top of page

ఊహకందని నిజం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Uhakandani Nijam' Telugu Story Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

అప్పుడే కోడలు మాధవి అందించిన కాఫీ కప్పులోని వేడి ఫిల్టర్ కాఫీని సిప్ చేస్తున్న మీనాక్షి మొబైల్ ఫోన్ రింగైంది..

అమెరికాలో ఉంటున్న కూతురు మేఘన నుండి ఫోన్..


“ఏమిటే మేఘూ, ఇంకా పడుకోలేదా ?”

“ఇప్పుడు రాత్రి తొమ్మిదే కదా అమ్మా మాకు.. బాబు ఇంకా పడుకోలేదు.. మీ అల్లుడు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు.. ఇంతకీ నీవేమి చేస్తున్నావు అమ్మా ?”

“ఇంతక మునుపే లేచాను.. కాఫీ తాగుతున్నానే..”

“అదృష్టవంతురాలివి.. అన్నీ తమరి కాళ్లదగ్గరకే నడచి వస్తాయి కదా !

ఏం, నీవు కలుపుకోలేవా కాఫీ.. పాపం వదినే అందివ్వాలా ? కాస్త అటూ ఇటూ తిరిగితే నీకే మంచిది కదా అమ్మా.. ఒళ్లొస్తోంది అంటావు కదా, అది తగ్గుతుంది కదా మూవ్ మెంట్ ఉంటే..”


“సరేలేవే, ఏమిటీ విశేషాలూ ?”


“పెద్ద విశేషమే ఉంది..

మేము వచ్చే శుక్రవారం రాత్రి కి ఇండియా వస్తున్నాం.. టిక్కెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి..”


“అదేమిటీ? ఉరుములేని పిడుగులా .. చెప్పనేలేదు ఇంతవరకూ..”


“నీకు మాత్రమే చెపుతున్నాను .. మా అత్తగారు వాళ్లకూ చెప్పలేదు, చెప్పం కూడా.. నీవూ చెప్పకు.. సర్ప్రైజ్ చేయాలని.”

.

కూతురికి తనమీద ఉన్న ప్రేమకు పొంగిపోయింది మీనాక్షి.. ఇంట్లో మేఘనా తనూ ఎప్పుడూ ఒకటే.. కొడుకు పవన్ కి మాత్రం అచ్చం వాళ్ల నాన్నబుధ్దులే వచ్చాయి.. చాలా నెమ్మది.. ఏమీ పట్టదు వాడికి.. మేఘన అలాకాదు, ప్రతీ విషయం తనతో షేర్ చేసుకుంటుంది.. పెళ్లైనాక కూడా..

“ఇంతకీ ఇక్కడ నుండి ఏమి కావాలి నీకు?”

“మేకప్ సామాన్లు అయిపోయాయి మేఘూ.. వాటితోబాటూ పర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా..”


“అలాగేలే, వదినకు కూడా తెస్తాను..”

“చూడు మేఘూ, అందరికీ సూట్ కేస్ లనిండా సామాన్లు నింపి తేనవసరంలేదు..” తన మాటలు లోపలున్న కోడలికి వినపడ కూడదనుకుంటూ గొంతు తగ్గించింది..


“ముందూ వెనుకా చూసుకోవే మేఘనా..”


“అమ్మా! నీ సోది ఆపు.. ఎప్పుడో ఒకసారి వస్తాం, నాకు అందరూ ఒకటే..

సరేలేగానీ ఏయిర్ పోర్టుకు నేనూ మీ నాన్నా చిన్న కార్ లో వస్తాం.. అన్నయ్య పెద్ద కార్ లో వస్తాడు..”

“అమ్మా, ఇంతకీ మేము నేరుగా మా అత్తగారింటికి వెడతాం.. మీరెవరూ రానవసరంలేదు రిసీవింగ్ కి..”


మీనాక్షి నివ్వెరపోయిందో క్షణం.. చాలా అసహనంగా ఫీల్ అవుతూ “అదేమిటే మేఘూ, ఎప్పుడూ లేంది నేరుగా అక్కడకు వెళ్లడం ఏమిటి?” అంది.


