతున్నాయి. నోరు ఎండిపోతోంది. రుక్మిణి ఒంటి నంతటనూ తన కళ్లతో తడిమేస్తూ నగ్నంగా తన ఎదుట నిలబడమని ఆదేశించాడు.


రుక్మిణి మానసిక సంఘర్షణ వర్ణనాతీతం.

భయంతో బిగుసుకుపోయిన రుక్మిణి స్పృహ కోల్పోయి అక్కడకక్కడే కిందకు వాలిపోయింది. తరువాత తనకేమైందో తెలియదు.


మరునాడు పనిమనిషి చెప్పింది. మీరు నీరసంగా ఉన్నమూలాన స్పృహ కోల్పోయారని, ఒకవారం రోజులు బలమైన ఆహారం పెట్టమని అయ్యగారు చెప్పారని. బ్రతుకు జీవుడా అనుకుంది రుక్మిణి.


తనను చూస్తూ దూర దూరంగా తప్పుకు తిరుగుతున్న పాపారావు ఇద్దరాడపిల్లలను దగ్గరకు పిలిపించుకుని నెమ్మదిగా మాటలు కలిపింది. ఎంతో అందంగా ఉన్న రుక్మిణి, మృదువుగా ఆప్యాయంగా వాళ్లతో మాట్లాడుతుంటుంటే ఆ అమ్మాయిలకు రుక్మిణి పట్ల మంచి అభిప్రాయమే కలిగింది. పాపారావు బంగళాలో ఉన్నంతసేపూ రుక్మిణి భీతహరిణిలా వణికి పోయేది. అతను బయటకు వెళ్లాడని తెలుసుకున్నపుడు మాత్రమే ఆమె హాయిగా ఊపిరి తీసుకునేది. ఒక్కోసారి చీకటి పడగానే కారు తీసుకుని సిటీకి వెళ్లిపోయి ఏ తెల్లనారు ఝామునో వచ్చేవాడు.


అతను పెట్టిన గడువు రేపటితో ముగుస్తుందనగా ఆ రోజు సాయంత్రం చీకటిపడుతుండగా కారు తీసుకుని సిటీకి బయలదేరి వెళ్లాడు పాపారావు. పనిమనిషి రుక్మిణి దగ్గరకు వచ్చి, రేపు మీ మొదటి రాత్రి అని, అయ్యగారు గదినంతా అందంగా అలంకరించమన్నారని చెప్పేసరికి రుక్మిణి చిగురుటాకులా కంపించిపోయింది.


ఆ రేపన్న రోజు రాకపోతే ఎంత బాగుండునని మనస్సులో పదే పదే అనుకుంటోంది. ఎలా ఈ విపత్కర పరిస్తితి నుండి బయటపడాలా అనే మానసిక సంఘర్షణతో వేదనకు గురౌతూ భయంతో నిద్రపట్టక కలత చెందుతోంది. ఎప్పటికో మూగన్నుగా నిద్ర పట్టింది.


ఆ తెల్లవారుఝామున బంగళా లో ఉన్నట్టుండి హడావుడి చోటుచేసుకుంది. పనివాళ్లు పరుగులు తీస్తున్నారు. ఎవరోవచ్చి రుక్మిణిని నిద్రలేపారు. అయ్యగారు తెల్లవారు ఝామున కారులో తిరిగి వస్తుండగా కారుని ఒక లారీ గుద్దేసిందని, అయ్యగారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయని.


ఎక్కడెక్కడి వాళ్లో వచ్చి పలకరించి పోతున్నారు. రుక్మిణి నాన్నా, సవితి తల్లి పరామర్శకు వచ్చారు. సవతి తల్లి వెళ్లిపోతున్నపుడు మొగుడు చచ్చాడని పుట్టింటికి వచ్చేస్తావేమో, నీ బ్రతుకంతా ఇక్కడే. వస్తే మెడపట్టి గెంటేస్తానని హుంకురించి మరీ చెప్పింది.

