top of page

బంధాలు - విలువలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Bandhalu Viluvalu' Telugu Story Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త


“ఇదిగో వసంతా! ఎక్కడున్నావు? ఒకసారి వస్తావూ” అంటూ భర్త రామకృష్ణ పిలిచిన పిలుపుకి వంటింట్లోనుండి హాలులోకి వచ్చింది..


లేప్ టాప్ ముందు పెట్టుకుని, కీబోర్డుమీద టైప్ చేస్తూ, “వచ్చావా ? ఎల్లుండి బుధవారం నా స్నేహితుడు విశ్వమూర్తి వస్తున్నాడు మనింటికి.. పదిరోజులు ఉంటాడుట..

విశ్వం గురించి నీకెప్పుడూ చెపుతూనే ఉంటాను కదా వసంతా.. ఆ మధ్య కాకినాడ లో కాలేజ్ రీ యూనియన్ ఫంక్షన్ లో కలసినపుడు మన ఇంటికి రమ్మని ఆహ్వానించాను.. ‘వస్తానులేరా రామం’ అన్నవాడు ఇప్పుడు వస్తున్నా”డంటూ ముఖంనిండా ఆనందం పులుముకుంటూ భార్యతో పంచుకున్నాడు ఆ విషయాన్ని..


రామకృష్ణ, విశ్వమూర్తి కాకినాడలో పి..ఆర్ గవర్న్ మెంట్ కాలేజ్ లో బి..కామ్ చదువుతున్న రోజుల్లో మంచి స్నేహితులు..


విశ్వమూర్తి బి..కామ్.. చదివిన తరువాత అతని తండ్రి ఉద్యోగరీత్యా హైద్రాబాద్ కి ట్రాన్స్ ఫర్ అయితే మొత్తం కుటుంబం హైద్రాబాద్ కి వెళ్లిపోయారు.. అప్పట్లో ఇద్దరూ ఉత్తరాలు వ్రాసుకునేవారు కొంతకాలం.. ఆ తరువాత కాకినాడలోనే తనకి బి..ఎస్..ఎన్.ఎల్ లో ఉద్యోగం రావడం, అదే జిల్లాలో అటూ ఇటూ బదిలీలతో ఇద్దరిమధ్యా ఉత్తరాలు పూర్తిగా తగ్గిపోయాయి.


విశ్వం ఎమ్..కామ్, ఆ తరువాత సీ..ఏ చేసి ప్రైవేట్ గా ప్రాక్టీస్ పెట్టాడని ఆ తరువాత తన క్లాస్ మేట్ ఎవరో కలసినప్పుడు చెప్పాడు..


తను కొంతకాలం బదిలీల మీద అటూ ఇటూ తిరిగినా చివరకు తుని బ్రాంచ్ కి బదిలీ చేయడంతో తుని లోనే స్తిరపడిపోయాడు.. రెండువందల గజాల స్తలం కొనుక్కుని సొంత ఇల్లు కట్టుకున్నాడు..

తరువాత చాలా కాలం తరువాత కాలేజ్ రీ యూనియన్ ఫంక్షన్ లో విశ్వం కలసినపుడు ఇద్దరూ ఒకరినొకరు తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు..


పాపం విశ్వం భార్యపోయి రెండు సంవత్సరాలు దాటిపోయిందని చెప్పినపుడు చాలా బాధ పడ్డాడు తను.. ఇద్దరు కొడుకులని చెప్పినపుడు వాళ్లతోనే ఉంటున్నావా అని అడిగితే, రెండోవాడు అమెరికాలో సెటిల్ అయ్యాడని, భార్యా పిల్లలతో అక్కడే ఉన్నాడని చెప్పాడు.. అయితే మీ పెద్దబ్బాయితో ఉంటున్నావా అంటే ఔనన్నట్లుగా తల ఊపాడు.. కానీ వివరాలు ఎందుకో చెప్పలేదు, తనూ గుచ్చి గుచ్చి అడగలేదు..


