top of page

నీలాకాశంలో తారక

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Neelakasamlo Tharaka' Telugu Story Written By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త


నీల కనకమ్మా రాజయ్యల గారాల బిడ్డ..

కనకమ్మ కి తల్లితండ్రులు పదహారు సంవత్సరాలప్పుడు రాజయ్యతో వివాహం జరిపించారు.. పెళ్లైన సంవత్సరానికే నీల కడుపున పడింది.. రాజయ్య ఆ ఊళ్లో ఒక హాస్పటల్ లో నైట్ వాచ్ మేన్ గా పనిచేస్తున్నాడు.. పెద్ద సంసారం, తల్లీ తండ్రీ పెళ్లైపోయిన అక్కలు, ఆటో డ్రైవర్ గా ఆటో నడుపుతున్న పెళ్లికాని తమ్ముడు.. కనకమ్మ ఆ ఊరిలోని నలుగురిళ్లల్లో పాచిపనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది..


కూతురు పుట్టినప్పుడు నీలాకాశంలో ఒక తారక తళుక్కుమని మెరిసిందంటూ నీల అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు.. నీల ఆ తారకలా తమ జీవితాల్లో మెరుపులు కురిపించాలని, పుట్టిన బిడ్డ తమలా కష్టపడకుండా బాగా చదివించి ప్రయోజకురాలిని చేయాలని, ఒక బిడ్డ చాలనుకుంటూ నీలతో సరిపెట్టు కున్నారు.. రాజయ్య తల్లీ తండ్రీ గొడవచేసినా రాజయ్య వినలేదు..


నీల చాలా చురుకైనది.. రాజయ్య నీలను కష్టపడి ప్రైవేటు స్కూల్ లోనే చదివిస్తున్నాడు.. చాలామంది గవర్నమెంటు స్కూల్ లో చదివించచ్చు కదా అన్నా నా బిడ్డ ఇంగ్లీషు చదువులు చదివి గొప్పది అవాల, పెద్ద ఆఫీసర్ గా చూడాల అంటూ అందరి దగ్గరా గర్వంగా చెప్పుకుంటాడు..


నీల ఒక్కసారి చదివితే చాలు పాఠ్య సారాంశాన్ని మెదడుకి పట్టించుకునే దానినే రెవ్యూ చేసుకుంటూ ఉంటుంది.. స్కూల్ లో ఆరోజు ఏమి చెప్పారో, టీచర్ అడిగిన ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతే తానొక్కర్తే చెప్పేసరికి గుడ్ అన్నారు నాన్నా అని చెపితే ఆ తండ్రి కళ్లల్లో అప్పుడే తన గారాల పుత్రిక ఎంతో ఎత్తుకి ఎదిగినట్లుగా అనిపించేది..


నీల ఏడవక్లాస్ లోకి వచ్చేసరికే ఆ అమ్మాయి మనసులో తన భవిష్యత్ ను ఎలా తీర్చు దిద్దుకోవాలో, తన తల్లితండ్రులను ఎలా సుఖపెట్టాలోనన్న ఆలోచనలే ఉండేవి.. అమ్మ పనిచేస్తున్న వారింట్లో చదివేసిన న్యూస్ పేపర్లను అడిగి తెచ్చుకుని దేన్నీ వదలకుండా చదివేది.. అలాగే వాళ్ల పిల్లలు చదివి పారేసిన కామిక్స్, చిన్న చిన్న ఇంగ్లీష్ కధల పుస్తకాలూ చదువుతూ తన నాలెడ్జ్ ను పెంపొందించుకోవడం అదీ చేసేది.. తన చుట్టుపక్కల ఉండే గుడిసెలవారి పిల్లలందర్నీ చేర్చి చదివించడం అదీ చేసేది.. ఏడవక్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చింది..


స్కూల్ హెచ్. ఎమ్ ఆ సందర్భంలో నీల తల్లితండ్రులను పిలిచి అభినందించి ఆ అమ్మాయిలో అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయని, బాగా చదివించమని చెపుతూ నీల ఇకనుండి స్కూల్ ఫీజ్ కట్టనవసరంలేదని ఉచితంగా చదువుకోడానికి స్కూల్ కమిటీ సిఫార్సు చేసిందని చెప్పేసరికి కనకమ్మ రాజయ్యల ఆనందం వర్ణనాతీతం..

