top of page

మమతానురాగాలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Mamathanuragalu' Telugu Story Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

వృద్ధాప్యంలో ఓర్పుతో ఉండటం అవసరం.

ఆ ఓర్పు, ఎదుటివారిలో మార్పు తీసుకుని వస్తుందని తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం


బెంగుళూర్ నుండి బస్ లో హైదరాబాద్ కు ఆయన చిన్న కొడుకు ఇంటికి వచ్చారు సుదర్శనరావుగారు..

“రండి నాన్నగారూ, ప్రయాణం బాగా జరిగిందా ? బస్ లో అన్ని గంటలు కూర్చోడం కష్టం, ఫ్లైట్ లో రండన్నా బస్ లోనే వస్తారు.. అంతకీ నేను అడిగాను కూడా, ఫ్లైట్ కి టికెట్ బుక్ చేయమంటారా అని” కాస్తంత నిష్టూరం నిండిన స్వరంతో మాట్లాడుతున్న చిన్న కొడుకు కల్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ, “ఒరేయ్! విమాన ప్రయాణం తక్కువైనా, అక్కడ మీ అన్నయ్య ఇంటి నుండి ఎయిర్ పోర్ట్ కు వెళ్లడం, ఇక్కడ ఎయిర్ పోర్ట్ నుండి మీ ఇంటికి రావడం, ఈ ట్రాఫిక్ జామ్ లకు తట్టుకోలేక నాకు ఇదే సుఖంగా ఉంటుందిరా.. అక్కడ బస్ లో రాత్రి ఎక్కి పడుకుంటే ఇక్కడ ఉదయాన్నే దిగుతాను.. పైగా బస్ స్టాప్ మీ ఇంటికి దగ్గర కూడానూ” అంటూ బేగ్ లో నుండి బ్రష్, టవల్ తీసుకుని బాత్ రూమ్ లోకి వెళ్లిపోయారాయన..


ఆయన బాత్ రూమ్ నుండి వచ్చేసరికి చిన్నకోడలు అపర్ణ పొగలుకక్కుతున్న కాఫీ కప్పు ఆయన చేతికి అందిస్తూ, “బాగున్నారా మామయ్యగారూ, తరచుగా ఫోన్ లో మాట్లాడుకుంటున్నా, ఫేస్ టైమ్ లో మిమ్మలని చూస్తున్నా, ఇలా దగ్గరనుండి చూస్తుంటే ఆనందంగా ఉంది.. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాం.. మీ అబ్బాయి లాగానే నేనూ మాట్లాడుతున్నానని అనుకోకండి..కానీ, అటూ ఇటూ తిరిగే బదులు ఇక్కడే హాయిగా ఉండిపోవచ్చు కదా మామయ్యా” అంటూ అభిమానంగా మాట్లాడుతున్నకోడలి వైపు ప్రేమగా చూసారు..


ఇంతలో ఎనిమిదో క్లాస్ చదువుతున్న మనవడు సాకేత్, అయిదో క్లాస్ చదువుతున్న మనవరాలు సాక్షి స్కూల్ కి తయారౌవుతూ హడావుడిగా వస్తూ “తాతయ్యా ఎలా ఉన్నారూ, సాయంత్రం స్కూల్ నుండి రాగానే బోల్డు సంగతలు చెప్పాలి మీకు” అంటూ అంతే హడావుడిగా లోపలకు వెళ్లిపోయారు..


సుదర్శనరావు గార్కి ఇద్గరు కొడుకులు.. పెద్దవాడు కృష్ణకాంత్ బెంగుళూర్ లో సీమన్స్ కంపెనీ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.. అతని భార్య రేవతి.. ఆంధ్రా వాళ్లే అయినా రేవతి తల్లితండ్రులు ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడిన మూలాన రేవతి బాల్యం, చదువూ అక్కడే పూర్తి అయ్యాయి.. కృష్ణకాంత్ ది, రేవతిది ప్రేమ వివాహం.. పెళ్లికి ముందు డెలాయిట్ కంపెనీ లో పనిచేసేది.. వాళ్లకు ఇద్గరూ మొగపిల్లలే రోహిత్, రోషన్ .. పిల్లలు పుట్టాక వాళ్ల సంరక్షణనూ, ఇంటినీ బేలన్స్ చేసుకోవడం కష్టం అయిపోయి ఉద్యోగం మానేసింది..


