top of page

నేను ఒంటరిని కాదు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Nenu Ontarini Kadu' New Telugu Story Written By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త" పూర్ణా! నవ్వుతున్నావా ఈ నిర్భాగ్యుడిని చూసి ? నానుండి శాశ్వంతంగా ఎందుకంత తొందరగా వెళ్లిపోయావు ? నీవే ఇప్పుడు ఉండి ఉంటే మనిద్దరం ఒక చిన్న గుడిసెలో ఉంటూ గంజిత్రాగుతూ బ్రతికినా మన పాలిట నందనవనంలా ఉండేది కాదూ ?

అయినా మీకేం తక్కువంటూ పరిహసిస్తున్నావా ? నిజమే మన 'నందూ' ఇంట రాజభోగాలు అనుభవిస్తున్నాను.. ఆనంద్ పెద్ద డాక్టర్ అవ్వాలని కలలు కన్నావు.. కడుపుకట్టుకుంటూ, ఎన్నో ఆనందాలను, సౌఖ్యాలను త్యాగం చేసి మరీ చదివించాం. కానీ కొడుకుని డాక్టర్ గా చూసుకోకుండానే కన్నుమూసావు..


ఆనంద్ ఇప్పుడు పేరుమోసిన పెద్ద డాక్టర్ పూర్ణా..

చిన్నప్పుడు వాడు మట్టిలో ఆడుకుని వస్తే వాడి కాళ్లు కడిగి మెత్తని టవల్ తో తుడిచి మట్టిలోకి వెళ్లకురా నందూ అంటూ కాలు కిందపెట్టనీయకుండా పెంచావు యువరాజులా.. ఇప్పుడు...... జనం వాడిని తివాసీలమీద నడిపిస్తున్నారు.. పెద్ద బంగ్లా, కారులు, ఇంటినిండా నౌకర్లు.. నీవు వాడి గొప్పతనాన్ని హోదాన్ని చూడకుండానే వెళ్లిపోయిన దురదృష్టవంతురాలివైతే, నేను నా పెద్దకొడుకు ఐశ్వర్యాన్ని, హోదాను కళ్లెదుట చూస్తూ కూడా ఇంకా ఎందుకు ఎవరికోసం బ్రతికి ఉన్నానో అర్ధంగాక సతమతమౌతున్న ఒక దౌర్భాగ్యుడ్ని"...

కంటి నుండి స్రవిస్తున్న కన్నీటిని చేతిరుమాలుతో వత్తుకుంటూ ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చుని శూన్యంలోకి చూస్తూ భార్యతో తన ఆవేదనను పంచుకుంటూ ఉండిపోయారు దశరధరామయ్యగారు..


ఆయన మస్తిష్కంలో చెలరేగుతున్న ఆలోచనలు, జరిగిన సంఘటనలు ట్రైన్ వేగాన్ని మించి పరుగెడుతూ అయన ఆవేదనను రెట్టింపు చేస్తున్నాయి..


ఆయన పెద్దకొడుకు ఆనంద్, కోడలు వైశాలి ఇద్దరూ డాక్టర్లే..

ఆనంద్ ది ప్రేమ వివాహం.. ఒక డాక్టరుకి ఉండాల్సిన లక్షణాలేమీ వైశాలిలో భూతద్దం వేసి చూసినా కనపడవు.. డబ్బుగల కుటుంబం నుండి వచ్చానన్న అహం, ఆమె పుట్టిపెరిగిన కుటుంబ సాంప్రదాయం, పధ్దతలు ఆమెను అహంభావిగా మార్చాయి.. మామగారు ఆమె దృష్టిలో ఇంట్లో పడివున్న ఒక వ్యర్ధమైన జీవి అనిమాత్రమే ఆమె భావిస్తుంది.. అంతకంటే ఏమాత్రం విలువ , గౌరవం ఇవ్వదు..