రోజులు చక చకాగడచిపోతున్నాయి.. రాజయ్య తల్లీ తండ్రీ ఒక సంవత్సరం వ్యత్యాసంలో చనిపోయారు.. రాజయ్య తమ్ముడు పెళ్లి చేసుకుని వేరు కాపురానికి వెళ్లిపోయాడు..


లేత గులాబీ మొగ్గ విచ్చుకున్నట్లుగా నీలలో కూడా శారీరకంగా మానసికంగా పరిపక్వత వస్తోంది..


కష్టపడడమే ధ్యేయంగా, కష్టపడితే వచ్చే ఫలం రుచిని చవిచూసిన నీల టెన్త్ క్లాసులో రాష్ట్రంలోనే మూడవ రేంక్ తెచ్చుకుని ఆ ఊరినంతటినీ దిగ్భ్రాంతిని చేసింది.. ఊరి జనం అంతా కదలివచ్చి చిన్నారి నీలను అభినందించారు.. ప్రతీ వార్తా పత్రికలో నీల ఫొటోనే.. ఒక మురికివాడలో నివసిస్తున్న నీల అనే అమ్మాయి దేశానికే గర్వకారణం అంటూ, ఆమె ఇలాగే ముందు ముందు ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని..

ఆ ఊరిలోనే కాకుండా పక్క ఊర్ల జూనియర్ కాలేజ్ ల యాజమన్యం నీల ఇంటికి వచ్చి ఇంటర్ మీడియట్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఆఫర్ చేసారు..


నీల ను ఎక్కువగా అభిమానిస్తూ చదువులో అనేక సలహాలనిస్తూ ప్రోత్సహిస్తున్న లెక్కల మాస్టారైన రామయ్య గారికి తన మనస్సులోనున్న ఉద్దేశాన్ని చెపుతూ ఆయన సలహా అడిగింది..


" ఏమిటమ్మా నీలా, నీవు ఐ..పి..ఎస్ ఆఫీసర్ వి అవుతావా ? అది రావడం అంత తేలిక కాదమ్మా, చాలా కష్టపడాలి"..


కష్టపడగలను మాస్టారూ, నాకు మీరో సహాయం చేయండి.. నేను ఇంటర్ లో ఎమ్ ఇ సి గ్రూప్ తీసుకుని ఆ తరువాత బి..ఏ లో ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ గ్రూప్ తీసుకుని చదవాలనుకుంటున్నాను.. ఈలోగా ఐ.పిఎస్. సిలబస్ ఆన్ లైన్ లో గేదర్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను సర్.. మీ సహాయం కావాలి ఇందులో" !


" అదేమిటీ, ఐఐటి, ఇంజనీరింగ్ లాంటివి చదవవా?"

చదవనంటూ తలూపింది.. నీల నిర్ణయానికి చాలా ముచ్చటపడ్డాడాయన..

నీల తను అనుకున్నట్లుగా ఇంటర్ మీడియట్ లో కూడా రేంక్ సాధించి బి..ఏ లో చేరిపోయింది.. రాత్రీ పగలూ పుస్తకాలు రిఫర్ చేస్తూ ఎక్కువ సమయాన్ని కాలేజ్ లైబ్రరీలో గడుపుతోంది..

డిగ్రీ లో కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చింది..


తరువాత ఎమ్..ఏ ఎకన్ మిక్స్ లో యూనివర్సిటీ గోల్డుమెడల్ సాధించింది..

ఒక సంవత్సర కాలం ప్రైవేట్ కాలేజ్ లో టీచింగ్ చేస్తూ సివిల్ సర్వీస్ ఎక్జామ్ కి ప్రిపేర్ అవసాగింది..

నోటిఫికేషన్ పడిన వెంటనే యూ..పి..ఎస్ .సి సివిల్ సర్వీస్ ఎక్జామ్ కి అప్లికేషన్ పెట్టుకుంది..


" అమ్మా నీలా, ఇంకా సదువుతావా ? పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం తల్లీ " అని రాజయ్య అనగానే,

" నాన్నా నన్ను మంచి హోదాలో చూడాలనుకున్నారు నీవూ అమ్మాను, నేను అనుకున్నది ఇంకా సాధింనే లేదు.. మరికొంత కాలం ఆగండి నాన్నా"


ఏమిటే నీలమ్మా, అందరూ సెపుతున్నారు ఇప్పటికే నీవు బాగా సదూవుకున్నావని.. ఇంకా సదువుతావా? మన కులంలో నీ కంటే గొప్ప సదువులు ఎవరూ చదవలేదే ?

