top of page

పెంచిన ప్రేమ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Penchina Prema' New Telugu Story Written

By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త




"అమ్మా, చూడమ్మా, అత్త నన్ను ఇక్కడే ఉండిపొమ్మంటోంది" ! లోపలి గదిలోనుండి పరుగున వస్తూ తన నడుమును చుట్టేసుకుంటూ ఏడుస్తున్న ప్రణవిని ఎత్తుకుంది కౌసల్య..

"నాకు చాలా టాయస్ కొనిపెడ్తుందిట. నా దగ్గరా ఉన్నాయి, మా నాన్న ఇంకా బోలెడు తెస్తారని చెప్పాను.. నేను ఇక్కడ ఉండనమ్మా, అత్తకు చెప్పం"టూ ఏడుస్తూ మాట్లాడుతున్న ప్రణవిని ముందుకు లాక్కుని బుగ్గలమీద ముద్దు పెట్టుకుంటు "అలాగే చెపుతానులే ప్రణూ, ముందా ఏడ్పు ఆపం"టూ కూతురిని సముదాయించ సాగింది..


" మరేం, నీవూ, నాన్న నన్ను అత్త దగ్గర ఉంచేసి వెళ్లిపోతారుట కదా, నేనిక్కడే ఉండాలిట కదా చక్రాల్లాంటి దాని కళ్లనిండా భయమే.. ప్రణవిని ఆ స్థితిలో చూసిన కౌసల్య మనసు ద్రవించిపోయింది.. ప్రణవిని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది..



"చెప్పమ్మా! నా బట్టలు కూడా సర్దుతున్నావు కదూ? నీవు సర్దకపోతే నేనే నా బట్టలన్నీ తెచ్చేసుకుని నీ బాగ్ లో పెట్టేస్తా.."




" చూడు ప్రణూ, నీకిప్పుడు స్కూల్ శెలవలే కదా? పాపం అత్తకు నీతో ఆడుకోవాలని సరదా పడుతోంది.. నిన్ను కొన్ని రోజులు ఉంచమని బ్రతిమాలుతోందిరా.."


“అత్త నాతోనే ఆడుకోవాలా? అత్తకు శరత్ బావా లేడా? అప్పుడు కూడా ఒకసారి 'పల్లూ' లేదు కదా, పాపం అత్తకి బోర్ గా ఉంటుందంటూ నన్ను ఉంచేసి వెళ్లిపోయారు నీవు నాన్నానూ.. అసలు పల్లూ ఎక్కడకి వెళ్లిందీ? పల్లూ గురించి అత్త ఎప్పుడూ ఎందుకేడుస్తుంది అమ్మా?”


“అందుకే కదా ప్రణూ.. అత్త దగ్గర కొన్నిరోజులు ఉండమనేది. అత్త నిన్ను ఎంత ముద్దుగా చూసుకుంటుంది !”


ప్రణవి కళ్లనుండి నీళ్లు ధారగా కారిపోతున్నాయి.. అది గెస్ చేసేసింది.. తనని ఇక్కడ వదిలి వెళ్లిపోతున్నారని..



ఈలోగా మోహన్ వచ్చాడు.. " ఏమి జరుగుతోంది ఇక్కడా?” అంటూ.



'' చూడు నాన్నా అమ్మ నన్ను కొన్నిరోజులు ఇక్కడే ఉంచేస్తుందిట'.. నేను ఉండను నాన్నా, నేనూ మీతోనే వచ్చేస్తా”నంటూ మోహన్ ని పట్టుకుని ఏడ్చేయడం మొదలు పెట్టింది..

మోహన్ ప్రణవిని ఎత్తుకున్నాడు..

ఈలోగా రంగనాధం అక్కడకు వస్తూ 'ఏమోయ్ మోహన్, ప్రణవికి నచ్చ చెప్పేది ఇలాగేనా?' అంటూ మాట్లాడుతుంటుంటే మోహన్ ప్రణవిని కిందకు దించుతూ " బంగారూ.. ఏడవకూడదమ్మా! అందరూ నిన్ను చూసి నవ్వుతారు. నీకు మొన్న ఎక్జిబిషన్ లో కొన్న టెడ్డీబేర్ అత్తకు, శరత్ బావకూ చూపించిరా” అంటూ ప్రణవిని పంపేసాడు అక్కడనుండి..


