top of page

కోటి రూపాయలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Koti Rupayalu' New Telugu Story


Written By Kidala Sivakrishna


రచన: కిడాల శివకృష్ణ


ధర్మో రక్షతి రక్షితః- ఇది ఒకప్పటి సూక్తి.

నేడు డబ్బో రక్షతి రక్షితః- అంటున్నారు.

ఇలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే మన కథలోకి వెళ్ళాల్సిందే.


ఒక పెద్ద గ్రీన్ హైటెక్ సిటీ ఉంది. ఆ సిటీలో అద్దాలు కలిగి ఆకాశాన్ని తాకే మేడలు ఉన్నాయి. కంటికి చూడ ముచ్చటగా ఉండే పార్కులు, కాలక్షేపం కోసం కోసం సినిమా హాళ్లు.. ఇలా వినోదాన్ని కలిగించే అంశాలు ఎన్నో.


ఇలాంటి అందమైన హరివిల్లు లాంటి సిటీ లో కొన్ని మధ్య తరగతి కుటుంబాలు కూడా జీవిస్తున్నాయి.


కాకపోతే ఇంతటి వినోదాన్ని చూస్తున్న ఒక పద్దెనిమిదేళ్ళ మధ్య తరగతి చెందిన కుర్రాడు తన మిత్రులతో, ఇరుగూ పొరుగూ వారితో, మరియు పెద్దలతో కూడా ఒక్కటే ప్రశ్న గురించి చర్చిస్తూ ఉండేవాడు.


ఆ ప్రశ్న ఏమిటి అంటే "ఇలా ధనవంతులుగా జీవితాన్ని అనుభవించాలి అంటే ఏమి చేయాలి?.." అని.

అపుడు చాలా మంది ‘డబ్బును సంపాదిస్తే ధనవంతులుగా అవుతారు. ఏమి చేయాలి అనుకున్నా చేసెయ్యొచ్చు’ అని చెప్పారు.


‘అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బును ఎలా కూడ బెట్టాలి’ అడిగేవాడు చాలా మందిని.

చాలా మందిని అడిగినప్పుడు చాలా రకాల ఆలోచనలు గురించి చెపుతారు కదా.


అయితే తన మిత్రుడు మాత్రం “నువ్వు ఏమి చేసినా ప్రతి రూపాయి కూడపెట్టు. ఖర్చు పెట్టకు. అప్పుడు మాత్రమే నువ్వు డబ్బును సంపాదించినా నీ దగ్గర ఉంటుంది.

అలా కాక 10 రూపాయలే కదా అనీ.. 100 రూపాయలే కదా అనీ.. ఖర్చు పెడితే ఎంత సంపాదించినా మిగలదు” అని చెప్పాడు.


“సరే.. నువ్వు చెప్పినట్లే చేస్తాను. కాకపోతే నీకు ఈ విషయం ఎలా తెలుసు రా?" అని అడిగాడు ఆ కుర్రాడు.


అప్పుడు తన మిత్రుడు “ఏమీ లేదురా.. నేను స్వామిజీ ఉపన్యాసాలు వింటూ ఉంటాను. ఆయన చెప్పిన మాటలు నీకు చెప్పాను” అని చెప్పాడు.


“సరే మరి. నేను ఎంత డబ్బును సంపాదిస్తే ధనవంతుడుగా అవుతాను? అని అడిగాడు కుర్రాడు.

అపుడు తన మిత్రుడు “ఒక కోటి రూపాయలు సంపాదించాలి అని లక్షం పెట్టుకుని సంపాదించు” అని చెప్పాడు.


సరే అని వెళ్లిపోయాడు కుర్రాడు.


ఈ మధ్య కాలంలో సినిమాల ప్రభావం సమాజం మీద ఎంత ఉందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఆ కుర్రాడు సినిమాలను చూసి, బాగా ప్రేరణ పొంది, ముందుగా పేపర్ వేయడం, ఆటో నడపడం.. ఇలాంటి పనులు చేశాడు. దాదాపు ఆరు నెలలు గడిచినా అరవై వేలు కూడా సంపాదించలేకపోయాడు. ఖర్చులన్నీ పోయి, ఇలా అయితే నేను కోటి రూపాయలు సంపాదించడం కష్టమని భావించిన కుర్రాడు, తన దారిని మళ్లించాలి అని అనుకున్నాడు.


అనుకున్న విధంగానే తన దారిని ఆటలపైన.. అంటే క్రికెట్ బెట్టింగుల పైన వేయసాగాడు. అందులో 2000 రూపాయలు వస్తే 1000 రూపాయలు పోతున్నాయి. ఈ పద్ధతి కూడా మంచి పద్ధతి కాదని గుర్రపు స్వారీ ఆటలలో పందేలు కాయడం మొదలు పెట్టాడు. ఇందులో, వచ్చిన డబ్బులు వచ్చినట్లు పోతున్నాయి. అందువల్ల ఈ మార్గాన్ని కూడా వదిలేశాడు. చిన్నగా వ్యాపారం చేద్దామా అంటే అంత డబ్బు లేకపోయే! కాబట్టి చిన్న ఉద్యోగం చేయడం మంచిది అని ఆలోచించ సాగాడు.


