కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Leelavatharam' New Telugu Story Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
అదొక అందమైన అధునాతన సౌకర్యాలతో విశాలమైన ప్రాంగణంలో కట్టబడిన అయిదు అంతస్తుల మెటర్నటీ హాస్పటల్.. ఆ హాస్పటల్, డాక్టర్ షాలినీప్రసాద్ ది.. అయిదవ అంతస్తు లో డాక్టర్ షాలిని నివసిస్తుంది.. మిగతా నాలుగు ఫోర్లూ గైనిక్ వార్డులే.. నిత్య కల్యాణం పచ్చ తోరణంలా ఆ అధునాతనమైన హాస్ఫటల్ నిత్యం పురుడు పోసుకోడానికి వచ్చిన గర్భిణీ స్త్రీలతో నిండుగా ఉంటుంది..
ఆ హాస్పటల్ లో పురుడు పోసుకోవడమే ఒక స్టేటస్ సింబల్.. షాలినీప్రసాద్ మెటర్నటీ హాస్పటల్ అంటే అందరికీ ఒక క్రేజ్.. పెయిన్ లెస్ డెలివరీస్ కు మారుపేరు.. ఆ హాస్పటల్ లోకి వెళ్తే అదొక లోకం లోకి వెళ్లినట్లు ఉంటుంది. అలసట ఎరుగని చిరునవ్వుతో అందమైన డాక్టర్ షాలిని ఎంతో సౌమ్యంగా తన హాస్పటల్ కు వచ్చే ప్రతీవారిని ప్రేమగా పలకరిస్తూ, ‘నీకేమీ భయంలేదమ్మా, నేను లేనూ, పండంటి బిడ్డను నీ చేతుల్లో పెట్టి పంపిస్తా’నంటూ ఎంతో ధైర్యానిస్తూ, గర్భిణీ స్త్రీలకు మానసిక ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్ని కలిగిస్తుంది..
ఆమెకు అసిస్ట్ చేయడానికి మరో నలుగురు డాక్టర్లు, నర్సులతో ఇరవైనాలుగు గంటలు హాడావుడిగా ఉంటుంది..
డాక్టర్ అంటే కనిపించే దేవుడు, కనిపించని ఆ దేవుణ్ణి నమ్ముకునే ప్రజలు కనిపించే ఈ డాక్టర్ దేవుడికి దణ్ణం పెట్టి తమ ప్రాణాలు ఆ డాక్టర్ చేతిలో పెట్టి హాయిగా నిద్రపోతారు.. కానీ షాలినీ లాంటి డాక్టర్లు మాత్రం డబ్బు ఆశకు , అమాయకమైన గర్భిణీ స్త్రీలను తమ మాయమాటలతో నమ్మిస్తూ, తమ ఆస్తులను, అంతస్తులనూ పెంచుకుంటున్నారు.
డాక్టర్ వృత్తికి కళంకం తెచ్చేది కొందరు అయితే , ఆ వృత్తినే దైవంలా భావించి ప్రాణాలు పోసిన వారిలో డా. వి. శాంత వైద్యరంగ పరిశోధకురాలు. రాచపుండు పై రణభేరి మోగించిన శాస్త్రజ్ఞురాలు. ఆమె వైద్యాన్ని ఓ వృత్తిగా ఏనాడూ భావించలేదు. మనిషిలోని బాధల్ని మానవీయ కోణంలో దర్శించి, మానవతా దృక్పథంతో స్పందించి వైద్య వృత్తిని వ్యాపార కళ నుంచి వేరుచేశారు.
అడయార్ కాన్సర్ హాస్పటల్ నిర్వాహకురాలిగా లక్షలాది క్యాన్సర్ పీడితులకు ప్రాణదానం చేసిన డా..శాంత చిరస్మరణీయురాలు.. ఆవిడ కు వైద్యరంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు, రామన్ మెగసెసె అవార్డులు వచ్చాయి. మదర్ థెరెస్సా అవార్డును కూడా పొందారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వీరిని పద్మ విభూషణ్ పురస్కారంతొ సత్కరించింది.
కానీ డాక్టర్ షాలినీ లాంటి వాళ్లు మాత్రం డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చే అవినీతిపరులు.. పైకి సమ్మోహనమైన చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తూ , తన నటనా చాతుర్యంతో తన దగ్గరకు వచ్చే గర్భిణీ స్త్రీలను మోసం చేస్తూ, వారిని దోచేస్తూ కోట్లాది కోట్ల ఆస్తులను కూడపెట్టుకుంటూ, సొసైటీలో పేరు ప్రఖ్యాతులు కొట్టేస్తోంది..
