కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Nirnayam' Telugu Story Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
శారద కూతురు కీర్తి వివాహం ఇటీవలే అయింది.. శారద పుట్టింటి వైపు బంధువులు, అలాగే శారద భర్త మనోహర్ వైపు బంధువులే కాకుండా శారద స్కూల్ లోని కొలిగ్సు అందరూ శారద అదృష్టాన్ని తెగ మెచ్చుకున్నారు.. శారద గవర్న్ మెంట్ హైస్కూల్ లో మేధ్స్ టీచర్ గా పనిచేస్తోంది.. భర్త మనోహర్ ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. కీర్తి కాక మరో అమ్మాయి ఉంది వారికి..
పెళ్లి కొడుకు రవితేజ అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు.. కీర్తిని ఆ మధ్య ఎవరో దూరపు బంధువుల పెళ్లిలో చూసిన రవితేజ తల్లితండ్రులు ఒక రోజు హఠాత్తుగా శారదా వాళ్లింటికి రావడం, కీర్తిని తమ కోడలిగా చేసుకుంటామని అడిగారు.. వంక పెట్టడానికి ఏమీ కనపడలేదు శారదా వాళ్లకు.. మంచి కుటుంబం, రవితేజ తండ్రి రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో మంచి పోస్టులో ఉన్నాడు.. ఆస్తి పాస్తులు బాగానే ఉన్నాయి.. పెద్ద కొడుక్కి పెళ్లై భార్యతో లండన్ లో ఉంటున్నాడు.. ఇప్పుడు కీర్తిని చూసుకోడానికి వచ్చింది వారి చిన్నకొడుకు రవితేజ కోసం..
కీర్తిని రవితేజ ను ఫేస్ టైమ్ లో మాట్లాడుకునేటట్లు చేసారు. ఇంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ రావడం నీ అదృష్టంఅంటూ కీర్తి తల్లితండ్రులూ, అలాగే ఎంత మంది అమ్మాయిలను చూసినా నీకెవరూ నచ్చలేదు కదా తేజూ, కీర్తి బంగారు బొమ్మలా ఉంది, నీకు చక్కని జోడీ అవుతుందంటూ రవితేజ తల్లితండ్రులూ ఇరువురికీ ఆలోచించుకునే వ్యవధి ఇవ్వకుండానే పెళ్లి ముహూర్తం నిశ్చయించేయడం, రవితేజ వచ్చి కీర్తి ని పెళ్లిచేసుకుని, తొందరలో వీసా పేపర్లు పంపుతానని బయల్దేరి వద్దువుగానంటూ యూ..ఎస్ వెళ్లిపోయాడు.. కీర్తి తను చేస్తున్న జాబ్ ను యూఎస్ వెళ్లేవరకు కంటిన్యూ చేయాలనుకుని ఆఫీస్ కు వెళ్లి పనిచేసుకుంటోంది..
శారదను రోజూ స్కూల్ లో కొలిగ్స్ మీ కీర్తి కి వీసా వచ్చిందా? ఎప్పుడు వెడ్తోంది యూ..ఎస్ అంటూ ఆరాగా అడుగుతూ ఉండేవారు.. ఇంక పరిచయస్తుల సంగతి చెప్పనవసరమే లేదు.. ఇంకా లేదు, మా అల్లుడు వీసా పేపర్లు పంపించే హడావుడిలో ఉన్నాడంటూ సమాధాన మిచ్చేది.. అయినా ఎవరో ఒకరు ఏదో వార్తను శారద చెవిలో వేసేవారు.. ఫలానా వారబ్బాయి ఇలాగే చెప్పి వీసా పేపర్లు పంపలేదని, ఆ అబ్బాయి అక్కడ మరెవరితోనో కలసి ఉంటున్నాడని, అలాగే వీసా రాని మరెవరమ్మాయో ఇలాగే సంవత్సరం వరకు ఇక్కడే ఉండిపోయిందంటూ రక రకాల కధలు చెపుతుండేసరికి శారద మనసంతా దిగులు ఆవహించేది..
ఇంటికి రాగానే కీర్తిని అడిగేది..
ఏమే కీర్తీ, రవితేజ ఫోన్ చేస్తున్నాడా? నీ వీసా పేపర్లు ఎప్పుడు పంపిస్తాడుట అంటూ ?