మరి నీవురా రామం అంటే, తనకి ముగ్గురు కూతుళ్లని, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయిపోయాయని, పెద్దకూతురు, అల్లుడు నాగపూర్ లో ఉంటున్నారని.. వాళ్లకు ఒక కొడుకు, కూతురని.. అల్లుడు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ లో పనిచేస్తున్నాడని, చిన్నమ్మాయి చెన్నయ్ లో ఉంటోందని, అల్లుడు బేంక్ ఆఫ్ బరోడా లో పని చేస్తున్నాడని, వాళ్లకు ఒక పాప అని చెప్పాడు..


రెండో అమ్మాయి పుట్టిన పది సంవత్సరాల తరువాత మూడోది పుట్టిందని దానిపేరు హరిణి అని, అది ప్రస్తుతం తునిలోనే ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతోందని చెపితే నవ్వుతూ అదృష్టవంతుడివా రామం అంటూ ప్రేమగా భుజం తట్టాడు..


‘రిటైర్ అయిపోయాను, ఇంకా మూడో అమ్మాయి హరిణి చదువు పెళ్లి బాధ్యత ఉందం’టే, అన్నీ సక్రమంగా జరుగుతాయిలేరా అంటూ తనకి ధైర్యం చెప్పాడు..


భార్యపోయినప్పటి నుండి తను ప్రాక్టీస్ పూర్తిగా మానివేసానని, ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నానని చెప్పాడు.. ఎందుకో విశ్వం ముఖంనిండా నైరాశ్యం అలుముకుంది..

భార్యపోయినందుకు బాధ పడుతున్నాడేమోననుకుంటూ, మా ఇంట్లో కొన్నాళ్లు ఉందువుగాని రారా, కాస్త మార్పు ఉంటుందని పిలిస్తే ‘తప్పక వస్తాను రా రామం’ అంటూ మాటిచ్చాడు..


రామం విశ్వం గురించి ఆలోచిస్తుండగా వసంత “ఇంకేమీ మీ కాలేజ్ స్నేహితునితో మీకు భలే కాలక్షేపం అన్నమాట. మన రెండో బెడ్ రూమ్ సర్దుతానండీ మీ ఫ్రెండ్ ఉండడానికి.. హరిణి హాల్ లో చదువుకుంటుంది లెండి.. మన చిన్న ఇల్లు మీ స్నేహితునికి సౌకర్యంగా ఉంటుందో లేదోనండీ..” అంది.


“వాడు అలా ఏమీ అనుకోడు వసంతా.. వాడు స్థితిమంతుడైనా ప్రేమకూ ఆప్యాయతకూ ప్రాణమిచ్చే మనిషి.. ఏ భేషజాలూ లేవు మా విశ్వం”కంటూ గర్వంగా వసంతతో అన్నాడు..


అనుకున్నట్లుగా విశ్వం వచ్చాడు.. రామం, విశ్వం కాలేజ్ విషయాలెన్నో మాటలాడుకుంటూ తెల్లవార్లూ గడిపేవారు.. వసంతకైతే విశ్వాన్ని చూడగానే ఒక సొంత అన్నగారిలా అనిపించాడు..


‘అమ్మా వసంతా’ అని పిలుస్తుంటే అన్నయ్యలు లేని వసంత విశ్వాన్ని అభిమానంగా ‘అన్నయ్యా’ అంటూ పిలిచేది.. హరిణి అయితే ‘మామయ్యా’ అంటూ విశ్వం పక్కనే కూర్చుని భలే కబుర్లు చెపుతూ జోకులేస్తూ నవ్విస్తూ ఉండేది.. అసలే వాగుడుకాయ హరిణి.. నాన్న స్నేహితుడనేసరికి ఇంక హరిణిని ఆపేవారే లేరు..


ఖాళీగా ఉన్నపుడు విశ్వంతో ‘మామయ్యా కేరమ్స్ ఆడదాం రం’డంటూ, మరోసారి ‘ఛెస్ ఆడదామా’ అంటూ విశ్వాన్ని ఒక్క క్షణం ఖాళీగా ఉంచేదికాదు..


విశ్వం హరిణిని తీసుకుని బజారుకెళ్లి ఆ అమ్మాయికి కావలసిన డ్రెసులెన్నో కొనిచ్చాడు..