డాక్టర్ షాలిని దగ్గరకు వచ్చేది కేవలం వివాహిత స్త్రీలు మాత్రమేకాదు.. హై సొసైటీ అరిస్టోక్రాట్ ఫామిలీ అమ్మాయిలు ఫాషన్ పేరుతో బాయ్ ఫ్రండ్స్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అనైతికంగా గర్భం ధరించడంతో దాన్ని టర్మినేట్ చేయించుకోవాలని డా.. షాలినిని ఆశ్రయిస్తారు.. అటువంటి అమ్మాయిల కోసం ఎడారిలో దాహార్తిలా ఎదురుచూస్తుంది షాలిని.. ఎందుకంటే ఎంత ఛార్జ్ చేసినా లెక్కలేకుండా ఇవ్వగలిగే స్తోమత ఉన్నవారు.. వారిని చిరునవ్వుతో సాగనంపుతూ, మీ ఫ్రండ్స్ కు కూడా ఇటువంటి అవసరం కలిగితే నా దగ్గరకు పంపించమ్మా అంటూ వెన్ను తడుతూ ప్రోత్సహిస్తుంది..
ఆవిడ నార్మల్ డెలివరీలు అసలు చేయదు. తొంబై శాతం గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన అంటే ఏమిటో తెలియ నీయకుండా సి-సెక్షన్ చేసేస్తూ లక్షల్లో దోచేస్తుంది.. ఇంకా అనేక అనైతిక కార్యక్రమాలు ఆ హాస్పటల్ లో రహస్యంగా జరిగిపోతున్నాయి..
మాకు ఎలాగైనా మగబిడ్డనే ప్రసాదించి నా కాపురం నిలిపేలా చేయమని అడిగేవారికి, మా ఆస్తికి వారసుడే కావాలని కోరే కోటీశ్వరులకూ, బఢా వ్యాపారవేత్తలకూ అక్కడే పుట్టిన పసిబిడ్డలను అటూ ఇటూ మార్చేస్తూ వారిని సంతోషపరుస్తూ చాలా తెలివిగా కోట్లలో డబ్బుని దోచేసే డా.. షాలిని తెరవెనుక నడిపే గ్రంధాలు ఎవరికీ తెలియవు.. ఏ రహస్యాన్ని బయటకు పొక్కనీయకుండా అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ ఆకర్షణీయమైన జీతాలూ, బోనసులతో కట్టి పడేసింది..
అనుకోకుండా డా..షాలినీ అసిస్టెంట్ డా.. మైత్రేయి భర్త హార్ట్ ఎటాక్ తో చనిపోయిన మూలాన మైత్రేయి నిండా దుఖంలో ములిగిపోయి ఒక ఆరునెలలు డ్యూటీకి రాలేనంటూ శెలవు తీసుకుని వెళ్లిపోయింది.. అసలే కేసులు ఎక్కువగా వస్తున్న సమయంలో తన కుడిభుజంలాంటి డా.. మైత్రేయి వెళ్లిపోవడంతో లీల అనే అమ్మాయి డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఏదైనా హాస్పటల్ లో కొంతకాలం అనుభవం కోసం పనిచేసి ఆ తరువాత పై చదువుల కోసం ఆరు నెలల్లో లండన్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, డా..షాలినీప్రసాద్ హాస్పటల్ లో అనుకోకుండా జూనియర్ డాక్టర్ గా అవకాశం రావడం ఒక గొప్ప అదృష్టంగా భావించి వెంటనే జాయిన్ అయిపోయింది.
లీల డాక్టర్ వృత్తి ని దైవంగా భావించే మనస్తత్వం గల అమ్మాయి.. మనుషులకు సేవ చేయడం కోసమే తాను పుట్టినట్టుగా భావిస్తుంది .. మొదట్లో అంతా హాస్పటల్ లో బాగానే ఉందనిపించింది.. తరువాత, తను పూర్తిగా డ్యూటీలో ఇన్వాల్వ్ అయినాకా ఒొక్కొక్కటీ అర్ధం అవడంతో నిశ్చేష్టిత అయింది.. తను చూస్తూ చూస్తూ ఇటువంటి వాటిని సమర్ధించదు.. అసలు మానవత్వం ఉన్న ఎవరూ కూడా సమర్ధించరు. అక్రమంగా డబ్బు సంపాదించడం ముఖ్యంకాదు, అంతాకన్నా ముఖ్యమైనది ఉన్నతమైన విలువలు..