అమ్మా, నిన్ననే నేను మాట్లాడాను నా వీసా గురించి.. కోవిడ్ కారణంగా వీసాల విషయంలో కౌన్సిలేట్ చాలా స్ట్రిక్ట్ గా ఉందని, డిపెండెంట్ వీసాల సంఖ్య కూడా బాగా తగ్గించారని, ఈ సమయంలో వీసా కి అప్లై చేస్తే రిజక్ట్ అయితే మరో ఆరునెలల వరకు ఆగాలని, సమయం చూసి పంపుతానన్నాడు.. నీవు రోజూ అదేపనిగా నా వీసా గురించి మాట్లాడకమ్మా అంటూ కోపంగా సమాధానమిచ్చింది..
ఏమిటో, పెళ్లి అయి రెండు నెలలు అయినా ఇది ఇక్కడే ఉండిపోయింది.. నాకే కాదు బాధ, కొత్త దంపతులు, వాళ్లకు ఉండదా బాధ, కీర్తి ని అదే పనిగా అడుగుతూ దాన్ని బాధపెట్టకూడదని నిర్ణయించుకుంది..
కానీ ఆవిడ మనసు ఊరుకోలేక రవితేజ తల్లి సుమతికి ఫోన్ చేస్తూ, " వదినగారూ, మీ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడా?" మీరు కూడా గుర్తు చేస్తూ ఉండండి, సాధ్యమైనంత త్వరలో వీసా పేపర్లు పంపించమని.. పెళ్లయినాకా కూడా ఇద్గరూ తలోచోటా ఉండడం ఏమిటో బాధగా అనిపించి చేస్తున్నాను.. ఏమీ అనుకోరుగా ?
అయ్యో ఎందుకనుకుంటాను వదినా ? నాకూ ఆత్రంగానే ఉంది.. నాలుగురోజుల క్రితం మాట్లాడితే చెప్పానుకూడా.. ఆఫీస్ పని తో బిజీగా ఉన్నాడుట.. మరో పెద్ద ప్రమోషన్ ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవుతున్నానని, అదీగాక తొందరపడి పేపర్లు పంపితే వీసా రాకపోతే ప్రాబ్లమ్ కదా, కాస్త ఆలస్యమైతే ఏమౌతుంది మమ్మీ, కీర్తి కూడా ఆఫీస్ పనితో బిజీగా ఉందికదా, వీలుచూసుకుని పంపుతానని చెప్పాడు..
మీరు టెన్షన్ పడకండి.. భార్యా భర్తలు, వాళ్లిద్దరూ చూసుకుంటారు లెండి, వాళ్లకు తెలియదా ఏమిటీ అంటూ చాలా సున్నితంగా చెపుతూ నవ్వేసింది..
అంతే లెండి వదినా, మనసు ఆగక ఫోన్ చేసాను.. ఉంటాను, బై అంటూ ఫోన్ పెట్టేసింది..
అసలు కీర్తికి అప్పుడే పెళ్లి చేయాలని తాము అనుకోలేదు. ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరమే అయింది.. చిన్నకూతురు పూజ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది.. శారద, మనోహర్ ఇద్గరూ కూడా ఏ విషయానికీ తొందరపడరు.. నెమ్మదిగా ఆచి తూచి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు..
ఏ పెళ్లికీ రానంటూ తప్పించుకునే కీర్తి తమతో బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే రావడమేమిటీ, పెళ్లి జరిగిన నాలుగురోజులకు రవితేజ తల్లితండ్రులు స్వయంగా తమ ఇంటికి రావడం, కీర్తి వాళ్లకు బాగా నచ్చిందని చెప్పడంతో , అన్నీ ఒకదాని వెనుక మరొకటి కుదిరిపోవడం ఏమిటి ? ఘటన అంటే ఇంతే కాబోలు.. తమ కంటే అన్ని విధాలా స్తితిమంతులే కాదు , కీర్తిని ఇష్టపడ్డారన్న ఒకరకమైన గౌరవం కూడా వాళ్లమీద కలిగింది..