కనకమ్మవైపు చిరునవ్వుతో చూస్తూ, " అమ్మా నీ కూతురు పోలీసు ఆఫీసర్ అయితే నీకు సంబరం కాదా?"

" ఒకసారి గుర్తు తెచ్చుకో, నాకు అయిదారు సంవత్సరాలున్నప్పుడు రోడ్డు పక్కన ఎవరో పడేసిన చిరిగిపోయిన పాత పోలీస్ కేప్ ను తెచ్చుకుని తలకు పెట్టుకుని నీకు చూపిస్తే, ఎంత బాగున్నావే నీలా పోలీసమ్మలాగ అంటూ మురిసిపోలేదా ?

నేను బాగా చదువుకుని పెద్ద పోలీసమ్మను అవుతానంటే నీ వేమన్నావు?

'మనలాంటి పూరిగుడిసోళ్ల పిల్లలు అవరే పిచ్చిదానా' అన్నావు.. 'గవర్నమెంటోళ్లు ఎప్పుడో వచ్చేసి ఈ గుడిసెలని కూల్చేస్తాం మీరు ఎంటనే ఖాలీ చేయాలని సెపితే మూటా ముల్లేసర్దుకుని , ఈ ప్లాస్టుకి నీళ్ల డ్రమ్ములు నెత్తిమీద మోసుకుంటూ మరో చోట తలదాచుకోడానికి పరుగెత్తాల, మనలాంటోళ్లకి అటువంటి సదువులూ, కొలువులూ అందని సందమామలాంటివే నీలమ్మా' అన్నావు..


'నేను ఎట్లాగైనా పోలీసమ్మని అయి వస్తానమ్మా, మనలాంటి వారెందరో కష్టాలను తీరుస్తా'నంటూ తల్లి మెడచుట్టూ చేతులు వేస్తూ గారాలపోతూ మాట్లాడుతున్న కూతురి వైపు మురిపంగా చూసింది..


తన చిన్నారి నీల సదువుల సరస్వతమ్మే.. సక్కని సదువు అందంతో మెరిసిపోతోంది నా వరాలతల్లి.. నా బిడ్డ కోరిక ఈడేరేటట్టు అనుగ్రహించు దేవుడా అంటూ ప్రార్ఘించుకుంది..

నీల కష్టమో, భగవంతుని అనుగ్రహమో లేక ఆ రెండూ కలబోసిన వరమో గానీ నీల యూ..పిఎస్..సి.. పరీక్ష వ్రాయడం , ప్రెలిమినరీ, మెయిన్సు లోనూ సెలక్ట్ అవడం జరిగిపోయింది.. ఇంకా ఇంటర్వ్యూ ఉంది ఢిల్లీలో..


ఇంటర్వ్యూ రౌండ్ చాలా వైటల్ .. ప్రెలిమినరీ, మెయిన్స్ లో సెలక్ట్ అయినా ఇంటర్వ్యూలో సెలక్టు కాకపోతే అంతా వ్యర్ధమే..


నీల చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది.. కష్టే ఫలి అన్న సూత్రాన్ని బాగా నమ్ముతుంది.. నా వరకు నేను కష్టపడతాను, తరువాత నా అదృష్టం, భగవంతుని కృప అనుకుంటుంది..

అయిదుగురు సీనియర్ ఐ..ఏ..ఎస్ ఆఫీసర్ల పేనల్ ముందు ఎదురుగా ఉన్న సీట్ లో కూర్చుని ఉంది నీల.

ఇంటర్వ్యూ మొదలైంది..


ప్ర 1.. మీరు ఐపిఎస్ ఆఫీసర్ ఎందుకు అవాలనుకున్నారు మిస్ నీలా ?

జ .. సర్, నా ఆశయం సొసైటీలో మార్పుని తీసుకురావాలని.. ఒక సాధారణ వ్యక్తిలా ఉంటూ సొసైటీలో మార్పుని తేవడం కష్టం, చాలా సమస్యలతో కూడుకున్నది.. నేను అనుకున్న మార్పు ని తేవాలంటే నాకు ఈ పొజిషన్ చాలా అవసరమని భావించాను.. సొసైటీలో ఉమెన్ సేఫిటీ, లా అండ్ ఆర్డర్, క్రైమ్ ప్రివెన్షన్ , సోషల్ సెక్యూరిటీలలో డెవలప్ మెంట్, మంచి మంచి మార్పులు తీసుకు రావాలన్నది నా ఆశయం, చిరకాల వాంఛ..