సుదర్శనరావుగారు వైజాగ్ లో ట్రజరీ ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయినారు.. ఆయన రిటైర్ మెంట్ లోపునే ఇద్దరు కొడుకులు చదువులు, ఉద్యోగాలలో స్థిరపడడం, తరువాత వారి పెళ్లిళ్లు పూర్తి అయినాయి.. భార్యపోయి అయిదు సంవత్సరాల కాలం పూర్తి అయింది.. భార్య బ్రతికి ఉండగా ఇద్దరూ వైజాగ్ లో ఆయన సొంత ఇంట్లోనే ఉండేవారు.. అప్పుడప్పుడు కొడుకుల దగ్గరకు వచ్చి వారం పదిరోజులుండి వెళ్లిపోయేవారు.. భార్య పోవడంతో పిల్లలు ఒంటరిగా ఉండద్దని అనేసరికి వైజాగ్ లో ఉన్న ఇల్లు అమ్మేసి కొడుకులదగ్గరకు వచ్చేసారు..

“మామయ్యగారూ, నాకు స్కూల్ కి టైమైంది, లీవ్ పెడదామనుకున్నాను. కానీ స్కూల్ లో పరీక్షలు జరుగుతున్నాయి.. తొందరగా వచ్చేస్తాను.. టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్, వంట అవీ చేసేసి రెడీగా సర్ది ఉంచేసాను.. అన్నీ చూసుకుని తినండి మామయ్యా..”


“సరే నమ్మా, నాకేమేనా కొత్తా ఏమిటీ ? నీవెళ్లిరా.. నా కోసం మీ విధులను మానుకోనవసరంలేదు..”


“రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు.. హాయిగా స్నానం చేసి కాసేపు పడుకోండి, సాయంత్రం మాట్లాడుకుందాం” అంటూ అపర్ణ వెళ్లిపోయింది.. కొడుకు, మనవడు మనవరాలు కూడా వెళ్లిపోయారు.. అపర్ణ ఇంటి దగ్గరలోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తోంది..


చిన్న కొడుకు, కోడలి దగ్గర గడపడం ఆయనకు పండగలా ఉంటుంది..

జీవితం అంటేనే కష్టసుఖాల కలయిక.. సర్దుబాటు తప్పనిసరి.. తన వాళ్లు, తన కుటుంబం కావాలనుకుంటే తన చుట్టూ ఉన్నవారితో సర్దుబాటు చేసుకుంటూ పోవాలి..

అపర్ణ ఇంట్లో ఉన్నంత సేపూ గల గల మాట్లాడుతూనే ఉంటుంది.. ‘మామయ్యగారూ, మందులు వేసుకున్నారా’, ‘ఈరోజు పేపర్ న్యూస్ ఏమిటీ’, ‘లేత వంకాయలున్నాయి, కూర ఎలా చేయమంటారు’, ‘తోటకూర పులుసు ఆవపెట్టి చేయమంటారా లేక పప్పు చేయనా’, ‘ఈ కూర ఎలా చేస్తే బాగుంటుందో కాస్త చెప్పరూ’, ఇలా ఒక్కటి కాదు, అనేక విషయాలు మాట్లాడుతూ, సలహాలు అడుగుతూ తనని ఒక్క క్షణం ఖాళీగా ఉంచదు..


శనివారం గుడికి తీసుకెడుతుంది.. “మామయ్యగారూ, మీరైతే కూరగాయలు బాగా సెలక్ట్ చేస్తా”రంటూ రైతు బజారు కి తీసుకెడుతుంది.. మామగారికి ఇష్టమైనట్లుగా ఆయన సలహాలు తీసుకుంటూ వంట చేస్తుంది..

సుదర్శనరావుగారు ఒక విశిష్టమైన వ్యక్తి..

ప్రతీవారిలో ఏవో బలహీనతలు ఉంటాయని వాటిని తేలికగా తీసుకోవాలని తలబోసే వ్యక్తి..


ఇద్దరు కొడుకులు రెండు కళ్లతో సమానం ఆయనకు.. అందుకనే కొడుకులు ఎవరూ నిర్దేశించకపోయినా ఇద్గరి దగ్గరా ఆరేసి నెలలు ఖచ్చితంగా గడపి వెడతారు..

ఒకరిమీదే తన బాధ్యతను మోపి వారి స్వేఛ్చకు అంతరాయం కలిగించ కూడదనుకుంటారు.. అందుకనే ఆరునెలల చొప్పున విభజించుకున్నారు..


