top of page

సంకల్పం


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Samkalpam' Telugu Story Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

తండ్రికి కొడుకుల్లేని లోటును తీర్చింది శ్రీవల్లి.

అక్క కోసం తన పెళ్లిని సైతం వాయిదా వేసుకుంది.

కుటుంబానికి అండగా నిలిచిన ఒక అమ్మాయి కథను చక్కగా మలిచారు ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాంఅప్పుడే ఆ ఇంటి ముందు స్కూటీ నుండి దిగిన శ్రీవల్లి చేతిలో కేరీ బాగ్ పట్టుకుని మెల్లిగా గేట్ తెరుచుకుని లోపలకు అడుగు పెట్టింది.. రాజమండ్రి.. గోదావరికి అతి సమీపంలో ఆ ఇల్లు ఉన్నమూలాన చల్లని గాలి తెమ్మరలు శరీరానికి తాకుతూ మనసుకి ఆహ్లాదాన్నిస్తున్నాయి..


ఒక చేత్తో గాలికి ఎగురుతున్న జుట్టును పైకి సవరించుకుంటూ, ముందుకి పడిన పొడవైన ఒత్తైన జడను వెనక్కి వేసుకుంటూ, మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేసరికి గేట్ తీసిన శబ్దానికి ఆ ఇంటి యజమానురాలు సావిత్రమ్మగారు మెయిన్ డోర్ తెరిచారు.. ఎదురుగా శ్రీవల్లి..

' నమస్కారం ఆంటీ, బాగున్నారా' అని పలకరించేసరికి,

‘నీవామ్మా, ఎవరో అనుకున్నా’నంటూ లోపలకు రమ్మనమని పిలిచిందావిడ..

“మీరిచ్చిన బ్లౌజులు కుట్టడం అయిపోయింది ఆంటీ, ఇచ్చి వెడదామని వచ్చాన’నేసరికి “ఇన్నాళ్లకు నా బ్లౌజులు కరక్టెగా సూట్ అవుతున్నాయి నీ దయవల్ల , మంచి టైలరమ్మ దొరికింది నాకు, ఉండు వల్లీ డబ్బులు తెచ్చిస్తా”నని లోపలకు వెళ్లబోతూ ......


“ఆ ...... ఎప్పటికప్పుడు చెపుదామనుకుంటూ మరచిపోతున్నాను వల్లీ .. మా డోర్ కర్టెనులన్నీ పాతబడిపోయాయి.. మా అబ్బాయి వచ్చినప్పుడల్లా వాటిని మార్చవా అమ్మా, నా చిన్నప్పుడెప్పుడో కుట్టించావంటూ దెప్పుతాడు.. వాడికి ఇల్లు నీట్ గా ఉండాలి.. ఎలాగైనా ఈసారి వాటిని మార్చేసి కొత్త కర్టెన్లు వేసి వాడిని సర్ ప్రైజ్ చేయాలి.. వచ్చేవారం ఒక పదిరోజులు శెలవు మీద వస్తున్నాడు.. లైట్ కలర్స్ వి డీసెంట్ గా ఉంటే ఇష్టం వాడికి.. కాస్త నీవే ఆ క్లాత్ ఏమిటో సెలక్ట్ చేసి ఆ టైమ్ కి కర్టెన్లు కుట్టి ఇవ్వగలవా ?”


“అయ్యో ఆంటీ అంతగా అడగాలా, తప్పకుండా కుట్టి ఇస్తాను, నాదగ్గర కొత్త కొత్త మాడల్స్ ఎన్నో ఉన్నా”యంటూ చొరవగా తలుపులకు, కిటికీలకు మెజర్ మెంట్స్ తీసుకుంటుండగా సావిత్రమ్మగారు లోపలకు వెళ్లి “ఇవి కర్టెన్లకు, ఇవి నీవు కుట్టిన జాకట్లకు” అంటూ డబ్బులిస్తూ, “ఎక్కువ పడినా ఫరవాలేదు శ్రీవల్లీ , మంచి క్లాత్ తీసుకోమ్మా” అనగానే,

“సరే ఆంటీ.. తప్పకుండా” అంటూ శెలవు తీసుకుని వెళ్లిపోతున్న శ్రీ వల్లి నే చూస్తూ ‘ఎంత చక్కగా పొందికగా ఉందీ అమ్మాయి, చామనచాయ లో ఉన్నా ఆ కళ్లూ, ముక్కూ ఎంత బాగున్నాయో.. గడ్డం కింద పెసరబద్దంత ఆ పుట్టుమచ్చ ఆ అమ్మాయి ముఖానికి మరింత అందం తెచ్చింది కదా’ అనుకుంది.. మెరూన్ కలర్ పోచంపల్లి పంజాబీ డ్రస్ లో పొడవైన జడతో జాజి పూవులా సన్నగా పొడుగ్గా భలే ఉందనుకుందావిడ..


