top of page

మారిన ఆనవాయితీ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Marina Anavayithee' Telugu Story Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

ఆరోజు ఆఫీస్ లంచ్ టైమ్ లో కీర్తన తో కలసి లంచ్ చేస్తున్న గ్రీష్మ సడన్ గా “నేనూ, రాజేష్ త్వరలో బ్రేక్ అప్ అయిపోతున్నామే!” అనగానే దగ్గరలో ఏదో బాంబు పేలినట్లుగా ఉలిక్కిపడిందో క్షణం కీర్తన..


“జోక్ కైనా అర్ధం ఉండాలే బాబూ, హడలిపోయాననుకో . అయినా ఇటువంటి జోకులేమిటే ఉన్నట్టుండి?” అంది.


“జోక్ కాదు నిజం.. మేమిద్దరం విడిపోతున్నాం.. వారం రోజుల క్రితం లాయర్ ని కలసి పరస్పర అంగీకారం తో డైవర్స్ కి అప్లై చేసాం.. సమస్య ఏమీ ఉండదని త్వరగానే డైవర్స్ రావచ్చని లాయర్ గారు చెప్పా”రంటూ చాలా కూల్ గా మాట్లాడుతున్న గ్రీష్మ వైపు స్తాణువై చూడసాగింది..


“అసలు రాజేష్ తో సంవత్సరం కాపురం ఎలా చేసానా అని ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.. రాజేష్ కూడా అదే విషయాన్ని నాతోనూ అన్నాడు..” అంది గ్రీష్మ.


“అదేమిటే? ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. రాజేష్ అంత మంచివాడు ఎవరూ ఉండరంటావు కదా?” అడిగింది కీర్తన.


“రాజేష్ ఇప్పటికీ మంచివాడనే అంటాను..”


“మరి ఇంతకీ ఏమిటీ మీ సమస్య గ్రీష్మా ? అయినా కూడా సంసారమన్నాక చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉంటాయా చెప్పు.. సర్దుబాటు చేసుకుంటూ పోవాలంటారు కదే..”


“అవన్నీ ఉపన్యాసాలకు, నీతులు చెప్పడానికే బాగుంటాయి కీర్తనా .. ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవవు.. మా నిర్ణయం అందరికీ ఆశ్చర్యకరంగానే ఉండచ్చు.. కానీ ఇదే మంచిదని మేమిరువురం అభిప్రాయపడ్డాం..అభిప్రాయ బేధాలొచ్చి సరిపెట్టుకోలేనప్పుడు ఆ బంధాన్ని అలాగే ఉంచుకుని రోషాన్నీ ద్వేషాన్నీ రగుల్చుకుంటూ నిత్యం రభస చేసుకుంటూ కీచులాడుకోవడం కన్నా ఇది మంచిదనుకున్నాం ఇద్దరమూనూ..” అంది గ్రీష్మ.

****

గ్రీష్మా రాజేష్ లిరువురిదీ ప్రేమ వివాహం.. రాజేష్ ఇంజనీరింగ్ రెండు సార్లు తప్పి మూడోసారి పూర్తిచేసాడు. చాలా తెలివిగలవాడు కానీ, స్నేహితులతో జులాయిలా సినిమాలూ, షికార్లంటూ తిరుగుతూ ఉండేవాడు.. మాడ్రన్ హెయిర్ స్టైల్, ట్రెండీ డ్రసెస్ లో సినీ హీరోలను తలపించేటట్లు కనపడేవాడు.. రెండుసార్లు తప్పినా కంప్యూటర్ ఇంజనీరింగ్ లో అతనికున్న లాజిక్, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రభావితమైన ఒక సంస్థ అతనికి ఉద్యోగమిచ్చింది.. ఉగ్యోగంలో బాగానే స్తిరపడి త్వరలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.