"ఏమీలేదు మామయ్యగారూ, చిన్నపిల్ల కదా.. గట్టిగా చెప్పలేం కదా!”


“ఏమీ ఫరవాలేదయ్యా మోహన్, ఓ నాలుగు రోజులు పేచీ పెడుతుంది అంతే.. దాన్ని కాస్త అటు ఇటు తిప్పి ఆడిస్తే అన్నీ మరచిపోతుందిలే.. మీరు కనిపిస్తేనే పేచీ, మీరు బిజీగా ఉన్నారని, కొన్నాళ్లు పోయాక వస్తారని,నీవు ఇక్కడే ఉండి స్కూలు కి వెళ్లి చదువుకోవాలని చెబుతూ దాన్ని మరపిస్తాం లే.. కొన్నాళ్ల తరువాత వాసంతినే మీ అమ్మ అని చెప్పినా నమ్మేస్తుంది.. పసిపిల్లలను ఎవరు దగ్గరకు చేరదీస్తే వాళ్లనే తల్లీ తండ్రీ అనుకుంటారు.. అయినా ప్రణవి ని కన్నతల్లి వాసంతే కదా. అటువంటప్పుడు అభ్యంతరం ఏమిటోయ్ మోహన్?”


ఆయన అన్న మాటలకి మోహన్, కౌసల్యల మనసులు విలవిల్లాడాయి..


" కాదా? నిజమేగా? ప్రణవి కన్నతల్లి వాసంతేగా" !


నిజం ఎప్పుడూ చేదుగా భరించలేనిదానిగా ఉంటుంది..



******



" మోహన్ నీవూ కౌసల్యా ప్రణవిని తీసుకుని మా ఇంటికి రండి, ఎలాగూ ప్రణవికి స్కూల్ హాలిడేస్ కదా" , అనీ మరీ మరీ వాసంతి బ్రతిమాలితేనే కదా బాగుండదని వచ్చారు..


కిందటిసారి వచ్చినపుడు కూడా ప్రణవి ని తరువాత పంపిస్తాంలేరా అంటూ ఉంచేసుకుంది.. అది నాలుగురోజులకే తమ మీద బెంగపెట్టేసుకుని జ్వరం తెచ్చుకుని కలవరిస్తుంటే రంగనాధం, వాసంతి మామగారు కంగారుపడుతూ ప్రణవిని తీసుకొచ్చేసారు.. అలాంటిది మరోసారి ప్రణవిని ఇలా ఉంచేయమని అడగడం న్యాయమేనా?



కౌసల్య కి పది సంవత్సరాలనాటి గతం కళ్లముందు కదలాడింది..



తనకి పెళ్లై అత్తవారింటికి వచ్చేనాటికే ఆడపడుచు వాసంతికి పెళ్లి అయిపోయింది.. వాసంతి కంటే మూడు సంవత్సరాలు చిన్నవాడు తన భర్త మోహన్.. తమ పెళ్లైన సంవత్సరానికే వాసంతి కన్సీవ్ అవడం బాబు పుట్టడం జరిగిపోయింది.. వాసంతీ, ఆమె భర్త సుధీర్, వాసంతి మామగారు నెల్లూరు లో ఉంటారు. వాసంతికి అత్తగారు లేరు.


తన అత్తగారూ మామగారూ తిరుపతిలో ఉంటారు.. మామగారు టిటిడీ దేవస్థానంలో ఇంకా సర్వీసులో ఉన్నారు.



మోహన్ హైద్రాబాద్ లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు.. పెళ్లైన నాటికే ఆఫీసుకి దగ్గరలో మంచి ఫ్లాట్ కొనేసాడు.. తను అమ్మా నాన్నకి ఒక్కర్తే కూతురు.. బోల్డంత ఆస్తితో అత్తవారింటికి వచ్చింది..


జీవితం మూడుపూవులూ ఆరుకాయలుగా సాగిపోతోంది..