“ఒరేయ్ విశ్వం! అది సామాన్యమైనది కాదు. చనువిస్తే నీ నెత్తిమీద కూర్చుంటుంది. నీ జేబులు ఖాళీ చేయిస్తుం”దంటే, “చేయించనీయరా! చిన్నపిల్ల, నా మేనకోడలికి కొనివ్వడం నాకూ సరదానే” అనేవాడు.. వసంత విశ్వానికిష్టమైన వంటలెన్నో చేసి కొసరి కొసరి వడ్డిస్తూ కబుర్లు చెపుతుంటే ఆ ఆప్యాయతకు విశ్వం కళ్లనుండి కన్నీటిబొట్లు అన్నంలో రాలిపడేవి..


రామం, వసంత చూపిస్తున్న ఆదరణలో విశ్వం తిరుగు ప్రయాణం రెండురోజుల్లోకి వచ్చేసింది..


ఆరోజు రామం, విశ్వం పార్క్ లో వాకింగ్ చేస్తుండగా హఠాత్తుగా రామం విశ్వంతో “ఒరేయ్ విశ్వం! నీవు మీ పెద్ద కొడుకు దగ్గర సంతోషంగానే ఉన్నావు కదూ ? రెండోవాడిని చూడడానికి అమెరికా వెళ్లే ప్రోగ్రామ్ ఏదైనా ఉందా ? ఒకోసారి ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తావురా అందుకే అడిగా”ననేసరికి ........


“నా భార్య మాధవి గుర్తొస్తుందిరా! ఎంత మంది మధ్య ఉన్నా మాధవి లేదే అనుకుంటాను ఒకోసారి..” విశ్వం గొంతుకు గద్గదమైందో క్షణం..


స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తడుతూ, “ఒరేయ్ విశ్వం! మేమున్నామురా నీకు.. నీకు ఎప్పుడు బోర్ గా ఒంటరిగా ఉందనిపిస్తే అప్పుడు మా ఇంటికొచ్చేయ్.. నేను మీ పెద్దబ్బాయితో మాటలాడతాను. నిన్ను తరచుగా ఇక్కడకు పంపిస్తూ ఉండమని..” అన్నాడు రామం.


“నన్ను ఎవరూ అభ్యంతరం పెట్టరురా.. ఎక్కడికి వెళ్లినా ఎవరూ ఏమీ ప్రశ్నించరు.. మీ అందరితో నేను ఇక్కడ గడపిన రోజులు, నాకు మీరున్నారనే ధైర్యం.. ఒక టానిక్ లా పనిచేస్తుందిరా.. తప్పకుండా వస్తూ ఉంటాను. సరేనా” అంటూ రామానికి మాటిచ్చాడు..


విశ్వం వెళ్లేముందు హరిణిని పిలిచి తన దగ్గర కూర్చోపెట్టుకున్నాడు..


“చూడమ్మా హరిణీ! నీకు చదువుమీదున్న ఆసక్తిని గమనించాను.. ఒకరోజు అనుకోకుండా మీ నాన్న నీతో అన్నమాటలు విన్నాను.. ఇంజనీరింగ్ చదివించలేనమ్మా, అక్కల్లాగే డిగ్రీ చదువుదువుగానంటే నీవు కాసేపు ఏడ్చి తరువాత మీ నాన్నతో సరేనంటూ కాంప్రమైజ్ అయిపోయావు.. ఇంటి పరిస్తితులను చక్కగా అర్ధం చేసుకున్నావు.. నీకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వస్తుందని చెప్పడం విన్నాను.. నీవు ఇంజనీరింగ్ చదువు హరిణీ.. ఆ ఖర్చు నేనిస్తా”నంటూ ఒక చెక్కు హరిణి చేతికి అందించాడు..


ఈలోగా రామం వచ్చాడ్కడకు.. హరిణి విషయమంతా చెపుతూ ఆ చెక్కు తండ్రికి ఇచ్చింది..

రామం స్థాణువైపోయాడు.. “విశ్వం ఏమిటిదంతా ? అభిమానానికి కూడా హద్దు ఉంటుందిరా.. అయిదు లక్షల రూపాయలకు హరిణికి చెక్కు ఇస్తావా ? ఇదేమీ బాగోలేదురా.. మన మధ్య స్నేహబంధమే ఉండాలిగానీ డబ్బుతో ముడిపడిన బంధం ఉండకూడదురా.. తీసుకోరా” అంటూ తిరిగి ఇవ్వబోతుంటే,

" నా సొంత మేనకోడలికిస్తున్న అనుభూతితో ఇస్తున్నానురా రామం! నా మనసు బాధ పెట్టకు ప్లీజ్..” అంటూ గంభీరంగా అనేసరికి రామం ఏమీ మాటలాడలేకపోయాడు..