సావిత్రీ, రంగారావు దంపతులకు ఒక్కడే కొడుకు.. ఆ అబ్బాయి మోహనకృష్ణ.. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.. రంగారావుగారు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు..

దారిలో కర్టెన్ క్లాత్ కొనేసి ఇంట్లోకి అడుగుపెట్టింది శ్రీవల్లి ..


“అమ్మా మహంకాళీ అమ్మవారు వచ్చిందే” అంటూ చెల్లెలు శ్రీధరి అనడం శ్రీవల్లి చెవిని పడింది..

‘అవును మహంకాళీనే’ అనుకుంటూ లోపలకు రాగానే శ్రీధరి ఎదురొచ్చింది. ప్లేట్ నిండా బజ్జీలు పెట్టుకుని కర కరా లాగిస్తూ శ్రీవల్లి వైపు ఓరగా చూసింది..


“అమ్మా! ఇలా వేళా పాళా లేకుండా ఈ బజ్దీలు ఏమిటి ? ప్రతీరోజూ మూకుడు నిండా నూనె పోసేసి ఏవో పిండివంటలు చేసి దీన్ని మేపేస్తున్నావు.. ఇది ఏమి కష్టపడిపోతోందని ? అమ్మా తల్లీ పొదుపు చేయవమ్మా అంటే వినవు కదా ? ఇలా రోజూ ఆరారా టిఫిన్ లూ పిండి వంటలూనూ.. చిన్నదే పాపం ' ధరి కి' ఈ కూర ఇష్టం ఉండదు, ఆ పప్పు ఇష్టం ఉండదంటూ ప్రత్యేకంగా చేస్తావు రెండు మూడు వంటకాలు.. ఇంట్లో నీవు ఏది వండితే అదే అందరూ తినాలని చెప్పానా లేదా? ఈరోజు పేపర్ లో ఉక్రైన్ రష్యా యుధ్ద పరిణామం మన దేశ ఆర్ధిక వ్యవస్తపై బాగా ప్రభావితం అవుతుందని చదివాను.. వంటనూనె, గ్యాస్ ధరలు భగ భగ మంటాయిట.. ఆల్ రెడీ వంట నూనె కిలో కి ఇరవై తొమ్మిది రూపాయలు పెంచేసారు.. అలాగే పాల పేకెట్లు.. రేపటినుండి ఒక పాల పేకట్ తగ్గించేస్తున్నాను.. ఇలా అయితే అక్క పెళ్లి, 'ధరి' చదువు ఎలా అవుతాయమ్మా..

నాన్నారి ఒక్క సంపాదనతో ఇవన్నీ సాధ్యమా అమ్మా, అందుకనే దుబారా ఖర్చులు తగ్గించమనేది” అనగానే శ్రీవల్లి అక్క శ్రీలక్ష్మి వచ్చిందక్కడకు..

“ఏమిటే వల్లూ, వస్తూ వస్తూనే ఉపన్యాసాలు దంచేస్తున్నావ్ ?”

“కాదా అక్కా నీవు చెప్పు మరి . పనిమనిషిని పెట్టుకుంటే బోల్డంత ఇవ్వాలని నీవు ఇంటి పనంతా చేస్తున్నావా లేదా ? ఇస్త్రీకి చాకలికి ఇస్తే చాలా డబ్బులౌతాయని బట్టలన్నింటినీ అలా నిలబడి ఇస్త్రీ చేస్తావు.. 'ధరి' కి ఏమీ అర్ధం కాదు.. చూసిందల్లా కొనేసుకోవాలి, అన్నం సరిగా తినదు, చిరుతిళ్లు కావాలి రాణీగారికి..”


“అక్కా, అంతా నీ రాజ్యం లాగనే ఉందిక్కడ. నాన్నారికి సరిగా మేనేజ్ చేయడం రాదంటూ, జీతం రాగానే తీసేసుకుని అంతా నీవే ఖర్చుపెడుతున్నావు.. పైసా పైసాకి లెక్కలడుగుతావు.. టైలరింగ్ వర్క్ అంటూ రాత్రీ పగలూ ఆ కుట్టు మిషన్ మీదే ఉంటావు.. నీ సంపాదన అంతా ఏమి చేస్తున్నట్లో ? అసలు నీవు కుట్టేవాటికి పైసలిస్తారా ఎవరైనా ?” శ్రీవల్లి ని ఆటపట్టించింది శ్రీధరి..


“ఓహో బి. కామ్ చదువుతున్న ఈ రాణీ గారికి లెక్కల వివరాలు కావాలన్న మాట..”

“లేదులే చిన్నక్కా, సరదాగా అన్నాను.. నీవు ఏది చెప్పినా నా కోసమే కదా” అంటూ గారంగా శ్రీవల్లి మెడచుట్టూ చేతులేస్తూ బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది..