పెళ్లైన మూడు సంవత్సరాలకు గర్భవతి అయింది తాను.. ఇటూ అమ్మా నాన్నా, అత్తగారు మామగారితో సహా వాసంతి వాళ్లూ కూడా ఎంతో సంతోషించారు.. రెగ్యులర్ చెక్ అప్స్ అవీ మోహన్ చాలా కేర్ తీసుకుని చేయిస్తున్నాడు.. బలహీనంగా ఉన్నానని బెడ్ రెస్టు అంటే అమ్మ వచ్చి కొన్నాళ్లు ఉంది.. అత్తగారు కూడా వచ్చారు.. డెలివరీ హైద్రాబాద్ లోనే అంటూ మోహన్ పట్టుపట్టడంతో అమ్మా నాన్నగారూ విజయవాడనుండి వచ్చి ఉండిపోయారు..


డెలివరీ రోజులు దగ్గరపడ్డాయి.. లోపల బేబీ బాగానే ఉందని డాక్టర్ చెక్ అప్ చేసి చెపుతూ సి సెక్షన్ చేయాల్సి వస్తుందని రెండురోజుల్లో వచ్చి హాస్పటల్ లో అడ్మిట్ అయిపొమ్మన్నారు.. ఆపరేషన్ కి ఒకరోజు ముందు బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేస్తే డాక్టరుకి ఏదో అనుమానం వచ్చింది.. మరో సీనియార్ డాక్టర్ ను కూడా పిలిపించింది. డాక్టర్లిద్దరి ముఖాలు పాలిపోయాయి.. వెంటనే ఆపరేషన్ చేసేయాలన్నారు, లేకపోతే తల్లి ప్రాణానికే ప్రమాదమన్నారు.. ఆపరేషన్ చేసి చూస్తే బేబీ విగతజీవి అయి ఉంది..


కౌసల్య దుఖాన్ని నియత్రించలేకపోయారెవరూ. మోహన్ కౌసల్య ను దగ్గరకు తీసుకుని ఎంతో ధైర్యం చెప్పి మామూలు మనిషిని చేసేసరికి చాలా సమయం పట్టింది.. రెండోసారి ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా అయిదో నెలలో ఎబార్షన్ అయిపోయింది.. కౌసల్య మానసికంగా చాలా కృంగిపోయింది.. మౌనంగా ఉంటూ ఎప్పుడు ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చునేది.. డాక్టర్ ఖచ్చితంగా మూడోసారి కన్సీవ్ అయినా బిడ్జకు గేరంటీ లేదని తల్లికి కూడా రిస్క్ అని చెప్పేసరికి అనాధ శరణాలయం నుండి ఒక పాపను తెచ్చుకుని పెంచుకోవాలనుకున్నారు..


ఏమండీ చూడండి ఎవరొచ్చారో అంటున్న కౌసల్య పిలుపుకి అప్పుడే స్నానం చేసి ఆఫీసుకి వెళ్లడానికి డ్రెస్ అవుతున్న మోహన్ ఉన్న ఫళంగా బయటకు వచ్చాడు..


కారులో నుండి దిగుతున్నారు అక్క వాసంతి, అమ్మానూ.. ఇద్దరి చేతుల్లో నాలుగునెలల పసికందులు.. నాలుగునెలల క్రితమే అక్కకు కవలలు ఆడపిల్లలు పుట్టారు.. అదేమిటమ్మా చెప్పాపెట్టా కుండా ఇంత హఠాత్తుగా అంటూ డ్రైవర్ చేత సూట్ కేస్ లను లోపల గదుల్లో పెట్టించాడు..


మీ అక్క నిన్ను సర్ప్రైజ్ చేయాలంటూ ఉన్న ఫళంగా ఒకటే హడావుడి పెట్టేసింది.. దానికితోడు మీ బావ, అక్క మామగారు కూడా పర్మిషన్ ఇచ్చేసరికి నన్ను ఆఘమేఘాలమీద తీసుకొచ్చేసిందనుకో..


"రండి అక్కా అంటూ మోహన్ , కౌసల్యా వారికి సాదరంగా ఆహ్వానం పలికారు"!


మోహన్ ఆఫీసుకి బయలదేరుతూ సాయంత్రం వచ్చాకా మాట్లాడుకుందాం తీరిగ్గా అంటూ వెళ్లిపోయాడు.. ఆ రోజు సాయంత్రం మోహన్ ఆఫీసు నుండి వచ్చినప్పటినుండీ తల్లి మోహన్ చెవిలో ఊదుతూనే ఉంది.. వాసంతికి పుట్టిన కవలలో ఒకరిని పెంచుకోమని.. వాసంతి కూడా ఇవ్వడానికి ఇష్టపడుతోందని..