ఒక వారం రోజుల క్రితం ఆనంద్, వైశాలి చాలా హడావుడిగా ఇల్లంతా సర్దిస్తున్నారు.. ఆనంద్ స్నేహితుని కుటుంబం అమెరికా నుండి వస్తున్నారని నౌకరు రాజన్న వంటమనిషితో చెప్పడం తను విన్నాడు.. ఆ వచ్చే స్నేహితుడు, అతని భార్యా కూడా అమెరికాలో డాక్టర్స్ గా పని చేస్తున్నారుట.. ఏదో మెడికల్ కాన్ ఫరన్సు నిమిత్తమై అన్నిదేశాలనుండి కొంతమంది డాక్టర్సు ఇండియా వస్తున్న నేపధ్యంలో వీరూ వస్తున్నారు. ఆనంద్ కు వైశాలికి వాళ్లు బెస్టు ఫ్రెండ్సు కావడంతో వీరింట్లోనే వాళ్ల మకాం.. అందుకే అంత హడావుడి..


వైశాలి ప్రత్యేకమైన శ్రధ్ద తీసుకుని మరీ ఇల్లు అందంగా వినూత్నంగా ఉండాలన్న ఉద్దేశంతో నౌకర్లతో తెగ హడావుడి పడుతోంది.. అసలుకే పాష్ ఏరియాలో కట్టుకున్న అందమైన బంగళా, అందమైన తోట.. ఆ బంగ్లాని చూడాలనే నెపంతో ఆనంద్ స్నేహితులు తరచుగా రావడం గెట్ టుగెదర్లూ వగైరా జరగడం పరిపాటే.. హాలు కెదురుగా గోడకు వేళ్లాడుతున్న అత్తగారి ఫొటోను తీయించేసి స్టోర్ రూమ్ లో పడేయించింది వైశాలి.. దాని స్తానంలో అప్పుడే తెప్పించిన ఆయిల్ పెయింటింగ్ తగిలించింది..


దశరధరామయ్యగారి హృదయం విలవిల్లాడిపోయిందో క్షణం.. అన్నపూర్ణ ఫొటో మెయిన్ హాల్లో జీవకళ ఉట్టిపడ్తూ ఇంట్లోకి వచ్చేవారిని నవ్వుతూ పలకరిస్తున్నట్లుగా ఉండేది.. చాలా మంది తెలియనివాళ్లు అయితే ఎవరిదండీ ఆ ఫొటో, ఎవరైనా గీసిన చిత్రమా, అందులో ఆవిడ భలే అందంగా ఉన్నారని అనడం తను వింటూనే ఉంటాడు.. ఆవిడ మా అత్తగారని చెప్పడం వైశాలి నోటినుండి ఎప్పుడూ వినలేదు ..

' మీ అమ్మ తిధి ఫలానా రోజున రా నందూ"........ ఆరోజు మీ అమ్మ పేరుమీద నలుగురిని ఇంటికి పిలిచి భోజనం పెడితే మీ అమ్మ ఆత్మకు తృప్తి అలాగే మీ అమ్మ దీవెనలు నిన్ను వెన్నాడుతూ ఉంటాయంటే వైశాలి ఏమందో గుర్తుకొచ్చేసరికి ఆయన మనస్సు తల్లడిల్లింది..


' తద్దినాలు పెట్టడంలాంటివన్నీ నేటి కాలంలో ఛాదస్తాలుట, డబ్బు దండగట' , మరి తాను నెలకు రెండుసార్లు స్నేహితులకు ఇచ్చే విందుల మాట ఏమిటి ? తను నిలదీసి అడగ్గలడా? తనతో ఎవరూ మాట్లాడరు.. ఎలా ఉన్నావు నాన్నా అని పలకరించే సమయం ఉండదు ఆనంద్ కి.. చివరికి నౌకరు రాజన్నకు కూడా తానంటే అలుసే.. తను వంటింట్లోకి వెళ్లి ఒక కప్పు కాఫీ కలుపుకునే స్వాతంత్రం లేదు.. అలా అని కోడలు చేసి ఇస్తుందా, ఇవ్వదు. రాజన్నకు చెప్పుకోవాలి..రాజన్న వంటమనిషికి చెప్పి చేయించాలి.. కాఫీ తెమ్మనమని చెప్పిన ఒక గంటకుగానీ తీసుకురాడు..