పెద్దకోడలు రేవతి అహంభావి.. తనకు తోచినట్లు చేస్తుంది. రిజర్వ్ డ్ నేచర్.. చెడ్డది కాదు.. కానీ బాధ్యతను మొక్కబడిగా చేస్తుంది తప్ప అందులో ఆప్యానుతారాగాలు ఉండవు.. మామగారితో ఎప్పుడైనా ఒకటీ అరా మాట్లాడుతుంది అదీ అవసరం అనుకుంటే..ఒక్కోరోజు అసలు మాటలే ఉండవు.. ఆయన అవసరం తనకి ఏమీ లేదని భావిస్తుంది..


ఆమె పెరిగిన వాతావరణం అలవాటులు అటువంటివి.. మామగారు, తన భర్తకు తండ్రి అంతే.. అంతకు మించి ఎక్కువ కన్ సర్న్ చూపదు.. ఉద్యోగం చేయకపోయినా మామగారికి దగ్గరుండి భోజనం వడ్డించడం కానీ, ఏమి కావాలని అడగడం కానీ చేయదు.. అన్నీ టేబుల్ పైన పెట్టేస్తే ఆయనే పెట్టుకుని తింటారు.. ఆ కూర బాగుందా అనికానీ , మరికాస్త వడ్డించుకోండని కానీ అడగదు.. తనకి ఇష్టమైన రీతిలో ఏదో చేయాలి కదా అని మొక్కుబడిగా చేసేస్తుంది.. బయట హొటల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లకు అలవాటు పడిన ఆమె ఎక్కువ హొటల్ ఫుడ్ ఆన్ లైన్ లో ఆర్డరిచ్చేస్తుంది..పిల్లలు కూడా బయట ఫుడ్ అంటేనే ఇష్టపడతారు..


ఒకసారి కృష్ణకాంత్ భోజనం చేస్తూ ' నాన్నగారికి ఈ వంకాయ కూర ఇలా చేస్తే ఇష్టం ఉండదు', ఈ పప్పు ఏమిటి, ఇంత చప్పగా ఉంది ? నీకు చేయడం రాకపోతే నాన్నగారిని అడిగి చేయకపోయావా? నాన్నగారికి వంట చేయడం బాగావచ్చని అనడం తను విన్నాడు..


కోడలు ఏమి జవాబు చెపుతుందో వినాలన్న ఆసక్తి కూడా ఆయనకు లేదు.. ఆయన వ్యాపకాలు ఆయనవి.. పుస్తకాలే ఆయన ప్రపంచం, నేస్తాలు.. ఇంట్లో తనని పలకరించే వాళ్లు లేకపోయినా, నిశ్శబ్దం రాజ్యమేలుతున్నా, ఏనాడూ మీ అన్నయ్య ఇంట్లో నా పరిస్తితి ఇదంటూ చిన్న కొడుకు దగ్గర వెళ్లబోసుకోలేదు..


అపర్ణ దగ్గరకూడా రేవతి గురించి మంచిగా చెపుతాడేకానీ రేవతి వ్యక్తిత్వాన్ని కించపరచడం అదీ చేయరాయన..

అలాగే అపర్ణ చూపించిన ప్రేమానురాగాలను అదేపనిగా పెద్దకోడలు దగ్గర పొగడడం లాంటివి కూడా చేయడు..

అదీ ఆయన గొప్పతనం..


అపర్ణ స్కూల్ నుండి తొందరగా వచ్చేసింది.. ఏమిటి విశేషాలు మామయ్యా అంటూ పదే పదే అడిగి తెలుసుకుంది..


బెంగుళూర్ లో పెద్దకొడుకు దగ్గర ఉండగా కాలం అసలు గడవనే గడవదు.. కానీ ఇక్కడ కాలానికి రెక్కలు వచ్చేసినట్లుగా అప్పుడే రోజు గడచిపోయిందా, అప్పుడే వీక్ ఎండ్ వచ్చేసిందా అనుకుంటూ అబ్బురపడతాయన..


అందుకనే చిన్న కొడుకు కోడలు దగ్గర ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఆయనకు.. మనసులో ఎంతో కాలంగా బంధించేసిన మాటలన్నీ ఉప్పెనలా ముందుకు దూసుకు వచ్చేస్తాయి .. ఆ వయసులోనున్న ఎవరికైనాగానీ మాటలకు మించిన దివ్య ఔషధం మరేమీ లేదు..