ఓహో, చెప్పాపెట్టకుండా ఇంత హడావుడిగా రావడం వెనుక ఇదా కారణం అనుకున్నాడు మనసులో.. అయినా అక్క ఏమిటి? సొంత బిడ్డను పెంచుకోడానికి ఇవ్వాలనుకోడం.. ఇంత త్యాగమా? మోహన్ కి గుర్తొచ్చింది అప్పుడెప్పుడో అనాధశ్రమం నుండి ఒక పాపను తెచ్చుకుని పెంచుకోవాలన్నట్లు తల్లికి చూచాయగా చెప్పినట్లు.. బహుశా దాని ప్రభావమేమో అనుకున్నాడు .


అక్క తన సొంత బిడ్డను విడిచి ఉండగలదా? ఎందుకో తనకు అలా అక్క పాపను తీసుకుని పెంచుకోవడం సబబుగా అనిపించడం లేదు. తనకి గానీ, కౌసల్యకి గానీ ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు.. రాత్రి గదిలోకి పడుకోడానికి వచ్చిన కౌసల్య చేతిలో చిన్నపాపాయి . కౌసల్య ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.. చేతిలోనున్న పాపాయిని మంచంమీద జాగ్రత్తగా పడుకోపెడ్తుంటే " ఇదేమిటీ ఇక్కడ పడుకోపెడ్తున్నావు కౌసల్యా, రాత్రివేళ పాప పాలకి ఏడిస్తే "?


ఫరవాలేదు లెండి, ఏడిస్తే వాసంతి వదినకి ఇచ్చివస్తాను.. పాపాయిని మంచంమీద పడుకోపెట్టి తానుకూడా పాప పక్కనే హత్తుకుంటూ దగ్గరగా పడుకుంది.. తల్లి దగ్గర ఉండాల్సిన పసికందుని ఇలా తెచ్చేస్తావా ఆశ్చర్యంగా అన్నాడు..


"ఇక నుండి ఈ పాపాయికి నేనే తల్లిని కించిత్ గర్వంగా అంది" .. అలవాటు చేసుకోవద్దూ?


ఓ, అయితే నిర్ణయాలన్నీ అయిపోయాయన్నమాట.. పాపం వదిన ఒక్కర్తీ శరత్ ను ఈ ఇద్దరి కవలలనూ ఎలా పెంచగలదండీ? అత్తగారు లేరాయే, ఓపిక ఉండద్దూ? ఓపిక లేకపోతే ఎవరినైనా సహాయానికి పెట్టుకుంటారు.. అంతేగానీ ఇలా మనకి ఆప్తులూ, దగ్గరవారి పిల్లలకంటే అనాధాశ్రమం నుండి తెచ్చుకోవడం మంచిదని నా అభిప్రాయం..


ఎవరో ముక్కూ ముఖం తెలియని అనాధ పిల్లల కంటే వాసంతి వదిన పాపాయి అయితే బాగుంటుంది కదండీ.. చూడండి పాపాయి ఎంత ముద్దొస్తోందో? అయినా అనాధాశ్రమంలోనైనా మనకు నచ్చిన పిల్లలు దొరకద్దాండీ? " హాయిగా ఏ కష్టం లేకుండా అదృష్టం తలుపుతట్టిందని ఆనందించకుండా"?


"అబ్బ కాస్త నా మాట వింటావా కౌసల్యా"? మనం దిక్కూ మొక్కూ లేని అనాధ పాపను పెంచుకుంటే ఆ పాపకి ఆసరా కల్పించి తల్లీతండ్రీ లేని లోటుని తీర్చిన వాళ్లము అవుతాం.. అలా చేయడం సమంజసం.. అంతేగానీ అన్నీ సమృధ్దిగా ఉన్నవాళ్ల పిల్లను పెంచుకోవడం ఏమిటీ? ఇలా నాకు అక్క పాపను పెంచుకోవడం ఇష్టంలేదంటూ అటుతిరిగి పడుకున్నాడు..