పాపారావు ఎంత చెడ్డవాడైనా తన ఇద్దరి ఆడపిల్లల పట్ల ప్రేమ చూపేవాడు. తండ్రి పోయిన దుఖంలోనున్న ఆ ఇద్దరాడపిల్లలను దగ్గరకు తీసుకుని ఊరడించింది రుక్మిణి. తన సవతి తల్లి తనను ఎంతగానో బాధ పెట్టేది. తాను అలా చేయదు. ఆ పిల్లలను తన కన్నపిల్లల్లా దగ్గరకు తీసుకుంటూ వారి దుఖాన్ని మరపింప చేసింది. దగ్గరే ఉంటూ వారి ఆలనాపాలనా ఎంతో శ్రధ్దగా గమనిస్తూ, వారిని బాగా చదివించింది. వారితోబాటూ తానుకూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ ఆ తరువాత బి.ఎడ్ పూర్తి చేసింది.


పెద్దమ్మాయి వైష్ణవి డిగ్రీ పూర్తి చేసి పీ.జీ కూడా పూర్తి చేసింది. చిన్నమ్మాయి వైదేహి కి డిగ్రీ అయిపోయింది. ఆ అమ్మాయి ఇంక పెద్ద చదువులు చదవలేనని చెప్పేసింది. . తెలుసున్న వారిద్వారా వైష్ణవీ, వైదేహిలకు పెళ్లి సంబంధాలు వెతికిస్తోంది. మంచి చదువు, సంస్కారం గల అబ్బాయిలతో వివాహం జరిపించాలని రుక్మిణి అనుకుంటోంది.

ఒకరోజు వైష్ణవి ఒక యువకుడుని వెంటపెట్టుకుని వచ్చింది. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు. ముఫ్పై రెండు సంవత్సరాల వయస్సు ఉండచ్చు.రుక్మిణి పనిమనిషి చేత పలహారాలు, కాఫీ పంపించింది. ఉన్నట్టుండీ వైష్ణవి రుక్మిణీ అంటూ పిలిచింది.


వయస్సులో తనకంటే మూడేళ్లు వ్యత్యాసం మాత్రమే ఉన్న రుక్మిణి ని మొదటనుండీ ఆమె తనకు ఒక సవితి తల్లి అన్న దృష్టితో చూడలేదు. తండ్రి రుక్మిణిని రెండో పెళ్లిచేసుకున్నపుడు తండ్రి చేసిన పనికి అసహ్యించుకుంది. కానీ తండ్రిని నిలదీసి అడగేటంత ధైర్యం లేదు. రుక్మిణిని చూడగానే ఇంత చిన్నమ్మాయా, నా కంటే మూడేళ్ల మాత్రమే పెద్ద, అటువంటి అమ్మాయనా తన తండ్రి వివాహం చేసుకున్నాడని బాధ పడింది. రుక్మిణిని ఒక అక్కగా, స్నేహితురాలిగా మాత్రమే చూసేవారు వైష్ణవి, వైదేహి.

వైష్ణవి పిలుపుకి రుక్మిణి వచ్చింది అక్కడకి.

“డిగ్రీలో మా ఫిజిక్స్ లెక్చరర్ సూర్యనారాయణ గారు. మేము సూర్యం సార్ అని పిలుస్తాం రుక్మిణీ” అంటూ పరిచయం చేసింది.

“అంతేకాదు, సూర్యం గారి చెల్లెలు లలిత నా స్నేహితురాలు. తనకి పెళ్లైపోయింది” అని చెపుతూ, “ఈవిడ మా రుక్మిణి సర్, మీకు చెప్తూ ఉంటాను..”గా అంటూ చెప్పగానే రుక్మిణి, సూర్యనారాయణ పరస్పర నమస్కారాలు చేసుకున్నారు.