గ్రీష్మా రాజేష్ కుటుంబాల మధ్య కొంత బంధుత్వం కూడా ఉంది.. పెద్దగా రాకపోకలు లేకపోయినా బంధువుల ఇళ్లల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా ఇరు కుటుంబాలు హాజరవడంతో ఎవరు ఏమిటోనన్నది బాగా తెలుసు..


రాజేష్ తండ్రి మన్మధరావుకి ప్రకాశరావు కుటుంబం మీద సదభిప్రాయం లేదు.. ప్రకాశరావు అన్నదమ్ముల పిల్లలలో ఏ ఆడపిల్లా భర్తతో సవ్యంగా కాపురం చేయలేదు.. పెళ్లైన కొద్దికాలానికే ఏవో గొడవలు తగువులతో భర్తల నుండి తెగతెంపులు చేసేసుకుని పుట్టింట్లో స్తిరపడిపోయారు..


అలాగే ప్రకాశరావుకి మన్మధరావు కొడుకు రాజేష్ పట్ల సదభిప్రాయం లేదు.. ఎప్పుడూ పదిమంది స్నేహితులను వెంటపెట్టుకుని అల్లరి చిల్లరిగా తిరిగే రాజేష్ అంటే చాలా చులకన భావం ఆయనకు..


తన కూతురు జీనియస్.. ఇంజనీరింగ్ లో కాలేజ్ ఫస్ట్.. గ్రీష్మకి అమెరికా సంబంధాలెన్నో వస్తున్నాయి. కేంపస్ సెలక్షన్ లో రాజేష్ పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది.

అదే కంపెనీలో పనిచేస్తూ, ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ కనపడే రాజేష్ అంటే ఇష్టం కలిగింది గ్రీష్మకు . పైకి అల్లరిగా కనిపించే రాజేష్ పని విషయంలో అతని ఏకాగ్రతకు, నాలెడ్జెకు ఇంప్రెస్ అయ్యిది.. అలాగే అందంగా తెలివిగా ఉండే గ్రీష్మ పట్ల ఆకర్షితుడైనాడు రాజేష్.


రాజేష్ తను గ్రీష్మ ని ప్రేమించానని ఆమెను తప్ప మరెవరిని పెళ్లాడనని తండ్రితో చెప్పగానే ఆయన ఇంతెత్తున లేస్తూ ' ఆ ఇంటి ఆడపిల్లలు ఎవరూ భర్తలతో సవ్యంగా కాపురం చేయరురా రాజేష్, వద్దు ' అని గట్టిగా చెప్పినా వినలేదు..


నాన్నా, నేనూ రాజేష్ ఒకరినొకరం ఇష్టపడుతున్నాం, పెళ్లి చేసుకుంటామనగానే ' రాజేష్ లాంటి ఆవారా గాడు నీకు సరైనజోడీ కాదు. అమెరికా సంబంధం చేసుకో తల్లీ!’ అని చెప్పినా గ్రీష్మ వినలేదు.. రాజేష్ నే చేసుకుంటానంది.. అయితే ‘ఫో, నీవు నా కూతురివే కా’దంటూ ప్రకాశరావు గ్రీష్మ మీద మండిపడిపోయాడు.. గ్రీష్మ తో తెగగతెంపులు చేసుకున్నాడు..


ఎవరి అంగీకారం మాకు అవసరం లేదనుకుంటూ కొద్ది మంది మిత్రుల సమక్షంలో ఒక గుడిలో వివాహం చేసుకుని ఇద్దరూ ఒకటైనారు.. ఇరువైపు తల్లితండ్రుల పంతాలు, పట్టింపులు వారి వివాహం తరువాత మరింత రాజుకున్నాయి..

***

“మరి మీ అమ్మా నాన్నగారికీ చెప్పావా? వాళ్లేమన్నారు గ్రీష్మా?”