తనకు తన చిన్నతనంలో తాతగారు భగవద్గీత లోని శ్లోకాలకు అర్ధాలు చెపుతూ చిన్న చిన్న పిట్ట కధలద్వారా నీతిని బోధించేవారు.. ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును దుష్టులను రూపు మాపుటకు శ్రీకృష్ణపరమాత్ముడు ప్రతి యుగమునందును అవతరిస్తాడని తాతగారు చెప్పేవారు.. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించుటకు జీవుల రూపంలో అవతరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ ఉండటాన్ని లీలావతారం అంటారని చెప్పేవారు..
ఎలాగైనా ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు, అన్యాయాలు బయట ప్రపంచంలో అందరికీ తెలియాలి, స్త్రీ అంటే సృష్టి, మమతానురాగాలు పంచి ఇచ్చే మాతృమూర్తి.. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన డా.. షాలినీ ఆకృత్యాలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది.. కానీ ఎలా? అనుకుంటూ రాత్రంతా ఆలోచించి తన జర్నలిస్ట్ ఫ్రెండ్ అయిన సరితకు ఫోన్ చేసి సలహా అడిగింది.
లీలా , చాలా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నావ్ ! నీకెందుకే, కొంతకాలం పనిచేసి హాయిగా లండన్ కు ఎగిరిపోకా ? అయినా అడిగావు కాబట్టి చెపుతున్నాను " ఫేస్ బుక్ లో ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి నీవు సేకరించిన ఆధారాలను, వీడియోలనూ అందులో అప్లోడ్ చేయి". అలాగే అప్లోడ్ చేశాక హాస్పిటల్ పేరు కూడా వచ్చేలా చెయ్యి. నీ గురించి ఎవరు తెలుసుకోలేరు, నీ మీదే అనుమానం కలిగేటట్లు కనిపించకుండా యధా ప్రకారం నువ్వు మళ్లీ ఎప్పటిలా నీ డ్యూటీకు హాజరవ్వంటూ సలహా ఇచ్చింది సరిత.
సహజంగా తెలివైనదీ, ధైర్యంకలదీ అయిన లీల డాక్టర్ షాలినీని కొద్దికాలంలోనే ఆకర్షించుకుంది.. డాక్టర్ షాలిని తన కార్యకలాపాలన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ గా చేస్తుంది.. తొందరగా ఎవరినీ నమ్మేయదు.. అటువంటి షాలినిని బుట్టలో వేసేసుకుని చాలా స్వల్పకాలంలో ఆమె విశ్వాసాన్ని చూరగొంది.. డాక్టర్ షాలినీ పర్సనల్ కన్సల్టన్సీ రూమ్ లోకి, అలాగే ఆమే స్వయంగా ఇల్లీగల్ డెలివరీలు, సర్జరీలు చేసే ఆమె వ్యక్తిగత ఆపరేషన్ ధియేటర్స్ లోకి స్వతంత్రంగా ప్రవేశించగలిగే నమ్మకాన్ని సంపాదించింది .
ఒకరోజు ఒక పెద్ద భూస్వామితో రహస్య సమాలోచనలు జరుగుతున్నపుడు డాక్టర్ షాలినికి కనపడకుండా చాటున నిలబడి కొన్ని ప్రత్యక్ష సంఘటనలను రహస్యంగా తన ఫోన్ లో వీడియోలు గా రికార్డ్ చేసుకుని సేవ్ చేసుకుంది.. ఒకవేళ డాక్టర్ షాలిని తనను అక్కడ చూసినా ఏదైనా పనిమీద వచ్చిందేమోలే అనుకుంటూ తేలికగా తీసుకునేలా లీల ఆమెను నమ్మించింది.. అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైన ఆధారాలనూ సేకరిస్తూనే స్టాఫ్ తో అనుమానం రాకుండా మసలుకొనేది..