“మీరు డిగ్రీ, బి.ఎడ్ కూడా చేసారుట. పీ.జీ కూడా చేసెయ్యం”డంటూ రుక్మిణికి సలహా ఇచ్చి కాసేపు ఏవేవో మాట్లాడి ఆ తరువాత వెళ్లిపోయాడు.


ఒక వారం రోజుల తరువాత వైష్ణవికి ఒక సంబంధం తెచ్చారు పెళ్లిళ్ల పేరయ్యగారు. అబ్బాయి హైద్రాబాద్ లో మంచి ఉద్యోగంలో ఉన్నాడని, మంచి కుటుంబం అని చెపుతూ వైష్ణవి ఫొటో ఆ అబ్బాయికీ అతని తల్లితండ్రులకూ బాగా నచ్చిందని, అన్నీ కుదిరాయని చెపుతూ మనం ఏ విషయమూ చెపితే వచ్చి మన అమ్మాయిని చూసుకుంటారుట అని చెప్పాడు.


వైష్ణవికి ఈ విషయాన్ని చెవిని వేస్తే, “నేను పెళ్లి ఒక షరతు మీద చేసుకుంటాను రుక్మిణీ. నేనూ చెల్లాయి పెళ్లి చేసుకుని మా దారి మేము చూసుకుని వెళ్లిపోతే నీవు ఒంటరిగా ఎలా ఉంటావు ? నా కంటే మూడేళ్ల మాత్రమే పెద్ద నీవు. జీవితంలో ఏ ఆనందాలు అనుభవించావు రుక్మిణీ ? జీవితాన్ని అంతా అనుభవించేసానన్నట్లుగా విరాగిణి గా మిగిలిపోతావా ?” అంది.

ఈలోగా వైదేహి వచ్చింది అక్కడకు. అక్కమాటలు వింటూ, “అవును. అక్క చెప్పింది కరెక్ట్. మా పెళ్లిళ్లు అయి వెళ్లిపోయాక నీ పరిస్తితి ఏమిటి రుక్మిణీ?” అనగానే రుక్మిణి కళ్లు కన్నీటితో నిండిపోయాయి. సొంత చెల్లెళ్లలాగా తనని ఎంతో అభిమానిస్తారు ఇద్దరూ. తనంటే ఎంత గౌరవం ఈ పిచ్చిపిల్లలకు అనుకోసాగింది.


వైష్ణవే మాటలు కొనసాగిస్తూ, “పెళ్లైన పదిరోజుల లోపే నాన్న పోయారు. అప్పటినుండి మా బాగోగులను చూస్తూ ఇలా ఉండిపోయావు. ఎంతో తెలివైనదానివి. ప్రైవేట్ గా చదివి చక్కని డిగ్రీలు పొందావు. అలాగే, నీవు పెళ్లి కూడా చేసుకోవాలి రుక్మిణీ. నీ పెళ్లి అయినాకనే మా ఇద్దరి పెళ్లిళ్లు” అనగానే రుక్మిణి తెల్లబోయిందో క్షణం.


“నాకు పెళ్లేమిటి వైష్ణవీ ? మీ ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని ఆనందంగా కాపురాలు చేసుకుంటుంటే చూడాలని ఆరాట పడుతున్నాను. ఒకానొకప్పుడు పెళ్లి మీద కలలు, ఆశలు ఉండేవి. నా పుట్టింట్లో నరకాన్ని చవిచూసిన నేను, నన్ను చేసుకోబోయే భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలని ఆశపడ్డాను. కానీ నన్ను వదిలించుకోవాలని మా పిన్నీ, నాన్న మీ నాన్నకి కట్టబెట్టారు. నన్ను చేసుకున్న మూలానే, మీ తండ్రిగారు మీకు దూరం అయ్యారేమోనన్న గిల్టీనెస్ కూడా ఉంది ఒక వైపం”టూ తలదించుకున్న రుక్మిణి వైపే చూస్తూ…


“మాకు తండ్రి అయినా ఆయనమీద అభిమానం ఏనాడో పోయింది రుక్మిణీ. కూతురి వయస్సున్న నిన్ను పెళ్లిచేసుకుని ఇంటికి తీసుకువచ్చిన క్షణానే నాన్న అంటే గౌరవం పోయింది. నీవు అలా ఎప్పటకీ అనుకోకు.