“అమ్మా హరిణీ, బాగా చదువుకోవాలి.. నీకేమి కావాలన్నా మీ నాన్నతోబాటూ ఈ మామయ్యకూడా ఉన్నాడని గుర్తుపెట్టుకో.. అమ్మా, వసంతా వెళ్లొస్తాను.. నీవు చూపించిన ఆదరణకూ ప్రేమకూ విలువకట్టలేనమ్మా!”


“అయ్యో అన్నయ్యా! అలా అనకండి.. మీరూ వస్తూ పోతూ ఉంటేనే మాకు ఆనందం.. మళ్లీ త్వరగా రండన్నయ్యా.” అంటూ విశ్వం కాళ్లకు నమస్కరించింది.. విశ్వం వీడ్కోలు తీసుకున్నాడు వారందరినుండి..

====

విశ్వాన్ని చూస్తూనే వాచ్ మేన్ గబ గబా పరుగెత్తుకుని వచ్చి విశ్వం చేతిలోని బేగ్ ను అందుకుంటూ ఆయనతోబాటూ లిఫ్ట్ లోకి వచ్చాడు..


ధర్డ్ ఫ్లోర్ ముందు లిఫ్ట్ ఆగగానే ఇద్దరూ విశ్వం ఫ్లాట్ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చారు.. వాచ్ మేన్ తన దగ్గరున్న కీస్ తో తలుపు తెరిచాడు..


తను లేకపోయినా వాచ్ మేన్ ఫ్లాట్ ను నీట్ గా ఉంచాడు.. ఎప్పటికప్పుడు పనిమనిషితో తుడిపిస్తూ !

“వంట మనిషి అన్నపూర్ణగారు ఫోన్ చేసారు సర్, ఇంకో అరగంటలో వస్తానని చెప్పమన్నారు..” “సరే నీ వెళ్లవోయ్ ఆంజనేయులూ, అవసరమైతే ఫోన్ చేస్తా”నని వాచ్ మేన్ ను పంపించేసాడు..

విశ్వమూర్తిగారి స్నానం అదీ పూర్తయేసరికి అన్నపూర్ణ గారు వచ్చారు..


“నమస్తే సార్, మీ ప్రయాణం అదీ బాగా జరిగిందా” అంటూ కుశలప్రశ్నలు వేసింది..


మాధవి కి అనారోగ్యంగా ఉన్నప్పుడు వంటపనికోసం ఆవిడను పెట్టుకున్నారు.. భర్త పౌరోహిత్యం చేస్తుంటే ఈవిడ ఇలా బాగా తెలుసున్న ఇళ్లల్లో వంటలు చేస్తూ ముగ్గురాడపిల్లలను చదివించుకుంటున్నారు..


విశ్వమూర్తిగారు ఆ కుటుంబానికి సాయపడ్తూనే ఉంటారు.. ఆవిడే వస్తూ వస్తూ కూరగాయలూ, ఇంట్లోకి కావలసిన పచారీసామాన్లూ అవీ తెచ్చి పెడ్తుంది.. ఆవిడ వంటింట్లోకి వెళ్లి వంటపని ప్రారంభించారు..

ఇంక మళ్లీ ఒంటరి బ్రతుకు మొదలు..


ఈ పదిరోజులూ తను అనుభవించిన ఆనందం తన జీవితంలో మరచిపోలేనిది..

రామానికి తన గురించి ఏమీ సరిగా చెప్పనేలేదు..

ఎందుకని ? తనలో తనే ప్రశ్నించుకున్నాడు.. తన అంతరాత్మ పరిహసిస్తోంది.. నీ బాధ, ఆవేదనను నీ ప్రాణ మిత్రుడికి కూడా చెప్పకపోవడమేమిటి విశ్వం అంటూ..