తమ్ముడి ఆస్తి కలసి వస్తుందనో, లేక కవలపిల్లలను నిజంగా పెంచడం కష్టమనుకుందో లేకపోతే ఇంక సంతాన యోగం లేని తన తమ్ముడికి ఇలా సహాయపడాలనుకుందో ఏమోగానీ మోహన్ నిర్ణయంతో సంబంధం లేకుండా రెండో పాప ప్రణవిని తమ్ముడూ మరదలు ఒడిలో పెట్టి ఇకనుండి ఇది మీ కూతురే, పాపాయిని దత్తు తీసుకున్నా మా కభ్యంతరం లేదంటూ చెప్పి వెళ్లిపోయింది వాసంతి తన తల్లితో..


మోహన్ దేనినైనా దూరదృష్టితో ఆలోచిస్తాడు.. ఏదైనా ఒక పని చేసేముందు దానివలన లాభంకంటే ముందు ముందు ఏ ఏ సమస్యలు వస్తాయో అన్న ఆలోచన కూడా ఉండాలని తలబోసే వ్యక్తి.. అంతేగానీ కౌసల్యనుగానీ లేక తన అక్కనిగానీ బాధపెట్టాలన్న ఉద్దేశం కాదు..


పాపాయి పెరిగి పెద్దది అవుతోంది.. అది బోర్లాపడడం, పాకడం, చిన్న చిన్న తప్పటడుగులు వేయడం ఏదైనా ముద్దుగానే ఉంటోంది.. తల్లీ తండ్రిని గుర్తుపట్టి వాళ్లమీదకు ఉరుకుతుంటుంటే మోహన్ కౌసల్యల అనుభూతి అనిర్వచనీయమైనట్లు పులకించిపోతున్నారు.. పాపాయి తమకే పుట్టినట్లుగా భావిస్తున్నారు.. పోనీలే పాప రాకతో కౌసల్య ఆనందంగా ఉంది కదా అనుకున్నాడు..


ప్రణవికి ఆరు సంవత్సరాలు నిండాయి .. ప్రణవిని చట్టబధ్దంగా దత్తత చేసుకుని ఇంటి వారసురాలిగా చేసుకోమని తల్లి మాటి మాటికి గుర్తు చేస్తుంటే త్వరలో ఆ పని పూర్తి చేయాలని భార్యా భర్తలు తలబోస్తున్నారు..


ఒకరోజు పిడుగులాంటి వార్త వచ్చింది.. కవలపిల్లల్లో పెద్దది పల్లవి , పల్లూకి డయేరియా వచ్చి పోయిందని.. వార్త విన్నవెంటనే హుటాహుటిన మోహన్, కౌసల్యా ప్రణవిని తీసుకుని వెళ్లారు పలకరించడానికి.. వాసంతి పిచ్చిదానిలా తయారైంది.చిక్కి శల్యమైంది. నిద్రాహారాలు మానేసింది.. ప్రణవిని దగ్గరకు తీసుకుంటూ వదిలేది కాదు.. కౌసల్య వదినగారి కి అండగా నెలరోజులుండి తిరిగి వచ్చేసేటప్పుడు ప్రణవిని కొన్ని రోజులు ఉంచమని అడిగితే కాదనలేక వదిలి వచ్చింది.. అప్పుడే అది తమకోసం బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంటే భయపడిపోయి వాసంతి మామగారు ప్రణవిని తీసుకుని వచ్చి దింపి వెళ్లిపోయారు..


ఇలా వాసంతి పల్లూ మీద బెంగతో కృశించిపోతోందని ప్రణవిని తీసుకుని రమ్మనమన్నప్పుడల్లా కౌసల్యా మోహన్ ప్రణవిని తీసుకుని వెళ్లి వాసంతికి చూపిస్తూ ఉండేవారు.. ఇప్పుడుకూడా అలాగే వచ్చారు.. పదిరోజులు ఉన్నారు..మళ్లీ ప్రణవిని ఉంచేసి వెళ్లమంటే ఎలా కుదురుతుంది? ప్రణవి లేకుండా బ్రతకలేనంటుంది వాసంతి.. రంగనాధం కూడా కోడలి మాటలను బలపరుస్తూ " అవును, ప్రణవిని ఇక్కడే వదిలి వేయమని, పాపకు కూడా మెల్లిగా అలవాటు అయిపోయి సర్దుకుపోతుందని, కొన్నాళ్లుపోతే అన్నీ మరచిపోయి వాసంతినే అమ్మగా అనుకుంటుందని చెపుతున్నాడు.. అవకాశవాదం అంటే ఇదేనేమో..