ఇలా కీర్తికి పెళ్లి కుదిరిందని చెపితే స్కూల్ లో ప్రతీవాళ్లూ ఆశ్చర్యపోవడమే.. లవ్ మేరేజా అంటూ కొందరూ, అంత మంచి సంబంధం వెతుక్కుంటూ రావడం మీ అదృష్టం అంటూ అందరూ అభినందించడమే.. తన భర్త మనోహర్ కూడా అదే విషయాన్ని తనతో అన్నాడు.. మా ఆఫీస్ లో అందరూ ఇంత సడన్ గా ఎలా కుదిరిందబ్బా అంటూ బోల్డు ఆశ్చర్యపోయారు శారదా ..
ఆడపిల్ల పెళ్లికి ఎంత కష్టపడాలో అనుకున్నాను, కనీసం ఒక్క సంబంధం కూడా చూడకుండానే నా చిట్టితల్లి పెళ్లి కుదిరిపోయిందని ఒకటే సంబరపడిపోయాడు.. కీర్తి యూ..ఎస్ వెళ్లిపోతుందని ఒక వైపు బాధగా ఉన్నా, మరోవైపు రవితేజ లాంటి అల్లుడు తన కూతురిని పువ్వుల్లో పెట్టుకుని మరీ చూసుకుంటాడని, అమెరికాలో తన కూతురు అనుభవించే జీవితాన్ని ఊహించుకుంటూ మురిసిపోయేదావిడ..
కీర్తి యూ..ఎస్ వెళ్ళి పోతుందన్న ఆలోచనలలోనే మరో మూడునెలల కాలం గడచిపోయింది.. ఊరగాయల సీజనేమో శారద కీర్తి కోసం అన్ని రకాల పచ్చళ్లూ పెట్టేసింది.. వీసా వచ్చేస్తే నాలుగు రోజులకే ప్రయాణం పెట్టేసుకుని వెళ్లిపోతుందేమోనన్న భయం.. నాకేమీ పెట్టకు, తరువాత కొరియర్ లో పంపుదువుగానంటే ? ఆవిడ ఆరాటం ఆవిడది..
ఒకరోజు మధ్యాహ్నం స్కూల్ లో క్లాసులేమీ లేకపోతే స్టాఫ్ రూమ్ లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటోంది శారద.. తను తప్ప ఆ స్టాఫ్ రూమ్ లో మరెవరూ లేరు..
సడన్ గా ' మమ్మీ అనే పిలుపుకి తలెత్తి చూసింది'..
ఎదురుగా కీర్తి, ముఖంలో కంగారు..
ఏమిటి కీర్తీ, ఇలా వచ్చావేమిటింటూ ఆశ్చర్యంగా అడిగింది..
నీవు నాతో రాగలవా ? అర్జంట్ గా మాట్లాడాలి..
వస్తానంటూ హెచ్ ఎమ్ రూమ్ లోకి వెళ్లి ఏదో చెప్పి హేండ్ బేగ్ తీసుకుని కీర్తితో బయటకు వచ్చింది..
కీర్తి స్కూటీ మీద ఇద్దరూ ఒక హొటల్ కి వచ్చారు..
ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు..
అమ్మా నేను చెప్పబోయే విషయం విని నీవు కంగారు పడకూడదు.. అదిగో అప్పుడే నీ ముఖంలో టెన్షన్..
కూల్ గా వినాలి..
రవితేజ కి నాతో పెళ్లి ముందు నుండీ ఇష్టం లేదుట.. అక్కడ అతనో అమ్మాయిని ప్రేమిస్తున్నాడుట.. ఈ విషయం మా పెళ్లికి ముందే మా అత్తగారింట్లో చెపితే వాళ్లు ససేమిరా వద్దన్నారుట..
కారణం, రవితేజ అన్నయ్య లండన్ లో లవ్ మేరేజ్ చేసుకున్నాడుట, వీళ్లకు చెప్పకుండా.. ఇండియన్ కాదుట ఆ అమ్మాయి.. విషయం తెలిసిన మా అత్తగారు ఏడుస్తూ సూసైడ్ ప్రయత్నం చేసారుట.. రవితేజ్ అన్నయ్యతో వీళ్లు సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారుట.. అతను పెళ్లికి రాకపోవడానికి ఇదే కారణమట.. లీవ్ దొరకలేదని మనతో అన్నారు..