“అవునమ్మా, ఇండియాలోనున్న ఈయన స్నేహితుడికి ఆల్రెడీ చెప్పేసారు మీ అల్లుడు.. అతను తన ఇన్నొవా కారు తెచ్చి మమ్మలని నేరుగా మా అత్తగారింట్లో దింపుతానన్నారు.. “

తను ఇంకా కూతురితో ఏదో మాట్లాడానుకుంటోంది.. ఈలోపుల మేఘనే ‘ఇండియా చేరుకున్నాక ఫోన్ చేస్తాను.. నాన్నకు అన్నయ్యవాళ్లకు కూడా చెప్పు.. మా అత్తగారికి మాత్రం చెప్పకు, బై’ అంటూ ఫోన్ పెట్టేసింది..


కూతురు నేరుగా అత్తవారింట్లో దిగడం ఆవిడకు రుచించచడం లేదు.. మేఘన తన మాట వింటున్నట్లే ఉన్నా ఒకోసారి తనకు నచ్చినట్లే చేస్తుంది.. ఎవరూ ఒప్పించలేరు దాన్ని..

అనుకున్నట్లుగా మేఘనా వాళ్లూ ఇండియా చేరుకోవడం, అత్తవారింటికి చేరుకున్న తరువాత తల్లికి క్షేమంగా చేరామని ఫోన్ చేస్తూ, ‘తరువాత తీరికగా మాట్లాడుతాను అమ్మా, ఫ్లైట్ నాలుగు గంటలు డిలే మూలాన అలసటగా ఉందం’టూ ఫోన్ పెట్టేసింది..


మీనాక్షి ఒకటే హైరాన పడిపోతోంది.. ఆవిడకన్నీ సందేహాలూ, అనుమానాలూ.. ఒకచోట నిలవలేకపోతోంది.. కూతురు అలా నేరుగా అత్తవారింటికి వెళ్లడం భరించలేకపోతోంది..


మర్నాడు శనివారం ఉదయం వియ్యపురాలు శారద నుండి ఫోన్..

“ బాగున్నారా వదినగారూ” అంటూ, “అబ్బాయీ కోడలూ మనవడూ అమెరికానుండి వచ్చారు.. ముందస్తుగా ఏమాత్రం చెప్పకుండా సర్ప్రైజ్ చేసేసారు.. ఎవరికీ చెప్పలేదన్నారు, మీకూ తెలియదేమో కదూ ?”


“అవును వదినగారూ , మేఘన నిన్న రాత్రి మీ ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి చెప్పేసరికి ఆశ్చర్యపోయాం అందరమూనూ..

ఏమిటీ ఇంత హఠాత్తుగా వచ్చారనుకున్నాం..”

“అవునండీ వదినగారూ, ఆనందంతో కడుపునిండి పోయిందనుకోండి.. రేపు ఆదివారం పొద్దుటే మా ఇంటికి లంచ్ కి వచ్చేయండి.. రాత్రి దాకా వాళ్లతో సరదాగా గడపచ్చు.. మీ అన్నగారు కూడా అన్నయ్యగారితో చెపుతానన్నారు.. మీ అబ్బాయి, కోడలు, మనవడూ మనవరాలు సమేతంగా” అంటూ పదే పదే చెప్పి ఫోన్ పెట్టేసిందావిడ..


ఏమిటో ఈవిడ ఆనందంతో అంత ఉబ్బితబ్బిబ్బురాలైపోతోంది.. రేపు వస్తూ వస్తూ కూతురినీ, మనవడినీ తనతోబాటూ తెచ్చేసుకోనూ అని దృఢంగా అనుకోసాగింది.. అప్పుడు గానీ ఆవిడ మనసు శాంతించలేదు..


మర్నాడు ఆదివారం అందరూ కలుసుకున్నారు.. వియ్యపురాలిగారిల్లు పండగ వాతావరణం అలుముకుంది.. హడావుడిగా ఉంది.. కూతురు అందరి సమక్షంలో సూట్ కేస్ లు తెరిచి తెచ్చిన బహుమతులు అందరికీ పంచిపెడ్తోంది.. ముందుగా అత్తగారికి మామగారికి ఇస్తూ, ఆడపడుచుకి తెచ్చినవి పక్కన పెట్టి మిగతావి తల్లి తండ్రికి అన్న, వదినకు ఇచ్చింది.. అదివరకు కూతురు వచ్చినప్పుడల్లా ముదుగా సూట్ కేస్ లు తనే చొరవగా తెరిపించి తనకు కావలసినవన్నీ పక్కన పెట్టేసుకునేది.. ఈసారి కూతురు అలా చేయడం ఆవిడకు చాలా నామోషిగా అనిపించి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది..