ఒక్కోసారి పూర్తిగా మరచిపోయినట్లు చేస్తాడు కావాలని.. అలాగే డైనింగ్ టేబిల్ మీద వంటకాలను రాజన్న సర్దిపెట్టి, మీరు భోజనం చేయచ్చు అని చెప్పిన తరువాతే తను వెళ్లి వడ్డించుకుని తినాలి.. రాజన్న ఏదైనా పనిలో పడితే తనకు ఆకలివేసినా అలా ఎదురు చూడాల్సిందే.. ప్రతీరోజూ వంట ఏమి చేయాలో వైశాలి రాజన్నను పిలిచి చెపితే రాజన్న ఆ విషయం వంటమనిషికి చెపుతాడు.. వంటమనిషి చేసే వంటల్లో రుచీపచీ ఉండవు.. పూర్ణ చేసే గుత్తొంకాయకూర, మజ్జిగపులుసు రుచులు నాలుకమీద నాట్యంచేసినా అవి ఏనాడూ వంటల్లో ఉండవు..


కనీసం మామయ్యగారు, పెద్దాయన ఉన్నారే, ఆయన ఏమి తింటారోనన్న కనీస జ్నానంకూడా లేని తన కోడలు ఒక పెద్ద డాక్టర్..


అమెరికా నుండి డాక్టర్ స్నేహితులు వస్తున్న ముందురోజున నౌకరు రాజన్న " అయ్యగారు తమని అదేపనిగా బయటకు వచ్చి అటూ ఇటూ తిరుతూ అతిధుల కంట పడొద్దన్నారు" .. మీ గదిలోనే ఉండమని చెప్పమన్నారు. మీకు ఏదైనా కావాలంటే నన్ను చూసుకోమన్నారంటూ వచ్చి చెప్పేసరికి తను నిర్ఘాంతపోయాడు..

మా నాన్నగారంటూ ఆనంద్ తనని వాళ్లకు పరిచయం చేస్తాడనుకున్నాడు.. కన్నతండ్రిగా పరిచయం చేయడానికి ఎంత నామోషీనో.. నాకే హద్దులు విధించాడు . తాము కూడా కన్న కొడుకు అనే బంధానికి , కడుపుతీపికి హద్దులు ఏర్పరుచుకుని ఉంటే ఈనాడు ఇంత మనోవేదన ఉండేదికాదేమో?


డాక్టర్ ఫ్రెండ్సు కోసం వచ్చీపోయేవారితో ఇల్లు సరిపోవడంలేదని అదీకాకుండా వచ్చిపోయేవారందరి దృష్టిలో మీ నాన్నగారు పడితే ఆయనెవరూ అని అడిగితే సమాధానం చెప్పలేక చావాలంటూ, ' ఏం మనమేనా ఆయన్ని చూడాలీ, మీ తమ్నుడికీ బాధ్యత ఉందికదా' ? అక్కడ ఉండమనండి కొన్నాళ్లంటూ కోడలు కొడుకుతో అనడం విన్నాడు తాను.. దానికి కొడుకు ' అవును నీవు చెప్పింది కరెక్టే వైశూ' అంటూ భార్యని సమర్ధించడం విని, వాళ్లనోటితో చెప్పించుకోవడం ఇష్టం లేక ఒక బేగ్ లో బట్టలు, తనకు సంబంధించిన కొన్ని వస్తువులూ , భార్య ఫొటో సర్దుకుని మరునాడు ఉదయాన్నే ఆనంద్ దగ్గరకు వచ్చాడు..


'ఒరేయ్ నందూ, కొన్నాళ్లు మీ తమ్నుడి దగ్గర ఉండాలని వెడుతున్నాను' .. వెళ్లివస్తానురా జాగ్రత్త అంటూ భారమైన మనసుతో బయలదేరాడు.. ఆనంద్ తండ్రితో ద్వారం వరకూ వచ్చి ' ఓకే నాన్నా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను'..

ఒక చోటే ఉంటే మీకూ బోర్ గా ఉంటుంది కదా , మీకూ స్తలం మార్పు ఉంటే బాగుంటుంది.. ' అవునూ, ఈ మధ్య తమ్ముడి దగ్గరనుండి ఫోన్లు వస్తున్నాయా' ? ఎలా ఉన్నాడుట అని ఏదో మొహమాటానికి అడిగినట్లుగా ........


సొంత తమ్ముడు ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోలేనంత బిజీ మరి..