రవితేజ తానూ ఒక అమ్మాయిని ప్రేమించానని చెపితే ఆవిడ ఏడ్చిందిట.. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదంటూ అతన్ని బెదిరించి మరీ బలవంతంగా నాతో పెళ్లికి ఒప్పించిందిట..
పెళ్లి అయినాక రవితేజ కొన్నిరోజులు ఇక్కడున్నా నాతో దూరంగానే ఉన్నాడు.. అనుమానం వచ్చినా నా డౌట్ నిజంకాదేమోనని ఊరుకున్నాను.. నీతో కూడా చెప్పలేదు, కంగారు పడతావేమోనని..
నాకు డిటైల్డ్ మెయిల్ ఇచ్చాడు ఒక గంట క్రితం.. అక్కడ తాను ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తోందిట..
నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు.. మన ఇళ్లల్లో అందరికీ తెలిస్తే బాధపడతారు.. అందుకని నీకు వీసా పేపర్లు పంపుతాను.. ఇక్కడకు వచ్చేయంటూ..
నన్ను ఎమ్ ఎస్ చదివిస్తాడుట తన ఖర్చు తోనే.. లేకపోతే ఉద్యోగం అయినా చూస్తానన్నాడు..
నేను సెటిల్ అయ్యాకనే ఇంట్లో అందరికీ ఏదో కారణం చెప్పి డివోర్సే తీసుకుందామని, తరువాత ఎవరికి నచ్చిన దార్లో వాళ్లు ప్రయాణం చేయవచ్చని..
శారద కీర్తి చెపుతున్న మాటలకు నిశ్చేష్టిత అయిపోతూ, " కీర్తీ, ఏమిటే ఇదంతా ? నిజమేనా ? ఏడ్చేస్తోందావిడ..
నిజం మమ్మీ, ఇలాంటిదేదో ఉందని నేను లీలగా ఊహించాను.. లేకపోతే వీసా పేపర్లు పంపడానికి ఇంత తాత్సారం చేయడం ఏమిటని ? అంతెందుకు, పెళ్లి అయ్యాకా అతను నాతో ప్రవర్తించిన తీరే నాకు ఇటువంటి సందేహాన్ని రేకెత్తించింది..
ఆలోచించుకున్నాడు.. కట్టె విరక్కుండా పాము చావకుండా, నా ముందు ఆఫర్ పెట్టాడు.. యూ..ఎస్ అంటే ఎగిరి గంతేసి వచ్చేస్తాననుకుంటున్నాడు.. ప్రలోభపడతాననుకున్నాడు.. లేకపోతే సమాజానికి భయపడి యూ..ఎస్ కి పరుగెత్తుకుని వచ్చేస్తానని అనుకున్నాడు..
అది కాదు కీర్తీ, ఒక్కమాట చెపుతాను విను, యు..ఎస్ వెళ్లు, అతన్ని కన్విన్స్ చేయి, ఆ అమ్మాయితో మాకు పెళ్లి అయిపోయిందని చెప్పు.. అతని మనసుని మార్చలేవా?
తోకతొక్కిన త్రాచులా పైకి లేస్తూ, అమ్మా నీవు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ? ఇంత జరిగినా ఆ రోగ్ దగ్గరకు వెళ్లిపొమ్మంటావా ? అంటే సమాజానికి వెరుస్తున్నావా, లేకపోతే రేపు నీ కొలిగ్ ఆ విశాలాక్షికి ఏమి సమాధానం చెప్పాలోననుకుంటు భయపడుతున్నావా ?
నేను యూ..ఎస్ లో ఎలా బ్రతికినా చచ్చినా నీకు ఫరవాలేదా ? నా కూతురు అమెరికాలో భర్తతో హేపీగా ఉందని గొప్పలు చెప్పుకుంటూ, అబధ్దాలు చెప్పుకుంటు బ్రతికేస్తారా ?
నో వే మమ్మీ.. నాకు అంత ఖర్మ పట్ట లేదు..
రేపు ఎవరైనా మీ అమ్మాయి యు..ఎస్ ఎప్పుడు వెడ్తోంది అని అడిగితే ఎప్పటకీ వెళ్లదని, డివోర్స్ తీసుకుంటోందని, కారణం ఇదని ధైర్యంగా చెప్పు.. అంతేకానీ, రక రకాల కధలు, అబధ్దాలాడుతూ మిమ్మలని మీరు ఆత్మవంచన చేసుకోకండి..