భోజనాలు అయిపోయి అందరూ హాల్ లో కూర్చున్నపుడు అల్లుడు అవినాష్ మాట్లాడడం మొదలు పెట్టాడు.. “మీకు నేను చెప్పబోయే విషయం ఆశ్చర్యంగా ఉండచ్చు.. మేము ఇంత సడన్ గా ఎందుకువచ్చామా అనుకోవచ్చు.. మేము శాశ్వతంగా అమెరికాకు బై బై చెప్పి వచ్చేసాం..”

ఈ మాట వినగానే మీనాక్షి నెత్తిన పిడుగు పడినట్లైంది.. నమ్మలేక కూతురి వైపు చూసేసరికి మేఘన నవ్వుతూ అవునన్నట్లుగా సంకేతమిచ్చింది..


“అప్పుడే రెండుమూడు నెలల నుండి ప్రయత్నం చేస్తున్నాను.. ఇక్కడ ఇండియన్ కంపెనీలో నాకు పోస్టింగ్ దొరికింది.. అసలు ఇండియా వెళ్లిపోదామని ప్రోత్సహించింది మేఘనే ! తను చెప్పగానే నేను ప్రయత్నం చేయడం ఇక్కడే మా కంపెనీలో ఆఫర్ దొరకడం అన్నీ ఒకదానివెంట మరొకటి ఫాస్ట్ గా జరిగిపోయాయి.. మా నిర్ణయం మీకు ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నా”నంటూ అందరివైపూ చూసాడు..

వెంటనే అవినాష్ తల్లి శారదగారు " అవినాష్, మీకిద్దరికీ ఏది మంచో ఏది కాదో బాగా తెలుసు .. ఒక దశ దాటిన తరువాత ఎవరి భవిష్యత్ గురించి వాళ్లే నిర్ణయం తీసుకోవాలి.. అప్పట్లో యూఎస్ లో ఎమ్ ఎస్ చదువుతానంటే సరేనన్నాం,, నీ ఇష్టానికి కూడా విలువ ఇవ్వాలని.. ఆ తరువాత జాబ్ వచ్చింది.. జీవితంలో బాగా స్థిరపడ్డావు.. నీ భవిష్యత్ ను శాసించే అధికారం ఎవరికీ లేదు.. నీ నిర్ణయం సరైనదని నీవు భావిస్తే చాల”ని ఆవిడ సమాధానమిచ్చారు..


తరువాత అత్తగారు మామగారి వైపు చూస్తూ “మీరు మామయ్యగారూ..” అనగానే, “మంచి నిర్ణయం అవినాష్” అని ఆయన, పవన్, మాధవి కూడా “గుడ్ డెసిషన్” అంటూ వాళ్లను అభినందించారు.. ఎటూ ఏమీ మాటలాడనిది ఒక్క మీనాక్షిగారే.. ఆవిడ ముఖం నల్లగా మాడిపోయింది.. పెదాలు బిగించుకుని కూర్చుండిపోయింది మౌనంగా..

అక్కనుండి వీడ్కోలు తీసుకునే ముందు కూతురు తమతో వస్తుందేమోనన్నట్లు చూసింది.. ఈలోగా అవినాష్ “అత్తయ్యగారూ, రేపు మా చెల్లి శైలజ విజయవాడ నుండి వస్తోంది మమ్మలని చూడాలని.. రెండుమూడు రోజులుంటుందిట.. అది వెళ్లగానే నేను మేఘనా వినయ్ తో కలసి మీ ఇంటికి వస్తాము..అవునమ్మా, అప్పుడు వచ్చి రెండు రోజులుంటా”నని చెప్పేసరికి ఈవిడ గొంతుక ఎండి పోయింది మాటలు పెగలక..


మూడురోజుల తరువాత అల్లుడు వచ్చి కాసేపు కూర్చుని మేఘనను వినయ్ ను అత్తగారింట్లో దింపి వెళ్లిపోయాడు..

మేఘనతో ఫ్రీగా మాట్లాడడం కుదరనేలేదు.. మనసు రగిలిపోతోంది ఒక పక్క..


చక్కగా అమెరికా సంబంధం వచ్చిందని, అత్తవారి పోరు ఉండదని పెళ్లి చేసి అమెరికా పంపిస్తే ఇది చేసిన నిర్వాకం ఇదన్నమాట.. మనసులోని మాటలను బైటకు కక్కేసింది అణచుకోలేక..