ముకుందరావు గారు వేదవతి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.. శ్రీలక్ష్మి, శ్రీవల్లి, శ్రీధరి.. రాజమండ్రీ పేపర్ మిల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు.. కేవలం తాత ముత్తాతలనుండి సంక్రమించిన ఒక చిన్న డాబా ఇల్లు తప్ప ఏ ఆస్తిపాస్తులూ లేవాయనకు.. పెద్దమ్మాయి శ్రీలక్ష్మి, చాలా నెమ్మదిగా అణుకువగా ఉంటుంది.. ఇంటర్ తరువాత కాలేజ్ లో చదవనండీ నాన్నారూ, ప్రైవేట్ గా డిగ్రీ కడతాననేసరికి ఆయన సరేనన్నారు.. ప్రైవేట్ గా బి..కామ్ చదివి పాసైంది.. ఇంటి పనంతా చేస్తూ తల్లికి చేదోడువాగోడుగా ఉంటుంది.. ఆ అమ్మాయికి రాని పని వంటా అంటూ ఏమీలేవు.. చూడడానికి ఒక మోస్తరుగా ఉండే శ్రీలక్ష్మి కి రెండు సంవత్సరాలనుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఏ సంబంధమూ కుదరడంలేదు.. రెండోది శ్రీవల్లి.. వల్లూ అంటూ ముద్దుగా పిలుచుకునే శ్రీవల్లి చాలా తెలివైనది.. కేవలం ఉద్యోగాల ద్వారానేనా సంపాదించడం అనుకుంటూ ఆ అమ్మాయి కూడా ఇంటర్ తో చదువు ముగించి, టైలరింగ్ లో పది నెలల కోర్సు పూర్తి చేసి రక రకాల ఫాషన్స్ తో బ్లౌజ్ లు , డ్రసెలు కుట్టడం ప్రారంభించింది. శ్రీలక్ష్మి కూడా హెమ్మింగ్ వర్క్ లాంటివి చేస్తూ శ్రీవల్లి కి సహాయపడుతూ ఉంటుంది.. మహా పొదుపరి.. నాన్నా మీకు మానేజ్ చేయడం రాదంటు ఇంటి మానేజ్ మంటే తనే చూసుకుంటూ ఆదాయాన్ని, ఖర్చులనూ చాలా చక్కగా బేలన్స్ చేస్తూ, ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా చూస్తుంది..


టైలరింగ్ వర్క్ ద్వారా ఎంత లేదన్నా నెలకు ముఫైవేలు పైనే సంపాదిస్తుంది.. కానీ ఆమె ఎంత సంపాదిస్తుందో అన్నది ఇంట్లో నిగూఢ రహస్యం.. తండ్రికి శ్రీవల్లి అంటే వల్లమాలిన అభిమానం.. కొడుకు లేడే అన్న దిగులును వల్లూ ద్వారా తీర్చుకుంటాడు.. ఎల్లనేళలా తండ్రి వైపు నుండి ఆలోచించే వల్లూ కి ఎదురుగా అక్క పెళ్లి, చెల్లెలు 'ధరి' చదువు మాత్రమే కనపడతాయి.. టైలరింగ్ ద్వారా వచ్చిన డబ్బుని చిట్లు కడుతూ,వడ్డీలకు తిప్పుతూ, అనేక పొదుపు పధకాలలో డబ్బు దాస్తుంది.. పండుగ సీజన్లలో , పెళ్లిళ్లప్పుడు చాలా ఇన్ కమ్ వస్తే మరికొంత డబ్బు వేసి అక్కకి, చెల్లెలికి, తనకి బంగారు గొలుసులూ, చెవులకు బుట్టలూ కొంది.. ఆ గొలుసూ, బుట్టలూ పెట్టుకుని 'ధరి' ఒకటే మురిసిపోయింది.. బంగారం ధర తగ్గినపుడల్లా, కాస్త కాస్త బంగారం కొని అలా పెట్టేస్తుంది..మూడో అమ్మాయి శ్రీధరి.. ఇంట్లో ఆ అమ్మాయి అల్లరికి కోరికలకూ తాళం వేయగలిగే శక్తి ఒక్క వల్లూ కే ఉంది.. కాలేజ్ లో బి..కామ్ చదువుతోంది.. వల్లూ అక్క అంటే భయంతోపాటూ గౌరవం కూడాను.. శ్రీధరి కి పి..జి చేసి బేంక్ జాబ్ చేయాలన్న ఆకాంక్ష..

' సావిత్రి ఆంటీ లేరాండీ ' ? అన్న మాటలకు ఏదో పుస్తకం సీరియస్ గా చదువుతున్న మోహన్ తల ఎత్తి చూసాడు.. ఒక అమ్మాయి బేగ్ పట్టుకుని ఎదురుగా నిలబడేసరికి తడబడుతూ ' అమ్మ గుడికి వెళ్లింది, మీరెవ’రంటూ ప్రశ్నించాడు.