నేను ఈ విషయాన్ని చాలా మామూలుగా తీసుకుంటున్నా. పెళ్లి గురించి నాకు ఏ ఆలోచనలూ లేకుండానే , మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కీర్తీ పెళ్లి చేస్తున్నాం అన్నారు మీరు. సరే అన్నాను. ఈ అయిదారు నెలల్లో నాకు పెళ్లి వల్ల కలిగిన అనుబంధం ఏదీ లేదు, పోగొట్టుకునేది ఏదీ లేదు. ఇదొక సంఘటన అంతే.
విషయం తెలిసిన మనోహర్ గారు అగ్గిమీద గుగ్గిలం అవుతూ రవితేజ కుటుంబాన్నిరోడ్డుమీద కీడుస్తానన్నారు.. కోర్టులో రవితేజ మీద కేసు వేస్తానన్నారు.. కీర్తి ఆపేసింది ఆయన్ని..
నాన్నా, ఎందుకీ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం? నాకు ఒరిగే లాభం ఏదైనా ఉంటుందా చెప్పండి..
నేనంటే ఇష్టం లేని అతను నాతో కలసి ఉంటానన్నా నాకు ఆనందమా చెప్పండి ?
మరో రెండు రోజుల తరువాత రవితేజ తల్లితండ్రులు ఉదయాన్నే కారులో వచ్చేసారు వీరింటికి..
"ఏమమ్మా కీర్తీ, అబ్బాయి వీసా పేపర్లు పంపిస్తానంటే పంపద్దన్నావుట ? ఏమైంది ?..."
చాలా తెలివైనవాడు రవితేజ.. వీళ్లతో ఇలా చెప్పి ఒక రాయి విసిరి చూసాడన్నమాట.. తన తల్లితండ్రులకు విషయం మొత్తం చెప్పేసానో లేదో అని తెలుసుకోడానికి చేసిన ప్రయత్నం అన్నమాట..
"అవును సుమతిగారూ వద్దన్నాను.."
ఆవిడ తెల్లబోయింది.. అత్తయ్యా మామయ్యా అంటూ ఎంతో ప్రేమగా పిలిచే కీర్తి పేరుపెట్టి పిలిచేసరికి..
"నేను అతనికి డివోర్స్ ఇచ్చేస్తున్నాను.. అతను ప్రేమించిన అమ్మాయినే పెళ్లిచేసుకోమనండి.. పాపం నా మూలంగా ఆ అమ్మాయి ఎందుకు బాధపడాలి ? "
అంటే.... అంటే రవితేజ కి కీర్తి తో పెళ్లి అయినా తాను ప్రేమించిన అమ్మాయిని వదలలేకపోతున్నాడన్న విషయాన్ని గ్రహించేసారు రవితేజ తల్లితండ్రులు .
"చూడు కీర్తీ, పెళ్లికి ముందు రవితేజ ఎవరినో ఇష్టపడ్డాడడని తెలుసు.. కానీ పెళ్లైతే అన్నీ సర్గుకుంటాయని నీతో సర్దుకుపోతాడని భావించి పెళ్లిచేసాం.. నీవు యూ..ఎస్ వెళ్లి రవి తో కలసి ఉంటే వాడు తప్పకుండా మారతాడు.. అతన్ని నీవాడిగా చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది తల్లీ.. ఏదో పొరపాటు జరిగింది.. వాడు చాలా మంచివాడమ్మా.."
"నిజం సుమతిగారూ, ఒప్పుకుంటాను.. ఎంత మంచివాడు కాకపోతే నాకు ఒక చక్కని ఆఫర్ ఇస్తాడు?
నన్ను అమెరికాకు సాదరంగా ఆహ్వానిస్తున్నాడు.. అక్కడకు వెళ్లాకా నన్ను ఎమ్ ఎస్ తన ఖర్చుతో చదివిస్తాడుట, లేకపోతే మంచి జాబ్ ఇప్పిస్తాడుట.. నేను సెటిల్ అయిన తరువాతే నానుండి డివోర్స్ తీసుకుని అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడుట.. ఈలోపుల ఆ అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగిస్తాడుట.. ఈ విషయం అప్పుడే ఎవరికీ చెప్పనవసరం లేదని, తరువాత మెల్లిగా చెప్పవచ్చని సలహాకూడా ఇచ్చాడు..