“హు, మా పెళ్లి ఏమైనా వాళ్లు దగ్గరుండి చేసారా ? మా బాగోగులేమైనా పట్టించుకున్నారా? మేము ఎలా ఏడ్చినా వాళ్లకు అవసరం లేనపుడు ఈ విషయం చెప్పినంత మాత్రాన ఉపయోగం ఏమిటి ? అయినా ప్రత్యేకంగా మేము చెప్పకుండానే వారికీ విషయం ఈ పాటికి చేరిపోయి ఉంటుంది కూడా..”


“మరి నీ ఫ్యూచర్ ప్లాన్ ?”


“ఏముందీ ? వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాను..”

గ్రీష్మ అన్నట్లుగానే వారిరువురూ విడిపోతున్నారనే వార్త వారి తల్లితండ్రులకు తెలిసిపోయింది.. ఆఘమేఘాలమీద పరుగెత్తుకుంటూ వచ్చేసారు..రాజేష్ తండ్రి అయితే ' నేను అపుడే చెప్పాను, విన్నావు కాదు, ఆ ఇంటి ఆడపిల్లలకు ఇది ఆనవాయితీ.. పోనీలే దరిద్రం వదిలింది.. ఏది జరిగినా మన మంచికే.. విడాకుల పత్రం అందుకున్న వెంటనే మరో వివాహం చేసుకుందువుగా’నంటూ కొడుకుని ఊరడించాడు..


“నేను చెప్పలేదూ, వాడో జులాయి వెధవని, నీలాంటి రత్నం విలువ ఆ పోకిరీ గాడికి ఏమి అర్ధం అవుతుందిలే? నయమే.. తొందరగానే కళ్లు తెరుచుకుని బయటపడ్డావు, విడాకులు అయిపోయినాక రెండో పెళ్లి వాడైనా అమెరికా సంబంధం చేస్తా’నని గ్రీష్మని ఓదార్చాడు ఆమె తండ్రి.


అక్కడ రాజేష్ తండ్రి, ఇక్కడ గ్రీష్మ తండ్రి.. ఇద్దరి మనసులు పిల్లల జీవితాలు నాశనం అయిపోయాయని బాధ పడలేదు. ఈ సంఘటనతో వాళ్లు ఊహించినట్లుగానే జరిగిందని కాస్తంత ఉపశమనం పొందాయి..


ప్రకాశరావు రెండో కూతురు ప్రతిమకు ఎప్పటినుండో సంబంధాలు చూస్తున్నాడాయన. గ్రీష్మ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన నాటినుండే ఆయనకు భయం పట్టుకుంది.. రెండో దానికైనా అమెరికా సంబంధం చేసేయాలని.. ఒక అమెరికా సంబంధం రావడం, ఆ అబ్బాయి తల్లితండ్రులకు ప్రతిమ నచ్చడం కూడా జరిగాయి..


ఆ అబ్బాయి ఒక నెలరోజుల్లో అమెరికా నుండి వస్తాడని, ప్రతిమ ఫొటో బాగా నచ్చిందని, వచ్చి చూసిన వెంటనే ఎంగేజ్ మెంట్, పెళ్లి కూడా చేసుకుని అమ్మాయిని తీసుకుని వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా చెప్పారు.. ఆ సందర్బంలో ఏవో మాటల్లో మీ పెద్దమ్మాయిని ఎవరికిచ్చారని అడిగారు..


మా పెద్దమ్మాయిది ప్రేమ వివాహమని ఫలానా వారబ్బాయిని చేసుకుందని చెప్పారు.. వాళ్లు ఈ విషయాన్ని పెద్దగా గుచ్చి గుచ్చి అడగకపోవడంతో చాలా సంస్కారవంతులని సంతోషపడ్డారు..


కానీ గ్రీష్మ భర్తనుండి విడాకులు తీసుకుంటోందని తెలిసి పుట్టింటికి తీసుకు వచ్చేయడంతో ప్రకాశరావు దంపతులకు గొంతుకలో పచ్చి వెలక్కాయ పడినట్లైంది..