నిన్ను పెళ్లి చేసుకోడానికి మా సూర్యం సర్ రెడీగా ఉన్నారు. ఇన్నాళ్లూ ఆయన పెళ్లి చేసుకు పోవడానికి కారణాలు ఆయన కుటుంబ బాధ్యతలే. సడన్ గా ఆయన తండ్రిగారు చనిపోతే చెల్లెలిని తమ్ముడిని చదివించి ప్రయోజకులను చేసారు. లలిత ఆయన చెల్లెలు. రెండేళ్ల క్రితం చక్కని సంబంధం చూసి పెళ్లిచేసారు. ఒక అక్క కూడా ఉంది. ఆ అమ్మాయికి తండ్రి బ్రతికుండగానే పెళ్లిచేసారు. అక్క పురుళ్లూ, పుణ్యాలన్నీ దగ్గరుండీ బాధ్యతగా జరిపించారు. తమ్ముడికి చదువు పూర్తి అయింది. అసలు పెళ్లే చేసుకోను అని సూర్యం సర్ అంటే నేనూ, నా స్నేహితులం కొందరం ఆయన్ని మొత్తానికి ఒప్పించాం.


అఖరికి ఒప్పుకుంటూ తనను చేసుకోబోయే అమ్మాయి కష్టసుఖాలను అర్ధం చేసుకుంటూ తన కుటుంబంలో కలసిపోవాలని అన్నారు. నీ సంగతి అంతా చెప్పాను. నీవంటే ఎంతో గౌరవం కలిగింది సూర్యంగారికి. అందుకనే ఆరోజున సార్ ని నీకు పరిచయం చేసాను. నీవు సార్ కి బాగా నచ్చావని, రుక్మిణికి కూడా ఇష్టమైతే నాకు అభ్యంతరంలేదని, నిన్ను ఫోర్స్ చేయద్దన్నారు. మీరిద్దరూ ఒక సారి కలుసుకుని మనస్సులు విప్పి మాట్లాడుకుంటే బాగుంటుం’దనగానే రుక్మిణి మౌనంగా తల వంచుకుంది.

“నీ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నాను రుక్మిణీ” అంటూ వైష్ణవి రుక్మిణి బుగ్గలుమీద ముద్దు పెట్టుకుంది.


సూర్యం సర్ “పెళ్లి చాలా సింపుల్ గా రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటాం” అనేసరికి కొద్గి మంది స్నేహితులు, శ్రేయోభిలాషుల సన్నిధిలో వారి వివాహం జరిగిపోయింది. రుక్మిణీ సూర్యనారాయణల జంట చూడముచ్చటగా ఉంది అనిపించింది అందరికీ.

రుక్మిణి వైష్ణవినూ, వైదేహినూ దగ్గరకు తీసుకుని అభిమానంగా గుండెలకు హత్తుకుంది.

రుక్మిణీ సూర్యనారాయణ దంపతులు వైష్ణవీ, వైదేహిల పెళ్లి బాధ్యతలను తమ భుజాల మీద వేసుకుని చక్కని వరుళ్లతో వారిరువురి వివాహం జరిపించారు. అత్తవారింటికి వెడుతూ రుక్మిణిని కౌగలించుకుని ఆమె గుండెల్లో ఒదిగిపోయి ఏడుస్తున్న ఆ పిల్లలను దగ్హరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది.


రుక్మిణి చేత పి.జీ చదివించాడు సూర్యనారాయణ. ఆ తరువాత ఒక స్కూల్ ని స్తాపించి పిల్లలకు చక్కని విద్యాబోధనను అందేలా చేసారా దంపతులు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.




88 views0 comments

Comments


bottom of page