ఇంకో నాలుగురోజులలో లీల లండన్ ప్రయాణం .. డాక్టర్ షాలినీకు కూడా తెలుసు.. లీల త్వరలో లండన్ వెళ్లిపోతుందని.. ఆరోజు సరదాగా డాక్టర్ షాలిని ఒక చిన్న ఫేర్ వెల్ పార్టీ అరేంజ్ చేసి, లీల పనితీరుని ప్రశంసిస్తూ లీలను అభినందించింది.. ఆపార్టీ జరుగుతున్నంత సేపూ లీల అన్యమనస్కంగానే ఉంది.. ఎందుకు మేడమ్, మీరు ఈ నీతిమాలిని పనులు చేస్తున్నారు.. డాక్టర్ వృత్తి దైవంతో సమానం.. అటువంటి దైవత్వాన్ని ఎందుకు కలుషితం చేస్తున్నారంటూ ఆమె మనసు మూగగా రోదించింది..
ఆరోజు రాత్రి సరిత సలహా ఇచ్చినట్లే డాక్టర్ షాలినీ హాస్పటల్ లో తను సేకరించిన వివిధ అరాచకాలకు సంబంధించిన బుుజువులను, డాక్యు మెంట్లను, అలాగే తను తీసిన వీడియోలను ఫేక్ ఐడీ క్రియేట్ చేసి వాటినన్నిటినీ హాస్పటల్ పేరుతో సహా అప్లోడ్ చేసి తాతగారు తనచేత కంఠతా పట్టించిన భగవద్గీత శ్లోకాలను భక్తిగా మననం చేసుకుంటూ అనుకుంది, అయితే తాతగారు చెప్పినట్లుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మే నాలో ప్రవేశించి లీలావతారం ఎత్తడంలేదుకదా అని అనుకోగానే అందమైన ఆమె పెదవులపై చిరుదరహాసం మెరిసి హాయిగా ప్రశాంతంగా నిద్రపోయింది..
మరునాడు పొద్దుటే లీల ఏమీ తెలియనట్లుగా మామూలుగానే తయారయి హాస్పటల్ కు వెళ్లింది హాస్పటల్ గేట్ ముందు అంతా జన సమూహమే. పోలీస్ జీపులతో, అనేక వాహనాలతో ఆ ప్రాంగణమంతా నిండిపోయింది.. తను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోలు వైరల్ అయిపోయి ఉంటాయి..
విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి డిటైల్డ్ రిపోర్ట్ గవర్నమెంట్ కు సబ్ మిట్ చేయడంతో గవర్నమెంట్ ఆ హాస్పిటల్ ని సీజ్ చేసేసింది. అక్కడ మాట్లాడుకుంటున్న మాటలనుబట్టి, ఆ ఆసుపత్రి ఏం.డి అయిన డాక్టర్ షాలినీప్రసాద్ ఎంత రాజకీయ పలుకుబడిని, డబ్బుని వెదజల్లాలని చూసినా పనిచేయలేదట అంటూ గుస గుసలుగా మాట్లాడు కుంటున్నారు.. న్యూస్ మీడియా, టీవీ ఛానల్స్, మహిళా అభ్యుదయ సంఘాలన్నీ అక్కడకు చేరిపోయాయి.
డాక్టర్ షాలినీ లాంటివారు దేశానికే చీడపురుగు లాంటివారని, అటువంటి మహిళ మూలాన స్త్రీ జాతి మొత్తం అంతా తలవంచుకునే పరిస్తితి వచ్చిందని ,, ఆమెను శిక్షించాలని డిమాండ్ చేశారు . దాంతో డాక్టర్ షాలినీని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో అందరూ చూస్తూండగానే తీసుకు పోయారు.
మరో రెండురోజుల తరువాత లీలకు ఏయిర్ పోర్టు లో సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన సరిత లీలనైపు మెచ్చుకోలుగా చూస్తూ ‘మొత్తానికి నీవనుకున్నది సాధించావు లీలా’ అనేసరికి, ‘ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది సరితా.. వైద్య వ్యవస్త అవినీతి దారిన పడ్తూ, ప్రాణానికి భరోసా ఇవ్వాల్సిన డాక్టరే డబ్బు సంపాదన అనే మత్తులో పడిపోతూ రోగుల ప్రాణాలను తీసేస్తున్నాడు.. కనీసం మన కంటి ఎదురుగా జరుగుతున్న దౌర్జన్యాలను ఆనకట్ట వేయగలిగే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని దేవుడ్ని ప్రార్ధిద్దాం’ అంటూ " బై సరితా, నీవు ఈ విషయంలో నాకు ఎంతో సహకరించినందుకు కృతజ్నతలంటూ " వీడ్కోలు తీసుకుని చెక్ ఇన్ లోనికి నడిచింది లీల..
- సమాప్తం -
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం
Kommentare