తమ్ముడు మోహన్ ఎలా ఉన్నాడంటూ తననే ప్రశ్నించడం తో శుష్కహాసంతో సమాధానమిస్తూ బాగానే ఉన్నాడు, నన్ను రమ్మనమని ఫోన్ చేసిన మూలానే వెడ్తున్నానన్నాడు.. ఓ, ఇంకనే మరి, జాగ్రత్తగా వెళ్లిరండి నాన్నా , తొందరగా వచ్చేయండంటూ సాగనంపాడు ఇంటి ద్వారం వరకూ వచ్చి..


ఇంకా నయం, నందూ ఆ మాత్రమేనా అన్నాడు, కోడలు వెడ్తున్నారా అన్న ఒక్కమాట కూడా మర్యాదకి అనలేదు..


ఎక్కడికి వెళ్లాలి తాను ? ఎటువైపు తన గమ్యం ? మోహన్ దగ్గరకా ? ఆనంద్ తో తను ఏమని చెప్పాడు? మోహన్ తనని రమ్మనమని ఫోన్ చేసాడనికదూ? తనలో తనే నిర్వికారంగా నవ్వుకున్నాడు దశరధరామయ్య.. మోహన్ తో తను వస్తానని ఫోన్ చేస్తే ........


' నాన్నా, అన్నయ్య పెద్ద డాక్టరై రెండుచేతులా సంపాదిస్తున్నాడు' .. నీవు అక్కడ ఉండడమే సబబు.. అక్కడ నీకు సుఖాలకు, సౌకర్యాలకు కొదవ లేదు.. నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేను, నా భార్యా, ఇద్దరు పిల్లలతో ఈ సిటీలో అతి పొదుపుగా జీవిస్తున్నాను.. ఇటువంటి పరిస్తితులలో నిన్ను గట్టిగా రమ్మనమని అనలేనందుకు సారీ నాన్నా అంటూ జవాబిచ్చాడు.. ఇటువంటి విషయాలలో భార్య సహకారం లేని మగాడు చెప్పేవన్నీ ఇటువంటి సాకులే.. అభిమానాలకూ ఆప్యాయతలకు కాలం చెల్లిందని సరిపెట్టుకోవాలి.. ఆయన మనసు ఆవేదనతో తల్లడిల్లింది..


ఎవరి భావోద్వేగాలతో నాకు పనిలేదు సుమా, నేను నా గమ్యాన్ని చేరడమే ముఖ్యం అనుకుంటూ ట్రైన్ వేగాన్ని పుంజుకుంటూ పరుగెడ్తోంది..


దశరధరామయ్యగారు జేబులోనుండి ఒక ఉత్తరం పైకి తీసారు.. స్నేహితుని నుండి నెలరోజుల క్రితం వచ్చిన ఉత్తరం అది..


" ఒరేయ్ దశరధా, మనలాంటి వాళ్లకోసమే ఈ వృధ్దాశ్రమాలు.." వచ్చేయ్ రా ! పిల్లల దగ్గర ఆనందం కరువైనపుడు సగం చస్తూ బ్రతకడం ఎందుకరా?" బ్రతికినన్నాళ్లూ హాయిగా గౌరవంగా బ్రతుకుదాం, అంటూ స్నేహితుడు విశ్వనాధ్ వ్రాసిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు.. తన ఆఖరి మజిలీ అదేనని నిర్ణయానికి వచ్చాకా ఒకలాంటి ధైర్యం వచ్చింది..


" నేను ఒంటరినెలా అవుతాను" ? ప్రేమను పంచి పెట్టే వృధ్దాశ్రమాలు, స్నేహితులు ఉన్నప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా నా వాళ్లే.. ' నా ' అనే పదం నా కన్నబిడ్డలకు మాత్రమే పరిమితం చేసుకునన్నాళ్లూ నేను నిజంగా ఒంటరి వాడిని..


కానీ, నీడలా వెంటాడే నా ' పూర్ణ ' జ్నాపకాలు చాలవా? నాకు బ్రతికినంతకాలం ఊపిరినందివ్వడానికి ? ఇలా అనుకునేసరికి ఆయన మనసు తేలిక పడడమే కాదు, కిటికీలోనుండి ఆకాశం మభ్బులు తేలిపోయి స్వఛ్చంగా నిర్మలంగా కనపడిందాయనకు..


- సమాప్తం -

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం


71 views0 comments

Comments


bottom of page