అమ్మ అంటున్నాడు..ఆరోజు సావిత్రి ఆంటీ తనతో అన్నట్లు గుర్తు.. మా అబ్బాయి వైజాగ్ నుండి వస్తాడని.. ఇతనే కాబోలనుకుంటూండగా, ' నేను వారి అబ్బాయినే, ఫరవాలేదు చెప్పం’డంటూ ఆమె వైపే చూస్తూ అన్నాడు.

“ఏమీ లేదండీ, ఆంటీ కర్టెన్లు కుట్టమని చెప్పారు.. అవి అయిపోయాయి, ఇటువైపు ఏదో పనిమీద వస్తూ ఇవి ఆంటీకి ఇచ్చేస్తే మంచిది కదా అని వచ్చాను.. “

‘ఫరవాలేదు, ఏవీ చూపించండి’ అనగానే ' అమ్మో ఇతను ఏమీ వంకలు పెట్టడు కదా' అనుకుంటూ బేగ్ తెరిచి వాటన్నటినీ అతని ముందు పెట్టి చూపించింది..

“కలర్ చాలా బాగుందండీ” అంటూ, మీరేమీ అనుకోపోతే నాకు హెల్ప్ చేయగలరా?

అమ్మ వచ్చేలోపల మనం మొత్తం ఇంటి స్వరూపం మార్చివేయాలి.. అమ్మ ఆశ్చర్యపోవాల”నగానే సరేనంటూ తలూపింది..


గబ గబా తలుపులకు, కిటికీలకు ఉన్న కర్టెన్లు విప్పుతుంటుంటే శ్రీవల్లి అతనికి సహాయం చేస్తోంది.. ఎంతో చాక చక్యంగా నీట్ గా పాతవి స్తానంలో కర్టెన్ రాడ్స్ కి కొత్తవి తొడిగేస్తున్నాడు..


మధ్య మధ్యలో ‘వావ్, బ్యూటిఫుల్’ అంటున్నాడు..


పని పూర్తైంది.. కొత్త కర్టెన్లు చాలా చక్కగా అమిరి పోయాయి.. గాలికి కొత్త కరెటెన్లు రెప రెపలాడుతుంటే చూడ ముచ్చటగా ఉంది.. మెయిన్ హాల్ డోర్ కర్టెన్ కు కుట్టిన అందమైన మువ్వలు లయబధ్దంగా ఊగుతుంటుంటే ఆ సంధ్యాసమయంలో ఆ శబ్దం వీనుల విందుగా ఉంది..


“ఇంక నేను వెళ్లి వస్తానండీ, ఆంటీ తో చెప్పండి, రెండురోజుల్లో వచ్చి కలుస్తానని..”


“ధాంక్సండీ, ఇంతకీ మీపేరు? అమ్మకి చెప్పాలి కదా అందుకని అడుగుతున్నాను.. ఎవరో అమ్మాయి వచ్చి ఇచ్చిందని చెప్పాలి”

అతని గొంతుకలో కొంత కొంటెతనం ఇమిడి ఉండడంతో శ్రీవల్లి తడబడుతూ “శ్రీవల్లి వచ్చిందని చెప్పండి చాలు.. “

“ నా పేరు మోహన్, మోహనకృష్ణ” అని చెప్పగానే, “ఉంటానండీ” అంటూ గిర్రున వెనుతిరుగుతూండగా పొడవైన ఆమె జడ ఆమె వీపుమీద నాగుపావులా నాట్యం చేసింది.. ఆ జడను ఒక్కసారి స్పృశించాలన్న అతని చిలిపి కోరికకు సిగ్గుపడ్డాడో క్షణం..


“అమ్మా ! పెళ్లిసంబంధాలు రెడీగా ఉన్నాయి, చూసుకోడానికి రమ్మనమని నీవు నాన్నగారు పదే పదే చెపితే వచ్చాను.. నేను ఏ సంబంధమూ చూడను.. నాకు శ్రీవల్లి చాలా నచ్చేసింది.. ఆ అమ్మాయి తల్లితండ్రులతో మాట్లాడండి” అనగానే సావిత్రమ్మగారు ఆశ్చర్యపోయారు..


“అవునా మోహన్ , నిజమేనా?”

“ నిజమేనమ్మా.. మీరు ఆ అమ్మాయి పెద్ద వాళ్లతో మాటలాడండి.. తరువాత నేను శ్రీవల్లితో మాటలాడతాను..”


రెండురోజుల తరువాత వస్తానన్న శ్రీవల్లి కోసం ఎక్కడకూ వెళ్లకుండా గుమ్మంలోనే కాపుకాసాడు..