ప్రతిమ పెళ్లి అయిపోయి అమెరికా వెళ్లిపోయాకైనా ఇలా జరిగింది కాదనుకున్నారు.. తన మాట వినకుండా గ్రీష్మ చేసిన పనికి ఆయన మనసు ఆవేశంతో రగిలిపోతోంది..

జీవితమనే ప్రయాణంలో అన్నీ అనుకున్నట్లు జరగవు. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? ఊహించని అవాంతరం ఒకరోజున ఉప్పెనలా రానే వచ్చింది.. అమెరికానుండి పెళ్లికొడుకు వస్తాడని ఎదురుచూస్తున్న వారికి ఒక ఉదయాన్నే వచ్చిన ఫోన్ కాల్ వారిని నిర్వీర్యులను చేసింది..


“మీ పెద్దమ్మాయి భర్తనుండి విడిపోయిందిట కదా.. అయినా మీ ఇంటి ఆడపిల్లలు సవ్యంగా మొగుళ్లతో కాపురాలు చేయరని తెలిసింది.. విడాకులు మీ ఇంటి ఆడపిల్లలకు ఆనవాయితీట కదా ? భగవంతుడు మా పక్షానే ఉన్నమూలాన మాకు ముందరే తెలిసి మునిగిపోకుండా జాగ్రత్త పడ్డాం.. మీకూ మీ సంబంధానికి దణ్ణం అండి బాబూ” అంటూ కూల్ గా చెప్పేసారు..


ప్రకాశరావు అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు.. ‘ఏమిటీ, విడాకుల మన ఇంటి ఆడపిల్లలకు ఆనవాయితీనా ? ఈ మాట వాళ్లకు మోసినదెవరో నాకు బాగా తెలుసు. నా కూతురు వివాహం చెడకొట్టి నా మీద పగ తీర్చుకోవడం కాదూ? వాళ్లను, వాళ్ల పరువును రోడ్డుమీదకీడుస్తా’నంటూ బయలదేరుతున్న తండ్రిని ఆపేసింది గ్రీష్మ..


“నాన్నా, ఇప్పుడు మీరెళ్లి దెబ్బలాడినంత మాత్రాన మన ప్రతిమను తిరిగి వాళ్లు చేసుకుంటారనా? వద్దు నాన్నా!” అంది.


“ఇది ఎవరు చేసారో తెలుసా నీకు ? నీ మాజీ మామగారు..వాళ్ల అంతు చూడందే వదలను..”


“నాన్నా ఎవరు చేసి ఉండచ్చో అని ఆలోచించి వాళ్లతో గొడవ పడినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా ? నలుగురి నోటిలో పడిపోవడం తప్పించి..

మన మంచితనం ఎదుటివారికి అర్ధమయ్యే రోజు కూడా వస్తుంది నాన్నా.. ఆవేశపడకండి.. మన ప్రతిమకి ఏమి తక్కువ.. ఇలా జరగడం మన మంచికేమో కూడా” అంటూ తండ్రిని శాంతపరిచింది..


మూడు వారాల తరువాత ఒకరోజు ప్రొద్దుటే ప్రకాశరావు కి ఫోన్ వచ్చింది.. మీ సంబంధం వద్దండి బాబూ అన్నవాళ్ల దగ్గరనుండే..


“సారీ ప్రకాశరావుగారూ, మేము మీ సంబంధం వద్దన్నామని పరిస్థితి ఇదీ అని చెప్పేసరికి మా అబ్బాయి చాలా బాధ పడ్డాడు.. ‘పెద్దమ్మాయికి అలా జరిగినంత మాత్రాన పాపం ప్రతిమ ఏమి చేసిందని, వాళ్లను అనవసరంగా బాధపెట్టారని, అనుకున్న టైమ్ కి ఇండియా వచ్చి మీ ప్రతిమను చూసి ఎంగేజ్ మెంట్ చేసుకుంటా’నంటున్నాడు.. మీకు సమ్మతమైతే.. సాయంత్రం తిరిగి ఫోన్ చేస్తా’నని “ఆలోచించుకుని చెప్ప’మంటూ పెళ్లికొడుకు తండ్రి ఫోన్ పెట్టేసాడు..