ఇంకా నయం, ముందరే అంతా చెప్పాడు.. నేను అక్కడకు వెళ్లాకా ఈ షరతులు పెట్టి నన్ను బలవంతంగా ఉంచేసి, నామీద లేనిపోని అభియోగాలు మోపో లేకపోతే నా ప్రాణాలు తీసేసో నా పీడ వదిలిపోయిందని ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే మీకు అసలు విషయం తెలిసేది కాదుగా ? నా మీద శాపనార్ధాలు పెడుతూ నన్నో దోషిని చేసేస్తూ దండోరా వేయించేవారు..
నేను ఎక్కడ ఉన్నా మీ అబ్బాయికి కావలసింది నా నుండి విడాకులు.. దానిగురించి నేను అమెరికా వెళ్లడం ఎందుకండీ?
డివోర్స్ పేపర్లు పంపించమన్నాను.. సంతకం చేసి పంపిస్తాను..
అయినా మీ అబ్బాయి పెళ్లి చేసుకోనంటున్నా అతని మాటలు వినకుండా నన్నో బలిపశువుని చేసేసారు చూడండి, అలా చేయడం మీలాంటి సంస్కారవంతులకు తగిన పనికాదండీ ..
తాను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటానంటే అతన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నన్ను మీ స్వలాభంకోసం వాడుకుందామని చూసారు.. పాపం బెడిసి కొట్టింది..
ఇవిగోనండీ, మీరు పెళ్లికి నాకు పెట్టిన నగలు, పట్టుచీరలన్నీ ఈ సూట్ కేస్ లో సర్దేసాను.. మంగళసూత్రాలూ, మట్టెలూ కూడా ఇందులోనే ఉన్నా"యంటూ వాళ్ల డ్రైవర్ స్వామి ని పిలిచి సూట్ కేస్ ని కారులో పెట్టమంది.. ఇంక వెళ్లవచ్చని మర్యాదగా ఇచ్చిన సంకేతమది..
వారిద్గరి ముఖాలలో నెత్తురు చుక్కలేనట్లుగా పాలిపోయి ఉన్నాయి.. తలవంచుకుని వెళ్లిపోయారు..
శారదా మనోహర్ లు కీర్తి తీసుకున్న నిర్ణయానికి ఒకపక్క బాధపడినా, కీర్తి ధైర్యానికి అచ్చెరువొందారు .. ఏ పనిచేసినా పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే తాము కీర్తి పెళ్లి విషయంలో తొందరపడ్డారు.. ఎందుకంత తొందర పడ్డామా అనుకుంటూ ఆవేదన చెందారు? తమ తొందరపాటు కూతురి జీవితంపైనే ప్రభావితం చూపుతుందని వాళ్లు ఊహించలేదు..
ఇంతలో కీర్తి వీరి దగ్గరకు వచ్చింది.. "నేను తీసుకున్న నిర్ణయం పట్ల మీకు కోపంగా ఉందా?" అంటూ తల్లీ తండ్రీ వైపు చూస్తూ అడుగుతున్న కూతురువైపు ప్రేమగా చూస్తూ " లేదు తల్లీ ముందరే తెలుసుకుని జాగ్రత్త పడ్డావు .. అమెరికా వెళ్లిపోయాకా ఈ విషయం తెలిస్తే నీవెలా తట్టుకునేదానివో, అసలు నీవు మాకు దక్కగలిగేదానివా అని ఆలోచిస్తుంటే ఒళ్లు భయంతో గగుర్పొడుస్తోంది.. మేము నీకు అన్యాయం చేసినా భగవంతుడు రక్షించాడు తల్లీ" అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న వారివైపే చూస్తూ "అన్యాయం చేయడం అనరమ్మా, తొందరపాటు నిర్ణయం అంటారు.. ఫరవాలేదు, నా జీవితంలో ఏర్పడిన ఈ గాయానికి మందు కాలమే నిర్ణయించా"లంటూ అక్కడనుండి తన గదిలోకి వెడ్తున్న కూతురివైపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు..
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం
Comentários