అయిదు రోజుల తరువాత వచ్చిన శ్రీవల్లి కర్టెన్లు తాలూకా బిల్ ను సావిత్రమ్మగారికి అందచేసి ఆమెకు రావలసిన డబ్బులు తీసుకుని వెళ్లిపౌయింది.. ఎదురుగా కనిపిస్తున్న మోహన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు..


అంతకు రెండు రోజుల ముందు సావిత్రమ్మగారూ, ఆమె భర్త రంగారావుగారూ శ్రీవల్లి ఇంటికి వెళ్లడం, శ్రీవల్లిని తమ ఇంటికోడలుగా చేసుకుంటామని, ఏ విషయమూ తెలియచేయమని చెప్పి వచ్చారు..


వాళ్లు ఇంకా ఏమీ చెప్పలేదు.. అందుకే సావిత్రమ్మగారు కూడా శ్రీవల్లి వచ్చినపుడు ఆ విషయం ఎత్తలేదు..


నిజానికి మోహన్ తల్లితండ్రులు వచ్చి శ్రీవల్లిని తమ ఇంటికోడలుగా చేసుకుంటామనేసరికి 'వల్లూ' తల్లితండ్రులు చాలా సంతోషించారు.. వల్లూ అదృష్టానికి పొంగి పోయారు.. కానీ పెద్దదానికి పెళ్లి సంబంధం కుదరడంలేదు.. వల్లూ కి వచ్చిన మంచి అవకాశాన్ని వదులు కోవడమూ ఇష్టం లేదు.. శ్రీలక్ష్మి కి పెళ్లి ఎప్పుడు కుదురుతుందో ? అంతవరకూ వాళ్లను ఆగమనడం సమంజసమా ?


ఇంట్లో జరుగుతున్న మాటలు, సంఘర్షణలను అర్ధం చేసుకోలేని అమాయకురాలు కాదు శ్రీవల్లి.. అక్కకు పెళ్లికాకుండా తను చేసేసుకుని వెళ్లిపోవడం స్వార్ధం కాదా ? పాపం అక్క, ఎంత మంచిది.. ఆరోజు రాత్రి అక్కాతను మంచంమీద పడుకుని ఏవో కబుర్లు చెప్పుకుంటుండగా హఠాత్తుగా అక్క ' ఏమే వల్లూ, నీకు చక్కని సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కదా' ? చేసేసుకోవచ్చు కదే అంటే నాకిప్పుడే చేసుకోవాలని లేదక్కా అంటూ టాపిక్ మార్చేసింది..


ఆ మర్నాడు సాయంత్రం శ్రీవల్లి సూపర్ మార్కెట్ కి వెడితే మోహన్ అక్కడ తారసపడి శ్రీవల్లిని పలకరించాడు.. మీతో మాట్లాడాలి, మీ స్కూటీమీద గోదావరి ఒడ్డుకి వెడదామా, ప్లీజ్ అనగానే, తనుకూడా తన మనసులోని విషయాన్ని చెప్పాలనుకుని సరేనంటూ అంగీకరించింది..


ఊ.... చెప్పండి శ్రీవల్లీ, నేనంటే మీకు ఇష్టమేనా ? మీ పేరెంట్స్ నుండి ఏ సమాధానం లేదని అమ్మా నాన్నగారు అనుకుంటున్నారు.. మీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదా ?

నేను నా పెళ్లి విషయం ఇంకా ఏమీ ఆలోచించలేదండీ.. ఎందుకంటే మా అక్క శ్రీలక్ష్మి కి ఇంకా పెళ్లికాలేదు..

మీరు మా అక్కని ఎందుకు చేసుకోకూడదూ ? తను చాలా మంచిది, డిగ్రీ చదివింది.. అన్ని పనులూ వచ్చు.. మీరు తనని చూస్తే వద్దనరు కూడా..

నేను మిమ్మలని అడుగుతుంటుంటే మీరు మీ అక్కని నాకు ప్రొపోజ్ చేస్తున్నారేమిటండీ? ఫక్కున నవ్వాడు మోహన్.. అతని నవ్విన శబ్దానికి గోదావరి అలలు ఒక్క క్షణం పరుగులు ఆపి, ఓహో ప్రేమికుల మాటలు వినడమేమిటని తిరిగి పరుగులు సాగించాయి..

నాకు నచ్చింది మీరు.. ఒక వేళ మీ కంటే మీ అక్క అందంగా ఉన్నా కూడా నేను మిమ్మలనే ఇష్టపడతాను..


మా అక్కకు పెళ్లికాకుండా నేను చేసేసుకోవడం స్వార్ధం అవుతుంది..

మీ బాధ అదా ?

మీ అక్కకు సంబంధం కుదిరి పెళ్లి అయ్యేవరకు ఆగుదాం.. ఆ తరువాత చేసుకోడానికి ఏమైనా అభ్యంతరమా ?