అపర్ణ ఒక రోజు శెలవు పెట్టి మామగారికి అన్ని వైద్య పరిక్షలూ చేయించింది.. అన్నీ నార్మల్ గా ఉన్నాయని తెలిసి ఆనంద పడింది..

సుదర్శనరావుగారి ప్రయాణం ఇంకో రెండురోజుల్లోకి వచ్చేసింది.. అప్పుడే ఆరునెలలు ఎంత వేగంగా ముగిసాయో కదా అనుకుంటారాయన..


అదేమిటి నాన్నగారూ, ఇంకా కొంత కాలం ఉండచ్చుకదా అంటూ కల్యాణ్ ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు.. అన్నయ్యతో మాట్లాడతానన్నాడు..

' లేదురా కల్యాణ్, అన్నయ్య ఏదో అనుకుంటాడని కాదు' .. నేనే వెళ్లాలని అనుకుంటున్నాను.. అయినా ఇక్కడకు బెంగుళూర్ ఎంత దూరమని ? రావాలనుకున్నపుడు వచ్చేస్తాను.. ఓపిక ఉంది కదా.. ఓపిక లేనపుడు ఆ భగవత్నిర్ణయానికి ఎలాగూ కట్టుబడక తప్పదు..


“మామయ్యా నా స్కూల్ హడావుడిలో మిమ్మలని సరిగా చూసుకోలేకపోతున్నానేమో కదూ? అందుకనే వెళ్లిపోతున్నారా” అంటూ బేలగా తనవైపే చూస్తూ మాట్లాడుతున్న అపర్ణ మంచితనానిని ఆయన మనసు అర్ధ్రమైంది..

“లేదమ్మా, ఆరునెలలు ఎంతలో గడుస్తాయి' ? అయినా వచ్చే సంక్రాంతి పండుగకి కృష్ణ మిమ్మలని బెంగుళూర్ కి రమ్మనమని చెపుతానన్నాడు.. అందరూ రం”డంటూ ఆయన వారినుండి వీడ్కోలు తీసుకుని బెంగుళూర్ వచ్చేసారు..


కృష్ణకాంత్ ని ట్రైనింగ్ నిమిత్తమై రెండునెలలు కంపెనీ జర్మనీ కి పంపించింది..

రేవతికి నాలుగురోజుల నుండి సాయంత్రం అయ్యేసరికి స్వల్పంగా టెంపరేచర్ వస్తోంది..తలనొప్పి, చలితో ముడుచుకుపోతోంది..

నీరసంతో చేసుకోలేక ఒక వంట మనిషిని పెట్టింది..


రేవతి తల్లితండ్రులు బెంగుళూర్ లోనే ఉంటారు.. వారికి రేవతి కాక మరో అమ్మాయికి ఉంది.. పెళ్లి అయి భర్తతో సింగపూర్ లో ఉంటోంది.. ఆ అమ్మాయి రెండో డెలివరీకని రేవతి తల్లీ తండ్రీ సింగపూర్ వెళ్లారు..

రేవతికి టెంపరేచర్ తగ్గడం లేదు.. ఏవో నార్మల్ మందులు వేసుకుంటోంది నీరసించిపోతోంది.. లేవలేకపోతున్న కోడల్ని చూస్తూ సుదర్శనరావుగారు గట్టిగా మందలిస్తూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.. బ్లడ్ టెస్టులూ అవీ చేసి రక్తంలో హెమోగ్లోబిన్ లెవెల్ బాగా తక్కువగా ఉందని, ఇది ఒకరమైన ఎనీమియా అని చెప్పారు.. భయపడనవసరంలేదని ఐరన్ డెఫిషన్సీ అని రెగ్యులర్ గా మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందని చెపుతూ మరో నెలతరువాత రెవ్యూకి రమ్మనమని చెప్పారు..


రేవతి పెట్టిన వంటమనిషి రెండురోజులు వచ్చి ఇంక రావడం మానేసింది.. అయినా ఆవిడ చేసే వంటలకు రుచీపచీ ఉండడం లేదు.. రేవతికి ఆలోచించే సత్తువలేక నిస్త్రారణగా మంచమీద వాలిపోయింది..


' అమ్మా రేవతీ, లేస్తావా ? భోజనం చేద్దువుగాని ' అని మామగారు పిలిచేసరికి ఉలిక్కిపడుతూ లేచి కూర్చుంది..