నిజమే, ఏమని చెప్పుకోవాలి.. ఏమంత గొప్ప జీవితం అని ? తన మాధవి తనను విడిచి వెళ్లిపోయిందని తెలిసినా తన పెద్దకొడుకు సంసారంతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాననుకుంటున్నాడు.. అమెరికాలోని చిన్నకొడుకు ప్రతీరోజూ ఫోను చేస్తూ ఉంటాడని అనుకుంటాడు.. ‘నాన్నా.. నా దగ్గరకు వచ్చేయ్’ అంటూ చిన్నకొడుకు బ్రతిమాలుతూ ఉంటాడనుకుంటాడు..


కానీ, ఇందులో ఏదీ నిజంకాదు.. చెప్పేయాలి రామంతో..

లేప్ టాప్ తెరిచి మెయిల్ ఇవ్వసాగాడు..


“డియర్ రామం..

క్షేమంగా చేరానింటికి.. మళ్లీ యధాప్రకారం ఒంటరి జీవితం..

ఒంటరి జీవితం అంటున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావుకదూ రామం? నన్ను క్షమించు రా ! నీతో కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెట్టాను..

చెప్పలేక పోయానురా రామం.. గొంతు పెగల్లేదు.. నీ ఎదురుగా లేను కనుక ఇప్పుడు ధైర్యం వచ్చేసిందిరా..


మా పెద్దవాడు రాహుల్ ఐఐటి లో టాపర్.. తరువాత యు..ఎస్ లో టాప్ యూనివర్సిటీలో ఎమ్ ఎస్ లో అడ్మిషన్ దొరికింది.. మొదటనుండీ పుస్తకాల పురుగు.. ఎప్పుడూ ఆలోచిస్తూ ఏదో సాధించాలన్న తపన కనబడేది వాడిలో.. యూ..ఎస్ లో చదువు పూర్తయ్యాక పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామంటూ వీడికోసం క్యూ కట్టాయి..


ఎందుకో సడన్ గా ఒక రెండునెలలు వీడి నుండి ఏ ఫోనూ లేదు మాకు .. ఫోన్ కనక్ట్ అవడంలేదు.. మెయిల్స్ ఇచ్చినా డెలివర్ అయ్యేవి కావు.. కొత్త జాబ్ తో బిజీగా ఉన్నాడనుకున్నాం.. మాధవి పోరు పడలేక ఎలాగో వాడి రూమ్ మేట్ ఫోన్ నంబరు సంపాదించి ఫోన్ చేస్తే ' అదేమిటి అంకుల్ మీకు తెలియదా’ అంటూ ఆశ్చర్యపోయాడు ..


‘వాడు అక్కడ ఉండలేనని జాబ్ చేయలేనని చెపుతూ కలకత్తా బెలూర్ లోని రామకృష్ణా మఠంలో చేరిపోవాలన్న ఆశయంతో వెళ్లిపోతున్నానని నాతో చెప్పాడు.. మిమ్మలని కలవలేదా’ అంటూ బోల్డు ఆశ్చర్సపోయాడు.. ఇంక మాధవి దుఖాన్ని ఆప లేకపోయాను.. సరిగా అంతకు మూడు నెలల క్రితమే మా చిన్నవాడు రాకేష్ ఇంజనీరింగ్ తరువాత ఎమ్ బి ఏ చదవాలని యు..ఎస్ వెళ్లాడు.. మా పెద్దవాడికీ, చిన్నవాడికీ వయసు వ్యత్యాసం సంవత్సరంన్నరే..


మాధవీ నేనూ హుటాహుటిన బేలూర్ చేరుకుని రామకృష్ణ మఠానికి వెళ్లి వాకబు చేస్తే ఆ మఠం వాళ్లు వివరాలిచ్చారు.. వాడిని కలవాలని వెడితే ఫారిన్ డెలిగేట్స్ తో స్పిరుట్యుయల్ లెక్చర్ లో ఉన్నాడని, వెయిట్ చేయమని చెప్పారు.. ఆ తరువాత కొద్దిసేపటికి పిలుపు వచ్చింది.. వాడి రూపురేఖలు మారిపోయాయి .. పూర్తిగా గుండు, కాషాయి దుస్తులలో కనిపించాడు..