కౌసల్య ఆలోచనలలోనుండి వాస్తవం లోకి వచ్చింది.. ఆడపడుచుకి ఎదురు చెప్పలేని బలహీనత.. ప్రణవికి కన్న తల్లి వాసంతేగా? కన్నతల్లిగా ప్రణవి మీద సర్వాధికారాలూ తనకే ఉన్నాయని వాసంతి అనుకుంటోంది . అటువంటప్పుడు ప్రణవి మీద తనకేమి అధికారం ఉంది? నాలుగు నెలల పసికందుని తెచ్చి తన ఒళ్లో వేసేసి ఇకనుండి ఇది నీ కూతురే అని చెప్పిన వాసంతి ఇప్పుడు దానికి కన్నతల్లిని నేనే కదా అంటోంది.. ప్రణవికి ఊహ తెలుసున్నప్పటినుండీ తననే అమ్మ, మోహన్ ని నాన్నగా అనుకుంటోంది..


"అటువంటప్పుడు నేను దాని అమ్మను కాదంటే మరి ఎవరిని "?


ఆరు సంవత్సరాలు కంట్లో ఒత్తులు వేసుకుంటూ పెంచి పెద్ద చేసిన ఒక ఆయావంటూ నా అంతరాత్మ నన్ను పరిహసిస్తున్నట్లుగా అనిపించసాగింది..

ఏ జన్మలో ఏ పాపం చేసానో, కడుపున పడ్డ బిడ్డలు నిలవలేదు, ఇప్పుడు ఇలా వదిన నా బిడ్డను వదిలి వెళ్లు కౌసల్యా అంటూ బ్రతిమాలుతూ ఏడుస్తోంది..

మనసులో ఒక నిర్ణయానికి వచ్చి భర్తకు తన అభిప్రాయాన్ని చెప్పింది.. మోహన్ భార్య ముఖం వైపు చూసాడు.. ఆమె ముఖంలో ఒక విధమైన నిర్లిప్తత.. ప్రణవిని ఇంకా తాము దత్తత తీసుకోలేదు కాబట్టి సరిపోయింది.. ఒకవేళ దత్తత చట్టబధ్దంగా రిజిస్టర్ అయిపోయి ఉంటే? అప్పుడు ప్రణవిని తిరిగి మాకు ఇచ్చేయమని అక్క ఏ అధికారంతో తమను అడగగలదు? సొంత అక్కతో విబేధాలు తెచ్చుకోవడం తనకు ఇష్టంలేదు..


మోహన్ కి తెలుసు, ఇలాంటి సమస్యలు వస్తాయని.. అప్పుడు నేను చెపితే నీవు విన్నావా అంటూ కౌసల్యను ఏమైనా అంటే అసలుకే పుట్టెడు దుఖంలోనున్న కౌసల్య బాధపడదా అనుకుంటూ సరేనంటూ ఒప్పుకున్నాడు.. నిజానికి ప్రణూ మసిలిన ఇంట్లో తను ఉండగలడా? ఆఫీస్ నుండి రాగానే నాన్నా అంటూ ఆ చిట్టిచేతులు తనని చుట్టుకుపోయేవి.. మోహన్ కళ్లల్లోనుండి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి..


మరో రెండురోజులు ఉండి ప్రణవిని మరపించి, అది నిద్రపోతున్న సమయంలో మోహన్ వాసంతి హైద్రాబాద్ వచ్చేసారు.. ప్రణవిలేని ఇంట్లో ఉండలేకపోతున్నారు.. నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది.. మాటలులేవు, తిండిహారాలు లేవు.. ఎక్కడ చూసినా ప్రణవి కేరింతలే గుర్తుకొస్తున్నాయి.. మాటి మాటికీ ప్రణవి ఎలా ఉందో, అన్నం తిందో లేదో, నా కోసం ఏడుస్తూ వెతుక్కుంటోందేమోనన్న ఆలోచనలే కౌసల్యకు.. ప్రణవి ఎలా ఉందని ఫోన్ చేసి తెలుసుకోవాలని లేదు.. తిరిగి వ్యామోహాలు బంధాలు పెంచుకోవడం ఎందుకని ..