నీరసంగా ఉంది.. అయినా లేచి నెమ్మదిగా నడుస్తూ డైనింగ్ టేబిల్ దగ్గరకు వచ్చి కుర్చీలో నీరసంగా కూర్చుండిపోయింది..


ఆమె ఎదురుగా ప్లేట్ పెట్టి వేడి వేడి అన్నం వడ్డించారు.. తోటకూర పోపుకూర చేసారు.. అన్నంలో కూర కలుపుకోగానే నెయ్యి వేసారు.. కమ్మని కూర .. నోటికి ఎంతో రుచిగా ఉంది.. ఇది బీరకాయ పచ్చడి, బాగుంటుంది నోటికంటూ వడ్డించారు.. పచ్చడి ఎంత బాగుంది ? ఎప్పుడూ తను తిని ఎరుగదు ఇటువంటి కూర, పచ్చడి.. ఆకలి విజృంభిస్తోంది ఆ వంటకాలకు.. ఆ తరువాత వేడి వేడి మిరియాల ఘాటుతో టమాటా చారు వేసారు.. ఇంకాస్త కూర తినమ్మా, ఒంటికి మంచిదంటూ కొసరి కొసరి వడ్డిస్తూ తినిపించారు..


మనవలిద్దరూ తాతగారి వంట రుచి చూసి యమ్మీ గా ఉన్నాయి తాతా, మేమూ హెల్ప్ చేస్తాం నీకంటూ తాతగారికి అన్నీ అందివ్వడంలాంటి పనులు చేయడం మొదలు పెట్టారు.. ' యూ ఆర్ గ్రేట్ తాతా అంటే ' ఇలా అందరూ కలసిమెలిసి పనిచేసుకుంటే ఏదీ కష్టం కాదంటూ చెప్పారు..


ఒక పదిరోజులు రేవతిని కదలనీయలేదు ఆయన.. నోటికి హితవైన వంటలు చేసిపెడుతూ, ఆరారా పండ్ల రసాలు తీసి ఇస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు కోడలిని..

పదిరోజుల్లో రేవతి బాగా కోలుకుంది..


రేవతి మామగారి మంచి హృదయానికి, అభిమానానికి చలించిపోతోంది..

ఈ సమయంలో తన తల్లి ఉన్నా ఇంత బాగా చేసేది కాదు.. ఆవిడ ఇంట్లో కూరగాయలు పనిమనిషి తరిగి పెట్టి ఇచ్చి కుక్కర్ పెట్టి అన్నీరెడీ చేస్తే స్టౌ దగ్గర నిలబడి ఆవిడ కూరలకు పోపులేస్తుంది.. అమ్మ చేసినవి ఇంత రుచిగా ఉండవు.. పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ హొటల్ నుండి తెప్పించుకుంటారు.. నాన్నగారి కయితే స్టౌ వెలిగించడమే రాదు.. అందుకనే తనకూ తన చెల్లెలికీ ఏ పనులూ నేర్పలేదు.. పెళ్లైతే కుక్ ని పెట్టుకుంటారు, లేకపోతే హొటల్ నుండి తెప్పించుకుంటారు, వంట అన్నది పెద్ద సమస్యకాదు అని ఆలోచించే వ్యక్తి ఆవిడ..


ఇక్కడ అలాకాదు.. పొద్దున్నే మామగారు బ్రేక్ ఫాస్ట్కూడా చేసి, కూరగాయలన్నీ ఆయనే స్వయంగా కట్ చేసుకుని చక చకా వంట చేసేయడం చూసింది..


నిన్న మామయ్యగారు కూరల మండీకి వెళ్లి కాయగూరలెన్నో తెచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఫ్రిజ్ లో పెట్టారు.. ఆకుకూరలను చక్కగా కట్ చేసి జిప్ బాగ్స్ లో సర్దేసారు..

ఇన్నాళ్లూ తన మామగారి పట్ల ప్రవర్తించిన తీరుకి సిగ్గుపడింది.. ఏనాడూ మామయ్యగారికి తను దగ్గరుండి వడ్డించలేదు.. ఎవరో పరాయి వ్యక్తి అన్నట్లు భావించి ఏదో వండి టేబుల్ మీద పడేసేది..

మామగారితో ఆప్యాయంగా ఏనాడూ ఒక్క మాట మాటలాడలేదు.. తను ఓపికలేక లేవలేకపోతుంటే ' రేవతమ్మా, నీవు లేవకు నేను తెచ్చిస్తానంటూ' అన్నీ అందిస్తూ , అనుక్షణం తనకి ఏమికావాలో అడిగి చేసేవారు..