మౌనంగా మా ఇద్దరినీ కళ్లతోనే పలకరించాడు.. మాధవి భోరున ఏడుస్తూ ‘ఇదేమి ఖర్మరా నీకు, వచ్చేయ’మని కంటికిమంటికి ఏకధారగా ఏడ్చేసింది.. ‘రాను’ అన్నాడు.. ‘ఎవరికి నచ్చిన మార్గంలో వారు ప్రయాణించడమే సబబు’ అన్నాడు.. తనకు సాంసారిక విషయాలపట్ల, భౌతికమైన జీవితం పట్ల వ్యామోహం లేదని , తన జీవితాన్ని ఆధ్యాత్మిక దిశగా మలచుకోవాలని నిర్ణయించుకున్నానని , అందుకనే సన్యాసం స్వీకరించానని చెప్పాడు..


జీవితానికి పరమార్ధం గొప్ప గొప్ప పదవులు, వైవాహిక జీవితం పిల్లలు సంసారం కాదుట.. ప్రజల్లో సామాజిక సేవ, ఆధ్యాత్మిక భావన, క్రమశిక్షణను జాగృతం చెయ్యడానికి కృషి చేసిన స్వామి వివేకానంద బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయ సంకల్పించానని అదే తన ఆశయం అంటూ గంభీరంగా చెప్తూ లోపలకు వెళ్లిపోయాడు..


నేను మాధవి ఏమీ చేయలేని నిస్సహాయత స్తితికి గురైనాము.. మాధవి దుఖాన్ని నియత్రించలేకపోయాను.. మాధవి ఉండగా అప్పుడప్పుడు వాడిని చూడడానికి వెళ్లినా విజిటర్స్ లాగే దూరం నుండే చూసి వచ్చేసేవాళ్లం.. వాడు పూర్తిగా ఆ మఠానికీ, ఆధ్యాత్మిక సేవకూ అంకితమైపోయాడు.. ఇదిలా ఉంటే మా రెండోవాడు చదువు పూర్తవడం అక్కడే ఒక ఫారినర్ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు..


మాధవి ఈ రెండింటినీ జీర్ణంచుకోలేక బెంగపడిపోయి అనారోగ్యం తెచ్చుకుని నా నుండి శాశ్వతంగా వెళ్లిపోయింది..


తల్లి మరణవార్త విని రెండవ వాడు వచ్చి ఆ కార్యక్రమాలు పూర్తి చేసి నన్ను తనతో వచ్చేయమన్నాడు.. నాకూ గ్రీన్ కార్డ్ కి అప్లై చేస్తానన్నాడు.. రానని చెప్పేసాను రా రామం.. అప్పటినుండి వాడు రాలేదు, నన్ను మళ్లీ రమ్మనమని పిలవలేదు..


పెద్దవాడు భౌతికంగా ఉన్నా మన మనుషులలో లేడు.. చిన్నవాడు అమెరికన్ పౌరసత్వం తెచ్చుకుని అమెరికన్ అయిపోయాడు.. నా ప్రాణం అయిన మాధవి లేదు.. నా కొడుకులున్నా నా కోసం ఎవరూ ఆరాటపడరు.. ఇదీ నా పరిస్తితి.. నిన్ను నీ కుటుంబాన్ని చూసాకా నేను ఏమి పోగొట్టుకున్నానో అర్ధం అయింది..


నేను ఒంటరిగా ఉండలేనురా.. నీవు మాటల మధ్యలో మీ ఇంటి పక్కనే ఉన్న ఇంటి ఓనర్ ఇల్లు అమ్మేయాలనుకున్నట్లు చెప్పావు.. అందమైన పెద్ద తోట మధ్యలో కట్టిన ఆ ఇల్లు నాకు చాలా నచ్చింది.. ప్రశాంతమైన పచ్చని వాతావరణం అంతేకంటే నాకు నచ్చింది ఆ ఇంటి పక్కనే మీ ఇల్లు ఉండడం.. ఇక్కడ నేనుంటున్న ఫ్లాట్, కొన్ని ఆస్తులు అమ్మేసి నీ దగ్గరకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాను.. ఆ ఇంటి యజమానికి నేను వారిల్లు కొంటానని చెప్పి కొంత టోకెన్ ఎడ్వాన్స్ పేచేయి.. నేను నీ బేంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ ఫర్ చేస్తాను..