ప్రకాశరావుకి చాలా కోపం వచ్చేసింది.. ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నాడా ఆ పెద్దమనిషి ? ఆరోజున అలా మాట్లాడి ఇప్పుడు మళ్లీ కాళ్లబేరానికి రావడం ఏమిటని..

అక్కడే ఉన్న గ్రీష్మ “ నాన్నా ఆయనే చెప్పారుగా కారణం కూడా ' . తప్పు గ్రహించుకున్నారేమో, ఒప్పుకోండి నాన్నా.. ఆ అబ్బాయి సంస్కారం ఎంత గొప్పదో అర్ఘం చేసుకోండి.. అతను ముందు మన ప్రతిమను చూడనీయండి, ఆ తరువాత నిర్ణయించుకుందా”మని ఆయన్ని శాంతపరిచింది..


అనుకున్నట్లు గానే అమెరికా నుండి పెళ్లి కొడుకు కార్తీక్, అతని తల్లి తండ్రులు వచ్చారు కారులో వీరింటికి..


అతనితోబాటూ దిగుతున్న రాజేష్ ను చూస్తూ అందరూ విస్తుపోయారు.. ప్రకాశరావు అయితే మళ్లీ పెళ్లి చెడగొట్టమని ఆ తండ్రి పంపించలేదు కదా అన్నట్లుగా కోపంతో ఊగిపోతూ బలవంతాన నిగ్రహించుకుంటున్నాడు..


పరస్పర పరిచయాలు తరువాత కార్తీక్ చెప్పాడు వాళ్లకు.. ‘రాజేష్ తన బెస్ట్ ఫ్రెండ్’ అని.. ‘ఇంటర్, ఇంజనీరింగ్ కలిసే చదువుకున్నామని.. ఈ మధ్యనే రాజేష్ వైఫ్ చెల్లెలే ప్రతిమన్న విషయం తెలిసిం’దని చెప్పాడు..


‘ఏమిటీ ఇంకా వైఫ్ అంటున్నాడు.. రాజేష్, గ్రీష్మా విషయం తెలిసే కదా ముందర వద్దని ఖరాఖండీగా చెప్పార’నుకుంటూ ప్రకాశరావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు..


అక్కడే నిలబడి వాళ్లకు మర్యాదలు చూస్తున్న గ్రీష్మ అప్పుడప్పుడు ఓరగా రాజేష్ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వడం ప్రకాశరావు దృష్టిని దాటిపోలేదు..


ప్రతిమ కార్తీక్ కు చాలా నచ్చింది.. ఇద్దరికీ కాస్త స్వేఛ్చగా మాట్లాడుకోడానికి అవకాశమిచ్చి అందరూ లోపలకు వచ్చేసారు..


రాజేష్ కూడా లోపలకు వస్తూ, “మీరంతా ఒక్క క్షణం కూర్చుని నా మాటలు వినండి ప్లీజ్” అనడంతో అందరూ కూర్చున్నా ప్రకాశరావు కోపంగా లోపలకు వెళ్లబోతున్నాడు..


“మామయ్యగారూ! మీరే ఉండాలిక్కడ” అనేసరికి గ్రీష్మ కూడా “అవును నాన్నా! ఒక్క అయిదు నిమిషాలు నాకోసం” అనగానే ఆయన కోపంగా కుర్చీలో కూర్చుండిపోయారు..