పది రోజులు అయిపోయాయి . ఈపాటికి నెమ్మదిగా నెమ్మదిగా తమని మరచిపోతూ ఉండచ్చని భావిస్తున్న తరుణంలో ఆరోజు ఇంటిముందు కారు ఆగింది.. కారులోనుండి సుధీర్ దిగాడు ముందు, తరువాత వాసంతి ప్రణవిని ఎత్తుకుని.. కౌసల్యను, మోహన్ నూ చూస్తూనే ప్రణవి వాసంతి చేతుల్లోనుండి దిగిపోయి అమ్మా అని ఏడుస్తూ కౌసల్యను చుట్టేసింది.. నాన్నా ఎత్తుకోమంటూ చేతులు చాచింది.


కౌసల్య దుఖానికి అంతేలేదు.. ప్రణవిని ఎత్తుకుని గుండెలకు అదుముకుంటూ నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ ' నా బంగారు తల్లీ వచ్చేసావా' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. వాసంతి మోహన్, కౌసల్యా ఎదురుగా తప్పుచేసిన దానిలా తలొంచుకుంది.


"మోహన్, కౌసల్యా నన్ను క్షమించండి"! అవును మోహన్, వాసంతి తనున్న బాధలో మూర్ఖంగా ప్రవర్తించింది.. మీరిద్దరూ మమ్మలని క్షమించాలంటూ సుధీర్ మోహన్ రెండు చేతులనూ పట్టుకున్నాడు..


వెంటనే వాసంతి అందుకుంది.. మీరు వెళ్లిపోయాకా ప్రణవి చాలా ఏడ్చింది.. బలవంతంగా అటూ ఇటూ తిప్పుతూ మీరు ఏదో అర్జంట్ పనిమీద వెళ్లారని వస్తారని అబధ్దమాడాం.. ప్రతీ రోజూ ఇంటి గుమ్మం ముందే మీ కోసం ఎదురుచూస్తూ కూర్చునేది చీకటి పడేవరకు.. తిండి తినేదికాదు.. ఒకరోజు అందరం లోపల పనుల్లో ఉన్నాం.. రోజూ మీకోసం ఏడ్చే ప్రణవి ఆ రోజెందుకో నిశ్శబ్దంగా ఉంది.. పోనీలే అలవాటుపడిపోతోందేమోనని సంబరపడ్డాం.. ఉన్నట్టుండి ఎలా వెళ్లిపోయిందో గేట్ తీసుకుని బయటకు అర్ధం కాలేదు.. శరత్ తో ఆడుకుంటోందేమో ననుకుంటూ పట్టించుకోలేదు.. ఓ రెండుగంటల తరువాత చూస్తే ఇంట్లో ఎక్కడా కనపడలేదు.. కంగారుగా ఇంట్లోనూ, ఆ చుట్టుపక్కలా అంతా వెతికాం. అందరం తలోవైపుకి పరుగెత్తాం. సాయంత్రం అయింది, చీకటి పడుతోంది..


ఈలోగా ఎవరో వచ్చి ఒక పాప ఆంజనేయస్వామి గుడి మెట్లమీద పడుకుని నిద్రపోతోంది, మీ పాపేమో చూడండనేసరికి అందరం పరుగెత్తాం. మేము ఊహించినట్లుగా ప్రణవే.. మెట్లమీద పడుకుని ఉంది..


"ఏంటమ్మా ఇక్కడున్నావని అడిగితే"?


అమ్మా నాన్నా కోసం వచ్చానంది. తనకోసం మీరు అక్కడకే వస్తారని ఆ మెట్లమీదే కూర్చుందిట.. ఫో, మీరు అమ్మా నాన్నా కాదంటూ నన్నూ, సుధీర్ ని చూస్తూనే ఏడుస్తూ అక్కడనుండి పరుగెట్టబోయింది.. ఒళ్లు కాలిపోతోంది.. నీరసంతో తోటకూరకాడలా వాడిపోయింది.. పల్లూని పోగొట్టుకున్నాను.. ప్రణవి కి ఏదైనా జరగరానిది జరిగితే? ఆ ఊహకే భయంతో నిలువెల్లా ఒణికిపోయాను.. ప్రణవి ఎక్కడ ఉన్నా ఆనందంగా, క్షేమంగా ఉండాలి .. అప్పుడు నా స్వార్ధంతోనే బలవంతంగా ప్రణవిని పెంచుకోమని మీకిచ్చేసాను.. ఎందుకంటే మీ ఆస్తి ఐశ్వర్యం ప్రణవికి దక్కాలని. అమ్మ ప్రోత్సాహం కూడా నా దురాశను ఎగదోసింది.. మోహన్ ఎవరినో అనాధ పిల్లను తెచ్చుకుని పెంచుకుంటే వాడి ఆస్తి అంతా ఎవరో దిక్కూ మొక్కూ లేని పిల్లకు వెళ్లిపోతుంది, అందుకని నీ కవల పిల్లల్లో ఒక దాన్ని మోహన్ కు ఇచ్చేయమంటూ అమ్మ ఒకటే సతాయింపు..