ఒకవేళ అక్కకు ఇంకా లేట్ అయితే ?

ఎంత అమాయకురాలివి శ్రీవల్లీ.. నీమీద ఎంతో ఇష్టాన్ని పెట్టుకున్నాను.. నిన్ను ప్రేమిస్తున్నాను మనసా వాచా.. అటువంటిది నీకోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడగలనని చెపుతున్నాను.. ప్రామిస్..


ఒకవేళ అక్కకు కుదరక పోతే మీరు మరో అమ్మాయిని చేసేసుకోండి మోహన్ గారూ, నాకోసం ఎదురుచూడద్దంటూ తలవంచుకుని మాట్లాడుతున్న శ్రీవల్లి ముగ్ధత్వం అతన్నెంతో ఆకర్షించింది..


మీ అక్కకు కుదురుతుందండీ, బెట్.. మీ అక్క పెళ్లిపీటలు ఎక్కాకనే మనం పెళ్లిపీటలు ఎక్కుదాం, అంతే ఇంక మాటలాడకండి శ్రీవల్లీ అంటున్న అతని మాటలకి సిగ్గుతో ఆమె బుగ్గలు అరుణిమ దాల్చాయి.. ఆమెనే తదేకంగా చూస్తున్న మోహన్, ' అందమైన నీపొడవైన జడను స్పృశించాలనే నా కోరిక త్వరగా తీరితేబాగుండును శ్రీవల్లీ అని మనసులో అనుకోబోయిన ఆ మాటలు బయటకు వచ్చేసరికి నాలుక కొరుక్కోబోతున్నలో........


ఆ...... ఏంటున్నారు మోహన్ గారూ, ఈ అలల శబ్దంలో మీ మాటలు సరిగా వినపడలేదు.

ఏమీలేదు శ్రీవల్లీ ..

గోదావరి అలల శబ్దం ఎంత బాగుందో అంటున్నాను.. అవునండీ నిజంగా బ్యూటిఫుల్ సీన్ కదూ !


ఇంక వెడదామా అనగానే తలూపింది.. ఇద్దరూ తిరుగుముఖం పట్టారు..

ఆరునెలల కాలం ముందుకు సాగిపోయింది.. ఒకరోజు ముకుందరావుగారి భార్య వేదవతి పెద్దమ్మ కొడుకు పనిమీద రాజమండ్రీ వచ్చి వీరింటికి చూద్దామని వచ్చాడు.. ఆయన కాకినాడలో ఉంటారు.. వేదవతితో ' చెల్లాయ్ నేను మీ ఇంటికి రావడానికి ఒక కారణం ఉందమ్మా', మీ పెద్దమ్మాయి శ్రీలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది.. వ్యవసాయ కుటుంబం.. పదెకరాల మాగాణి పొలం , రెండెకరాల కొబ్బరి తోటా ఉన్నాయి. ఆ అబ్బాయి చదువు ఇంటర్ తో ఆగిపోయింది.. తల్లి హఠాత్తుగా చననిపోవడంతో ఆ అబ్బాయి చదవలేనని తండ్రి వ్యవసాయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.. చెఱుకుపల్లి గ్రామం వారిది.. ఇక్కడకు పది కిలోమీటర్ల దూరం ఇల్లూ వాకిలీ, గొడ్డూ గోదా కలిగిన కుటుంబం.. అబ్బాయి తమ్ముడొకడికి డిగ్రీ పూర్తి అయింది.. ఎమ్ బి ఏ చదవాలనుకుంటున్నట్లు, రెండోవాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కి తయారవుతున్నాడుట.. అబ్బాయి యోగ్యుడు, బాగుంటాడు.. మీ వదినకు చాలా దగ్గర బంధువులు.. ఎందుకో మీ వదిన ఈ మధ్య నాతో అంది.. మన వేద పెద్ద కూతురికి మా రంగశాయి, అదే పెళ్లికొడుకు ఈడూజోడూగా ఉంటాడు కదండీ అంటూ.. ఎలాగూ రాజమండ్రి రావాలికదా, నిన్ను కలసి చెప్పాలని వచ్చానే వేదవతీ .. ఈ సంబంధం మీకూ, శ్రీలక్ష్మి కీ నచ్చితే చెప్పు.. ఒక మంచిరోజు చూసుకుని నేను బావగారు చెఱుకుపల్లి వెళ్లి మాట్లాడి వస్తామని చెప్పి వెళ్లిపోయాడాయన..


ముకుందరావు గారికి వేదవతికి ఈ సంబంధం చాలా నచ్చింది.. శ్రీలక్ష్మి ని పిలిచి చూడు తల్లీ బాగా ఆలోచించుకుని చెప్పు.. మేము బలవంతం చేయం.. పల్లెటూరు, వ్యవసాయమా అనుకోకు.. ఒకవేళ ఉద్యోగస్తుడే కావాలనుకున్నా చూస్తాం.. దేనికి సంశయించకమ్మా అంటూ నిర్ణయాన్ని ఆమె మీదే వదిలేసారు..