“మేము విడిపోవాలనుకుని డైవర్స్ కి అప్లై చేసిన మాట నిజమే.. వాస్తవానికి మా మధ్య తలెత్తిన వివాదాలు చాలా సిల్లీవి.. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్ధంలో పెట్టి చూసుకుంటూ గొడవలు పడేవాళ్లం.. ఇద్గరికీ ఇగో ప్రాబ్లమే.. తను ఎందుకు నాకు సారీ చెప్పకూడదని నేను, నేను తనకు సారీ చెప్పాలని తనూ అనుకునేవాళ్లం.. మాకు మంచి చెడూ చెప్పే పెద్దవాళ్లు మాతో లేనిమూలాన ఆ ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసేసుకున్నాం.. విడిపోవడం ఒక్కటే పరిష్కారం అనుకుని డైవర్స్ కి అప్లై చేసాం..

తరువాత నేను మా ఇంటికి, గ్రీష్మ ఇక్కడకు వచ్చేసాకా అమెరికాలో నా ఫ్రెండ్ కార్తీక్ కు జరిగిన విషయం చెపితే ఇద్దరినీ కౌన్సిలింగ్ కు వెళ్లమని సలహా ఇచ్చాడు..

గ్రీష్మ ఒప్పుకుంది.. కౌన్సిలింగ్ తో మాకు జ్ఞానోదయం అయి భార్యాభర్తల బాంధవ్యం అంటే అర్దమేమిటో తెలిసివచ్చింది..


ఇదే విషయం కార్తీక్ కు చెపుతూ ‘నీ సలహాకి ధాంక్స్ రా’ అంటే ‘ఇండియా వస్తున్నాను అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోడానికి.. అప్పుడు కలుస్తానురా’ అన్నాడు.


‘ఎవరూ ఆ అమ్మా’యని వివరాలు అడిగితే కార్తీక్ మాటల్లో ఆ అమ్మాయి ప్రతిమ అని తెలిసింది.. ‘నా భార్య గ్రీష్మ చెల్లెలే ప్రతిమ’ని చెపితే వాడూ ఆశ్చర్యపోయాడు.. అందుకే కార్తీక్ అమ్మా నాన్నగారికి ‘ప్రతిమనే చేసుకుంటానని, వస్తున్నానని’ మీతో చెప్పమన్నాడు..” చెప్పాడు రాజేష్ .


ఈలోగా కార్తీక్ అక్కడకు వస్తూ “అంకుల్! ఒకానొకప్పుడు రాజేష్ అల్లరిచిల్లరిగా తిరిగేవాడు..వయస్సు ప్రభావం అంతే.. కానీ చాలా జీనియస్.. ఎంత జీనియస్ కాకపోతే అతని సీనియర్స్ కు కూడా రాని అవకాశాన్ని మనవాడు కొట్టేసాడు” అనగానే గ్రీష్మ కూడా “అవును నాన్నా, రాజేష్ ను రెండు సంవత్సరాలు ప్రాజక్ట్ పనిమీద అమెరికా పంపుతున్నారు, అతనికి ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ గా నేను కూడా వెడుతున్నాను.. మీకు చెప్పకుండా రాజేష్ తో కలసి కౌన్సిలింగ్ క్లాసెస్ కి వెళ్లేదాన్ని.. అప్పుడే తెలిసింది, మేము చేసిన పొరపాట్లు ఏమిటో, వాటిని విడాకుల వరకు ఎందుకు లాగేమోనని.. ఆవేశంలో చాలా తొందరపడ్డాం.. మా తప్పు మేము తెలుసుకుని ఒకటౌదామనుకుని నిర్ణయించుకున్నాం..అన్ని విషయాలూ కార్తీక్ ప్రతిమను చూసుకోడానికి వచ్చినపుడు చెపుదామని, అందరినీ సర్ ప్రైజ్ చేయాలనుకున్నాను” అని చెప్పింది..


ప్రకాశరావుకి రాజేష్ పట్ల ఉన్న తేలిక భావం మబ్బులా వీడిపోయింది.. రాజేష్ ను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు..ప్రతిమ కార్తీక్ ల పెళ్లి శుభవార్త , గ్రీష్మ రాజేష్ ల కలయిక ఆ ఇంటి ఆనవాయితీని పూర్తిగా మార్చివేసింది..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం



87 views1 comment
bottom of page