"ప్రలోభపడ్డాను!"


కానీ పల్లూ దూరం అయినాకా నాకు ఏదీ ముఖ్యం కాదనిపించింది.. ఆస్తీ ఐశ్వర్యాలకంటే మించిన సంపద పిల్లలని అర్ధం చేసుకున్నాను.. పల్లూ తిరిగిరానప్పుడు నాకు లోకంలో ఏదీ ముఖ్యం కాదనుకున్నాను.. ప్రణవిలో పల్లూని చూసుకోవాలని ఆశపడ్డాను.. మీకు ఇచ్చేసిన ప్రణవిని మళ్లీ తీసేసుకోవాలన్న దుర్బుధ్ది పుట్టింది.. ప్రణవి కి మీరు ఎంత ప్రేమను పంచి ఇస్తున్నారో తెలుసుకోలేని మూర్ఖురాలిని అయ్యానురా మోహన్..


"అక్కా! నీవలా బాధపడితే మా హృదయం తట్టుకోలేదు".. మాకు ప్రాప్తం లేదనుకుని ఎలాగోలాగ మరచిపోతాం.. ప్రణూని నీవే ఉంచేసుకో..


"ఒరేయ్ మోహన్, మీ మంచితనంతో ఇంకా నన్ను బాధపెట్టకండి ప్లీజ్!


ప్రణూ నా కళ్లెదుటే ఉండాలని అనుకున్నానేగానీ దానికో హృదయం ఉందని , ఆ హృదయం వేరొకరి సొంతం అయిందని అర్ధం చేసుకోలేకపోయాను.. నా మూర్ఖత్వంతో దాన్ని కూడా పోగొట్టుకునేదాన్ని.. నామీద జాలిపడి మీరు పెంచిన ప్రేమను మమకారాన్ని కూడా త్యాగం చేయగలిగారు. కానీ ఆ చిన్ని హృదయానికి ఏమి తెలుసు ఇవన్నీ? పెంచిన‌ ప్రేమ‌ని అనుభ‌వించేదాంట్లో ఉండే ఆనందం ఆ త‌ల్ల‌లుకి పిల్ల‌ల‌కే అర్ధ‌మ‌వుతుంది. నేను ఆ పసిమనస్సుని ఎంత బాధపెట్టానో !


వాసంతి ప్రణవిని దగ్గరకు రమ్మనమని పిలుస్తుంటే, మళ్లీ తనని వాళ్లు ఎక్కడకు తీసుకుపోతారో అన్నట్లుగా భయంగా కౌసల్య వెనుక దాక్కుంది..


ఇంక ప్రణవి మీ కూతురే.. చట్టబధ్దంగా దత్తత కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి.. మేమందరం దాన్ని ఆశీర్వదించడానికి వస్తాం.. ఎప్పుడైనా చుట్టపుచూపుగా వచ్చి దాన్ని చూసి వెళ్లిపోతాను.. నా కిచ్చేయ్ ప్రణవి నంటూ మిమ్మలని బాధ పెట్టను.. మీ సంస్కారం మంచితనంతో అది పెరిగి పెద్దదయి ఒక పరిపూర్ణ స్త్రీ గా తయారవుతుందని నాకు తెలుసు..


"ఉంటానురా మోహన్, వెళ్లి వస్తానమ్మా కౌసల్యా" అని వెళ్ల బోతున్న ఆ దంపతులను నిలవరించే ప్రయత్నం చేసినా లాభం లేదనుకుంటూ మౌనంగా వీడ్కోలు పలికారు.. అప్పటికే కౌసల్య చంకనెక్కేసిన ప్రణవి తల్లి భుజాలకు కరచుకుపోయింది.


***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం


66 views0 comments
bottom of page