' అక్కా ఏమాలోచిస్తున్నావంటూ అంటూ శ్రీవల్లి అడిగింది' ..

ఆ పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబంలో నేను ఇమడగలనా అన్న భయం కలుగుతోంది..

సర్దుకుపోగలిగే గుణం ఉంటే అడవిలో కూడా బ్రతికేయచ్చు.. అందరూ ఉద్యోగమే చేయాలని లేదక్కా.. ఎవరి వృత్తిలో వారు రాణింవచ్చు.. అయినా రంగశాయి గారు చదువబ్బక చదువు మానేయలేదుట.. టెన్త్ క్లాస్ లో ఆయన చదివిన స్కూల్ కి ఫస్ట్ వచ్చారుట.. తొంభై శాతం మార్కులతో పాస్ అయ్యారుట.. ఇంటర్ ఎమ్. పి. సి గ్రూప్ లోనూ ఎనభై అయిదు శాతం మార్కులొచ్చాయిట.. తల్లి ఆకస్మిక మరణం ఆయనని నిరుత్సాహ పరిచి ఉండచ్చు.. తండ్రిని ఒంటరిగా వదిలేసి సిటీలో ఉంటూ పెద్ద పెద్ద చదువులు చదివేసి పెద్ద ఉద్యోగం తెచ్చేసుకుని ఆయన సెటిల్ అయిపోతే చాలా ? అది స్వార్ధం కాదా ? చదువులు, హోదాలొక్కటే జీవితం కాదక్కా.. అంతకుమించిన మానవత్వానికి కూడా విలువనివ్వాలి..


సరే వల్లూ, ఇంత చెపుతున్నావు, నీవే నా పరిస్తితిలో ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటావు ?

నేనా ? ఆ మోహన్ గారు నా వెంటపడకపోయి ఉంటే, నాకే ఇటువంటి సంబంధం వచ్చి ఉంటే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటాను.. నేను కూడా మా రైతు శ్రీవారితో కలసి పొలాల్లో పనిచేస్తూ, సమయం దొరికినప్పుడల్లా ఆ పొలాల గట్లు వెంబడి పరుగెడుతూ డ్యూయట్లు పాడుకుంటూ..........


'వల్లూ' మాటలకు శ్రీలక్ష్మి ఫక్కున నవ్వేస్తూ, 'నీవేమైనా చేయగలవే రాక్షసీ' అంటూ చెల్లెలి నెత్తిమీద ముద్దుగా మొట్టింది..


అక్కా నీవూ చేయగలవు.. దృఢ సంకల్పం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు.. నీకు చదువుమీద అంత ఇష్టం ఉంటే నీ పెళ్లైనాకా రంగశాయిగారి చేత ప్రైవేటుగా డిగ్రీ, ఆ తరువాత పి..జి కూడా చదివేలా ప్రోత్సహించు.. అయినా ఇది నీ పెళ్లి, నీ నిర్ణయం నన్ను మధ్యలోకి లాగకు తల్లీ అంటూ అక్కకు బ్రైన్ వాష్ చేసి తెలివిగా అక్కడనుండి తప్పుకుంది..


శ్రీలక్ష్మి ఇష్టపడడంతో, ఇరువైపుల పెద్దలు కలసి మాట్లాడుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు.. రంగశాయికి శ్రీలక్ష్మి చాలా నచ్చేసింది..

ఇద్దరి కూతుళ్లకూ నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు..


ఒక నెలరోజులలో ఇద్దరి కూతుళ్లకూ ఒకే రోజున మహూర్తాలు కలసి వచ్చాయి.. శ్రీలక్ష్మికి ఉదయం ఆరుగంటల ముఫై రెండు నిమిషాలకు సుముహూర్తం నిశ్చయమైతే, శ్రీవల్లికి రాత్రి ఏడూ నలభై అయిదుకి సుముహూర్తం నిశ్చయ మైంది..

ఒక రోజు పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు వివరాలను నోట్ బుక్ లో వ్రాసుకుంటున్న తండ్రి దగ్గరకు వచ్చింది శ్రీవల్లి .. ' నాన్నారూ, ఇది నేను టైలరింగ్ చేసి సంపాదించిన డబ్బు' .. నేను ఒక్కదాన్నీ కష్టపడలేదు.. ఇందులో మన అందరి సమిష్టత, సహకారం ఉన్నాయి.. ఇంటి ఖర్చుల విషయంలో పిసినారిగా వ్యవహరించి మిమ్మలందరినీ బాధ పెట్టి ఉంటాను కదూ?