“అదేమిటే మేఘూ, ఉన్న ఫళంగా మూటా ముల్లె సర్దుకుని ఇండియా వచ్చేయడమేమిటే ? అందరూ అమెరికా వెళ్లిపోతుంటే ఇక్కడేదో స్వర్గం ఉందనుకుంటూ ఉబలాటపడిపోతూ వచ్చేసి, పైగా మా నిర్ణయం సరైనదేనంటూ ఆ ప్రగల్భాలు ఏమిటే ?

అవినాష్ ఇండియా వెళ్లిపోదాం అనగానే గంగిగోవులా తలూపడమేనా ? వద్దని చెప్పలేవా? ఆవిడ ఆగ్రహావేశాలతో కూతురిని ప్రశ్నించింది..


“అమ్మా, నేను చెప్పేది వింటావా ?”


“ఏమిటే చెప్పేది? ఇక్కడ మీ ముసలి అత్త మామలకు వెట్టి చాకిరీ చేస్తూ పడుంటావా ? అవినాష్ చాలా తెలివిగా నిన్ను మభ్యపెట్టాడనిపిస్తోంది.. పైగా నీ ప్రోత్సాహమేనంటూ నీమీద నెట్టేసి తప్పుకుంటున్నాడు..”


“నన్ను ఎవరూ మభ్యపెట్టలేదమ్మా.. నేనే వెళ్లిపోదామని అవినాష్ ని ఒప్పించేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది..

అయినా అమ్మా, ముసలి అత్తమామలంటున్నావు, మీరు ముసలాళ్లుకాదా ? వదిన కూడా మిమ్మలని చూస్తూ అలాగే అనుకుంటోందేమో?

నేను గమనిస్తూనే ఉన్నాను.. వదిన జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పనంతా తనే చేస్తుంది.. నీవు వదినకు కనీసపు సహాయం కూడా చేయవు.. కానీ వదిన మీకు చేయాలి.. కోడలిగా ఆమె బాధ్యత అనుకుంటావు.. నేను మాత్రం మా అత్తమామలకు చేయకూడదు..

ఇదేమి సిధ్దాంతమమ్మా?


మా అత్తగారు ఎంత కష్టజీవో ఆ మధ్య మా వారు చెపుతుండగా విని ఆశ్చర్యపోయాను.. నీకేమీ, నీవు హాయిగా ఇంటి పట్టునే ఉంటే నాన్నగారు సంపాదించి తెచ్చేవారు.. కష్టం అంటే ఏమిటో తెలియదు.. అన్నీ నాన్నగారే చూసుకున్నారు..


మా అత్తగారు ఆవిడ ఇరవయ్యవ ఏట జాబ్ లో చేరారుట.. నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసారటమ్మా.. ఉదయం నాలుగు గంటలకే లేచి అన్నీ పనులు చేసుకుని ఏడున్నరకి ఫేక్టరీకి వెడితే సాయంత్రం అయిదున్నరకు వచ్చేవారుట.. మామయ్యగారు ఆఫీస్ ఇన్సపెక్షన్ టూర్లమీద నెలకు పదిహేను రోజులు టూర్లు వెడుతూ ఉంటే, పిల్లల చదువులు, బాధ్యత అంతా మా అత్తగారిదేట.. పైగా నెలకొకసారి స్కూల్ టీచర్లను కలసి వాళ్ల పోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఏ సబజక్టు లో వీక్ గా ఉన్నారో తెలుసుకుంటూ దగ్గర కూర్చుని చదివించేవారుట..


నీవు ఎప్పుడైనా మా గురించి అంత శ్రధ్ద తీసుకున్నావా ? ఎప్పుడూ మీ అక్కచెల్లెళ్లు, అన్నయ్యల ఇంట్లో పెళ్లిళ్లూ, ఫంక్షన్లూ అంటూ మమ్మలని ఇంట్లో వదిలేసి వెళ్లిన రోజులున్నాయి.. నాన్నగారే మాకు అన్నీ చేసి పెట్టేవారు..


ఒక్కరోజు పనిమనిషి రాకపోయినా వదిన పనిమనిషి స్థానాన్ని తీసుకున్నా కూడా నేను అమెరికాలో ఉన్నపుడు నీవు నాకు ఫోన్ చేసి చెప్పేసేదానివి పనిమనిషి రాలేదని.. చిన్న జలుబు వచ్చినా ముక్కుతూ మూలుగుతూ చెప్పాల్సిందే.. చివరకు చిన్న చీమ కుట్టినా చెప్పేస్తావు..”