ఒక నెలరోజులలో నా పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేస్తాను.. చి.. సౌ.. వసంతకు, హరిణికి కు నా ఆశీస్సులు..

ఎప్పటికీ నీ విశ్వం..”


మెయిల్ ను పైకే చదివిన రామం బరువుగా నిట్టూర్చాడు.. అతని కనుకొనలనుండి దుఖాశ్రువులు రాలిపడ్డాయి.. హరిణి అయితే బిగ్గరగా ఏడ్చేసింది.. ‘పాపం మామయ్య కదూ నాన్నా.. మామయ్యను ఎప్పుడూ మనతోనే ఉంచేకుందాం’ అంటూ.. వసంత అయితే ‘అన్నయ్య ఎంతటి వేదనను తన మనసులో దాచేసుకున్నా’రండీ అంటూ కంటతడి పెట్టింది.. ‘నాన్నా మామయ్య మెయిల్ ఐడి ఇవ్వు, నేను జవాబు వ్రాస్తా’నని హరిణి మెయిల్ అడ్రస్ తీసుకుంది..


రామం వెంటనే జవాబు వ్రాసాడు..

“ఒరేయ్ విశ్వం,

ఎంతటి ఆవేదనను మనసులో దాచేసుకున్నావురా? నీ భార్య నీ నుండి దూరమైనా నీ కొడుకులతో ఆనందంగానే ఉన్నావనుకున్నాను గానీ, అప్పుడప్పుడు డల్ గా అయిపోతుంటే మాధవి లేదన్న దిగులనుకున్నాను..


నీవెప్పటికీ ఒంటరివి కావు.. నాలో చివరి శ్వాస ఆగిపోయేవరకు నీవు నాతోనే ఉంటావు.. వచ్చేయ్.. మనిద్దరం కలసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సామాజిక సేవలందిస్తూ, మనలాంటివారికి అండంగా ఉందాం.. నా పెద్దకూతురు, చిన్నకూతురు మామయ్యను చూడడానికి వస్తామంటున్నారు.. ఇంక నీ ప్రియమైన మేనకోడలు హరిణి గురించి చెప్పాలా ? మామయ్యా అంటూ నీకోసం ఏడుస్తోందిరా.. వసంత దుఖాన్ని ఆపలేకపోతున్నాను..


నీకోసం పరితపించే ఇంతమంది ఉండగా నీవు ఒంటరి వాడివి ఏమిటిరా ? బోలెడు సందడిని, ఆనందాన్ని పంచి ఇచ్చేందుకు మేమందరం సిధ్దంగా ఉన్నాం..

నీకోసం ఎదురుచూస్తూ........ నీ రామం.. “


మెయిల్ చదివిన విశ్వమూర్తికి రామం మాటలు ఓదార్పునిచ్చాయి..

హరిణి మెయిల్ విశ్వమూర్తిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది..


‘మామయ్యా, నాకెవరూ లేరు, ఒంటరిననే మాట మీ నోటినుండి రానివ్వకుండా చూసుకుంటాం మేమందరం. నా చదువు అయిపోయిన వెంటనే పెళ్లి చేసేసుకుని పిల్లలను కనేసి, ఆ పిల్లలను మీ ఒడిలో పెట్టేస్తాను.. నాకు పుట్టిన పిల్లలతో మీరు ఆడుకోవాలి మామయ్యా.. నన్ను మీ కూతురుగా భావించండి.. మీ బాధలన్నీ నావే.. జరిగిన సంఘటనలన్నీ మరచిపోండి.. కొత్త జీవితాన్ని ప్రారంభించండి..

మీకు ఎల్లవేళలా ఆనందాన్ని, సంతోషాన్ని పంచి ఇచ్చే మీ మేనకోడలు హరిణి ఉండగా మీకు దుఖం ఎందుకు మామయ్యా ?

మీ రాక కోసం ఎదురుచూస్తూ,

మీ ప్రియమైన మేనకోడలు..”


హరిణి మెయిల్ చదివిన విశ్వమూర్తి ఆ పసిపిల్ల అభిమానానికి ముగ్ధుడైనాడు..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం


128 views0 comments

Comments


bottom of page