శ్రీవల్లి మాటలకు అక్కడే ఉన్న శ్రీధరి అవునౌను నిజం కదా నాన్నారూ అనగానే ముకుందరావుగారు ఫక్కున నవ్వుతూ ' లేదురా వల్లూ, నిన్ను కూతురిగా ఎప్పుడూ అనుకోలేదు నేను' .. నీ సమర్ధత చూసి పొంగిపోతాను.. నీవల్ల ఎవరం బాధపడలేదమ్మా..

అయితే నాన్నారూ, నేను కూడపెట్టిన డబ్బుతో అయిదు తులాల బంగారం అదివరకెప్పుడో కొని పెట్టేసాను, అలాగే రెండు కేజీల వెండి బిస్కట్ కూడా కొని ఉంచాను.. అక్క పెళ్లికి పనికొస్తుందని.. అయిదు లక్షలకు ఒక చిట్ వేసాను.. ఇరవై అయిదు నెలలకు ప్రతీ నెల ఇరవై వేలు కడుతూ.. నాకు టైలరింగ్ మీద నెలకు ముఫైవేలు పైనే వచ్చేది సంపాదన.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో అయితే ఏభైవేలు పైనే వచ్చేది.. పాపం అక్క, అమ్మా కూడా నాకు చాలా సాయం చేసారు.. చిట్ ఈ నెలతో అయిపోతుంది.. అలాగే అమ్మ పేరున వేసిన రెండులక్షల ఎఫ్..డీ రెండు నెలల్లో మెట్యూర్ అవుతుంది.. కాస్త లాస్ అయినా తీసేద్దాం.. రేపే మనం చిట్ ఫండ్ కంపెనీకి వెళ్లి అవసరమైన సంతకాలు చేసేస్తే ఆ డబ్బు మన అకౌంట్ కి డిపాజిట్ చేసేస్తారు.. పెళ్లి పనులకు అవసరం అవుతాయి కదాండీ..


వద్దమ్మా, ఆ డబ్బు నీదే.. నేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక రెండువందల గజాల స్తలం కొన్నాను.. మంచి బేరం వచ్చింది, అమ్మేస్తాను..

నాన్నారూ, నాదీ నీదీ ఏమిటండీ ? నన్ను మీ అబ్బాయిగా భావిస్తున్నానని పదే పదే అంటారు కదా ? మళ్లీ ఈ వివక్షత ఏమిటీ ?


వద్దండీ, అది అలాగే ఉంచేయండి.. మీరు పి..ఎఫ్ లోన్ కూడా అప్లై చేసానన్నారు కదా, సరిపోతుందండీ.. అక్కకి నాకు పెళ్లి పట్టు చీరలు కూడా కొని పెట్టేసాను..

పెళ్లి మన తాహతుకి మించి చేయద్దు.. పెట్టుపోతలంటూ భారీగా పెట్టుకోకండి.. అలాగే భోజనాల దగ్గర వేస్టేజ్ లేకుండా చూడండి..

అమ్మా వల్లీ, ఇక్కడ కూడా నీ పొదుపు పధకాలేనా ? నీ పెళ్లికైనా నాకు కడుపునిండా భోజనం పెడతావా లేక మాడ్చేస్తావా అంటున్న శ్రీధరి మాటలకు అందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు..


పెళ్లి పీటల మీద కూర్చున్న మోహన్, తన పక్కనే అంటుకుపోతూ కూర్చున్న శ్రీవల్లితో నెమ్మదిగా ' ఆరోజు నీకు చెప్పానా లేదా ? మీ అక్క పెళ్లి పీటలెక్కాకనే మన పెళ్లంటే నమ్మలేదు కదూ, నాకు భలే డౌట్ మాస్టర్ దొరికిందనగానే సిగ్గుగా నవ్వుతూ తలొంచుకుంది..


అత్తవారింటికి బయలదేరుతున్న శ్రీలక్ష్మి శ్రీ వల్లిని గదిలోకి పిలిచి తలుపు వేసేసింది..

కొత్త పెళ్లికూతుళ్లుగా అక్కచెల్లెళ్లిరువురూ బంగారు బొమ్మల్లా మెరిసి పోతున్నారు.. ఇద్దరి ముఖాలలోనూ పట్టలేని ఆనందం..


' వల్లూ ఇదంతా నీ ప్రోత్సాహం, ధైర్యమేనే' ! ఆరోజు నీమాటల ప్రభావం నాకు ఎంతో స్పూర్తినిచ్చింది . ఆ ధైర్యమే నా జీవితానికి ఒక అందమైన మలుపునిచ్చింది..

' ధాంక్సే వల్లూ ' అంటూ చెల్లెలిని ప్రేమగా కౌగలించుకుంది..

నీ సంకల్పం నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానక్కా అంటూ అభిమానంగా అక్క బుగ్గలమీద ముద్దుపెట్టుకుంది శ్రీవల్లి..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


108 views0 comments
bottom of page