“చీమ కుడితే ఎప్పుడు చెప్పానే మేఘూ ?”

తల్లి అమాయకత్వపు తీరుకి ఫక్కుమంటూ నవ్వేసింది..


“ఓసి పిచ్చి అమ్మా, నిజంగా చీమ అని కాదు.. అటువంటి చిన్న విషయాలను కూడా ఓర్చుకోలేక చెప్పేస్తావని.. కానీ మా అత్తగారు కానీ మామగారు కానీ ఏనాడూ వారి సమస్యలను మాకు చెప్పరు.. ఆ మధ్య వారం రోజులు విపరీతమైన కీళ్లనొప్పులతో మా అత్తయ్యగారు లేవలేకపోయారుట.. అప్పుడే పనిమనిషి కూడా రాలేదుట.. పాపం పెద్దాయన మామయ్యగారే అన్నీ చేసి పెట్టారుట.. ఆయనకు కూడా బి..పీ, సుగర్ ఉంది కదా..”


“ఏం మీ ఆడపడుచు ని పిలిపించుకోవచ్చుకదా ?”

“అమ్మా, శైలూకి కూడా అత్తగారూ మామగారూ ఉన్నారు.. ఉమ్మడి కుటుంబం.. తను ఇక్కడకు వచ్చి ఎన్నాళ్లు చేయగలదమ్మా? తనకీ ఇద్దరు చిన్న పిల్లలు..


విజయవాడలో ఉంటున్న ఆడపడుచు భర్త డాక్టర్.. వాళ్లది ఉమ్మడి కుటుంబం..


ఆ సమయంలో మావారు ఎందుకో అనుకోకుండా అత్తయ్యగారికి ఫోన్ చేస్తే ఆవిడ గొంతుకు చాలా నీరసంగా అనిపించి ఏమిటమ్మా బాగా లేదా అని తరచి తరచి అడిగితే అప్పుడు చెప్పారుట..మోకాళ్ల నొప్పులతో కదలలేకపోతున్నానని.. మేమిద్దరం ఎంత బాధ పడ్డామో తెలుసా ?


ఇదంతా విన్నాకా నాకే అనిపించింది, వాళ్లను అలా వదిలేసి ఇక్కడమేము ఉండిపోవడం సబబు కాదని.. ఈ వయసులో వారికి ఆసరాగా ఉండాలని..”

“సమస్యలు రాకుండా ఉంటాయా మేఘూ ? అందరూ మీలాగే పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నారా ?

నీ గురించి ఎన్ని కలలు గన్నాను ? అమెరికాలో నా కూతురు హాయిగా ఆనందంగా కాపురం చేసుకుంటోందని మురిసిపోయాను.. అందరికీ గొప్పగా చెప్పుకున్నాను..

అలాంటిది చక్కని అదృష్టాన్ని జారవిడుచుకున్నారు కదే ? నీ అత్తగారికీ మామగారికీ చాకిరీ చేస్తూ పడుండు.. నాకేమిటీ” అంటూ ఆవిడ నిష్టూరంగా మాట్లాడుతూనే ఉంది..


“అమ్మా నీ సంస్కారం అంతేనా ? నీకు సాగుతోంది కాబట్టి అలా మాటలాడుతున్నావు.. వదిన నీకు చాకిరీ చేయడం లేదా ? నీవు తాగేసిన కాఫీ కప్పుకూడా వదినే తీసుకుని వెళ్లాలి.. వదినే నీకు సహకరించపోతే అప్పుడు కూడా నీవు ఇలాగే మాటలాడతావా?

అన్నయ్య పై చదువుల కోసం అమెరికా వెళ్లను ఇక్కడే ఉంటానంటే నీవు మాటలాడలేదు.. అప్పుడు అన్నయ్యను పట్టుబట్టి ఎందుకు పంపలేదు ? ఇక్కడే ఉండడం నీకు సబబు అనిపించింది..దూరదృష్టితో ఆలోచించావు.. అది నీ స్వార్ధం కాదా ?

కానీ నాకు పట్టుబట్టి అమెరికా సంబంధం చేసావు..

అయినా ఇప్పుడు మా భవిష్యత్ కి వచ్చిన లోటేమిటి ? మేము ఇన్నాళ్లూ సంపాదించుకున్నది ఉంది.. అవినాష్ కు ఉద్యోగం ఉంది.. మా మామగారు కట్టించిన ఇల్లు ఉంది..ఇంతకంటే ఏమి కావాలమ్మా ?”