ఈ పరిస్తితిలో మామయ్యగారే లేకపోతే తను ఏమై పోయి ఉండేదో? దుఖంతో ఆమె వివశురాలయిపోతోంది..


కాస్త ఓపిక వచ్చింది కదా అనుకుంటూ ఆ మర్నాడు కిచెన్ లోకి వచ్చి తను పాలు వేడిచేసుకుంటూ మామగారికీ కాఫీ కలుపుతుంటుంటే ఆయన అక్కడకు వచ్చి కాస్త ఓపిక వచ్చేసింది కదా అనుకుంటూ కష్టపడకు తల్లీ.. నేను నీకు సాయం చేస్తాను.. మొహమాటపడకంటూ ఆప్యాయంగా అనేసరికి దుఖంతో మామగారి పాదాల మీద ఒరిగిపోతూ కళ్లకు అద్దుకుంటూ " మామయ్యగారూ నన్ను క్షమిస్తారా?" ఇన్నాళ్లూ నేను మీపట్ల ప్రవర్తించిన తీరుకి చాలా గిల్టీగా ఉంది.. ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించానో గుర్తొస్తొంది అనేసరికి......


' రేవతమ్మా, లే, ఇందులో క్షమార్పలేమిటి '? మనమంతా ఒక కుటుంబం.. మీ అత్తగారు బ్రతికి ఉండగా ఏమనేదో తెలుసా? మనకి కూతుళ్లు లేరన్న దిగులు లేదు.. చక్కగా చదువు అందం ఉన్న ఇద్దరు కోడళ్లు వచ్చారు.. వాళ్లనే మన కూతుళ్లగా అనుకుందాం అండీ అంటూ సంబర పడేది.. నా కూతురికి అనారోగ్యంగా ఉంటే నేను సాయం చేయడం గొప్ప విషయమా తల్లీ..


పాలు చల్లగా అయిపోతాయి తాగేసేయి.. నేను నీకు ఎలా చేయాలో దగ్గరుండి సూచనలిస్తాను. వంట చేయడం రాకెట్ సైన్స్ ఏమీకాదులే అని తేలికగా నవ్వేసారాయన..

మరో రెండువారాలకు మామగారు దగ్గరుండి సూచనలిస్తుంటే ఎన్నో వంటకాలను నేర్చుకుంది.. అసలే ఏకసంత్రాగ్రాహి.. అబ్బ, వంకాయని ఇన్ని రకాలు చేయొచ్చా ? ఇన్ని రకాల ఆకుకూరలతో ఆవ పులుసులు చేయచ్చా? కాయగూరలతో ఇన్నిరకాల రోటి పచ్చడ్లా అంటూ ఒకటే ఆశ్చర్యపోయేది..


ఆరోజు వంటయ్యాకా మామగారిని భోజనానికి పిలిచింది.. దగ్గరుండి వడ్డిస్తూ ' మామయ్యగారూ మీరు చెప్పినట్లు వంకాయ సంతర్పణ కూరచేసాను.. అందులో మినపవడియాలు కూడా వేయించి కలిపాను.. బచ్చలికూర వేసి మజ్జిగ పులుసు చేసాను.. బాగాలేదంటే నేను ఏదో ఫీల్ అయిపోతానని అనుకోకుండా ఫ్రాంక్ గా చెప్పాలి మరంటూ చేతులు కట్టుకుని నిలబడి ఆయన ముఖంవైపే ఆత్రంగా చూస్తూ అడిగింది..

కూర కలుపుకుని తింటూ ' మా రేవతమ్మ వంటేనా ఇది ' ? నేను నమ్మను గాక నమ్మను..

అంటే...... బాగాలేదా మామయ్యగారూ ?


నిజం తల్లీ, చాలా రుచిగా ఉన్నాయి రెండూనూ.. వంటల్లో నీకు చేయితిరిగినట్లే..

మన కృష్ణ నీ వంటతిని డంగైపోవడం ఖాయం అనేసరికి రేవతి సిగ్గుతో ముసి ముసి నవ్వులు నవ్వుకుంది..

ఒక చిన్న సంఘటన ఆ ఇంటి కోడలిలో ఒక అనూహ్యమైన పరిణామాన్ని తేవడమే కాదు వారిమధ్య మమతానురాగాలకు వారధి వేసింది..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.84 views0 comments

Comments


bottom of page