ఆ ఆలోచనని అమలు చేసే విధానంగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు. కొన్ని కంపెనీలకు ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు. అందులోనూ ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలో చేరాడు. ఎంత కష్టమైనా ఓర్చుకుంటూ జీతం కోసం పనిచేయసాగాడు. ఆ విధంగా సంవత్సరానికి లక్ష నుండి రెండు లక్షల వరకు కూడా బెట్ట సాగాడు.


పెళ్లి చేసుకుంటే డబ్బులు సంపాదించడానికి కష్టం అవుతుంది అని పెళ్లి చేసుకోవడం కూడా మానేశాడు. ఇలా కొన్ని సంవత్సరాలకు ముప్పై వేల జీతాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ విధంగా అతడికి 40 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి యాబై, యాబై ఐదు లక్షల రూపాయల వరకు సంపాదించాడు. ఆ విధంగానే ఇంకా పది, పదిహేను సంవత్సరాలు కష్ట పడితే కోటి రూపాయలు సంపాదించడం సులభం అవుతుంది అని ఆలోచిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.


50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఆయన 97 లక్షల రూపాయల వరకు డబ్బును సంపాదించాడు. ఇంకా 3,4 నెలలు కష్టపడితే కోటి రూపాయలు సంపాదిస్తాను అనే సంతోషంలో ఉన్నాడు. అనుకున్న విధంగానే ఆయన లక్ష్యాన్ని సాధించాడు. అంటే కోటి రూపాయలు సంపాదించాడు అన్నమాట.


ఈ విషయాన్ని తన మిత్రుడి దగ్గరకి వెళ్లి చెప్పి “ఇంత డబ్బు సంపాదించాను కదా.. ఏమి చేయాలి?” అని అడిగాడు.

అపుడు తన మిత్రుడు “ఒక బుల్లెట్ బైక్ తీసుకోరా” అన్నాడు.


అపుడు ఆయన “అరే.. నాకు 50 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇప్పుడు కష్టం రా దాన్ని తోలడానికి ఇబ్బందిగా ఉంటుంది” అన్నాడు.


“సరే మరి కార్ తీసుకోరా” అన్నాడు.


“అరే.. నా ఒక్కడికే అంత పెద్ద కార్ అవసరం లేదు కదరా” అన్నాడు.


“అందుకే రా.. నువ్వు 2 లక్షలు సంపాదించిన్నపుడు ఒక బుల్లెట్ బైక్ తీసుకొని ఉంటే,,,, లేదా 10 లక్షలు సంపాదించినప్పుడు కార్ తీసుకొని ఉంటే కొంచెం అన్నా సంతోషంగా ఉండేవాడిని కదా! పాతిక సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే కుటుంబ అనురాగాలు, ఆప్యాయతల గురించి తెలుసుకునే వాడివి. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఏమి లాభం చూడు..


అంటే నువ్వు సంపాదించింది అంతా నీకు పనికిరాకుండా పోతుంది. ధనవంతులుగా బ్రతకడం అంటే కార్లలో తిరగడం, సినిమాలు చూడటం, పెద్ద పెద్ద బంగళాల మధ్య జీవించడం కాదురా,..!!


పెళ్ళాం పిల్లలతో పూరి గుడిసెలో అయినా మూడు పూటలు అన్నం తిని అయినా, గంజి తాగి అయినా సంతోషంగా జీవించే వాళ్లేరా, అసలైన ధనవంతులు అంటే.


సరే గానీ నీకు డబ్బు ఉన్నందుకు నువ్వేమైనా రోజుకు 10 పూటలు తింటున్నావా, కనీసం 5 పూటలు కూడా తినలేవు కదా! ఎంత సంపాదించినా రోజుకు మూడు పూటలే తినేది.


ఏమీ సంపాదించని వాడు అయినా మూడు పూటలు మాత్రమే తింటాడు. అందుకే అందరూ అనేది.. ఏ వయస్సులో చేయాల్సిన పని ఆ వయస్సులో చేయాలి అని” అన్నాడు తన మిత్రుడు.


అపుడు ఆయన తన జీవితంలో ఏమి పొందలేకపోయాడో తెలుసుకున్నాడు. ఇలా ఎన్నో కోల్పోయాను అని బాధపడుతూ ‘జీవితంలో డబ్బు అవసరమే. కాకపోతే డబ్బులే జీవితం కాదు. పెళ్లి, పిల్లలు, బంధాలు, బాధ్యతలు, ప్రేమానురాగాలు.. అన్నీ ఉంటేనే జీవితానికి ఒక అర్థం ఉంటుంది’ అని తెలుసుకొని, అతడు సంపాదించిన డబ్బును అనాధ శరణాలయానికి పూర్తిగా ఇచ్చేసి, ఆ పిల్లలతోనే కొంత వరకు ఆనందాన్ని పొందుతున్నాడు.


ఈ విధంగా తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేశాడు.


సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.









67 views0 comments
bottom of page