“ఎన్నైనా చెప్పు మేఘూ, మీరు చేసిన పనిని హర్షించలేకపోతున్నాను.. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక్కమాట నాకు చెప్పి ఉండాల్సింది..”


“నేను చేసిన మంచి పని ఏదైనా ఉంటే ముందుగా నీకు చెప్పకపోవడమే అమ్మా.. చెపితే ఎంత రాధ్దాంతం చేస్తావో నాకు తెలియదా ?

అమెరికాలో నా ఫ్రెండు రాధిక అంటూంటే అప్పుడు ఏమీ అర్ధం కాలేదు, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజమేనని పిస్తోంది. “

“ఏమిటే ఆ నిజం, నీవూ, నీ అర్ధంకాని మాటలూనూ ? అమెరికానుండి పరుగెత్తుకు వచ్చేసి కూడా ! “


“అమెరికాలో ఆ మధ్య నా స్నేహితురాలు రాధిక ‘ఇండియాలో ఆడ పిల్లల పెళ్లిళ్లు విఫలమవడానికి , వాళ్ల సంసారాలలో కలతలు రేగడానికి ముఖ్యకారణం చాలావరకు ఆడపిల్లల తల్లితండ్రులే’ అంటే ‘అదెలా’ అంటూ వాదించాను . ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూసాక, వంద శాతం నా స్నేహితురాలన్నది నిజం..


అమ్మాయి అత్తమామలతో కలసి ఉండకూడదు, వాళ్లకు దూరంగా స్వేఛ్చగా ఉండాలని అనుకుంటారుట.


మీ అత్తమామలతో కలసి సఖ్యతగా ఉండాలి, వాళ్లను గౌరవించడం నేర్చుకో అని బుద్ధిచెప్పే తల్లితండ్రులు కరువౌతున్నారని అంటుంది.. కూతురిని వేరు కాపురానికి ప్రోత్సహించేది కూడా వారేనంటుంది..”


“అంటే, నేను మరీ అంత దుష్టురాలిగా కనిపిస్తున్నానుటే మేఘనా ?”

“మరి లేకపోతే ఏమిటమ్మా ? నీవూ ఒక తల్లివి.. నీ కోడలు నిన్ను చూసుకోవాలి, నీకు సేవలు చేయాలి అని కోరుకున్నప్పుడు, నీ కూతురు కూడా ఆమె అత్తమామలను చూసుకోవాలని ఎందుకు అనుకోవమ్మా..

మా ఆడపడుచు వచ్చి మా అత్తమామలను చూసుకోవచ్చు కదా అంటూ రూల్ గా మాట్లాడావేగానీ, తనకూ ఒక కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేకపోయావు ? కాస్తంత సంస్కారంగా సున్నిత హృదయంతో ఆలోచించమ్మా..”


మేఘన మాటల్లో ఎంతో సబబు ఉన్నట్లు తోస్తోంది.. కూతురు ఎంతో హుందాగా అత్తవారింట ఒక కోడలిగా తన బాధ్యత ఏమిటో చెపుతుంటుంటే ఇంత కుసంస్కారిగా తను ఆలోచించడం సమంజసం కాదనుకుంది..ఒక తల్లిగా కూతురికి మంచి మాటలు చెప్పాల్సిన తాను ఇలా దాని నిర్ణయాన్ని ప్రోత్సహించకపోవడం అమానుషం .


కాసేపటికి కూతురిని దగ్గరకు పొదుపుకుంటూ “నిజమే మేఘూ నాది స్వార్ధమనుకో, నీ మీద అమితమైన ప్రేమనుకో, మరేదేమైనా అనుకో, నీ మాటలు నన్ను ప్రభావితం చేసాయి.. ఒక తల్లిగా, అత్తగారిలా నా ప్రవర్తన ఎలా ఉండాలో నాకు అర్ధమైంది.. నీ నిర్ణయం నాకూ ఆనందాన్నిస్తోంది.. నీ భర్తతో, పిల్లా పాపలతో అత్తవారింట్లో ఒక మంచి కోడలుగా నిండునూరేళ్లు జీవించు తల్లీ” అంటూ కూతురికి పసుపు కుంకుమలు, సారె నిచ్చి అత్తవారింటికి సాగనంపింది..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.


ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం229 views0 comments

Comments


bottom of page