ప్ర 2.. " ఆదర్శ్, అనుపమ్ " అనే ఇద్దరు కవలలు ' మే ' లో పుట్టారు.. కానీ వాళ్ల బర్త్ డే జూన్ లో.. ఇదెలా సంభవం?

జ.. సర్ ' మే' అన్నది ఒక ప్లేస్ నేమ్ , ప్రపంచంలో ఇరవై ఆరు ప్రదేశాలలో లో 'మే ' అనే ప్లేస్ ఉంది.. అమెరికాలో 'మే' పేరు మీద చాలా ప్లేసెస్ ఉన్నాయి..


ప్ర..3.. ఒకరోజు నీవు ఉదయం నిద్రలేవగానే నీకు అర్ధమైనది ఏమిటంటే నీవు ప్రెగ్ననంట్ వని.. ఈ విషయం తెలుసుకున్న నీవు మొట్టమొదటిసారి గా ఏమి చేస్తావు?

జ.. సర్, మాతృత్వపు అనుభూతి ప్రతీ స్త్రీకి అనిర్వచనీయమైనది.. నా ఆనందాన్ని అనుభూతిని ముందస్తుగా నా భర్తతో పంచుకుంటాను..

గుడ్, వెల్ సెడ్.. ధాంక్యూ సర్ !


ప్ర 4.. ఒక క్రిమినల్ కు మరణశిక్ష విధించబడింది. ఛాయిస్ అతనికే ఇచ్చారు.. అతనికి మూడు గదులు చూపారు..మొదటి గదినిండా మంటలున్నాయి, రెండో గదినిండా తుపాకీలు.. తుపాకీని పట్టుకుని చంపడానికి ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు రెడీగా, మూడో గదిలో మూడు సంవత్సరాలనుండి ఏమీ తినకుండా ఉన్న ఒక టైగర్ ఉంది.. ఆ హంతకుడు ఏ రూమ్ ని ఛూజ్ చేసుకుంటాడు ?

జ.. మూడో రూమ్ సర్ . ఎందుకంటే మూడుసంవత్సరాలనుండి టైగర్ తిండి తినకుండా ఈ పాటికి చచ్చిపడిపోయి ఉంటుంది గ్యారంటీగా కాబట్టి..


ప్ర5.. " ఏ స్టేట్ లో బే ఆఫ్ బెంగాల్ " ఉంది మిస్ నీలా ?

జ. " లిక్విడ్ స్టేట్ లో " సర్

" వెరీ స్మార్ట్ "


ప్ర6.. ఎనిమంది కూలీలకు పదిగంటలు పట్టింది ఒక గోడ నిర్మాణం పూర్తి అయ్యేసరికి.. నలుగురు కూలీలకు ఎన్నిరోజులు పడ్తుంది ?

జ.. ఎనిమిది మంది పదిగంటల్లో కట్టేసిన గోడను తిరిగి మళ్లీ కట్టనవసరంలేదు..

"గుడ్ మిస్ నీలా, యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్"

"ఆల్ ది బెస్ట్!"

ధాంక్యూ సర్స్ అంటూ నీల నిష్క్రమించింది..


మరో వారం రోజులకు ఐపిఎస్ ఆఫీసర్ గా సెలక్టు అయినట్లు మూడునెలల ఫౌండేషన్ కోర్సు నిమిత్తమై ముసోరీకి వచ్చి రిపోర్ట్ చేయవలసినదిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానుండి ఎపాయింట్ మెంట్ ఆర్డర్ అందుకున్న నీల ఆనందానికి అవధులు లేవు..


రాజయ్య కనకమ్మల కలలు ఫలించాయి.. తమ గారాల కూతురిని ఉన్నత స్తాయిలో చూడాలనుకున్న రాజయ్య ఆశయం నెరవేరింది.. అతని కనులనుండి ఆనందభాష్పాలు రాలాయి..


ఆ దంపతుల ఆనందానికి నీలాకాశంలోని తారక తళుక్కుమని మెరిసింది..


***శుభం***


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం


47 views0 comments
bottom of page